Saturday, April 20, 2013

History of Lyposuccion , లైపోసక్షన్ చరిత్ర

  •  

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -History of Lyposuccion , లైపోసక్షన్ చరిత్ర - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


లైపోసక్షన్  అందుబాటులోకి వచ్చిందిలా... 


శరీరంలోని ఒక నిర్ధిష్టమైన భాగంలో కొవ్వును కరిగించడం నే లైపోసక్షన్  అంటాము .

ఇన్‌పేషెంట్‌గా ఉన్న రోగులకు రక్తంగాని, సెలైన్‌గాని ఎక్కించడానికి వీలుగా మణికట్టు దగ్గర ఒక సూది అమర్చి ఉంచుతారు. దాన్ని ‘కాన్యులా’ అంటారు. ఇలాంటి ఒక  కాన్యులా అమర్చి కొవ్వును బయటకు పీల్చే ప్రక్రియను డాక్టర్ వ్యస్ గెరార్డ్ ఇల్లావుజ్ అనే ఫ్రెంచ్ సర్జన్ మొదటిసారిగా 1982లో ప్రయత్నించాడు. తన ప్రయత్నం  చాలామేరకు సఫలమైందని గుర్తించాడు. 1990లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును ద్రవరూపంలోకి మార్చి బయటకు పీల్చేసే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చింది.

ఆ తర్వాత్తర్వాత గతంలో ఉన్న సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఒక లేజర్ మొన ఉండే శరీరంలోకి పంపించగల పరికరం (ప్రోబ్) సహాయంతో లోపల ఉన్న కొవ్వును తొలగించే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ ముఫ్ఫై ఏళ్లలో తక్కువ రక్తస్రావం, తక్కువ ఇబ్బందులు, తక్కువ దుష్ర్పభావాలు, తక్కువ రిస్క్ ఉండే అధునాతన ప్రక్రియలు అందబాటులోకి వచ్చాయి. అంతేకాదు...  మన శరీరంలోనే ఒక చోటినుంచి తొలగించిన కొవ్వును... అవసరమైన మరోచోటికి పంపే ప్రక్రియలూ అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియనే ‘ఆటోలాగస్ ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్’ గా అభివర్ణించవచ్చు.

ఆపరేషన్‌కు ముందే కొన్ని జాగ్రత్తలు...

కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించాలనుకున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఉదాహరణకు లైపో ప్రక్రియకు కనీసం రెండు వారాల ముందు నుంచి పొగతాగకుండా ఉండటం చాలా మంచిది. పొగలోని నికోటిన్ రక్తప్రసరణ సంబంధమైన ప్రతిబంధకాలను ఏర్పరచవచ్చు. పొగతాగడం మానేయడం ద్వారా ఆ ప్రమాదాలను
నివారించే అవకాశం ఉంటుంది. మిగతా సర్జరీల్లోలాగే లైపో లోనూ శరీరంలో మరే ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం రెండు వారాల ముందు నుంచి రక్తాన్ని పలచబార్చే మందులేవీ వాడకుండా ఉండటం అవసరం.

గుండెజబ్బు రోగులు లైపో ప్రక్రియకు ముందుగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. వాస్తవానికి మీరు ఉండాల్సిన బరువెంత, ఉన్న బరువెంత, తొలగించాక ఉండబోయే బరువు వంటి అంశాలు, మహిళలైతే భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా వంటి విషయాలను ముందే డాక్టర్లతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి.

గతంలో మీకు అయిన సర్జరీల సంగతులు, ఏవైనా జబ్బులతో బాధపడుతున్నారా, మీకు  ఉన్న అలర్జీలు, వాడుతున్న మందుల వంటి వివరాలు లైపో నిర్వహించబోయే నిపుణులకు వివరించాలి. హైబీపీ, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం వంటి అన్ని వివరాలూ చెప్పాలి. దాని వల్ల లైపో ప్రక్రియలో ఏవైనా రిస్క్ పెరిగే అవకాశం ఉందా అన్న అంశాలను నిపుణులు అంచనా వేస్తారు.

