ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు
-పరిపూర్ణ ఆరోగ్యము-అవగాహన , Complete health-awareness - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
- మన పయనం... విజయం నుంచి విజయానికి! ఒకప్పుడు వ్యాధులను జయించటమే గొప్ప. క్షయ, ప్లేగు, కుష్టు, సిఫిలిస్, గనేరియా.. ఇలా మానవాళిని కబళించి, మారణహోమం చేసిన వ్యాధులెన్నో. వీటితో తంటాలుపడి.. తలపడి.. సమర్థ ఔషధాల ఆవిష్కారంతో ఈ వ్యాధులను వదిలించుకుంటూ.. ఆరోగ్య పరిరక్షణలో చాలా దూరమే వచ్చాం. ఇది చిన్న విజయమేం కాదు!
ఇప్పుడు మన ఆలోచన మారుతోంది. మన లక్ష్యం విస్తరిస్తోంది. చక్కటి ఆరోగ్యమంటే... కేవలం వ్యాధుల్లేకపోవటమే కాదు. ఎటువంటి జబ్బులూ బాధలూ లేకపోవటం ఆరోగ్యానికి మూలమేగానీ... జబ్బు లేకుండా తిని తిరుగుతుండటాన్నే మనం 'ఆరోగ్యం' అనలేం. 'పరిపూర్ణ ఆరోగ్యం' అన్నది మన లక్ష్యం కావాలన్నది నేటి వైద్యరంగంఆలోచన!
కేవలం జబ్బుల్లేనంత మాత్రాన మనం జీవితంలో సుఖంగా, సంతోషంగా ఉంటామన్న భరోసా ఏంలేదు! పరిపూర్ణ ఆరోగ్యమంటే.. శారీరకంగానే కాదు.. సామాజికంగా, మానసికంగా, వృత్తిపరంగా, భావోద్వేగపరంగా..ఆధ్యాత్మికంగా.. అన్ని రకాలుగా హాయిగా.. స్వస్థతతో ఉండటం! అప్పుడే మనం ఏ చీకూచింతా లేకుండా.. జీవితంలోని ఆనందాన్నీ.. మకరందాన్నీ ఆస్వాదించగలుగుతాం. చక్కటి ఆయుర్దాయంతో.. సంతోషంగా జీవించగలుగుతాం. అందుకే నేటి వైద్యరంగం.. వ్యాధుల చికిత్స నుంచి నియంత్రణ వైపు.. నియంత్రణ నుంచి వ్యాధుల నివారణ వైపు... కేవల 'ఆరోగ్యం' నుంచి 'పరిపూర్ణ ఆరోగ్యం' వైపు... దృష్టి సారిస్తోంది.
పరిపూర్ణ ఆరోగ్యమన్నది వైద్యంతో.. మందులతో సాధించేది కాదు. ఇది ఆసాంతం మన జీవనశైలితో.. మన అలవాట్లతో.. మన ఆలోచనలతో, భావోద్వేగాలతో ముడిపడిన వ్యవహారం. మన ఆరోగ్యానికి మనమే బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే విభాగం. భౌతికంగా, శారీరకంగానే కాదు.. మానసికంగా, సామాజికంగా కూడా మనిషిని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే బహుముఖీన విధానం. అందుకే ఈ లక్ష్య సాధనలో మన అడుగులు ఎటు కదలాలో... మన ఆలోచనలు ఏ దిశగా సాగితే మంచిదో..తెలుసు కుందాం .
