ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Diabetes and Hypertension combined complications,మధుమేహం-హైబీపీ లతో దుష్ప్రభావాలు-జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రెండు శత్రువులు. ఒక్కోటీ ఒక్కో విలయం! ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా కళ్ల నుంచి కాళ్ల వరకూ మన శరీరం మొత్తాన్నీ దెబ్బ తియ్యగల సమర్థమైనవే. అలాంటి రెండూ కలిసిపోయి.. ఏక కాలంలో జంటగా దాడికి దిగితే? పరిస్థితి వూహించటం కష్టం. ఇప్పుడు మధుమేహం, హైబీపీ ల విషయంలో జరుగుతున్నది అదే. ప్రపంచ మానవాళికి నేడు అతి పెద్ద శత్రువుగా అవతరించిన మధుమేహం... దాదాపు దానంత ప్రమాదకారీ అయిన హైబీపీ.. దేనికదే పెద్ద సమస్యలనుకుంటుంటే.. ఒకటి చాలదన్నట్టు చాలాసార్లు రెండూ తోడుదొంగల్లా కలిసే ఉంటున్నాయి. ఒకటి వచ్చిందంటే.. అది తన జంటను తెచ్చుకుంటోంది. రెండూ కలిస్తే ఇవి శరీరంలో తీవ్ర దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయి. ఇదో జటిల సమస్య! అందుకే అసలీ రెండూ దరి చేరకుండా చూసుకోవటం ఉత్తమం. ఒకటి వస్తే కనీసం రెండోది రాకుండా జాగ్రత్తపడటం అవసరం. ఇక రెండూ వస్తే.. వీటితో దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం!.
ఒకటి అగ్ని. మరోటి వాయువు! ఒకదానికి మరోటి తోడైతే రెండూ కలిసి సృష్టించే విలయం చాలా తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలో కూడా మధుమేహానికి- అధిక రక్తపోటు (హైబీపీ) తోడైతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. దీన్ని గురించి కాస్త వివరంగా చూద్దాం. మధుమేహం కారణంగా సహజంగానే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, కంటి చూపు (రెటినోపతి) దెబ్బతినటం వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఇక ఈ మధుమేహానికి హైబీపీ కూడా తోడైతే ఈ దుష్ప్రభావాలు త్వరగా ముంచుకొచ్చే అవకాశాలు, అవి మరింత ఉద్ధృతమయ్యే అవకాశాలు పెరుగుతాయి. పైగా సమస్యేమంటే మధుమేహులలో చాలామందికి హైబీపీ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. ఈ రెండు రుగ్మతల మధ్యా ఉన్న సంబంధం అటువంటిది.
ముప్పు ఎక్కువ
* సాధారణ ఆరోగ్యవంతుల కంటే మధుమేహులకు హైబీపీ వచ్చే ముప్పు రెండు రెట్లు ఎక్కువ. అలాగే హైబీపీ ఉన్న వారికి మధుమేహం వచ్చే అవకాశం రెండున్నర రెట్లు అధికం!
* మధుమేహుల్లో వయసు పెరుగుతున్న కొద్దీ రక్తపోటు కూడా పెరుగుతుంటుంది.
* సగటున 45-75 ఏళ్ల మధ్య వయసు మధుమేహుల్లో 40-60% మందికి హైబీపీ కూడా ఉంటోంది.
* అమెరికాలో మూత్రపిండాలు విఫలమై ఏటా డయాలసిస్ (రక్తశుద్ధి) వరకూ వస్తున్న కేసులు దాదాపు 3.5 లక్షలుంటున్నాయి. వీరిలో సగానికి సగం మందికి (50%) అధిక రక్తపోటు, మధుమేహం రెండూ ఉంటున్నాయి! దీన్నిబట్టి ఈ రెండూ ఉన్నవారిలో మూత్రపిండాల వైఫల్యం ఎక్కువగా ఉంటోందని తేలికగానే అర్థం చేసుకోవచ్చు.
* మన దేశంలో పరిస్థితి ఎలా ఉందో గుర్తించేందుకు ముంబైలో ఒక అధ్యయనం చేశారు. ఆసుపత్రికి వస్తున్న మధుమేహుల్లో 40% మందికి హైబీపీ కూడా ఉంటున్నట్టు దీనిలో తేలింది.
