Thursday, April 18, 2013

Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ

  •  
  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --Trouble with Increased blood flow in periods, నెలసరి లో అధిక రక్తస్రావంతో అవస్థ-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    నెలసరి దగ్గరపడుతోందంటే కొందరు మహిళల్లో కంగారు. ఆ సమయంలో విపరీతమైన రక్తస్రావం కావడమే ఆ భయానికి కారణం. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్యలేదు. తరచూ బాధ పడుతోంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అవుతోందా లేదా అన్నది తెలుసుకునే ముందు అసలు ఆ సమయంలో సాధారణంగా ఎంత రక్తస్రావం అవ్వాలనే దానిపై అవగాహన ఉండాలి. సాధారణ నెలసరి అంటే తక్కువగా అలాగని మరీ ఎక్కువగా రక్తస్రావం కాకుండా ఉండటమే. సగటున అయితే ఐదు రోజులకు మించి నెలసరి ఉండకూడదు. ఆ సమయంలో ఇరవై నుంచి అరవై ఎంఎల్‌ దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పరిస్థితిని హెవీ పీరియడ్స్‌ అనొచ్చు.. దాన్ని తెలుసుకోవడం కష్టం అయినా, కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతోందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ న్యాప్‌కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి రెండు న్యాప్‌కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడటం.. లాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి.

ఇవీ కారణాలు...
అప్పుడే రుతుక్రమం మొదలైన వారి నుంచి మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న ఎవరైనా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ప్రతి పదిమందిలో దాదాపు ఆరుగురిలో ఈ సమస్య ఉన్నా, చాలాసార్లు అసలైన కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ప్రొస్టాగ్లాండిన్‌ అనే రసాయనం రక్తంలో ఉండే స్థాయిని బట్టీ ఈ సమస్య ఎదురవుతుంది. ఈ రసాయనం గర్భాశయ పొరపై ప్రభావం చూపి సమస్యగా మారుతుంది. ఇంకొన్నిసార్లు గర్భాశయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు పెద్దగా ఉన్నప్పుడూ ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు ఈ కింది కారణాలూ ఉండే అవకాశం ఉంది.

*గర్భాశయంలో ఉండే కండరాల్లో ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి. ఇవి క్యాన్సర్‌ కణుతులు కావు కానీ, అవి కూడా అధికరక్తస్రావానికి దారితీస్తాయి.. ఎండోమెట్రియోసిస్‌, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ, పాలిప్స్‌ లాంటివీ అధిక రక్తస్రావానికి దారితీస్తాయి. మధ్య వయసు మహిళల్లో చాలా అరుదుగా ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వల్ల కూడా అలా కావచ్చు. అలాగే కటివలయ భాగంలో వచ్చే ఇన్‌ఫెక్షన్లూ, క్లమీడియా లాంటి వాటితోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

*పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌ (పీసీఓడీ)తో బాధపడే కొందరిలో ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. అలాంటప్పుడూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్‌తో బాధపడుతోన్నా అధికరక్తస్రావం కావచ్చు.

*ఇతర సమస్యలకూ, కీమోథెరపీలో భాగంగా ఇచ్చే కొన్నిరకాల మందుల వల్లా కొన్నిసార్లు సమస్య తలెత్తుతుంది.

గుర్తించేందుకు పరీక్షలుంటాయి..
సమస్య కనిపించినప్పుడు ఆ సమయానికి తగిన జాగ్రత్తలు తీసుకుని మౌనం వహించడం కన్నా అది నిజమా కాదా అన్నది నిర్ధరించుకునేందుకు డాక్టర్‌ని సంప్రదించాలి. అలాంటప్పుడు గర్భాశయం, గర్భాశయ ముఖద్వారం సైజు, ఆకృతిని అంచనా వేసేందుకు కొన్ని పరీక్షలు చేస్తారు. అలాగే రక్తహీనత కూడా అధిక రక్తస్రావాన్ని సూచిస్తుంది. ప్రతినెలా ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉండి, ఆ లోపాన్ని భర్తీ చేసేందుకు ఐరన్‌ మాత్రల్ని తీసుకోని వారిలో రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య కాబట్టే ఆ పరీక్ష చేయించుకోమంటారు. వాస్తవానికి అధిక రక్తస్రావంతో బాధపడే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి రక్తహీనత ఉంటుంది.