సామర్థ్యం, తృప్తి ముఖ్యం---
ఉద్యోగంలో వ్యక్తిగతంగా మనకు తృప్తి, సంతోషం లభించటమన్నది ఆరోగ్యానికి చాలా కీలకమైన అంశం. వృత్తిలో, ఉద్యోగంలో మన నైపుణ్యాలనూ, సామర్ధ్యాలనూ సంపూర్ణంగా వినియోగిస్తున్నప్పుడు మనకు అర్థవంతంగా పని చేస్తున్నామన్న గొప్ప తృప్తి కలుగుతుంది. పని చేయటం ద్వారా మన జీవితం మరింత ఎత్తులకు వెళుతున్న పాజిటివ్ భావన కలుగుతుంది. ఉద్యోగంలోగానీ, స్వచ్ఛంద కార్యక్రమాల్లోగానీ మనసు పెట్టి హృదయపూర్వకంగా పని చేసినప్పుడు, వృత్తిపరంగా మనం సరైన దారిలో నడుస్తున్నప్పుడు మన పని, మన వ్యాపకాలే మనకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాయి, అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంటాయి. పనిలో అంటీముట్టనట్టుండటం, క్రియాశూన్యంగా ఉండటం మన ఆరోగ్యానికే మంచిది కాదు. మీరు ఎంచుకునే వృత్తి, ఉద్యోగంలో తృప్తి, పైకి ఎదగాలన్న ఆకాంక్ష, పని సామర్థ్యం.. ఇవన్నీ కూడా మన పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేసే అంశాలే. అలాగే ఎప్పుడూ పనితో సతమతమవుతుంటే.. జీవితంలో సుఖశాంతులు అడుగంటుతాయి. లక్ష్యాలను చేరుకోలేకపోతుండటం, రోజుకు 24 గంటలకంటే ఎక్కువ టైముంటే బాగుండుననిపిస్తుండటం.. ఇవన్నీ సమయ పాలన సరిగా లేదని చెప్పే అంశాలు. ప్రాధాన్యం ప్రకారం పనిని వాయిదా వెయ్యకుండా చేసుకుంటూపోవటం, ఉన్న సమయానికి మించి ఎక్కువ పనులు నెత్తినేసుకోకుండా.. అవసరమైతే నిర్మొహమాటంగా 'చెయ్యలేను' అని చెప్పగలగటం, వీలైనచోట పని బాధ్యతలను ఇతరులకు అప్పగించటం.. ముఖ్యంగా విశ్రాంతి, వ్యక్తిగతమైన సరదాల సమయం హరించుకుపోకుండా చూసుకోవటం.. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు.
కుతూహలమే ఇంధనం--
మనం అంతగా గుర్తించంగానీ... మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటమన్నది ప్రతి మనిషి అస్థిత్వానికి ఎంతో కీలకం. జీవించినంత కాలం.. జీవితం మీద ఆసక్తి తగ్గకూడదు. నిర్లిప్తతలోకి జారిపోకుండా.. సామాజికంగా ముడుచుకుపోకుండా.. నిరంతరం కుతూహలంతో ఉండటం ముఖ్యం. అందుకు మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించటం ఎంతో అవసరం. మన మేధస్సుకు సృజనాత్మకంగా, స్ఫూర్తిమంతంగా ప్రేరణనిచ్చే అంశాలపై శ్రద్ధపెట్టాలి. మేధోపరంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి.. తన విజ్ఞానాన్నీ, అవగాహనా ప్రపంచాన్నీ విస్తరించుకుంటూ.. తన విజ్ఞాన ఫలాలను నలుగురితో పంచుకుంటూ ఉంటాడు! నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, పుస్తకాలు, పత్రికలు చుదువుతుండటం, పజిల్స్-సమస్యల వంటివి పరిష్కరించటం, సృజనాత్మకంగా ఆలోచించటం అవసరం. ప్రస్తుతం మన సమాజంలో, మన చుట్టుపక్కల ఏం జరుగుతోందో, కొత్తకొత్త ఆలోచనలు, ఐడియాలు ఏమేం వస్తున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని ఎప్పుడూ చంపుకోకూడదు. మనకున్న విజ్ఞానంతో మనకు మనమే సంతృప్తిపడిపోతూ.. కొత్తగా చేసేదేమీ లేకుండా నిరర్ధకంగా మారిపోవటం పరిపూర్ణ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కొత్తగా ఏదో ఒకటి చెయ్యాలన్న కుతూహలం, ఏదో ఒకటి తెలుసుకోవాలన్న ఉత్సుకత... మన మేధస్సుకు నిరంతరం సవాళ్లు విసురుతుంటుంది, ఫలితంగా మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లు మనకు అడ్డంకుల్లా, ప్రతిబంధకాల్లా కనబడవు, అవే విజయానికి మెట్లలా కనబడటం ఆరంభమవుతుంది. రకరకాల పుస్తకాలు, పత్రికలు చదువుతుండటం, కొత్తకొత్త విద్యలు, భాషలు, నైపుణ్యాలు, కళలు నేర్చుకుంటూ ఉండటం.. మేధోపరమైన అవసరం, అది ఏ వయస్సులోనైనా సరే!
