Monday, November 4, 2013

pregnancy general problems-awareness,గర్భిణుల్లో సాధారణంగా కనిపించే సమస్యలు-అవగాహన

  •  

  •  
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు - pregnancy general problems-awareness,గర్భిణుల్లో సాధారణంగా కనిపించే సమస్యలు-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



గర్భం దాల్చగానే సరిపోదు. నవమాసాలూ ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలి. అప్పుడే పండంటి పాపాయిని ఎత్తుకుంటాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. రకరకాల కారణాల వల్ల ఆ తొమ్మిది నెలల కాలంలోనే కొన్ని సమస్యలు ఇబ్బందిపెడతాయి. కాబోయే తల్లీబిడ్డలిద్దరిపైనా ప్రభావం చూపుతాయి. కొన్నిరకాల ముందుజాగ్రత్తలూ, మరికొన్ని పరిష్కారాలతో ఆ సమస్యల్ని అదుపులో ఉంచొచ్చు..

ఉద్యోగాలు చేయడం, వృత్తిపరంగా లక్ష్యాలు పెట్టుకోవడం, ఆర్థికంగా స్థిరపడాలనుకోవడం.. ఇలా కారణం ఏదయినా చాలామంది మహిళలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇంకా ఆలస్యంగా గర్భం దాల్చేందుకు ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నిసార్లు గర్భం రాక ప్రత్యేక చికిత్స తీసుకోక తప్పడంలేదు. ఈ మార్పులన్నీ కాబోయే తల్లిలో అధికరక్తపోటు, మధుమేహం.. లాంటి సమస్యల్ని పెంచుతున్నాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది అధికరక్తపోటు గురించి.

అధిక రక్తపోటు...
గర్భిణుల్లో సాధారణంగా కనిపిస్తుందీ సమస్య. కొందరిలో ముందునుంచీ ఉంటే, మరికొన్నిసార్లు గర్భధారణ సమయంలో ఎదురవుతుంది. ఒకవేళ ముందే మొదలై ఉంటే సమస్య నవమాసాలూ, ఆ తరవాత కూడా కొన్ని వారాలు కొనసాగుతుంది. కేవలం గర్భధారణ సమయంలో వస్తే.. ప్రసవానంతరం దానంతట అదే తగ్గిపోతుంది. ఎప్పుడు మొదలైనా దానివల్ల కొన్ని సమస్యలు తప్పవు.

అధికరక్తపోటు ఉన్నప్పుడు మాయకు రక్తప్రసరణ సక్రమంగా అందదు. దాంతో గర్భస్థశిశువుకు ప్రాణవాయువూ, పోషకాల్లాంటివి అందడంలో ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. తక్కువ బరువుతో పుడతారు. నెలలు నిండకుండానే కాన్పు కావచ్చు.

కొన్నిసార్లు గర్భాశయం నుంచి మాయ విడిపోతుంది. శిశువుకు ప్రాణవాయువు సరిగ్గా అందదు. తల్లిలోఅధికరక్తస్రావం మొదలవుతుంది. ఈ సమస్య కొందరిలో విపరీతంగా ఉంటుంది. దాంతో మూత్రం నుంచి ప్రొటీన్లు వెళ్లిపోతుంటాయి. ముఖం, కాళ్లలో వాపు ఉంటుంది. దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తరచూ తలనొప్పి రావడం.. చూపు మసగ్గా ఉండటం... పై పొట్ట నొప్పీ... హఠాత్తుగా బరువు పెరగడం... ముఖం, చేతుల వాపులాంటి సమస్యలు కనిపిస్తాయి.

మాత్రలు వాడాలి: గర్భధారణ సమయంలో వేసుకునే మాత్రలు బిడ్డపైనా ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో డాక్టర్లు సాధారణంగా ఇతర మందుల్ని సూచించరు. కానీ అధికరక్తపోటు అదుపులో ఉండాలంటే మాత్రలు తప్పనిసరి కాబట్టి వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకుని కొన్నిరకాల మాత్రల్ని సూచిస్తారు.