* మధుమేహం ఉన్న వారికి హైబీపీ వచ్చే అవకాశాలుంటాయి. అలాగని ముందుగా మధుమేహం వచ్చి, ఆ తర్వాత హైబీపీ వస్తుందనుకోవటానికి లేదు. ఎందుకంటే చాలామందిలో మధుమేహం రావటానికి చాలా సంవత్సరాల ముందు నుంచే అధిక రక్తపోటు ఉండి ఉండొచ్చు.
ఒకటొస్తే.. మరొకటి.. ఏమిటీ బంధం?
మధుమేహం, హైబీపీల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఇవి రావటానికి దోహదం చేసే అంశాలు కూడా చాలా వరకూ ఉమ్మడిగా ఉంటున్నాయి. ముఖ్యంగా చాలామందిలో మధుమేహం, హైబీపీలతో పాటు బొజ్జ (సెంట్రల్ ఒబేసిటీ), ఒంట్లో ఇన్సులిన్ ఉండి కూడా అది సమర్థంగా వినియోగం కాకపోవటం (ఇన్సులిన్ నిరోధకత- రెసిస్టెన్స్), రక్తంలో కొలెస్ట్రాల్ వంటి కొవ్వుల స్థాయి పెరగటం వంటివి కలగలిసి ఉంటున్నాయి. వీటన్నింటినీ కలిపి శరీరంలో జీవక్రియలకు సంబంధించిన ఒక రుగ్మతగా (మెటబాలిక్ సిండ్రోమ్) గుర్తిస్తున్నారు. మధుమేహం, హైబీపీల కారణంగా ఆపాదమస్తకం.. అంటే మెదడు నుంచి గుండె, మూత్రపిండాలు.. ఇలా కాళ్ల వరకూ ఉండే రక్తనాళాలన్నీ ప్రభావితం కావచ్చు. ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వంటి ముప్పులతో పాటు మూత్రపిండాల పనితీరు మందగించటం, గుండెలోని ఎడమ జఠరిక మందం కావటం వంటివీ వీరిలో ఎక్కువ.
తరచూ పరీక్షిస్తేనే హైబీపీ బయటపడుతుంది!
మధుమేహం వల్ల ఏవో కొన్ని సమస్యలూ, బాధలూ తలెత్తుతుంటాయి కాబట్టి ఏదో దశలో వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ హైబీపీ ఉన్నా పైకి ఎలాంటి బాధలూ, లక్షణాలూ కనబడవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అంటారు. చాలామందిలో హైబీపీని తొలిసారి గుర్తించే సమయానికే గుండె జబ్బు, మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ), చూపు తగ్గటం వంటివి సమస్యలు ముంచుకొచ్చేస్తున్నాయి. మధుమేహం బయటపడినప్పుడే కొందరిలో అధిక రక్తపోటూ ఉండొచ్చు. అందువల్ల తరచుగా వైద్యులతో పరీక్ష చేయించుకోవటం అన్ని విధాలా మంచిది. అప్పుడే వీటిని తొలిదశలోనే పట్టుకోవటం, నియంత్రణలో ఉంచుకోవటం సాధ్యపడుతుంది.
రక్తపోటు పెంచే మందులు వాడకూడదు
హైబీపీ ఉన్నవాళ్లు, అలాగే మధుమేహం-హైబీపీ రెండూ ఉన్నవాళ్లు కొన్ని మందుల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి:
* నొప్పులు తగ్గేందుకు వాడే ఐబూప్రోఫెన్, డైక్లోఫెనాక్, ఎసైక్లోఫెనాక్ వంటి 'ఎన్‌ఎస్‌ఏఐడీ' రకం మందులను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు.
* జలుబు మందులు కూడా వైద్యులను సంప్రదించకుండా సొంతంగా కొనుక్కొని వేసుకోకూడదు.
* ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు, కార్టిజోన్ సంబంధ స్టిరాయిడ్లు, సైక్లోస్పోరిన్, ఎరిత్రోపొయిటిన్, కొకైన్, నికోటిన్ వంటివి వాడరాదు.
అదుపు ముఖ్యం
*మధుమేహం, హైబీపీ రెండూ ఉన్నవారు రెంటినీ అదుపులో ఉంచుకోవటం ముఖ్యం. స్థూలకాయులైతే బరువు తగ్గటానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
* మధుమేహం అదుపులో ఉండేందుకు సంబంధించిన ఆహార నియమాలతో పాటు హైబీపీని నియంత్రించటానికి ఉప్పు కూడా తగ్గించాలి. ఆహారంలో రోజుకి 2 గ్రాముల సోడియం (ఉప్పు) మించకుండా చూసుకోవాలి.
