సినిమా హీరోల 'సిక్స్ ప్యాక్' శరీరాలను చూసి ముచ్చటపడే వారి సంఖ్య పెరిగింది. ఇక కండలు పెంచి, జబ్బలు ఉబ్బించే వారిని చూసి.. ఉప్పొంగి పోయే యువకులకు మన సమాజంలో కరువే లేదు. అయితే సమస్యల్లా... అచ్చం వారిలాగే తామూ కండలు పెంచుకోవాలని ఉబలాటపడుతూ జిమ్‌లో తెగ వ్యాయామాలు చెయ్యటమేకాదు... కొందరు తెలిసోతెలియకో స్టిరాయిడ్లను ఆశ్రయిసున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. స్టిరాయిడ్లన్నవి కీలకమైన అవసరాల కోసం వైద్యులు వాడే మందులు. వీటిని విచక్షణా రహితంగా వాడేస్తే.. లైంగిక సామర్థ్యం కొరవడటం, బట్టతల, ఆత్మహత్య భావనలు కలగటం వంటి అనర్థాలు చాలా ముంచుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంతో కష్టపడితేనే గానీ సిక్స్ ప్యాక్ శరీరం సాధ్యం కాదని గుర్తించాలి. ఇందుకు నియమబద్ధ వ్యాయామం, క్రమశిక్షణ, ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. తెర మీద కనిపించే హీరోలంతా తెర వెనక ఇంత కష్టం పడ్డవారే. అంత కష్టం మనమెక్కడ పడతామంటూ యువకులు తేలికగా పని అయిపోతుందని స్టిరాయిడ్లను ఆశ్రయిస్తుండటం అనర్థదాయకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వాడే స్టిరాయిడ్లను- ప్రధానంగా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్ల నుంచి తయారు చేస్తారు. యుక్తవయసు మగపిల్లలు వీటిని విచక్షణారహితంగా వాడితే వృషణాలు కుచించుకుపోవచ్చు. వీర్యకణాల సంఖ్య తగ్గొచ్చు. దీంతో లైంగిక సామర్థ్యమూ దెబ్బతినే ప్రమాదముంది. స్టిరాయిడ్ ఇంజెక్షన్లు తక్కువ ధరకు దొరుకుతుండటంతో చాలామంది వీటిపై మక్కువ పెంచుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాంసకృత్తుల ఉత్పత్తికి దోహదం చేస్తూ కండర కణజాలంలో కార్టిసోల్ ప్రభావాన్ని అడ్డుకునే ఈ స్టిరాయిడ్లు- కండర కణజాలం వేగంగా పెరిగేలా చేస్తాయి. క్రమేపీ అవే బయటకి పొంగుకొచ్చే కండల్లా మారతాయి. నిజానికి డాక్టర్లు వీటిని నిర్దుష్టమైన సందర్భాల్లో మాత్రమే వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడినా, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడినా- కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం, హైబీపీ, గుండె పరిమాణం పెరగటం, ప్రవర్తన దురుసుగా మారటం, మొటిమలు రావటం, మానసిక కుంగుబాటు.. ఇలా ఎన్నో అనర్ధాలుంటాయి. మాత్రల రూపంలో తీసుకుంటే లివర్ కూడా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యుక్తవయస్కుల్లో ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.
- source : Courtesy with eenadu sukheebhava
- ===============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.