అనుసరించాల్సిన మార్గదర్శకాలు : మనం అనుసరించాల్సిన లైపోసక్షన్ ఏదైనా కొన్ని మార్గదర్శకాలు అనుసరించడం తప్పనిసరి. అవి... ఏ ప్రాంతంలోని కొవ్వు తొలగించాలన్న విషయాన్ని రోగి, సర్జన్ ఇద్దరూ చాలా ముందుగానే నిర్ణయించుకోవాలి మిగతా అన్ని సర్జరీల్లోలాగే ఈ ప్రక్రియలోనూ రోగి తన ఆమోద పత్రాన్ని సంతకం చేసి ఇస్తారు ప్రక్రియకు ముందు, తర్వాత యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు రోగిని నించోబెట్టి కొవ్వు తొలగించాల్సిన ప్రాంతాలను మార్క్ చేస్తారు ఏయే ప్రాంతాల్లో కొవ్వు తొలగించాల్సి ఉంటుందో, ఆ ప్రదేశాల ఫొటోలు తీసుకుంటారు. ప్రక్రియ తర్వాత కూడా వాటి ఫొటోలు మళ్లీ తీస్తారు సర్జరీ రూమ్‌లోకి వెళ్లాక ప్రక్రియ నిర్వహించాల్సిన ప్రదేశంలో స్టెరిలైజేషన్ సొల్యూషన్ అయిన బెటాడిన్‌ను పూస్తారు అవసరాన్ని బట్టి లోకల్ అనస్థీషియా (ప్రక్రియ  నిర్వహించాల్సిన చోట మాత్రమే నొప్పి తెలియకుండా ఇచ్చే మత్తుమందు)ను ఇంజెక్షన్ ఇస్తారు. ఒకవేళ తొలగించాల్సిన  కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) ఇస్తారు లైపోలో శరీరంపై పెట్టే గాటు సాధారణంగా ఒక అంగుళంలో మూడో వంతు మాత్రమే ఉంటుంది సాధారణంగా రోగికి ఐవీ ఫ్లుయిడ్స్ ఎక్కిస్తూ ప్రక్రియను నిర్వహిస్తారు. ఎందుకంటే శరీరం నుంచి ఓ పక్క కొవ్వు తొలగిస్తూ ఉండటం వల్ల శరీంలోని ద్రవాల పాళ్లను సమంగా ఉంచడం కోసం (బ్యాలెన్స్ చేయడం కోసం) ఇలా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు రోగి తాలూకు రక్తపోటు, గుండె కొట్టుకునే తీరు, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తెలుసుకోవడం కోసం కొన్ని ఉపకరణాలను రోగికి అమర్చి ఉంచుతారు సాధారణంగా రోగి  అదేరోజు మేల్కోవడం, అటూ ఇటూ తిరగడం, అదే రోజు ఇంటికి వెళ్లిపోవడం చేయవచ్చు. అయితే ఐదు లీటర్ల కంటే ఎక్కువ కొవ్వు తొలగించిన వారు ఒక రోజు ఆసుపత్రిలోనే ఉండటం మంచిది.