కనిపించని సమస్య--
శరీరమూ, మనస్సూ విడదీయరానివేగానీ సంప్రదాయంగా మనం శారీరక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. మానసిక ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. అందుకే మానసిక సమస్యలను గుర్తించకపోవటం, ఈ సమస్యలతో బాధపడేవారిని చిన్నచూపు చూస్తూ హేళన చేయటం ఎక్కువ. ఈ ధోరణి మనకూ చేటు చేస్తుంది. ఎందుకంటే మనలో చాలామందికి కుంగుబాటు (డిప్రెషన్),ఆందోళన (యాంగ్జయిటీ) లక్షణాలు కనబడుతుంటాయి. ఇవి దైనందిన జీవితంలో సుఖశాంతులు లేకుండా చేస్తాయి. ఉద్యోగ జీవితంలోనూ ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అయినా దాన్నో సమస్యగా గుర్తించేందుకు ఎవరూ ఇష్టపడరు, దీనికి చికిత్స తేలికే అయినా అందుకు సిద్ధపడటం లేదు. కొందరిని ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి వంటివి విడవకుండా బాధిస్తుంటాయి, ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ బయటపడదు. డిప్రెషన్ వంటి మానసిక సమస్యల లక్షణాలు ఇలానూ బయటపడొచ్చని గుర్తించాలి. వృద్ధుల్లో ఆకలి తగ్గటం, నిద్ర పట్టకపోవటం, నిస్సత్తువ వంటి మానసిక సమస్యల లక్షణాలు కనబడుతున్నా 'పెద్దవయసులో ఇవి మామూలేలే!' అని కొట్టిపారెయ్యటం.. ఎవరైనా కాస్త భిన్నంగా ప్రవర్తిస్తుంటే 'పెంకి మనుషులు', ఎప్పుడూ 'ఏదో నస పెడుతుంటారు' అంటూ ముద్ర వెయ్యటం చేస్తుంటారు. కొందరు మానసిక సమస్యల కారణంగా మద్యం, మాదక ద్రవ్యాల వంటివాటికీ చేరువ అవుతారు. ఇవన్నీ విస్మరించటానికి వీల్లేని అంశాలు. నిత్య వ్యాయామం, తగినంత నిద్ర విశ్రాంతి, హాస్యంతో సరదాగా, సానుకూలంగా, సృజనాత్మకంగా ఉండే ధోరణి, చక్కటి ప్రేమానురాగాలు పొందటం, పంచటం.. ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి చాలా కీలకం!
దీని తర్వాతే ఏదైనా!---
ఎన్ని భాగ్యాలున్నా ఆరోగ్యాన్ని మించింది లేదు. శారీరక ఆరోగ్యం లేకపోతే జీవితమంతా నిస్సారంగా, నీరసంగా గడవాల్సిందే. శక్తి, పని సామర్థ్యం, కార్య దక్షత, సన్నద్ధత.. వీటన్నింటికీ శారీరక ఆరోగ్యమే కీలకం. శారీరకంగా అనారోగ్యం పాలైతేమనమూ, మన కుటుంబమూ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మన ఆహారం, అలవాట్లు, వృత్తులు మారిపోతుండటం వల్ల.. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జీవనశైలీ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అందుకే వ్యాధులు దరిజేరకుండా చూసుకునే చక్కటి జీవనశైలి, పుష్టికరమైన ఆహారం, తగినంత శారీరక శ్రమ చాలాచాలా అవసరం. ఏవైనా వ్యాధులున్నా వాటిని సమర్థంగా నియంత్రించుకునే సంకల్పం ఉండాలి. చాలామంది వ్యాయామానికి సమయం చిక్కటం లేదని వంకలు చెబుతుంటారు. ఇంట్లో ఎప్పుడూ టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతే ఊబకాయం, మధుమేహం, గుండెబజ్బుల వంటి వాటిని కొని తెచ్చుకున్నట్టే. వీటితో ఏదో ఒకనాడు ఆసుపత్రి పాలు కావటం ఖాయమని గుర్తించాలి. రోజుకి సుమారు అరగంట చొప్పున వారానికి ఐదుసార్లు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్ వంటివి ఉంటున్నాయేమో కనీసం ఆర్నెల్లకు ఒకసారైనా పరీక్షలు చేయించుకోవాలి. ఇవి ఉన్నవారు వాటిని కచ్చితంగా నియంత్రణలో పెట్టుకోవాలి. ఏ కాస్త నలతగా ఉన్నా నిర్లక్ష్యం మాత్రం చెయ్యకండి!
