Monday, January 24, 2011

పిల్లల ఎదుగుదల ,Growth in children

పిల్లల ఎదుగుదల గురించి తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు . మాబాబు అందరి పిల్లల్ల ఎదగడం లేదు . సన్నగా ఉన్నాడు . పాపాయి సన్నగా పీలగా ఉంటుంది . తింది సరిగా తినడం లేదు . ఎదుగుతుందో ,లేదో ? ఇలా తల్లులు ఎంతగానో ఆవేదన చెందుతూ ఉంటారు . పిల్లలు వాళ్ళ ఆకలి ప్రకారం తింటున్నా తమ ప్రేమ వల్ల తినడంలేదని , ఎదగడం లేదని అనుకుంటారు . ఒక్కొక్కప్పుడు నిజంగానే పిల్లల ఎదుగుదల కుంటుపడవచ్చు ... ఎందుకు , వాటి నివారణ మార్గాలు గురించి కొంత జ్ఞానము , వైద్య పరిజ్ఞానము తెలుసుకునేందుకు చదవండి .


పిల్లల ఎదుగుదల ,Growth in children :

తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలలో మార్పులను చూసి చాలా బెంగపెట్టుకుంటుంటారు. వారి హైట్‌లో మార్పులు రావడంలేదని తెగబాధపడుతుంటారు. ఇక్కడ మేము చెప్పే క్యాలిక్యులేషన్‌లతో మీరు మీ పిల్లల్లో ఎదుగుదలను మీరు గమనించగలరు.

పిల్లల ఎదుగుదల ఎలాగుర్తించడం ?

** తల్లిదండ్రుల హైట్ ఎలావుంటే పిల్లల్లోకూడా హైట్ అలాగే ఉంటుందని, దీనిని ఎవరుకూడా నియంత్రించలేరని వైద్యులు తెలిపారు. పిల్లల హైట్ దాదాపు 90శాతం తల్లిదండ్రుల హైట్‌తో సంబంధం ఉంటుంది. తల్లిదండ్రులిరువురు మంచి హైట్ ఉంటే పిల్లల్లోకూడా ఎదుగుదల బాగుంటుంది.

** పిల్లలు పుట్టినప్పుడు సహజంగా వారి పొడవు 50 సెంటీమీటర్లుంటుంది. ఒక ఏడాది తర్వాత 75 సెంటీమీటర్లకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఏడాది 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు పెరుగుతారు. ఇలా పిల్లలు కిశోరావస్థకు చేరుకునేవరకు పెరుగుదల జరుగుతుంటుంది.

** కిశోరావస్థలో పెరుగుదల చాలా వేగంగా పెరుగుతుంది. అమ్మాయిలలోనైతే 10 సంవత్సరాలు, అబ్బాయిలలోనైతే 12సంవత్సరాల తర్వాత పెరుగుదల ప్రారంభమౌతుంది.

** పుష్టికరమైన ఆహారంతోబాటు మంచిగా వ్యాయామం చేస్తే మీ పిల్లల్లో పెరుగుదల కనపడుతుందని చిన్నపిల్ల-వైద్యులు తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు.

పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక లోపాలకు కూడా గురవుతారు. పిల్లలు ముఖ్యంగా విటమిన్ - ఎ ఐరన్, కాల్షియం, అయొడిన్ వంటి పోషక పదార్థాల లోపానికి గురవుతారు. ఆ లోపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అవి పిల్లల ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పై ప్రభావం చూపుతాయి

** టానిక్కులు, ప్రోటీన్ పౌడర్, ఇతర మందులపై ఆశపెట్టుకోకూడదంటున్నారు వైద్యులు. ఇవి బలహీనంగానున్న పిల్లలకు మాత్రమే పనికొస్తాయి.


బిడ్డ ఆరోగ్యం అంటే?

బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు కాకుండా ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం.

బిడ్డ ఆరోగ్య సంరక్షణలో దశలు

* గర్భస్థంగా ఉన్నప్పుడు
* నవజాత శిశువు
* శిశువు దశలో
* చిరు బాల్య దశలో
* ప్రీ – స్కూల్ దశలో

పైన చెప్పిన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అని్న దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావితం చూపిస్తుంది.
పిల్లల ఆరోగ్యాని్న పిల్లల మరణాల సంఖ్య మరియు వ్యాధుల సంక్రమణను ఆధారంగా చేసుకొని నిర్ణయించవచ్చును.

పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు
పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, వయస్సు, లింగం, పరిసరాలు, కుటుంబ పరిమాణం, పోషణ, మాతృశిశు సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం.

పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు
నవజాత శిశువుకు వచ్చే ఆరోగ్య సమస్యలు – కామెర్లు, ధనుర్వాతం, శ్వాస సంబంధ సమస్యలు, ఉష్ణోగ్రతను క్రమపరచకోవటం (బయటి వాతారణంలోని ఉష్ణోగ్రతను తట్టుకోకపోవటం), నోటి పూత సంబంధిత వ్యాధులతో బాధపడడం.
అంటుసోకటం మొదలగున్నవి, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు ఎక్కువగా ఒక గంటలోపు బిడ్డ బరువు చూడటం ముఖ్యమైన చర్య. మంచి ఆరోగ్యంతో పోషకాహారంతో ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలు 3.5 కేజీల బరువు ఉంటారు. కానీ భారతదేశంలో పిల్లల యొక్క కనీస బరువు 2.5 నుండి 2.9 కేజీలు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను (తక్కువ బరువుతో పుట్టిన) పిల్లలు అంటారు.

పిల్లల పెరుగుదల అభివృద్ధిని పర్యవేక్షించుట

పిల్లల పెరుగుదల, అభివృద్ధిని పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని వారి పోషణ స్థితిని తెలియచేస్తుంది. మరియు పిల్లల పెరుగుదలలో వచ్చే తేడాలను తెలియచేస్తుంది. దీని వలన కుటుంబ స్థాయిలో నివారణోపాయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది.

పిల్లలలో పెరుగుదల
పిల్లలలో ముఖ్యంగా ఎత్తు, బరువు, తల, ఛాతిలను కొలవటం ద్వారా తెలుసుకోవచ్చును..
పిల్లలలో పెరుగుదలను క్రమ బద్ధంగా పర్యేవేక్షించుట ద్వారా కుపోషణ వలన పిల్లల పెరుగుదలలో ఏదైనా తరుగుదల కనిపించటం తెలుస్తుంది. వెంటనే ఆరోగ్య కార్యకర్త /తల్లులు వారిని తిరిగి మామూలు స్థితికి రావడానికి చర్యలు తీసుకోవచ్చు. క్రమంగా బరువు పెరగటం అనేది ఆరోగ్యానికి సూచిక వంటిది. (భారత ప్రభుత్వం వారు) రూపొందించిన (గ్రోత్ చార్ట్ / పిల్లల పెరుగుదల పట్టికలో) పిల్లల బరువును నమోదు చేయవచ్చును. ఈ పట్టిక ఆరోగ్య కేంద్రాలలో లభ్యమవుతుంది.
సంవత్సరం వరకు పిల్లల బరువును నెలకొకసారి చూడాలి. రెండు సంవత్సరాలు వచ్చే వరకు రెండు నెలలకు ఒకసారి చూడవచ్చు. 5 సం.లు వచ్చే వరకు మూడు నెలలకు ఒకసారి చూడవచ్చును.

మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బరువు 1వ స్థితికి కంటే పైకి ఉంటుంది.
బిడ్డ బరువు 1వ – 2 మరియు 2 – 3 మధ్య ఉండే వారికి ఇంటి వద్ధనే అనుబంధ ఆహారాన్ని సరిపోయినంత అందించవలసి ఉంటుంది.
బిడ్డ బరువు 3వ లైను కంటే తక్కువ ఉంటే వారు డాక్టరును సంప్రదించి జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. వీరు తీవ్రమైన కుపోషణను గురి అవుతుంటారు.
బిడ్డ బరువు 4వ లైను కంటే తక్కువ ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందవలసిన అవసరం లేదు.

గ్రోత్ చార్టు

* బిడ్డల పెరుగుదలను క్రమంగా పర్యేవక్షించడానికి
* పిల్లలలో కుపోషణ స్థాయిని నిర్ధారించడానికి
* తగిన చర్యలను తీసుకోవడానికి
* ఆరోగ్య కార్యకర్తలను, తల్లులను బిడ్డల బరువును తీసుకోవటం వలన ఉపయోగం గురించి అవగాహన కల్పించవచ్చు. మరియు కుపోషణను నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు.
* పిల్లలలో మొదటి సంవత్సరంలో అనూహ్యమైన పెరుగుదల కన్పిస్తుంది.

