ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు
-కెమికల్ పీల్స్ - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
చర్మం..మన శారీరక సంరక్షణకే కాదు.. మన సౌందర్యానికీ అదే చిరునామా. అందుకే చర్మం పట్ల ప్రతి ఒక్కరికీ అంత శ్రద్ధ! చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునేందుకు వంటింటి చిట్కాల నుంచి పార్లర్ ప్రయత్నాల వరకూ రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. అయితే మార్గం ఏదైనా.. అది సశాస్త్రీయమైనదైతే ఇబ్బందులుండవు. వైద్యపరంగా సురక్షితమని నిరూపణ ఐన వాటినే ఆశ్రయిస్తే తర్వాత బాధలు పడాల్సిన పని ఉండదు. ముఖ సౌందర్యాన్ని కాంతివంతం చేసేందుకు ఇటీవలి కాలంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన 'కెమికల్ పీల్' విధానానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ రసాయనాలు చాలా శక్తిమంతమైనవి. కాబట్టి వీటితో వచ్చీరాని ప్రయోగాలు చేస్తే విపరిణామాలు తథ్యం. వీటిని శాస్త్రీయంగా, అనుభవజ్ఞుల చేత చేయించుకోవటమే ఉత్తమం.
మన చర్మం.. పైకి కనిపించేదంతా పాతదే! ఆశ్చర్యంగా అనిపించినా అది నిజం. కింది పొరల్లో నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా చర్మకణాలు పుట్టుకొస్తుంటాయి. అవి పుట్టుకొస్తున్నకొద్దీ.. పైచర్మం మనకు తెలియకుండానే పొట్టుపొట్టుగా రాలిపోతుంటుంది. ఇది నిరంతరం జరుగుతుండే ప్రక్రియే. సరిగ్గా ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే.. పైచర్మం పైపైపొరలను తొలగించి.. చర్మానికి చక్కటి కొత్త నిగారింపును తెచ్చేందుకు వినియోగంలోకి దాదాపు వందేళ్ల క్రితమే వాడకంలోకి వచ్చిన ప్రక్రియ కెమికల్ పీల్స్! వైద్యరంగం కూడా దీనిపై రకరకాల అధ్యయనాలు చేసి.. సురక్షిత విధానాలను రూపొందించటంతో ఇటీవలి కాలంలో ఇది మరింత ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇలా చర్మం పైపొరలను తొలగించేందుకు వాడేవన్నీ కూడా రకరకాల సహజసిద్ధమైన పండ్లు, పదార్ధాల నుంచి తీసే ఆమ్లాలే. అయితే ఇవి చాలా శక్తిమంతమైనవి. అందుకే వీటితో చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం.
వయసుతో గానీ, మొటిమల వల్లగానీ, రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల కానీ చర్మంలో మార్పులొస్తుంటాయి. కొన్నిసార్లు బాగా ఎండలో తిరిగినా కూడా ముఖం నల్లబడటం, ముసలితనం ఛాయలు వస్తాయి. ఈ మార్పులు ప్రధానంగా మన చర్మం మీది పైపొరల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. ఇలాంటి మార్పులను తొలగించి, చర్మానికి తిరిగి కొత్త నిగారింపు, మంచి ఛాయ తీసుకురావటానికి 'కెమికల్ పీల్స్' ఉపయోగపడతాయి. వీటితో మన చర్మం పైపొర (ఎపిడెర్మిస్)లో వచ్చే మార్పులను, అలాగే దాని కింది పొర- డెర్మిస్‌లో తలెత్తే మార్పులను కూడా తొలగించవచ్చు.
కెమికల్ పీల్స్‌కు ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ సౌందర్యరాశి క్లియోపాత్ర (ఈజిప్టు) స్నానం చేయటానికి అప్పట్లో 'సోర్ మిల్క్' (విరిగిన పాలు) ఉపయోగించేదని చెబుతుంటారు. ఒక రకంగా దీన్ని 'పీలింగ్' అనుకోవచ్చు. ఈ సోర్ మిల్క్‌లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. అందువల్ల క్లియోపాత్ర స్నానం చేసిన తర్వాత ఆమె చర్మం నిగనిగలాడినట్టు కనిపించేది. ఫ్రెంచి వాళ్లు కూడా వైన్ సీసాల అడుగున పేరుకునే పాత వైన్‌ని చర్మంపై రాసుకునేవారు. ఇందులో 'టార్టారిక్ ఆమ్లం' చర్మం పైపొరను తీసేసేందుకు ఉపయోగపడేది. ఇక ఆధునిక వైద్యంలోకి వస్తే- 1882లో పాల్ గెర్సన్ ఉన్నా అనే జర్మన్ వైద్యుడు సాల్సిలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్, ఫైటిక్ యాసిడ్ వంటి వాటిని పీలర్లుగా ఉపయోగించటం ఆరంభించారు. అప్పట్నుంచి క్రమంగా వీటి వాడకం పెరుగుతూ వచ్చింది. ఆధునిక కాలంలో వీటిని కచ్చితంగా ఎంత మోతాదులో, ఎంత లోతు వరకూ చెయ్యచ్చన్నదంతా శాస్త్రీయంగా ప్రామాణీకరించటంతో వీటి వాడకం బాగా పెరిగింది.