* పచ్చళ్లు, అప్పడాలు, ఆలూచిప్స్, ఉప్పు బిస్కట్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వంటివి మానెయ్యాలి.
* వైద్యుల సలహా మేరకు రోజూ కనీసం 30 నిమిషాల సేపు వేగవంతమైన నడక వంటి వ్యాయామాలు చెయ్యాలి.
* పొగ, మద్యం పూర్తిగా మానెయ్యాల్సిందే.
రెండూ ఉంటే.. మందులు తప్పవు
మధుమేహంతో పాటు హైబీపీ కూడా ఉన్నవాళ్లు ఆహార నియమాలను పాటించటంతో పాటు మందులనూ వేసుకోవటం అవసరం. ఎందుకంటే ఈ రెండూ ఉన్నవారిలో బీపీని నియంత్రణలోకి తేవటం అంత తేలిక కాదు. అసలు చాలామందికి ఒకే రకం మందు కాకుండా రెండు, మూడు, అవసరమైతే 4 రకాల మందులు వాడితేనే గానీ రక్తపోటు అదుపులోకి రాకపోవచ్చు. మందుల్లో- రామిప్రిల్, లిసినోప్రిల్ వంటి ఏసీఈ ఇన్‌హిబిటార్లు ముఖ్యమైనవి. వీటితో కొందరిలో దగ్గు వంటి దుష్ప్రభావాలు కనబడొచ్చు. ఇలాంటి వారికి లోసార్టాన్, టెల్మిసార్టాన్, ఓల్మిసార్టాన్ వంటి ఏఆర్‌బీ మందులు ఉపయోగపడతాయి. వీటిని వాడుతున్న సమయంలో వైద్యుల సలహా మేరకు మూత్రపిండాల పరీక్షలు (క్రియాటినైన్, యూరియా), రక్తంలో పొటాషియం పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి.
* ఇతర రక్తపోటు మందులతో పాటు హైడ్రోక్లోర్‌థయజైడ్ వంటి మూత్రం రావటానికి దోహదం చేసే మందులను వాడితే మంచి ఫలితం కనబడుతుంది.
* అవసరమైతే యాంలోడిపిన్, ఎస్.యాంలోడెపిన్ వంటి క్యాల్షియం బ్లాకర్లనూ వాడాల్సి రావొచ్చు.
* గుండెజబ్బు ఉన్నవారికి మెటోప్రోలాల్, బిసోప్రొలాల్, కార్విడిలాల్ వంటి బీటా బ్లాకర్లు ఉపయోగపడతాయి.
* ఎప్పుడైనా సరే, బీటా బ్లాకర్లు, క్లోనిడిన్ వంటి రక్తపోటు మందులను హఠాత్తుగా ఆపకూడదు, అలా ఆపితే దుష్ఫలితాలు వస్తాయి. బీపీ మందుల మోతాదులు తగ్గించటం, పెంచటం వంటివన్నీ వైద్యుల సలహా మేరకే చేయాలి.
చాలామందిలో మధుమేహం, హైబీపీ రెండూ కలిసి ఉంటాయి. వీటిపై చాలామందికి తగినంత అవగాహన లేకపోవటం, మందులు సరిగా వాడకపోవటం, వైద్యుల సలహాలను పాటించకపోవటం వల్ల ఈ రెంటి మూలంగా తలెత్తే సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మధుమేహులు తరచుగా మధుమేహ పరీక్షలతో పాటు బీపీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు ఏమాత్రం పెరిగినా దాన్ని కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి.
లేస్తే బీపీ తగ్గుతుంటే!
కొంతమంది మధుమేహుల్లో అటానమిక్ న్యూరోపతి (స్వయంచాలక నాడీమండలం అవ్యవస్థ) అనే సమస్య ఉంటుంది. దీని మూలంగా వీరిలో పడుకున్నప్పుడు రక్తపోటు ఎక్కువగానూ, నిలబడినప్పుడు తక్కువగానూ ఉంటుంది. ఇలా నిలబడినప్పుడు సిస్టోలిక్ రక్తపోటు 20 మి.మీ. కన్నా తగ్గుతుంటే- కళ్లు తిరగటం, తల తేలికగా ఉండటం, చెమటలు, వాంతి వచ్చినట్లుండటం, చూపు మసకగా ఉండటం, కొద్దిసేపు సొమ్మసిల్లటం (సింకొపీ) వంటి 'పోశ్చరల్ హైపోటెన్షన్' లక్షణాలు బాధించొచ్చు. ఇవి కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించి, తగు చికిత్స తీసుకోవటం మంచిది.