ఎటువంటి అంటుసోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరియు వారు వేసుకునే దుస్తులు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలను కనపరచాలి. దీని వలన పిల్లలో రక్షణ భావం, నమ్మకం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుంది. సరిపోయినంత ప్రేమ, ఆప్యాయత మరియు ఇతర అవసరాలకు సరైన స్థితిలో లేకపోవడం వలన పిల్లలలో అభద్రతాభావం ఏర్పడుతుంది. దీని వలన వారి మానసిక మరియు ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కనుక తల్లిదండ్రులకు వారి పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్రేకాలపరంగా రక్షణ కల్పించడం అవసరం. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని, నమ్ముకున్న విషయాలను గ్రహించే శక్తిని మరియు భద్రతాభావాన్ని కల్పిస్తుంది.

పిల్లలలో వచ్చే వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వటం
సాధారణంగా బిడ్డకు నెల రోజుల నుంచి 5 సం.ల వయస్సు వరకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన పిల్లలు వ్యాధులకు గురికావటం వలన మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధులు 4 రకాలు ఉంటాయి.

* డయేరియా
* ఏ.ఆర్.ఐ. (శ్యాస కోశ వ్యాధులు)
* వ్యాధి నిరోధక టీకాల ద్వారా నిరోధించ గల వ్యాధులు
* పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు

పై వీటన్నింటికి కూడా మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయాలు.



పిల్లలలో పెరుగుదల విధానం


పిల్లల పెరుగుదలలో ముఖ్యమైన దశలు / మైలు రాళ్ళు

ఒక బిడ్డ ఎదుగుదల క్లిష్టమైన మరియు కొనసాగుతూ ఉండే ప్రక్రియ. కొన్ని వయస్సులలో కొన్ని పనులు మాత్రమే చేయ గలరు. వీటినే అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు. ఒక తల్లి తండ్రిగా, గమనించవలసిన ముఖ్య విషయం ఏమనగా ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఎదగరు. కావున , పక్కింటి బిడ్డ ఫలానా పనులు చేయగలుగుతున్నాడు, కాని తన , సొంత బిడ్డ చేయలేకపోతున్నాడే అని విచారించడం నిరర్ధకం. ఫలానా వయస్సులలో పిల్లలు చేయదగ్గ పనుల కొరకు, వారిని కొంతకాలం గమనించవలెను.

కొన్ని నెలల ఆఖరున ఫలానా పని ఇంకా చేయలేని యెడల, పిల్లల నిపుణులను సంప్రదించవలెను. దీనివల్ల మనం తెలుసుకోవలసిన సత్యం ఏమనగా ఆ బిడ్డకు రుగ్మత లేక కలవరపాటు వలన భిన్నంగా ప్రవర్తించు చున్నాడని, అప్పుడప్పుడు ఆ బిడ్డ కొన్ని ప్రాంతాలలో సమాన వయస్కులైన మిగతా పిల్లల కన్నా మెల్లగా అభివృద్ధి చెందవచ్చు, కాని కొన్ని విషయాలలో మిగతా పిల్లల కంటే ముందుండ వచ్చును. బిడ్డ నడవడానికి సిధ్ధంగా లేనప్పుడు బలవంతంగా నడిపించుట సహాయపడదు

అభివృద్ధి లోని ఆలస్యమును త్వరితంగా గుర్తించుట

బిడ్డ వయసు - చేయగలగ వలసిన పనులు

* 2 నెలలు - సాంఘికమైన చిరునవ్వు.
* 4 నెలలు - మెడను నిల్పుట
* 8 నెలలు - ఆధారం లేకుండా కూర్చోనుట.
* 12 నెలలు - నిలబడుట.



పుట్టుక నుండి 6 వారాల వరకు

* బిడ్డ వీపు మీద పడుకుని తల ఒక ప్రక్కగా తిప్పిఉండును.
* అకస్మాతైన శబ్ధానికి అతడి శరీరం ఉల్లికిపడి బిఱుసుగా మారును.
* పిడికిలి గట్టిగా మూసివేయబడి ఉండును.
* అతడి హస్తానికి మోటుగా తగిలిన వస్తువును దగ్గరకు తీసుకోగలడు. దీనిని గ్రాస్ప్ రిఫ్లెక్స్ అంటారు.



6 నుండి 12 వారాల వరకు

* అతడి మెడను బాగా నిలుపుట నేర్చుకుంటాడు.
* వస్తువుల మీద చూపు నిలపగలుగుతాడు.