ఉప్పు తగ్గించాలి: గర్భధారణకు ముందే ఈ సమస్య ఉంటే వైద్యులకు తెలియజేయాలి. దాన్ని బట్టి వాడుతున్న మందుల్ని కొనసాగించాలా లేదా అన్నది నిర్ణయిస్తారు. మందుల్ని క్రమం తప్పకుండా వేసుకోవాలి. గర్భం దాల్చిన తొమ్మిదినెలలూ వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ఎప్పకటిప్పుడు బీపీని గమనించుకోవాలి. తరచూ మూత్ర, రక్తపరీక్షలు చేయించుకోవడమూ అవసరమే. ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్‌ స్కాన్‌లు చేస్తూ పాపాయి ఆరోగ్యాన్నీ వైద్యులు గమనిస్తారు. బిడ్డ గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకుంటారు.

నిపుణుల సలహాతో వ్యాయామం చేయాలి. గర్భధారణ సమయంలో కాబోయే తల్లి బరువు పదకొండు నుంచి పదహారు కిలోలు పెరిగితే సరిపోతుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రసవ సమయంలో అధికరక్తపోటు పెరగకుండా డాక్టర్లు ఎప్పటికప్పుడు గమనిస్తారు. లేబర్‌ ఇండక్షన్‌ ప్రక్రియను ఎంచుకుంటారు. అంటే ఇంజెక్షన్లు ఇచ్చి ప్రసవం అయ్యేలా చేస్తారు. ఒకవేళ సమస్య మరీ ఎక్కువగా ఉంటే ఫిట్స్‌ రాకుండా మాత్రలు ఇచ్చి సిజేరియన్‌ చేస్తారు.

మధుమేహం
గర్భిణుల్లో కనిపించే మరో సమస్య మధుమేహం. ముందునుంచీ ఉన్నా లేక ఆ సమయంలోనే కనిపించినా గైనకాలజిస్టుతోపాటూ ఎండోక్రైనాలజిస్టు, డైటీషియన్‌ సలహాలు తీసుకుంటూ ఉంటే సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయి. ఫలితంగా..గర్భస్రావం అవకుండా చూసుకోవచ్చు. తల్లిలో అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. కాబోయే తల్లిలో ఇతర సమస్యలూ తగ్గుతాయి. తొమ్మిదినెలలు గడిచాక కూడా పాపాయి దక్కకపోవడం లాంటి సమస్యల్నీ అధిగమించవచ్చు.

నెలలు నిండకుండా కాన్పు అయ్యే పరిస్థితి నుంచి బయటపడొచ్చు. పుట్టబోయే పాపాయికి దృష్టిలోపాలు ఎదురవకుండా, మెదడూ, వెన్నెముక, గుండె పనితీరూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

ఒకవేళ రక్తంలో చక్కెరస్థాయులు సమతూకంలో లేకపోతే ఆ ప్రభావం మాయపై పడుతుంది. శరీరంలో అదనంగా ఇన్సులిన్‌ తయారీ అవసరం అవుతుంది. దాంతో బిడ్డ బరువు పెరుగుతుంది. ఫలితంగా కొన్నిసార్లు సహజ కాన్పు కాకపోవచ్చు.

కొన్నిసార్లు కాబోయే తల్లులకు గర్భధారణ సమయంలో మధుమేహం ఎదురైనా.... ప్రసవానంతరం అది తగ్గుతుంది.

ముందు జాగ్రత్తలున్నాయి: ఈ సమస్య ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరస్థాయుల్ని పరీక్షించుకోవాలి. తదనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారం.. వికారంతో అయ్యే వాంతుల్ని బట్టి గర్భిణికి ఇన్సులిన్‌ని ఎంత మోతాదులో ఇవ్వాలనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆహారంలో పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాలూ ఎక్కువగా ఉండాలి. ఓ పద్ధతి ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి. ఫోలిక్‌యాసిడ్‌ లాంటి పోషకాలనూ వాడాల్సి ఉంటుంది. అలాగే నడక, యోగాసనాలు లాంటి వ్యాయామాలు వారంలో కనీసం ఐదురోజులు అరగంట చొప్పున చేయాలి. బిడ్డ ఆరోగ్యాన్ని గమనించేందుకు ఎప్పటికప్పుడు స్కాన్‌ చేయించుకోవడం కూడా అవసరమే.

