ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Wisdom teeth Awareness - జ్ఞానదంతాలు అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
జ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే దంతాలు కనుక వీటిని జ్ఞాన దంతాలు అంటారు. సాధారణంగా 17-21 సంవత్సరాల మధ్య వయసులో ఇవి వస్తుంటాయి. రెండు దవడల చివరలో వచ్చే నాలుగు శాశ్వత దంతాలే జ్ఞానదంతాలు. సరైన పద్ధతిలో చక్కగా వచ్చిన జ్ఞానదంతాలు నోటికి ఎంతో విలువైనవి. అలాకాకుండా అవి సరిగ్గా రాకుండా ఇబ్బందులు కలిగిస్తే వాటిని తీసివేయాల్సి ఉంటుంది. కొందరిలో దవడలు ఉండాల్సినంత పెద్దవిగా ఉండవు. అప్పుడు జ్ఞానదంతాలు రావడానికి సరైన స్థలం ఉండదు. దీనితో చాలా ఇబ్బంది అవుతుంది. అవి దవడల నుంచి క్రిందికి రావడానికి బదులు ప్రక్కలకి రావచ్చు. ఒక్కొక్కసారి బైటికి రావడానికి స్థలం లేక కొంత భాగమే బయటికి వచ్చి, పూర్తిగా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో శస్త్రచికిత్స చేసి వాటిని తీసివేయలా అక్కర్లేదా అని విషయాన్ని దంతవైద్యుడు నిర్ధారిస్తాడు. కొన్ని సందర్భలలో జ్ఞాన దంతాల్ని తీసి వేయకపోతే ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే ప్రమాదముంది. కొంత వరకే జ్ఞానదంతాలు బయటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో చిగుళ్ళు లోపలికి సూక్ష్మ జీవులు ప్రవేశించి ఇన్‌ఫక్షన్‌ని కలిగించే ప్రమాదముంది. దవడలు గట్టిపడడం, వాపు, నొప్పి అలాంటి సందర్భాలలో కనిపించే లక్షణాలు.
జ్ఞానదంతాలు బయటికి రావడానికి సరైన స్థలంలేనప్పుడు అవి పక్కనున్న దంతాల మీద ఒత్తిడి కలిగించి వాటి ఆరోగ్యాన్ని పాడుచేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో జ్ఞానదంతాలకి ముందుండే రెండు మోలార్స్ మీద ప్రభావం పడి తీరుతుంది. అప్పుడు ఆహారం సమలడం, తినడం చాలా ఇబ్బంది అవుతుంది.
బయటికి రాకుండా ఇబ్బంది పెట్టే జ్ఞానదంతాల దగ్గర ద్రవ పదార్థాలు నిండిన సంచీలలా ఏర్పడడంగాని, కంతులు రావడంగాని జరగవచ్చు. దాంతో ఆ ప్రాంతంలో చిగుళ్లు, దవడ ఎముక దెబ్బ తింటాయి. సాధారణంగా ఇరవై సంవత్సరాలలోపే ఇబ్బంది పెట్టే జ్ఞాన దంతాలను తొలగించేప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే చిన్న వయసులో దంతాల మూలాలు పూర్తిగా గట్టిగా దవడలో బిగుసుకుపోయి ఉండవు. అందుకు శస్త్రచికిత్సలో చుట్టు ప్రక్కల నరాల దెబ్బతినవు. చికిత్స తర్వాత గాయం కూడా త్వరగా మానుతుంది.
జ్ఞానదంతాల్ని తీసివేసేటప్పుడు స్థానికంగా ఆ ప్రాంతంలో మాత్రమే మత్తుమీందు నిచ్చి ఆ దంతాన్ని తీసివేస్తుంటారు. మొదట్లో కొద్దిగా వాపు వచ్చి అసౌకర్యం కలగవచ్చు. క్రమంగా మందుల ద్వారా ఆ వాపును తగ్గించవచ్చు. శస్త్రచికిత్స తర్వాత మొదట్లో ద్రవపదార్థాల్ని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. తర్వాత క్రమంగా మెత్తటి ఘనపదార్థాల్ని ఆ తర్వాత మామూలు ఆహారాన్ని తీసుకోవాలి. కొంతమందికి శస్త్రచికిత్స తర్వాత ఆ ప్రాంతంలో స్పర్శ కాస్త తక్కువగా అనిపించవచ్చు. కొంత సమయం తర్వాత ఆ ప్రాంతం మామూలుగా అయిపోతుంది. కాబట్టి జ్ఞానదంతాలు రావడంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే దంతవైద్యుడ్ని కలవడం మంచిది.జ్ఞానదంతాలకు సకాలంలో చికిత్స చాలా అవసరం. జ్ఞానం కలిగే యుక్తవయసులో వచ్చే ఈ జ్ఞాన దంతాల సమస్యతో యువతీ యువకుల ఎలాంటి ఇబ్బందులు పడకుండా విజ్ఞతతో వ్యవహరించాలి.
- =====================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.