కోలుకునే సమయం: రోగి మళ్లీ తన పనులు తానే చేసుకోవడం అన్నది తీసిన కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా రెండు రోజుల నుంచి రెండు వారాల్లో పనులకు వెళ్లవచ్చు. అయితే కొవ్వు తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది కాబట్టి 6-8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉంచే ఎలాస్టిక్ దుస్తులు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొందరిలో చర్మంలోనికి కరిగిపోయే కుట్లు కాకుండా తొలగించాల్సిన కుట్లు వేస్తే వాటిని 5 నుంచి 10 రోజుల తర్వాత తొలగించాలి. ఈ ప్రక్రియలో ఉండే నొప్పులు సాధారణంగా మూడు రోజుల నుంచి రెండు వారాల పాటు ఉంటాయి. చర్మంపై ఎర్రబడిన ప్రాంతం రెండువారాల్లో క్రమంగా మామూలు స్థితికి  వస్తుంది. వాపు తగ్గడానికి రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టవచ్చు. సర్జరీ ఫలితాలు కనిపించడానికి నెల నుంచి ఆర్నెల్లు కూడా పట్టవచ్చు. సాధారణంగా చర్మంలోని కొవ్వు కణాలను తొలగిస్తారు కాబట్టి ఫలితాలు బాగానే ఉన్నా... ఆహారంపై నియంత్రణ లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా ఉన్న కొవ్వు కణాలే విపరీతంగా పెద్దవై, ఈ సారి అస్తవ్యస్తంగా కొవ్వు పెరిగే అవకాశం ఉంది.

లైపోసక్షన్ అవసరమైన ప్రదేశాలు
సాధారణంగామన శరీరంలో లైపోసక్షన్ ప్రక్రియతో కొవ్వు తొలగించాల్సిన ప్రదేశాలివి...
పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గదమ కింద, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఎత్తుగా కనిపించే చోట (గైనకోమాజియా).

ఎంత కొవ్వు తొలగిస్తారు...
ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగ్‌లో సురక్షితంగా ఎంత కొవ్వు తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని వైద్య నిపుణులు, రోగి చర్చించి ఒక నిర్ణయం   తీసుకుంటారు. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వు తొలగించినా అది కొన్ని సార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కొవ్వు మరీ ఎక్కువగా తొలగించిన చోట గుంతలా సొట్ట కనిపించవచ్చు.

దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్)...
ఇవి వైద్యపరంగా పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి కాకపోయినా రోగికి మాత్రం  అసౌకర్యం కల్పించవచ్చు. అవి... గాటు గాయంగా మారి కొద్దికాలం నొప్పితో బాధించవచ్చు. ఒకటి రెండు నెలల పాటు కొవ్వు తీసిన చోట వాపు ఉండవచ్చు. రోగికి నిర్వహించే ప్రక్రియను బట్టి మచ్చ ఏర్పడుతుంది. ఇది సాధారణంగా కొన్ని వారాల్లో తగ్గిపోవచ్చు. లైపో వల్ల వచ్చే నొప్పి తాత్కాలికమే. నొప్పి నివారణ మందులతో దీన్ని నివారించవచ్చు. కనీసం మూడు రోజుల పాటు ఎటూ కదలలేని పరిస్థితి వల్ల అసౌకర్యంగా ఉండవచ్చు.

కాంప్లికేషన్లు : చాలా అరుదుగా (అంటే 0.14% రోగుల్లో) కొన్ని కాంప్లికేషన్లు ఉండవచ్చు. అవి... మందుల వల్ల వచ్చే అలర్జీ, శరీరంలో గాటు పెట్టిన చోట ఇన్ఫెక్షన్ రావడం. దీన్ని యాంటీబయాటిక్స్‌తో తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో కొవ్వు తొలగించడానికి ఉపయోగించిన కాన్యులా వల్ల కొన్ని కణాలు దెబ్బతిని చర్మంపై మచ్చలా కనిపించవచ్చు. చాలా అరుదుగా కొన్ని సందర్భాల్లో చర్మం కణాలు మృతిచెందే ప్రమాదం ఉంది. చర్మంలో కొవ్వు తొలగించిన ప్రదేశాలను బట్టి ఒక్కోసారి శరీర సౌష్ఠవం దెబ్బతిని ఎగుడుదిగుడుగా కనిపించవచ్చు. కొందరిలో చర్మం తాలూకు సాగే గుణం సరిగా లేకపోవడం వల్ల (పూర్ ఎలాస్టిసిటీ వల్ల) కూడా ఈ ఎగుడుదిగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని టచప్ ప్రక్రియల ద్వారా దీన్ని సరిచేయవచ్చు కాన్యులా కదలికల వల్ల చర్మంపై బొబ్బలు రావచ్చు. ఇవి మినహా పెద్దగా దుష్ర్పభావాలు ఉండవు. అయితే అనుకున్న ఫలితాలు కనిపించడానికి మూడు నుంచి ఆర్నెల్ల సమయం కూడా ఒక్కోసారి అవసరమవుతుంది.

