Monday, November 18, 2013

Care after abortion,గర్భస్రావం తరవాత జాగ్రత్తలు

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- Care after abortion,గర్భస్రావం తరవాత జాగ్రత్తలు-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



    గర్భం దాల్చి అంతా సజావుగా సాగుతోందనుకుంటోన్న సమయంలో.. అబార్షన్‌ జరిగితే కొందరు శారీరకంగానే కాదు.. మానసికంగా నూ డీలా పడిపోతారు. మళ్లీ గర్భం ఎప్పుడు దాల్చొచ్చు? గర్భస్రావం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు..? అంటూ మహిళలకు రకరకాల సందేహాలు కలగడం సహజం. అలాంటి వాటికీ సమాధానాలున్నాయి.

జీవన విధానం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు... ఇంకేదయినా కారణం కావచ్చు... ఈ రోజుల్లో గర్భస్రావం అనేది సాధారణం అయింది. దానంతట అదే జరిగినా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయించుకోవాల్సి వచ్చినా.. అధ్యయనాల ప్రకారం చెప్పాలంటే ప్రతి ఆరుగురిలో ఒకరికి గర్భస్రావం అవుతోంది. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటే, మరికొందరు ఓ సమస్యగా భావిస్తారు. దాన్నుంచి బయటపడేందుకు ఎక్కువ సమయమే తీసుకుంటారు. ఏదేమైనా... ఇలాంటప్పుడే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. .

నొప్పీ.. రక్తస్రావం
..
గర్భస్రావం అనేది సహజంగా జరిగినా, మందులూ లేదా శస్త్ర చికిత్స రూపంలో అయినా... కొద్దిగా నొప్పి సహజం. నెలసరిలో వచ్చినట్లుగా రక్తస్రావం కూడా అయ్యే అస్కారం ఉంది. అయితే ఈ రెండు మార్పులూ రెండు వారాల్లోపల ఆగిపోవాలి. సాధారణంగా వైద్యులు గర్భస్రావం తరవాత వచ్చే నొప్పిని తగ్గించడానికి నొప్పి నివారణ మందుల్ని ఇస్తారు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉండి, రక్తస్రావం కూడా తీవ్రంగా అవుతున్నా, అదే సమయంలో దుర్వాసనతో కూడిన డిశ్చార్జి కనిపించినా, జ్వరంగా ఉన్నా తేలిగ్గా తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఇన్‌ఫెక్షన్‌కి సంకేతం కావచ్చు. ఈ సమయంలో... రక్తస్రావం పూర్తిగా ఆగిపోయి, సౌకర్యంగా అనిపించేంత వరకూ కలయికలో పాల్గొనకూడదు. రక్తస్రావం కనిపిస్తున్నా కూడా మామూలుగా స్నానం చేయొచ్చు. కొందరు మహిళలు గర్భస్రావమే కదా అన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల్లోనే ఏవో ఒక పనులు చేయడం మొదలు పెడతారు. అయితే సౌకర్యంగా అనిపించేంత వరకూ విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వ్యాయామం చేసే అలవాటు ఉండి... చేయాలీ అనుకుంటే ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి.

మానసికంగా కుంగిపోకుండా..
గర్భం దాల్చాక, నవ మాసాలూ కొనసాగుతుందనే ఆనందంలో ఉండే మహిళలకు అనుకోకుండా అబార్షన్‌ జరిగితే మానసికంగా కుంగిపోవడం సహజం. దాంతో ఆలోచనలూ, ఉద్వేగాల పరంగా కొంత మార్పు కనిపిస్తుంది. ఇవి కొందరిని తాత్కాలికంగా ఇబ్బందిపెడితే.. మరికొందరిని చాలాకాలం పాటు, తీవ్రంగా వేధిస్తాయి. ఒకవేళ అబార్షన్‌ తాలూకు ఆలోచనల నుంచి ఎంతకీ బయటపడకపోయినా, కుటుంబం లేదా స్నేహితుల నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా, అంతా గందరగోళంగా అనిపిస్తున్నా, దేనిమీదా ఏకాగ్రత కుదరక, నిద్రపట్టక, ఆకలి వేయక ఇబ్బందిపడుతున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే కొందరు ఈ సమయంలో చాలా ఒత్తిడికి లోనవుతారు. మళ్లీ గర్భం దాల్చినా అదే పరిస్థితి ఎదురవుతుందేమో అని భయపడతారు. దాంతో ఏ పనులూ చేసుకోక, ఉద్యోగానికీ వెళ్లక, ఎవరికీ చెప్పుకోకుండా లోలోన మథనపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి అవసరాన్ని బట్టి మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి.

మళ్లీ గర్భం ఎప్పుడంటే..
చాలామంది వెంటనే గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అన్నిసార్లూ అది మేలు చేయకపోవచ్చు. జరిగిన గర్భస్రావం నుంచి ముందు శరీరం పూర్తిగా కోలుకోవాలి. కొన్నిసార్లు అది కొన్ని గంటల్లో జరిగితే, మరికొన్నిసార్లు రోజులూ, వారాలూ పట్టొచ్చు. ఏదేమయినా గర్భస్రావం జరిగి, రక్తస్రావం ఆగిపోయి, మళ్లీ నెలసరి వచ్చిన తరవాత గర్భం దాల్చడం మంచిది. నెలసరి అనేది గర్భస్రావం జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తరవాత మొదలవుతుంది. అంతకన్నా ముందు వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే...

