Sunday, January 15, 2012

ఇన్సులిన్‌ పంప్‌ చికిత్స-అవగాహన , Insulin pump treatment and Awareness


  • image : courtesy with Eenadu newspaper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఇన్సులిన్‌ పంప్‌ చికిత్స-అవగాహన , Insulin pump treatment and Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


  • వైద్యంలో కొన్ని విషయాలు వినటానికి భయంగా ఉంటాయి. కానీ వాటిని చూస్తే.. వాటిని ఉపయోగించటం మొదలుపెడితే.. ఆ భయాలు వాటంతట అవే తొలగిపోతాయి. 'ఇన్సులిన్‌ పంప్‌' కూడా అలాంటిదే. వైద్యులు 'ఇన్సులిన్‌ పంప్‌' పెట్టుకోవాలని సూచిస్తే.. భయం, బెరుకు సహజం! నిరంతరం మన శరీరానికి ఒక మిషన్‌ తగిలించుకుని తిరగాలంటే... అది రోజంతా లోపలకు కొద్దికొద్దిగా మందు పంపిస్తుందంటే.. వినటానికి ఎంతో ఆందోళన, బోలెడు అనుమానాలు ముసురుకుంటాయి. అయితే... దాని వాడకాన్ని ప్రత్యక్షంగా చూసినా.. దానిపై అవగాహన పెంచుకున్నా.. అంతగా భయపడాల్సిన పని లేదని అర్థమవుతుంది. వాస్తవానికి ఈ 'పంప్‌'లు ఎంతో సురక్షితం, వీటితో చక్కటి గ్లూకోజు నియంత్రణ సాధించవచ్చు. ముఖ్యంగా చిన్నవయసులోనే టైప్‌-1 మధుమేహం బారినపడిన వారెందరినో ఇది వరప్రదాయినిలా ఆదుకుంటోంది.

ఇన్సులిన్‌... మన శరీరానికి నిత్యావసరం. మన శరీరంలోని ప్రతి కణానికీ.. క్షణక్షణావసరం. మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తుంది. ఆ గ్లూకోజును మన శరీరం శక్తిగా మార్చుకుని.. ఇంధనంగా వినియోగించుకోవాలంటే.. ఇన్సులిన్‌ కీలకం! దీన్ని మన శరీరంలోని క్లోమ గ్రంథి తయారు చేస్తుంటుంది. అది విఫలమై ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోయినా.. లేక తగినంత లేకపోయినా.. మధుమేహం సంప్రాప్తిస్తుంది. అందుకే మధుమేహ నియంత్రణకు ఎన్ని మందులున్నా.. బయటి నుంచి ఇంజక్షన్ల రూపంలో.. ఆ సహజమైన 'ఇన్సులిన్‌'ను కృత్రిమంగా భర్తీ చేస్తుండం సమర్థమైన చికిత్సగా నిలుస్తోంది.

  • ఇంజక్షన్లకు పరిమితులు
మామూలుగా లోపల మన క్లోమ గ్రంథి నిరంతరాయంగా పని చేస్తుంటుంది. సమయాన్ని బట్టి.. అవసరాన్ని బట్టి.. మనం తింటున్న ఆహారాన్ని బట్టి.. అది శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ను రోజంతా అందిస్తూనే ఉంటుంది. మధుమేహులకు.. మనం ఇదే తీరులో బయటి నుంచి ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వటం అసాధ్యం. అందుకే రోజు మొత్తంలో 2, 3, 4 సార్లు ఇంజక్షన్లు చేసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. ఇది ఆచరణకు వీలైనదేేగానీ.. దీనితో అందరికీ పూర్తిస్థాయి గ్లూకోజు నియంత్రణ సాధ్యం కాకపోవచ్చు. అందుకే మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ను నిరంతరం సరఫరా చేస్తుండేందుకు ఒక 'పంప్‌'ను తయారు చెయ్యాలన్న ప్రయత్నం కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ఇందుకోసం రకరకాల యంత్రాలను రూపొందించారు కూడా. అయితే అవన్నీ చాలా పెద్దగా, నాటుగా, మనతో పాటు తీసుకుపోవటానికి వీలు లేనంత భారంగా ఉండటంతో ఇన్నేళ్లుగా వాటికి అంత ప్రాచుర్యం రాలేదు. అయితే గత దశాబ్దకాలంలో ఈ పంప్‌లు అద్భుతమైన పురోగతి సాధించాయి. ఇప్పుడు పంప్‌ పెట్టుకోవటమంటే ఏమంత భయపడాల్సిన పని లేదు. అదేమంత అసౌకర్యంగానూ ఉండదు. ముఖ్యంగా- వీటితో గ్లూకోజు నియంత్రణ చాలా సమర్థంగా సాధ్యమవుతోంది. అందుకే 'పంప్‌'ల వాడకం ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది.