సాధారణంగా లైపో తర్వాతి ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. కానీ కొన్నిసందర్భాల్లో పెరిగే వయసు, ఆహార నియమాలు పాటించకపోవడం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితం ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్దిమందిలోనే ఉంటాయి.

వివిధ లైపో ప్రక్రియలు

సాధారణంగా కొవ్వు తొలగించే ప్రక్రియ కోసం అవసరమైనది ఒక ఖాళీ పైప్ (కాన్యులా), ఒక ఆస్పిరేటర్ (కొవ్వును లోపలి నుంచి పీల్చివేసే పరికరం). ఈ రెండు పరికరాల సహాయంతోనే రకరకాల మార్గాల్లో లైపోను నిర్వహిస్తారు. వాటిలో కొన్ని...

సక్షన్ అసోసియేటెడ్ లైపో (ఎస్‌ఏఎల్) : ఇది సాంప్రదాయికంగా చేసే లైపో. ఇందులో కొవ్వు ఉన్న చోట చిన్న గాటు పెట్టి దాని ద్వారా కొవ్వు ఉన్న చోటికి ఒక పైప్ (కాన్యులా)ను పంపుతారు. దాన్ని పీల్చేసే పరికరమైన వాక్యూమ్ డివైజ్‌కు కలుపుతారు. ఈ ప్రక్రియలో కొవ్వు ఉన్న చోటికి పైప్‌ను మ్యాన్యువల్‌గా కదిలిస్తూ కొవ్వును తొలగిస్తారు.

పవర్ అసిస్టెడ్ లైపో (పీఏఎల్) : ఇది కూడా పూర్తిగా సక్షన్ అసిస్టెడ్ లైపో (ఎస్‌ఏఎల్)లాగే ఉంటుంది. కానీ నిపుణుడు తానే స్వయంగా కాన్యులాను కదిలిస్తూ కొవ్వు ఉన్నచోటికి కాన్యులాను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.

అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపో (యూఏఎల్) : ఈ లైపోసక్షన్ ప్రక్రియలో అల్ట్రా సౌండ్  తరంగాలను శరీరంలోకి పంపే ప్రత్యేకమైన కాన్యులాను ఉపయోగిస్తారు. ఈ తరంగాలు  కొవ్వు కణాలను చిలికినట్లుగా చేస్తాయి. దాంతో అక్కడి కొవ్వు తేలికగా బయటకు వస్తుంది. 

స్మార్ట్ లైపో : ఇందులో లేజర్ సహాయంతో కొవ్వును ద్రవంలా మార్చి ఒక ట్యూబ్ సహాయంతో ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. ట్విన్ కాన్యులా (అసిస్టెడ్) లైపో (టసీఏఎల్ లేదా టీసీఎల్): ఇందులో ఒక ట్యూబ్‌లోనే అంతర్గతంగా మరో ట్యూబ్ ఉండే కాన్యులాను ఉపయోగిస్తారు. లోపలి ట్యూబ్‌ను కొవ్వు తొలగించడానికి ఉపయోగిస్తే, బయటి ట్యూబ్ సహాయంతో మరింత లోతుగా కొవ్వు కణాలను చేరడానికి ఉపయోగిస్తాయి.