తగ్గిన కొద్దీ తంటాలే!---
ఒకప్పుడు ఎంత తక్కువ నిద్ర పోతే అంత మంచిదనీ.. గాంధీజీ వంటి ప్రముఖులంతా రోజుకు నాలుగు గంటలే నిద్రపోయేవారనీ.. గొప్పగా చెబుతుండేవారు. కానీ కాలం మారిపోయింది. మన అలవాట్లు, వృత్తులు, ఉద్యోగాలూ మారిపోయాయి. ఆధునిక జీవనశైలికి మొదటగా బలి అవుతున్నది మన నిద్ర. నిద్రకు సమయం లేని వారు కొందరైతే.. పడుకున్నా నిద్ర పట్టనివారు ఎంతోమంది. అందుకే ఇప్పుడు నిద్ర గురించీ, నిద్ర ఆరోగ్యం గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. రోజంతా పనితో అలసిన శరీరం నిద్రలోనే కొత్త శక్తిని పుంజుకుంటుంది. నిద్రాసమయం.. మన శరీరానికి మరమ్మతు సమయం. నిద్ర సరిగా పట్టకపోతే ఈ జీవ ప్రక్రియ అంతా దారితప్పుతుంది. దీంతో అధిక బరువు, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించటం, చిరాకు, కోపం, ఆందోళన, ప్రమాదాల బారినపడటం వంటి సమస్యలెన్నో బయల్దేరతాయి. నిద్ర లేమి మరీ తీవ్రమైతే గుండె జబ్బులతో పాటు హైబీపీ, ఒత్తిడి, హారోన్ల స్థాయులు పెరగటం, గుండె లయ తప్పటం వంటి జబ్బులూ దాడిచేస్తాయి. నిద్రలేమి రోగ నిరోధక వ్యవస్థ ను దెబ్బతీస్తుంది. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర కూడా కీలకమని గుర్తించాలి. నిద్ర పెద్దలకు సగటున రోజుకు 7-8 గంటలు తప్పనిసరి. పిల్లలకు ఇంకా ఎక్కువ అవసరం.
విడిగా కాదు.. కలివిడిగా!--
మనం ఎవ్వరమూ కూడా ఒంటరి ద్వీపంలా ఉండలేం. మన కుటుంబం మీద ఆధారపడతాం, ఇరుగుపొరుగు మీద ఆధారపడతాం, సమాజం మీద ఆధారపడతాం.. ఈ ప్రకృతి మీదా ఆధారపడతాం. వీటన్నింటి మీదా మనకు తెలియకుండానే మన ప్రభావం చాలా ఎక్కువ. వీటన్నింటినీ మరింత మెరుగ్గా మార్చేందుకు మనం క్రియాశీలంగా ఉండటం.. మన సామాజిక ఆరోగ్యానికి ముఖ్యం. మన చుట్టుపక్కల వారితో మనసు విప్పి ఆలోచనలను, అవసరాలను పంచుకోవటం, మంచి కోసం వారందరితో కలిసి నడవటం, వీలైతే అందర్నీ నడిపించటం.. పనిలోనూ, విశ్రాంతిలోనూ కూడా ఇతరులతో కలిసిమెలిసి ఉంటూ సానుకూలంగా, సంతోషంగా నవ్వుతూ గడపటం, చక్కటి స్నేహితులను తయారు చేసుకోవటం, సాన్నిహిత్యంతో మెలగటం, వారి బాధలు వింటూ సహానుభూతితో స్పందించటం.. ఇతరులు మనకు సహకరించటానికి ముందుకొస్తే నిండు మనసుతో హర్షించటం.. నలుగురితో కలిసి గడిపేందుకు కొంత సమయాన్నీ, సొమ్మునూ కూడా కేటాయించుకోవటం అవసరం! ఒత్తిడిని ఎదుర్కొనటానికి, కొలెస్ట్రాల్ తగ్గేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా.. చక్కటి సామాజిక ఆరోగ్యం ముఖ్యమైన మార్గం!