  • 'పంప్‌'ల ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా ఇన్సులిన్‌ను ఇంజక్షన్ల రూపంలో-
1. మన చర్మం కిందకే ఇవ్వచ్చు. కొన్ని గంటల పాటు మందు అక్కడే ఉండి.. క్రమేపీ కరుగుతూ రక్తంలో కలుస్తుంది. కానీ ఈ పద్ధతిలో మొత్తం తీసుకున్న ఇన్స్‌లిన్‌లో 30-50% మన శరీరానికి అందుబాటులోకి రాకుండా.. వృథాగా పోవచ్చు!

2. కండరాల్లోకి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే 70-90% అందుబాటులోకి వస్తుంది. కానీ ఇది వేగంగా అయిపోతుంది.

3. నేరుగా రక్తనాళాల్లోకి తీసుకోవచ్చు. దీనిలో దాదాపు పూర్తిగా (90% పైగానే) వినియోగమవుతుంది. కానీ రక్తనాళాల్లోకి ఇంజక్షన్‌ అన్నది ఇళ్లలో కష్టం. ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యం. పైగా ఇదీ చాలా వేగంగా అయిపోతుంది.

కండరాల్లోకి ఇచ్చినా, నేరుగా రక్తనాళాల్లోకి ఇచ్చినా ఇబ్బందేమంటే- ఇలా ఇచ్చిన ఇన్సులిన్‌ వేగంగా, రక్తంలో కలిసిన 20 నిమిషాల్లోనే కరిగి.. చాలా భాగం వృథాగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి రక్తంలో నిరంతరం ఇన్సులిన్‌ ప్రవహించేలా.. ఆ ఇన్సులిన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు భర్తీ చేయటానికి దశాబ్దాల తరబడి కృషి చేసి రూపొందించిన విధానమే.. 'ఇన్సులిన్‌ పంపు'. దీన్ని ఒక రకంగా వ్యవసాయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నచోట.. ఉన్న నీటినే సమర్థవంతంగా వినియోగించేందుకు అనుసరించే బిందు సేద్యం (డ్రిప్‌ ఇరిగేషన్‌) పద్ధతి లాంటిదే అనుకోవచ్చు.

ఈ విధానంలో ఇన్సులిన్‌.. నేరుగా రక్తంలో కలవకుండా కణజాలం మధ్యలో ఉండే ద్రవంలోకి (ఇంటర్‌స్టీషియల్‌ ఫ్లూయిడ్‌) చుక్కలు చుక్కలుగా పడుతుంది. ఇది వేగంగా వెంటనే రక్తంలో కలుస్తుంది. ఇది కూడా 20 నిమిషాల్లోనే కరిగిపోతుంది కానీ.. ఒక్కసారిగా ఎక్కువ ఇవ్వకుండా.. చుక్కలు చుక్కలుగా ఎప్పుడూ అందుతుండటం వల్ల.. నిరంతరం రక్తంలో తగినంత ఇన్సులిన్‌ ఉంటుంది, దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగే అవకాశం ఉండదు. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం అందించే బిందు సేద్యంలా.. మనం ఇస్తుండే ఇన్సులిన్‌లో బొట్టుబొట్టూ సద్వినియోగం అవుతుంది. అందుకే ఇన్సులిన్‌ పంప్‌లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి.

  • పంపులు: రెండు రకాలు!
ఇన్సులిన్‌ పంపుల్లో 'ఓపెన్‌ లూప్‌', 'క్లోజ్డ్‌ లూప్‌' అని రెండు రకాలున్నాయి.
* క్లోజ్డ్‌ లూప్‌ పంపు: ఇది 5 నిమిషాలకు ఒకసారి రక్తంలో గ్లూకోజు మోతాదును తనే పరీక్షించుకొని.. అవసరమైన మేరకు ఇన్సులిన్‌ను తనే ఇచ్చేస్తుంటుంది. కానీ దీని సైజు పెద్దగా ఉండటం, ఖరీదు ఎక్కువగా ఉండటం వంటి కారణాల రీత్యా ఇదంత ప్రాచుర్యంలో లేదు. దీన్ని ఎక్కువగా ఆసుపత్రుల్లోనే వాడుతున్నారు.