ఎక్స్‌టర్నల్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ (ఎక్స్‌యూఏఎల్ ఏఇ ఈయూఏఎల్) : సాధారణంగా యూఏఎల్ ప్రక్రియలో చర్మంపై కణాలు నశించడం (నెక్రోసిస్), నీటితిత్తులు ఏర్పడటం వంటి దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. వీటిని నివారించడం కోసం   ఎక్స్‌యూఏఎల్ ప్రక్రియను అనుసరిస్తారు. ఇందులో అల్ట్రాసౌండ్ తరంగాలను శరీరం బయటి నుంచే చర్మం ద్వారా పంపి కొవ్వు తొలగిస్తారు.

వాటర్ అసిస్టెడ్ లైపోసక్షన్ (డబ్ల్యూఎల్) : ఇందులో ఫ్యాన్ ఆకృతిలో ఉండే నీటిని ఉపయోగిస్తారు. ఈ ఫ్యాన్ ఆకృతిలోని నీరు చర్మంలోపల ఉండే కొవ్వును పలచబారుస్తుంది.

కుట్లు: లైపో ప్రక్రియలో గాటు చిన్నగా ఉంటుంది. కొందరు సర్జన్‌లు ప్రక్రియ తర్వాత కూడా ఆ గాటును అలాగే తెరచి ఉంచేందుకే ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా లోపల మిగిలి ఉండే కొద్దిపాటి కొవ్వు కూడా బయటకు జారిపోతుందని వారి ఉద్దేశం. మరికొందరు ఈ గాటును పూర్తిగా కుట్టకుండా పాక్షికంగానే కుట్టి వదిలేస్తుంటారు.

-Courtesy with Saakshi News paper@Dr.Kishore Reddy of Hyd.
  • -----------------------------------------------------------------------------
రేడియో ఫ్రీక్సెన్సీతో 'కేర్‌' లైపోసక్షన్‌ చికిత్స-- 31 Aug 2011.
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: శరీరంలో అదనంగా పేరుకుపోయే కొవ్వు కణాలను కేర్‌ హాస్పిటల్‌ వైద్యులు రేడియో ఫ్రీక్సెన్సీ సహాయంతో తొలగించారు. లైపోసక్షన్‌ చికిత్సలో భాగంగా తాము దేశంలో తొలిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించామని కేర్‌ హాస్పిటల్‌కు చెందిన ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ లక్ష్మీ సలీమ్‌ చెప్పారు. ఇజ్రాయిల్‌లో అమలు చేస్తున్న రేడియో ఫ్రీక్వెన్సీ ప్రక్రియ వలన ఒబేసిటితో ఇబ్బంది పడుతున్న వారిని చక్కని ఆరోగ్యవంతులుగా మార్చవచ్చని ఆమె పేర్కొన్నారు. అయితే లైపో సక్షన్‌ విధానాలను అనేక విధాలుగా అమలు చేస్తారని, ఇందుకోసం అనేక రకాల సర్జికల్‌ పరికరాలను ఉపయోగిస్తుం టారన్నారు. చేతి సహాయంతో, ఎలక్ట్రిసిటీ ద్వారా, అల్ట్రాసౌండ్‌, పేజర్‌ల సహాయంతో ఇంతవరకూ లైపో సక్షన్‌ చేస్తున్నారని తెలిపారు. ఆయా విధానాల వలన సమయం అధికంగా వెచ్చించాల్సి ఉంటుందని, రేడియో ఫ్రీక్వెన్సీలో డే కేర్‌ ప్రొసిజర్‌లో ఒబేసిటికి వైద్యం చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ విధానంలో శరీరంలో ఎక్కడైతే కొవ్వు కణాలు పెరిగిపోయాయో వాటిని మాత్రమే తొలగిస్తారని, కొవ్వు కణాల సమీపంలో దీని ప్రభావం ఏమాత్రం ఉండకపోవడం వలన రోగికి అదనపు ఇబ్బందులు ఉండవని వివరించారు. కొవ్వు తొలగించడం వలన శరీరంపై ఎలాంటి ముడతలు కూడా ఏర్పడవని ఆమె తెలిపారు.
         

  • ============================
 Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.