ఒకసారి గర్భస్రావం జరిగాక ఆర్నెల్లలోపు మళ్లీ గర్భం దాల్చితే... అది కూడా మొదటి గర్భధారణ అయితే ఆలోచించవచ్చు. ఒకవేళ మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకుంటే.. ఏ మాత్రం ఆలోచించకుండా అంతకన్నా త్వరగా కూడా గర్భం దాల్చవచ్చు. ఆలస్యంగా గర్భం దాల్చేవారితో పోలిస్తే.. త్వరగా తల్లయ్యే వారిలో ఎదురయ్యే సమస్యలు తక్కువే అని అధ్యయనాలు చెబుతున్నాయి.

ర్రెండు అంతకన్నా ఎక్కువగా గర్భస్రావాలు అయినప్పుడు గర్భం దాల్చేముందు, డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. దానికి గల కారణాలు డాక్టర్లు తెలుసుకుని ముందు జాగ్రత్తగా అవసరమైన చికిత్సలు చేసి, మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూస్తారు. కొన్నిసార్లు గర్భాశయంలో క్యాన్సర్‌కు దారితీయని కణితి పెరుగుతుంది. దాన్ని గర్భం అనుకుంటాం కానీ కాదు. ఇలాంటప్పుడు ఆ కణితిని తొలగించాక వైద్యులు ఆర్నెల్ల నుంచి ఏడాది వరకూ ఆగమని చెబుతారు వైద్యులు. దీన్ని కచ్చితంగా పాటించాలి.

ఈ జాగ్రత్తలూ అవసరమే..
గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పాక.. ముందు మీ బ్లడ్‌గ్రూప్‌ని తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయించుకోండి. ఒకవేళ పాజిటివ్‌ కాకుండా నెగిటివ్‌ బ్లడ్‌ టైప్‌ అని తేలితే ఆ మహిళలు యాంటీ డి ఇంజెక్షన్‌ని గర్భస్రావం తరవాత తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో సమస్యల్ని కొంతవరకూ నివారించవచ్చు. కొందరికి గర్భస్రావం ఒకసారే అయితే, ఐదు శాతం కన్నా తక్కువమందికి రెండుసార్లు కావచ్చు. ఒకశాతం మాత్రమే అంతకన్నా ఎక్కువసార్లు అబార్షన్లు అవుతాయి. అయితే ఒకేసారి అయినా.. అంతకన్నా ఎక్కువసార్లు జరిగినా.. మళ్లీ గర్భం దాల్చి, అది ఏ ఆటంకం లేకుండా నవమాసాలూ కొనసాగాలనుకుంటే కొన్ని అంశాలపై శ్రద్ధ పెట్టాలి.

ముందునుంచీ ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని పాటించాలి. సాధ్యమైనంత వరకూ అన్నిరకాల పోషకాలు లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి. వైద్యులు చెప్పాక రోజులో కనీసం అరగంట ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం కూడా మానసికంగా సాంత్వనను అందిస్తుంది. అప్పుడే కాబోయే తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.

గర్భధారణకు కనీసం కొన్ని నెలల ముందునుంచీ ఫోలిక్‌యాసిడ్‌ని తీసుకోవడం మంచిది. అది ఎప్పుడనేది డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది. సాధ్యమైనంత వరకూ ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి.
కారణాలు తెలిపే పరీక్షలున్నాయి..
ఒకటికన్నా ఎక్కువగా గర్భస్రావాలు జరిగితే మళ్లీ అలాంటి సమస్య ఎదురుకాకుండా దానికి కారణాలు తెలుసుకున్న తరవాత గర్భం దాలిస్తే, పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. పరిస్థితిని బట్టి వైద్యుల సలహాతో కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా హార్మోన్లూ, రోగనిరోధశక్తికి సంబంధించిన సమస్యల్ని తెలుసుకునేందుకు వైద్యులు రక్త పరీక్షలు సూచించవచ్చు. దాంతోపాటూ కొన్నిసార్లు భార్యాభర్తల నుంచి రక్తాన్ని సేకరించి కూడా కొన్నిరకాల పరీక్షలు చేస్తారు. ఫలితంగా క్రోమోజోమ్‌ల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి గర్భస్రావం జరిగాక ఆ కణజాలాన్ని కూడా పరీక్ష చేయొచ్చు. ఇవి కాకుండా గర్భాశయం పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ కూడా చేస్తారు. కొన్నిసార్లు గర్భాశయ గోడల్నీ, ఫెల్లోపియన్‌ ట్యూబుల పనితీరునూ అంచనా వేసేందుకు టెలిస్కోప్‌ ఆకారంలో ఉండే చిన్న పరికరాన్ని గర్భాశయ ముఖద్వారం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ పద్ధతిని హిస్టెరోస్కోపీ అంటారు. పరిస్థితిని బట్టి సోనోహిస్టెరోగ్రామ్‌ పద్ధతినీ ఎంచుకోవచ్చు. దానివల్ల గర్భాశయ పొరల్లో ఉన్న సమస్యల్నీ తెలుసుకునే అవకాశం ఉంది.

courtesy with : Dr.Pranathi reddy (Uro gynaecologist)@vasundara of eenadu news paper.
  • ======================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. I have one son and his age is 3Y now.After this baby we wantedly gone for abortion twice.And now my wife given birth to DOWNSYNDROME baby.Now we are going for next pregnenecy after months.Pls tell me what precautions and tests we have to take for healthy child.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.