మితంగానే మంచిది!--
ఒత్తిడి.. స్ట్రెస్.. నిజానికి మనకు మేలు చేసే అంశమే. కాకపోతే అది మితి మీరకుండా చూసుకుంటేనే మంచిది. ఒత్తిడి తగు మోతాదులో ఉంటే లక్ష్యసాధన, పోటీతత్వం, ఉత్పాదకత వంటివన్నీ అద్భుతంగా పెరుగుతాయి. వేగంగా పని చేయటానికి, చురుకుగా ఆలోచించటానికి అవసరమైన శక్తి ఒత్తిడి నుంచి కూడా వస్తుంది. కానీ ఇది శ్రుతి మించితే మాత్రం నాడీ వ్యవస్థ లయ తప్పుతుంది. జ్ఞాపకశక్తి దెబ్బతినటం, ప్రతికూల ధోరణి, ఆందోళన, దిగులు, ఎప్పుడూ మూడీగా ఉండటం, కోపం, ఒంటరితనం వంటి లక్షణాలన్నీ బయల్దేరతాయి. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి ఒత్తిడి మితంగా ఉండేలా చూసుకోవటం.. ముఖ్యంగా అది మితి మీరకుండా చూసుకోవటం అవసరం. ఒక రకంగా మనం సామాజికంగా, మానసికంగా,ఆధ్యాత్మికంగా, వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉంటే.. ఒత్తిడిని ఎదుర్కొనటం తేలిక అవుతుంది, అసలు ఒత్తిడి దరిజేరకుండా చూసుకోవటం కూడా సాధ్యమవుతుంది. వాటి పట్ల అవగాహన లేకపోతే.. కనీసం ఒత్తిడిని ఎదుర్కొనటం ఎలాగో నేర్చుకోవటమైనా అవసరం. ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే కండరాలను విశ్రాంతిగా వదిలేయటాన్ని సాధన చేయాలి. కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా ఛాతీనిండా శ్వాసను తీసుకోవటం, వదలటం చేయాలి. ఇలా 20-30 సార్లు చేస్తే ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఆత్మస్తుతి, పరనిందకు తావులేకుండా.. ప్రతికూల ఆలోచనలను అడ్డుకోవటమెలాగో సాధన చేయాలి.
మన శక్తి తెలిసొస్తుంది!---
తాత్వికత, ఆధ్యాత్మికత వంటివి మనకు ఏదోమతపరమైన నమ్మకాలకు సంబంధించిన వ్యవహారాల్లా అనిపిస్తాయిగానీ.. ఆధ్యాత్మికమైన అవగాహన పెరిగిన కొద్దీ మన జీవితం మనకు మరింత అర్థవంతంగా, ప్రయోజనకరంగా కనిపించటం ఆరంభమవుతుందని ఆధునిక వైద్యరంగం స్పష్టంగా గుర్తిస్తోంది. దీనివల్ల మనం- మన చుట్టుపక్కల సమాజాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతాం. ఈ దృక్కోణం నుంచి చూడటం అలవాటైతే.. మన దైనందిన అనుభవాలను, సమస్యలను కూడా ఆవేశకావేశాలకు లోనుకాకుండా ఎంతో సానుకూలంగా, సమర్థంగా నెగ్గుకురాగలుగుతాం. ఆధ్యాత్మికంగా మనం ఎదిగిన కొద్దీ.. మనకూ, మన చుట్టుపక్కల సమాజానికీ మధ్య అవగాహన, సయోధ్య మెరుగవుతుంటాయి. మన అంతర్గత భావాలకూ, భావోద్వేగాలకూ... జీవితంలో ఎదురయ్యే ఎగుడుదిగుళ్లకూ మధ్య ఒక రకమైన సామరస్యం కుదురుతుంది. ముఖ్యంగా మన గురించి, మన శక్తిసామర్ధ్యాల గురించి, మనకున్న పరిమితుల గురించి స్పష్టమైన అవగాహన సాధ్యమవుతుంది. మనల్ని గురించి మనం తెలుసుకునే ఈ మార్గంలో మనకు ఎన్నో సందేహాలు, అనుమానాలు, భయాలు, అసంతృప్తులూ ఎదురవ్వచ్చు. అలాగే అనిర్వచనీయమైన ఆనందాలూ, సంతోషాలూ కూడా కలగొచ్చు. ఇవన్నీ అవసరమైన, ఆరోగ్యకరమైన అనుభవాలేనని అర్థమవుతుంది. మనం చక్కటి ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకొనేందుకు.. మంచిచెడ్డలను తర్కించుకునేందుకు.. మన చేతల్లో పవిత్రత సాధించేందుకు.. ప్రతి చిన్నదాన్నీ మనసుకు తీసుకుని బాధపడకుండా శాంతియుతంగా ఉండేందుకు.. మంచి విలువలకు కట్టుబడి ఉండేందుకు ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం ఎంతగానో దోహదం చేస్తుంది.