* ఓపెన్‌ లూప్‌ పంపు: ప్రస్తుతం విరివిగా వాడుతున్న ఇన్సులిన్‌ పంపులు ఇవే. వాస్తవానికి ఇవి 40 ఏళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్నా అప్పట్లో ఈ యంత్రాలు చాలా పెద్దగా ఉండేవి. ఏదైనా కారణాన ఇన్సులిన్‌ విడుదల కాకపోతే హెచ్చరించే వ్యవస్థ ఉండేది కాదు. కానీ గత రెండు దశాబ్దాల్లో ఇవి సెల్‌ఫోన్‌ కంటే తక్కువ సైజుకు వచ్చేయటంతో వీటి వాడకంలో సౌలభ్యం పెరిగింది. వీటి సామర్థ్యమూ మెరుగైంది. అందుకే మధుమేహ నియంత్రణకు, ముఖ్యంగా టైప్‌-1 మధుమేహం బారినపడిన పిల్లలకు.. ఇప్పుడీ అధునాతన పంప్‌లు గొప్ప అవకాశాలుగా నిలబడుతున్నాయి.

  • పంప్‌: పనితీరు
సెల్‌ఫోన్‌ కన్నా చిన్నగా, పేజర్‌ సైజులో ఉండే అధునాతన పంప్‌లు.. ఎంత ఇన్సులిన్‌ ఇవ్వాలో కచ్చితంగా అంతే ఇస్తుంటాయి. దీనికి అనుసంధానంగా సన్నటి గొట్టం ఉంటుంది. ఈ గొట్టం చివర ఉండే ప్లాస్టిక్‌ మొన చర్మం కింద 6 లేదా 9 మి.మీ. లోతులో ఉండి.. బొట్టు బొట్టుగా ఇన్సులిన్‌ను కణజాల ద్రవంలోకి విడుదల చేస్తుంటుంది.

ఈ పంపు బ్యాటరీతో నడుస్తుంది. ఇందులో 300 యూనిట్ల ఇన్స్‌లిన్‌ నింపుకునే సామర్థ్యం ఉంటుంది. ఇందులో మనం రోజు మొత్తంలో ఎంత ఇవ్వాలో ఒక్కసారే సెట్‌ చేసి వదిలేస్తే చాలు. దీన్ని 'బేసల్‌' అంటారు. అలాగే ఆహారం తినే ముందు అందుకు తగ్గట్టు అదనంగా అప్పటికప్పుడు కొన్ని యూనిట్లు ఇచ్చుకునే సదుపాయమూ ఉంటుంది, దీన్ని 'బోలస్‌' అంటారు. మనం సెట్‌ చేసిన మేరకు.. గొట్టం ద్వారా ఇన్సులిన్‌ నిరంతరం, అద్భుతమైన కచ్చితత్వంతో శరీరంలోకి వెళ్లిపోతుంటుంది. అదక్కడ నిల్వ ఉండదు, వెంటనే రక్తంలో కలుస్తుంది. వృథా తక్కువ. ఫలితంగా మామూలు ఇంజక్షన్ల ద్వారా అవసరమయ్యే ఇన్సులిన్‌ మోతాదులో 60% శాతమే సరిపోతుంది.