ఒకవేళ గర్భాశయం, గర్భాశయ ముఖద్వారంలో ఎలాంటి సమస్యలూ లేకపోతే, వయసు నలభై లోపు ఉంటే అదనంగా ఎలాంటి పరీక్షలూ సూచించరు. సమస్య తీవ్రతను బట్టి మాత్రల్ని ఇస్తారు.
అలా కాకుండా వయసు నలభై అయిదేళ్లు దాటి, నెలసరి, నెలసరికీ మధ్యలో రక్తస్రావం అవుతోన్నా, కలయిక తరవాత రక్తం కనిపించడంతోపాటూ నొప్పిలాంటి లక్షణాలు కూడా ఉంటే డాక్టర్లు గర్భాశయం గురించి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ పరీక్షలో కేవలం గర్భాశయం పనితీరు మాత్రమే కాదు.. ఫైబ్రాయిడ్లు, పాలిప్స్‌ లాంటివి ఉన్నా తెలుస్తాయి. అలాగే ఎండోమెట్రియల్‌ శాంపిల్‌ కూడా తీసుకుని పరీక్షిస్తారు. పరిస్థితిని బట్టీ హిస్టెరోస్కోపీ కూడా చేయాల్సి రావచ్చు.

మాత్రలే మొదటి చికిత్సగా..
ప్రత్యేక కారణం అంటూ లేకుండా సమస్య ఎదురైతే దాన్ని తగ్గించడానికి మాత్రల్ని సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లూ, ఎండోమెట్రియోసిస్‌ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. ఈ వయసులో ఇచ్చే కొన్నిరకాల మాత్రలు దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకూ రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతాయి. అయితే వాటివల్ల నెలసరిలో వచ్చే నొప్పి, నెలసరి రోజుల్నీ తగ్గించలేం. వీటివల్ల చాలా అరుదుగా పొట్టలో అసౌకర్యంగా అనిపించవచ్చు.

*మరికొన్ని రకాల మాత్రలు కేవలం అధిక రక్తస్రావాన్నే కాదు, నెలసరి నొప్పినీ తగ్గిస్తాయి. వాటివల్ల ప్రొస్టాగ్లాండిన్‌ రసాయన ప్రభావం కూడా కొంతవరకూ అదుపులోకి వస్తుంది. అయితే పొట్టలో అల్సర్‌, ఆస్తమా లాంటి సమస్యలుంటే డాక్టర్లకు ముందే తెలపడం మంచిది.

*గర్భం రాకుండా వాడే మాత్రల్లో కంబైన్డ్‌ ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ కూడా రక్తస్రావంతోపాటూ నెలసరి నొప్పినీ కొంతవరకూ తగ్గిస్తాయి.

*కొన్నిసార్లు మిరేనా గా చెప్పుకొనే లెవనార్జెట్రెల్‌ ఇంట్రా యూటరైన్‌ సిస్టమ్‌ కూడా ఈ సమస్యను చాలామటుకు తగ్గిస్తుంది. దీన్ని గర్భాశయంలో అమరుస్తారు. అది ప్రతిరోజూ కొద్దికొద్దిగా లెవనార్జెట్రిల్‌ అనే ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. దాంతో నెలసరి చాలా తక్కువ కావచ్చు. లేదా కొంతకాలం ఆగిపోవచ్చు. ఆ సమయంలో వచ్చే నొప్పీ తగ్గుతుంది. ఇది ఎండోమెట్రియల్‌ పొరను పలుచన చేస్తుంది. ఈ మిరేనాని కనీసం ఐదేళ్లవరకూ అమర్చుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు వెంటనే తొలగించుకోవచ్చు. రక్తస్రావం సమస్య తగ్గడంతోపాటూ ఎక్కువకాలం గర్భం రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారికి మంచి పరిష్కారం.

*ఇవన్నీ పనిచేయనప్పుడు ఆఖరి ప్రయత్నంగా డాక్టర్లు శస్త్రచికిత్సను చేయించుకోమంటారు. గర్భాశయాన్ని తీసేయడం లేదా అక్కడ ఉండే ఎండోమెట్రియల్‌ పొరను కరిగించడం ఈ శస్త్రచికిత్సలో భాగం. అదే ఎండోమెట్రియల్‌ ఎబ్లేషన్‌. ఇందులో ఎండోమెట్రియల్‌ పొరను సాధ్యమైనంతవరకూ తగ్గిస్తారు. ఈ శస్త్రచికిత్సను హీట్‌, మైక్రోవేవ్‌, క్రయోథెరపీ లాంటి ఏదో ఒక పద్ధతిలో చేస్తారు. ఆ తరవాత సమస్య దాదాపుగా తగ్గినా భవిష్యత్తులో గర్భం వచ్చే అవకాశం మాత్రం ఉండదు.

*పై చికిత్సలేవీ పనిచేయనప్పుడు..గర్భాశయాన్ని పూర్తిగా తీసేసే హిస్టెరెక్టమీ డాక్టర్లు సూచిస్తారు.

అదనంగా జాగ్రత్తలు..
అధికబరువున్న వాళ్లలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. కాబట్టి పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తహీనత సమస్య ఉందని రక్తపరీక్షలో తేలితే ఐరన్‌ మాత్రల్ని తీసుకోవడంతో పాటూ ఇనుము అందించే పదార్థాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా బెల్లం, తోటకూర, గుడ్లు, ఎండుద్రాక్ష, సోయా లాంటివి రోజూ ఆహారంగా తీసుకోవాలి.
  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.