మధుమేహుల్లో బీపీ : ఎంత ఉండొచ్చు?
ఎవరికైనా సరే రక్తపోటు 120/80, అంతకన్నా తక్కువ ఉండటం అత్యుత్తమం. దీన్ని 'ఆప్టిమల్' అంటారు. ఇక ఆ పై అంకె (సిస్టోలిక్) 130 లోపు.. కింది అంకె (డయాస్టోలిక్) 85 కన్నా తక్కువుంటే రక్తపోటు సాధారణ (నార్మల్) స్థాయిలో ఉందని అర్థం. పై అంకె 140 కన్నా ఎక్కువగానూ కింది అంకె 90 కన్నా ఎక్కువగానూ ఉంటే దాన్ని 'అధిక రక్తపోటు (హైబీపీ)'గా పరిగణిస్తారు. మధుమేహుల్లో కీలకమైన అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే సిస్టోలిక్ రక్తపోటు 130, అంతకన్నా తక్కువగానూ.. డయస్టోలిక్ రక్తపోటు 80, అంతకన్నా తక్కువగానూ ఉండాలి. మధుమేహులంతా బీపీ కచ్చితంగా ఈ పరిమితుల్లోనే ఉండేలా చికిత్స తీసుకోవటం చాలా అవసరం.
ముందే గుట్టు చెప్పే-మూత్ర పిండాలు
మధుమేహుల్లో మూత్రపిండాల వ్యాధి (నెఫ్రోపతీ) అన్నది.. మూత్రంలో సూక్ష్మాతిసూక్ష్మ స్థాయిలో సుద్ద (మైక్రో అల్బుమిన్) పోవటంతో మొదలవుతుంది. అప్పుడే రక్తపోటు పెరగటం కూడా ప్రారంభమవుతుంది. అందువల్ల తరచుగా వైద్య నిపుణులతో 'మైక్రో అల్బుమిన్' పరీక్ష చేయించుకోవటం అవసరం. మూత్రంలో అల్బుమిన్ మోతాదు పెరుగుతున్నకొద్దీ టైప్-2 మధుమేహుల్లో చాలామందిలో అధిక రక్తపోటూ ఉంటుందని గుర్తించాలి. నెఫ్రోపతీ వల్ల రక్తపోటు పెరగటం, అలాగే రక్తపోటు పెరగటం వల్ల నెఫ్రోపతీ ఉద్ధృతం కావటమూ జరుగుతుంటుంది. మొదట్నుంచే రక్తపోటును, రక్తంలో చక్కెర మోతాదును అదుపులో ఉంచుకుంటే సమస్య ఈ నెఫ్రోపతీ వరకూ రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా మరింత ముదరకుండా జాగ్రత్త పడొచ్చు.
కొలవటంలో.. జాగ్రత్తలు
రక్తపోటు చూపించుకోవటానికి గంట ముందు నుంచీ కాఫీ, టీ, పొగ తాగకూడదు. చూపించుకోవటానికి వెళ్లినప్పుడు కూడా ముందు 5 నిమిషాలు విశ్రాంతిగా కూర్చోవాలి.
* బీపీ కొలిచే సమయంలో కుర్చీ వెనక భాగానికి ఆనుకొని కూచోవాలి. అవసరమైతే పడుకొని కూడా రక్తపోటు పరీక్ష చేయించుకోవచ్చు. గాలి పట్టీ కట్టే చేయిని గుండెకు సమాంతరంగా ఉంచాలి.
* రక్తపోటు కొలిచేందుకు పాదరసంతో పనిచేసే స్ఫిగ్మోమానోమీటరే సరైన సాధనం. ఇప్పుడు విరివిగా వాడకంలోకి వస్తున్న ఎనిరాయిడ్, ఎలక్ట్రానిక్ పరికరాలు మంచివే అయినా వాటిని ప్రతి ఆర్నెల్లకోసారి కేలిబరేషన్ చేయించాల్సి ఉంటుంది.
హైబీపీ విషయంలో మిగతావారి కన్నా మధుమేహులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ 130/80, అంతకన్నా తక్కువగానే ఉండేటట్లు చూసుకోవాలి.
Courtesy with - డా.దక్షిణామూర్తి ఎండోక్రైనాలజిస్ట్ -తెనాలి @ ఈనాడు సుఖీభవ.
- =======================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.