ప్రసవంపై ప్రభావం: పరిస్థితిని బట్టి కొన్నిసార్లు కాన్పు సహజంగా అయ్యేవరకూ ఆగుతారు. లేదంటే తల్లీబిడ్డల ఆరోగ్య దృష్ట్యా ముందే చేయాల్సీ రావచ్చు. ఒకవేళ బిడ్డ మరీ బరువుంటే సిజేరియన్‌కి ప్రాధాన్యం ఇస్తారు.

ఒత్తిడి అదుపులో: గర్భధారణకు ముందే వైద్యులకు పరిస్థితిని వివరించి వారు సూచించిన మందుల్ని వాడాలి. శారీరక శ్రమ ఉండాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. కెఫీన్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. గర్భం దాల్చకముందే వైద్యుల్ని సంప్రదిస్తే ఫోలిక్‌యాసిడ్‌ని ఎక్కువ మోతాదులో సూచిస్తారు. దానివల్ల నాడీ సంబంధ సమస్యల్లాంటి వాటిని తగ్గించుకోవచ్చు. అలాగే నవమాసాల సమయంలోనూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

గర్భధారణ సమయంలో ఉబ్బసం--
వాస్తవానికి ఇది వూపిరితిత్తుల సమస్య. పుట్టబోయే పిల్లలపైనా దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే సమస్యలు,
* పుట్టబోయే పాపాయికి ప్రాణవాయువు సరిగ్గా అందదు. మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎక్కువగా కనిపిస్తుంది. రక్తపోటు పెరుగుతుంది.
* బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. నెలలు నిండకుండానే కాన్పు అవడమే కాదు... ప్రసవం కూడా కష్టం అవుతుంది.

వేటికి దూరంగా ఉండాలి: దీని లక్షణాలు తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. గర్భం దాల్చిన వెంటనే వేసుకునే మందుల్ని మానేయడం, లేదా మార్చడం లాంటివి ఈ సమస్యని పెంచుతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు నవమాసాలూ చికిత్స తీసుకోవచ్చు. అది ఏ పద్ధతిలో ఎలాగా అనేది డాక్టర్లే నిర్ణయిస్తారు. పొగ, దుమ్మూ, మంచూ, పుప్పొడీ, జంతువుల నుంచి వచ్చే జుట్టు లాంటి వాటికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహాతో వ్యాయామాన్ని చేయాలి. తరచూ దగ్గు వస్తున్నా, ఛాతీలో పట్టేసినట్లు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించినా తేలిగ్గా తీసుకోకూడదు.

 మూర్ఛ -
కొన్నేళ్ల క్రితం మూర్ఛ ఉన్న స్త్రీని పిల్లలు కనేందుకు ప్రోత్సహించేవారు కాదు. కానీ ఇప్పుడా సమస్య ఉన్నవారిలో తొంభైశాతం మంది పండంటి పాపాయిలకు జన్మనిస్తున్నారు. అయితే మూర్ఛ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..
* మాయ ముందే విడిపోవచ్చు. అధికరక్తపోటూ తప్పదు. మూత్రం ద్వారా ప్రొటీన్‌ బయటకు పోతుంది.
* తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, ప్రసవ సమయంలో ఇబ్బంది..
* బిడ్డలో ఇతర సమస్యలూ ఎదురవుతాయి.

వాస్తవానికి ఇలాంటి వారు గర్భధారణ సమయంలో ఏ తరహా మందులు వాడినా అవి పుట్టబోయే పిల్లలపై ప్రభావం చూపుతాయి. నాడీ సంబంధ సమస్యలూ, గుండెకు అసౌకర్యం.. లాంటివి వాటిల్లో కొన్ని. అలాగని మందులు మానేస్తే గర్భస్రావం, నెలలు నిండినా బిడ్డ దక్కకపోవడం లాంటివి తప్పవు. వైద్యులు ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే మందులు సూచిస్తారు.

Courtesy with : Dr.Pranati Reddy , Uro-Gynaecologist , Hyd. @Vasundara of Eenadu paper
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.