మన చర్మంలో ప్రధానంగా రెండు పొరలు ఉంటాయి. పైపొరను ఎపిడెర్మిస్ అంటారు, కింది పొరను డెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్‌లో కూడా మళ్లీ నాలుగు సూక్ష్మపొరలుంటాయి. వీటిలో పైపొరను 'స్ట్రేటమ్ కార్నియమ్' అంటారు. నిజానికిది మృత పొర (డెడ్ లేయర్). మనకు పైకి కనిపించే చర్మం ఇదే. మనకు తెలియకుండానే ఇది నిరంతరం ఊడిపోతుంటుంది. (వాతావరణంలో తేమ తగ్గిపోయే చలికాలంలో పొట్టులా ఊడిపోయేది ఈ పొరే). దీని స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది. ఎపిడెర్మిస్ అడుగుభాగాన ఉండే 'స్ట్రేటమ్ బేసల్' నుంచి కొత్త చర్మ కణాలు నిరంతరం పుట్టుకొస్తుంటాయి. దీంతో పాత చర్మం పోతూ కొత్త చర్మం వస్తుంటుంది. కెమికల్ పీల్స్ ఈ పై పొరను తొలగించి మచ్చలు, గుంతలను తొలగిస్తాయి. ఇవి చర్మం పొరను తొలగిస్తూ కణాల్లోని ప్రోటీన్లను ఓ మోస్తరు స్థాయిలో దెబ్బతీస్తాయి. దీంతో అక్కడి చర్మం చక్కగా తనను తాను పునరుద్ధరించుకుంటుంది. ముడతలు, నలుపు మచ్చలు, మొటిమల కారణంగా ఏర్పడే గుంతల వంటివన్నీ కూడా చాలా వరకూ ఈ పైపొరల్లోనే ఉంటాయి. కాబట్టి ఈ పైపొరలు తొలగిపోయేలా చేసి.. మచ్చలు, గంతల వంటివన్నీ తొలగిపోయేలా చేయటం 'కెమికల్ పీలింగ్' లక్ష్యం. కెమికల్ పీల్ తొలగించిన పొర స్థానంలోకి 48 గంటల్లో కొత్త కణాలు వచ్చి చేరతాయి. క్రమేపీ కొత్తపొర ఏర్పడుతుంది. అక్కడ రక్తనాళాలు చురుకుగా మారి చర్మానికి రక్త సరఫరా మెరుగవుతుంది.
ఇక మన చర్మం లోపలి పొరల అడుగున చర్మాన్ని గట్టిగా పట్టి ఉంచే 'కొల్లాజెన్ ఫైబర్స్', ఎలాస్టిక్ ఫైబర్స్ వంటివి ఉంటాయి. సాధారణంగా యవ్వన దశలో ఈ ఫైబర్లన్నీ సమాంతరంగా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి అడ్డదిడ్డంగా అవుతాయి. దీంతో చర్మం వదులు కావటం, ముడతలు పడటం వంటి మార్పులు కనిపిస్తాయి. మనం పీల్స్‌తో పైపొరను తొలగించిన తర్వాత ఇవి తిరిగి సద్దుకుంటాయి. నాలుగైదు నెలల్లో చర్మం బిగుతుగా అవుతుంది. ముడతల వంటివి తగ్గి, ముఖంలో కొత్త కళ, కాంతి వస్తాయి.