  • సమర్థం.. సులభం.. సౌకర్యం!
ఇన్సులిన్‌ పంపు అనగానే చాలామంది దీన్ని రోజంతా మోసుకుంటూ తిరగాలి.. ఎక్కడికైనా వెళ్తే ఇబ్బంది.. ఎవరైనా చూస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తుందని భావిస్తుంటారు. కానీ ఇది ప్రస్తుతం సెల్‌ఫోన్ల కన్నా చిన్నగా ఉంటుంది. బరువు కూడా తక్కువ. ప్యాంటుకుగానీ, పైజమాకుగానీ పెట్టేసుకోవచ్చు. దీన్నుంచి సన్నటి గొట్టం మాత్రమే బయటకు కనిపిస్తుంది. గొట్టం పొట్టకు ఉంటుంది, పైన చొక్కా వచ్చేస్తుంది కాబట్టి ఇక ఎవరికీ తెలిసే అవకాశమే ఉండదు. మూడు రోజులకు ఒకసారి, కనీసం వారానికి ఒకసారి గొట్టాన్ని తీసి మరోచోటికి మార్చుకోవాల్సి ఉంటుంది, దీన్ని ఎవరికి వారే చేసుకోవచ్చు. పంప్‌ కింద పడినా పగిలిపోదు. పాడవదు. స్నానం చేసేటప్పుడు దీన్ని ఆపేసి తీసి పక్కనపెట్టి, తర్వాత మళ్లీ అమర్చుకోవచ్చు. గొట్టం చివర ఉండే సన్నటి ప్లాస్టిక్‌ సూది చర్మంలోకి 6 లేదా 9 మి.మీ. లోతువరకే వెళ్తుంది కాబట్టి నొప్పి కూడా ఉండదు. చాలావరకూ దీన్ని పొట్ట దగ్గరే అమర్చుతారు. దీన్ని ఎవరికివారే అమర్చుకోవచ్చు. నిద్రలో తొలగిపోవటమూ జరగదు. వ్యాయామం సమయంలో కూడా దీన్ని పెట్టుకునే ఉండొచ్చు. ఒకవేళ గొట్టం మడతబడో, సూది సరిగా లోనికి వెళ్లకో ఒక్క నిమిషంపాటు ఇన్సులిన్‌ విడుదల కాకపోతే.. వెంటనే దాన్ని సెన్సర్‌ దాన్ని గుర్తించి 'బీప్‌' ద్వారా హెచ్చరిస్తుంది. పంప్‌లో ఎప్పుడెంత ఇన్సులిన్‌ ఇచ్చిందీ గ్రాఫ్‌ రూపంలో నమోదవుతుంది కూడా. కావాలంటే ఆ సమాచారాన్ని కంప్యూటర్‌కు అనుసంధానించి చూసుకోవచ్చు. అలవాటయ్యే వరకూ మొదట్లో దీని వాడకం కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ సెల్‌ఫోన్‌ వంటివి వాడటం నేర్చుకున్నట్టే దీన్నీ.. ఎవరికి వారే తేలికగా వాడుకోవచ్చు.

  • ఎవరికి ఉపయోగం?
రక్తంలో గ్లూకోజు నియంత్రణలో లేనివాళ్లు ఖర్చు భరించగలిగే స్థితిలో ఉంటే పంపు అమర్చుకోవటం ఎంతో మంచిది. టైప్‌-1 మధుమేహులకు ఇది అత్యుత్తమం. టైప్‌-1 బాధితులు మధుమేహాన్ని గుర్తించినప్పటి నుంచే దీన్ని అమర్చేసుకుంటే మధుమేహ దుష్ప్రభావాలు దరిజేరకుండా చూసుకోవచ్చు.

* పిల్లలు: టైప్‌-1 బాధితులందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇన్సులిన్‌ పంపులు బాగా ఉపయోగపడతాయి. పిల్లల్లో యవ్వనదశలో హార్మోన్లస్థాయులు మారిపోతుంటాయి. పైగా ఇవన్నీ ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంటాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణ కష్టమవుతుంది. ఇలా నియంత్రణలో లేని (బ్రిటిల్‌ డయాబెటీస్‌) యవ్వనదశలో పిల్లల్లో ఎదుగుదల కూడా దెబ్బతింటుంది. అందువల్ల వీరికి ఇతర విధానాల కన్నా ఇన్సులిన్‌ పంపులతో మంచి ప్రయోజనం ఉంటుంది. ఎదుగుదల సక్రమంగా జరుగుతుంది. గ్లూకోజు హెచ్చుతగ్గులూ అదుపులో ఉంటాయి. నెల్లోపు పిల్లలకు పంప్‌లు అమర్చిన సందర్భాలూ ఉన్నాయి. దీన్ని లాక్‌ చేసే సదుపాయం ఉండటం వల్ల చిన్నపిల్లలకు, స్కూలుకెళ్లే పిల్లలకు అమర్చినా ఇబ్బందేం ఉండదు.