తెలివికి పరీక్ష!--
పిజ్జాలు, బర్గర్లు తినొద్దు.. కొవ్వు తినొద్దు, ఐస్‌క్రీములు తినొద్దు.. కూల్‌డ్రింకులు తాగొద్దు.. పోషకాహారం గురించి ఎవరు మాట్లాడటం మొదలుపెట్టినా ఇలాగే మొదలవుతుంది కథ. కానీ ఇది పూర్తిగా సరైన ధోరణి కాదు. పిజ్జాలు, బర్గర్లు తినకూడని విషపదార్ధాలేమీ కాదు.. కాకపోతే వాటిని మితి మీరి.. సమతౌల్యం తప్పి తింటేనే సమస్య! ఎప్పుడన్నా ఒకసారి వాటిని తింటే సమస్యేమీ ఉండదు. అందుకే నేడు ఆహారాన్ని ఎంచుకోవటమనేది మన తెలివికి, అవగాహనకు ఒక పరీక్షలా తయారైంది. మీ దినచర్యను చక్కటి అల్పాహారంతో మొదలుపెట్టండి. దీనిలో ఇడ్లీ, దోశ (ఇవీ మితంగానే) వంటి వాటితో పాటు ఒక పండు, పాలు వంటివీ ఉండేలా చూసుకోండి. ఆహారంలో ముడి బియ్యం, పప్పు, సీజన్‌వారీ వచ్చే తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. నూనె తక్కువేసి వండుకోండి. స్త్రీలు పెద్దవయసులో కూడా దండిగా పాలు తాగాలి. బయట రెడీమేడ్‌గా ప్యాకెట్లలో దొరికేవి, స్వీట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్ధాలు ఎక్కువగా తినొద్దు. చాలా రకాల సమస్యలకు పోషకాహారం తీసుకోకపోవటం.. లేదంటే సరైన పోషకాలు లేని పదార్ధాలు ఎక్కువగా తీసుకోవటమే మూలం. కాబట్టి ఈ పోషక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటే... మనం సగం సమస్యలను అధిగమించినట్లే!
మంచి పెంచండి!--
అలవాట్లు అనగానే మనకు వెంటనే చెడ్డ అలవాట్లే గుర్తుకొస్తాయి. పొగ, మద్యం, మాదక ద్రవ్యాలు.. ఇవన్నీ చెడ్డ అలవాట్లు, వ్యసనాలే! వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే జీవితంలో మంచి అలవాట్లు పెంచుకుంటున్న కొద్దీ... చెడ్డ అలవాట్లు క్రమేపీ దూరమైపోతుంటాయని గుర్తించటం చాలా అవసరం. నిత్యం వ్యాయామం చెయ్యటం, క్రమబద్ధంగా జీవించటం, పనిని సమర్థంగా సమయ పాలనతో నిర్వహించుకోవటం, జీవితంలో సానుకూల దృక్పథంతో ఉండటం, కష్టాలేవైనా ఎదురైతే వాటిని ఎదుర్కొనటంలో సంయమనం పాటించటం... ఇలాంటి మంచి అలవాట్లు అలవరుచుకుంటే.. అసలు చెడ్డ అలవాట్ల అవసరమే ఉండదు. అవి మన దరికి చేరవు కూడా. కాబట్టి పరిపూర్ణ ఆరోగ్యానికి.. మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యమని గుర్తించాలి. ఏవైనా వ్యసనాలు ఉన్నా వాటితో వచ్చే చిక్కులపై అవగాహన పెంచుకొని.. వాటిని వదిలించుకునేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయటం చాలా అవసరం. పొగ మానెయ్యటం, లైంగికంగా ఒకే భాగస్వామికి కట్టుబడి ఉండటం, మద్యం వంటి వ్యసనాలకు బానిసైన మిత్రబృందాలకు దూరంగా ఉండటం, జీవితంలో కొన్ని మంచి విలువలతో వ్యవహరించాలన్న సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సడలిపోకుండా చూసుకోవటం.. ఇవి ముఖ్యం.
- Source : Eeandu sukhibhava News paper.
- ===============================
Visit my website - >
Dr.Seshagirirao.com/