3 నెలలు

* వెల్లకిలా పడుకున్నప్పుడు అతడి చేతులు మరియు కాళ్ళు సమానంగా కదల్చగలడు. సమన్వయముకాని లేక తుళ్ళిపడే కదలికలు కావు. బిడ్డ ఏడుపే కాకుండా గుడుగుడు అను, ఇతర శబ్ధములు చేయును.
* బిడ్డ తల్లిని గుర్తించి మరియు ఆమె గొంతుకు స్పందించును.
* బిడ్డ చేతులు ఎక్కువగా , తెరిచే యుండును.
* బిడ్డను ఎత్తుకున్నప్పుడు, బిడ్డ తన తలను లిప్తకాలము కంటే ఎక్కువ కాలం నిలపగలడు



6 నెలలు

* బిడ్డ తన చేతులను ఒక దానితో ఒకటి అంటించి ఆడుకుంటాడు
* బిడ్డ తన చుట్టు ప్రక్కల చేయు శబ్ధములకు తలత్రిప్పును.
* బిడ్డ తన వీపు నుండి పొట్టమీదకు , పొట్టమీదనుండి వీపు మీదకు తిరుగుతాడు
* ఆధారంతో బిడ్డ కాసేపు కూర్చోగలడు.
* బిడ్డను ఎత్తుకున్నప్పుడు, అతనికాళ్ళమీద కాస్త బరువును భరించగలడు.
* అతని పొట్టమీదున్నప్పుడు, ఆ బిడ్డ తన చాపబడిన చేతులతో వాడి బరువును మోయగలడు.



9 నెలలు

* శరీరం పైకి లేపకుండా తన చేతులతో ఆధారం లేకుండా కూర్చోగలడు
* బిడ్డ తన చేతులతో మరియు మోకాలితో పాకగలడు.



12 నెలలు

* బిడ్డ నిలబడుటకు పైకి త్రోస్తాడు.
* మామ అను మాటలు అనుట ప్రారంభించును.
* సామాన్లు పట్టుకుని నడవగలుగును.



18 నెలలు

* సహాయం లేకుండా గ్లాసుపట్టుకొనగలడు మరియు వలకకుండా త్రాగగలడు.
* బిడ్డ పడిపోకుండా, తూలిపోకుండా ఒక పెద్ద గది గుండా ఆధారం లేకుండా నడవ గలడు.
* రెండు , మూడు మాటలు పలుక గలడు.
* బిడ్డ తనంతట తానే తినగలడు.



2 సంవత్సరంలు

* బిడ్డ పైజమా లాంటి బట్టలను తీసివేయగలడు.
* బిడ్డ పడిపోకుండా పరిగెత్తగలడు.
* బిడ్డ బొమ్మల పుస్తకం లోని బొమ్మల మీద ఆసక్తి కనబరచును.
* బిడ్డ తన కేమి కావాలో తెలుపగలడు.
* బిడ్డ ఇతరులు చెప్పిన మాటలు తిరిగి చెప్పగలడు.
* బిడ్డ తన శరీరం లోని కొన్ని అవయవాలను గుర్తించగలడు.



3 సంవత్సరంలు

* బిడ్డ బంతిని పైకి విసరగలడు ( ప్రక్కకు లేదా క్రిందకు కాకుండా )
* నీవు అమ్మాయివా అబ్బాయివా అనే చిన్న ప్రశ్నలకు బిడ్డ సమాధానం చెప్పగలడు.
* బిడ్డ వస్తువులను అవతలకు పెట్టడానికి సహాయపడును.
* బిడ్డ కనీసం ఒక రంగు పేరైనా చెప్పగలడు.



4 సంవత్సరంలు

* మూడు చక్రాల బండిని త్రొక్కగలడు.
* పుస్తకాలలోని పత్రికలలోని బొమ్మలను గుర్తించగలడు.



5 సంవత్సరంలు

* బిడ్డ తన బట్టలకు గుండీలు పెట్టుకొనగలడు.
* బిడ్డ కనీసం మూడు రంగుల పేర్లను చెప్పగలడు.
* బిడ్డ పాదాలను ఒకదాని కొకటి మార్చి మెట్ల కిందకు దిగగలడు.
* బిడ్డపాదాలు దూరంగా పెట్టి గెంతగలడు.


పిల్లలలో నిర్ధేశిత-ఎత్తు - బరువు



సేకరణ: Dr.Seshagirirao -MBBS.


  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

2 comments:

  1. very informative.Thank you for posting.

    ReplyDelete
  2. చాలా మంచి సమాచారం ఇచ్చారు.

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.