  • * గర్భిణులు:
ముందు నుంచీ గానీ.. లేక గర్భం ధరించిన తర్వాత గానీ మధుమేహం బయటపడిన స్త్రీలలో.. కాన్పు సమయంలో తల్లీ, బిడ్డకు సమస్యలు కొంచెం ఎక్కువ. అప్పటికే గర్భం పోవటం వంటి ఒకటిరెండుసంఘటనలు ఉన్నవారికి ముందే ఇన్సులిన్‌ పంపు అమర్చితే మంచి ఫలితం ఉంటుంది. పంప్‌తో హెచ్‌బీ ఏ1సీ 7 శాతానికి చేరుకున్నాక గర్భ ధారణకు ప్రయత్నిస్తే పెద్దగా ఇబ్బందులుండవు. కాన్పు అయ్యాక అవసరమైతే పంప్‌ తొలగించొచ్చు.

* అనియంత్రిత మధుమేహం: మధుమేహం వచ్చి 20, 25 ఏళ్లు దాటిపోయాక ఆహార, వ్యాయామ నియమాలు ఎన్ని పాటించినా.. ఎంత మంచి మందులు వాడినా.. ఇన్సులిన్‌ ఎంత బాగా తీసుకున్నా.. కొందరికి క్రమేపీ రక్తంలో గ్లూకోజు నియంత్రణ కష్టమైపోతుంటుంది. ఇలాంటి వారికి ముఖ్యంగా వృద్ధులకు ఇన్సులిన్‌ పంపు బాగా ఉపయోగపడుతుంది.

  • పంప్‌: ప్రయోజనాలు అనేకం!
* కచ్చిత నియంత్రణ: రోజూ రక్తపరీక్షలు చేసుకుని, రోజుకు నాలుగైదుసార్లు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకునే వారిలో కూడా చక్కెర నియంత్రణలో 'గ్త్లెకేటెడ్‌ హీమోగ్లోబిన్‌'.. 8 శాతం వరకే వస్తుంది. అంతకంటే తగ్గించటం చాలా కష్టం. అదే పంప్‌ వాడే వారిలో ఇది తేలికగా 7 శాతానికి వస్తుంది. ఈ లక్ష్యాన్ని చేరటం ఇంజక్షన్లతో సాధ్యం కాదు.

* డోసులు తేలిక: పంప్‌ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు అదనపు డోసులు ఇచ్చుకోవచ్చు. ఎప్పుడైనా ఆహారం కాస్త ఎక్కువ తీసుకున్నా, కూల్‌డ్రింకుల వంటివి తాగినా రక్తంలో ఆ మేరకు పెరిగే గ్లూకోజు శాతాన్ని బట్టి ఎవరికివారు 'బోలస్‌'ను నొక్కటం ద్వారా వెంటనే అదనంగా ఒకటో రెండో యూనిట్ల ఇన్సులిన్‌ ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఆ సమయంలో రక్తంలో పెరిగే గ్లూకోజును సరిగా నియంత్రించొచ్చు. ఇది పంప్‌తో పెద్ద ప్రయోజనం, ఇంజక్షన్ల ద్వారా ఇది కష్టం.

* హఠాత్తుగా ఆపెయ్యచ్చు: మామూలుగా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకున్నా.. లేక మాత్రలు వేసుకున్నా.. మధ్యలో ఎప్పుడైనా గ్లూకోజు స్థాయి తగ్గిపోయి 'హైప్లోగ్త్లెసీమియా' వస్తే (గ్లూకోజు డౌన్‌ అయిపోతే) దాన్ని వెంటనే అడ్డుకోవటం కష్టం. అప్పటికే తీసుకున్న ఇన్సులినో, మాత్రలో.. వాటి ప్రభావం పూర్తయ్యే వరకూ పని చేస్తూనే ఉంటాయి, ఆ 'హైపో' కొనసాగుతూనే ఉంటుంది. అదే పంప్‌లో అయితే వెంటనే ఇన్సులిన్‌ విడుదల కాకుండా కట్టెయ్యచ్చు, హైపో పెరగకుండా అడ్డుకోవటం తేలిక.

* అర్ధరాత్రి బెడద ఉండదు: రోజూ నాలుగుసార్లు ఇన్సులిన్‌ తీసుకునే వారు అర్ధరాత్రి లేచి ఇంజక్షన్‌ చేసుకోవాల్సిన బాధ పంపుతో తప్పిపోతుంది. మన నిర్దేశాల ప్రకారం రోజులో ఏ సమయంలోనైనా ఇన్సులిన్‌ డోసులు ఇస్తుంది.

* బాధలు తక్కువ: పంప్‌తో రక్తంలో గ్లూకోజు నియంత్రణ మెరుగ్గా ఉంటుంది కాబట్టి.. దుష్ప్రభావాలు తక్కువ. డాక్టర్లు, ఆసుపత్రుల మీద ఆధారపడటం తగ్గుతుంది.

*గొప్ప సౌలభ్యం: రెటినోపతీ కారణంగా దృష్టి సమస్యలు వచ్చిన మధుమేహులు తమకు తాముగా ఇన్సులిన్‌ ఇంజక్షన్లు తీసుకోవటం కష్టం. ఇలాంటి వారికి సహాయకులు పంప్‌ ఒక్కసారి సెట్‌ చేస్తే నాలుగైదు రోజుల వరకూ దిగులుండదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి తరచూ హైపోగ్త్లెసీమియా వచ్చే అవకాశం ఎక్కువ. పంపుతో వీటిని బాగా నివారించుకోవచ్చు.

  • ఇబ్బందేమిటి?
* ప్రస్తుతం ఇన్సులిన్‌ పంపులతో ఉన్న ప్రధాన అవరోధం- ఖర్చు! ఈ పంప్‌ ఖరీదు దాదాపు రూ. 1.5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో వాడేది మామూలు ఇన్సులినే అయినప్పటికీ.. శరీరంలో ఉండిపోయే గొట్టం భాగం, దాన్ని ఎక్కించుకునేందుకు అవసరమైన సూదుల కిట్‌ వంటివన్నీ కలిపి దాదాపు రూ.500 వరకూ అవుతాయి. వీటిని కనీసం వారానికి ఒకసారైనా మార్చుకోవాల్సి ఉంటుంది. పంప్‌తో ఒనగూడే లాభాలతో పోలిస్తే ఈ ఖర్చు లెక్కలోనిది కాదుగానీ తప్పదు.

* కొద్దిమందికి పొట్ట మీద సన్నటి ప్లాస్టిక్‌ గొట్టం అమర్చే చోట అలర్జీలు రావచ్చు. ఈ ప్రదేశాన్ని మూడు రోజులకు ఒకసారి మార్చాలి. ఇది అమర్చిన చోట కొద్దిమందికి చిన్న పుండులా తయారై, మానటానికి రెండు మూడు రోజులు పట్టొచ్చు. దీన్ని గురించి వైద్యులతో చర్చిస్తే మార్గం చెబుతారు.
దశాబ్దాల చరిత్ర
అసలు ఇన్సులిన్‌ ఆవిష్కారమే అద్భుతమనుకుంటే.. దాన్ని నిరంతరాయంగా మన శరీరానికి అందించే 'పంప్‌' కోసం దశాబ్దాల తరబడి జరిగిన అన్వేషణ కూడా తక్కువదేం కాదు. బెస్ట్‌, బ్యాంటింగ్‌మహాశయులు ఇన్సులిన్‌ను ఆవిష్కరించి 90 ఏళ్లు అవుతోంది. మానవాళికి చేసిన ఈ మహోపకారానికి వారు నోబెల్‌ పురస్కారం సైతం అందుకున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి ఇంజక్షన్‌ చేయటం కాకుండా.. ఇన్సులిన్‌ను అచ్చం మన క్లోమం లాగే బయటి నుంచి నిరంతరాయంగా ఇచ్చే యంత్రం కోసం 1970 సం.ల నుంచీ అన్వేషణ ఆరంభమైంది. మొదట్లో ఇవి భుజానికి తగిలించుకునే సంచీ అంత పెద్దగా ఉండేవి. మెరుగులు దిద్దీ దిద్దీ.. 1980 లలో వీటిని పెద్ద ఇటుకరాయి అంత సైజుకు తెచ్చారు. అప్పట్లో దీర్ఘకాలం మన్నే బ్యాటరీలు లేకపోవటమూ సమస్యగానే ఉండేది. ప్రస్తుతం పేజర్‌ కంటే చిన్నసైజుకు చేరుకోవటానికి ముందు ఇంతటి చరిత్ర ఉంది.

  • Source : ఈనాడు న్యూస్ పేపర్ - సుఖీభవ. / డా.పి.వి.రావు డయాబిటీస్ ప్రొఫెషర్ నిమ్స్ హాస్పిటల్ - హైదరాబాద్ .
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.