వివిధ రకాల ప్రకృతి సిద్ధమైన పదార్ధాలు, పండ్ల నుంచి తీసే ఆమ్లాలనే పీల్స్‌గా వాడతారు. వీటిని 'ఫ్రూట్ యాసిడ్లు' లేదా 'ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్స్'.. అంటారు. ఉదాహరణకు గ్త్లెకాలిక్ యాసిడ్ అన్నది చెరుకు నుంచి తీస్తారు. లాక్టిక్ ఆమ్లం పాల నుంచి గ్రహిస్తారు, మాండలిక్ యాసిడ్ ఆపిల్ పండ్ల నుంచి వస్తుంది. సిట్రిక్ ఆమ్లం పుల్లటి పండ్ల నుంచి వస్తుంది. అయితే ఇవి పండ్ల నుంచి తీసేవే అయినా వీటిని శాస్త్రీయంగా తీసి, శుద్ధిచేసి, మోతాదులు ప్రామాణీకరించి వీటినీ మందుల్లాగానే తయారు చేస్తారు. కాబట్టి వీటికి మూలం పండ్లే అయినా.. మనం నేరుగా పండ్ల రసాలను వాడితే ఇంత సమర్థంగా పనిచేయవు. శాల్సిలిక్ ఆమ్లం, బీటాహైడ్రాలిక్ ఆమ్లం, ట్రైక్లోరో అసిటిక్ ఆమ్లం, ఆల్ఫా కీటో ఆసిడ్స్.. ఇవన్నీ వివిధ శాతాల్లో, మోతాదుల్లో లభిస్తాయి. జస్నర్ సొల్యూషన్, ఎల్లోపీల్ వంటివి వంటివి వివిధ ఆమ్లాల మిశ్రమాలు.
* హైపర్ పిగ్మెంటేషన్.. మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అక్కడంతా నల్లగా అవుతుంది. అలాంటివాటికి ఉపయోగపడుతుంది.
* పొగలోకి, ఎండలోకి వెళ్లినవారికి పైచర్మం కమిలినట్లుగా నల్లగా తయారవుతుంది(ట్యానింగ్). వీరికి పీల్స్ ఉపయోగపడతాయి.
* ఎండలోకి వెళితే ముఖం మీద ఒకరకమైన కాఫీపొడిరంగు మచ్చలు (ఫ్రెకిల్స్, లెంటిజెన్స్ మొ||) వస్తాయి. వీటిని తొలగించటానికి ఉపయోగపడుతుంది.
* మొటిమలు.. చర్మం జిడ్డుగా ఉండే వారికి మొటిమలు ఎక్కువ. ఇలాంటి వారికి శాల్సిలిక్ యాసిడ్ పీల్స్ బాగా ఉపయోగపడతాయి. అయితే మొటిమలు బాగా ఉద్ధృతంగా ఉన్నప్పుడు మొటిమలకు చికిత్స తీసుకుంటూ దాంతో పాటే ఈ పీల్స్ చేయించుకోవచ్చు.
* గుంటలు.. మొటిమలు వచ్చి తగ్గిపోయాక అక్కడ మచ్చలు, గుంతలు ఏర్పడొచ్చు. అలాగే మొటిమలు గిల్లటం వల్ల కూడా మచ్చలు వస్తాయి. ఇక ఆటలమ్మ (పొంగు) వచ్చాక మచ్చలు కనబడొచ్చు. ఇలాంటి మచ్చలు, గుంటలు తొలగించటానికి పీల్స్ ఉపయోగపడతాయి.
* వృత్తి వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల ముఖానికి ముడతలు వచ్చి, వయసు మీదపడిన భావన కలుగుతుంటుంది. (ఫోటో ఏజింగ్). దీన్ని కూడా కెమికల్ పీల్స్‌తో బాగా తగ్గించుకోవచ్చు.
* కొందరికి ముఖంపై మంగు మచ్చలు (మెలాస్మా) వేదనకు గురి చేస్తుంటాయి. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఈ మంగు మచ్చలు రావొచ్చు. ఇవి అంత ప్రస్ఫుటంగా కనబడకుండా తగ్గించేందుకు కూడా పీల్స్ ఉపయోగపడతాయి.
* కొందరికి చెంపల మీద స్వేద రంధ్రాల వంటివి పెద్దపెద్దగా కనబడుతుంటాయి (ఓపెన్ పోర్స్). వీటిని ఇబ్బందిగా భావించేవారు పీల్స్‌లో తొలగింపజేసుకోవచ్చు.
లోతు కూడా ప్రధానమే!
సమస్యను బట్టి, పైచర్మాన్ని ఎంత లోతు వరకూ తొలగించాలన్నదాన్ని బట్టి ఏ రకం పీల్ వాడాలి, దాన్ని కూడా ఎంత గాఢతలో వాడాలన్నది వైద్యులు నిర్ధారిస్తారు. ఎండలో తిరిగి నల్లబడటం వంటివాటికి పైపైన పొరలు తొలగిస్తే చాలు.. దీనికి శాల్సిలిక్ ఆమ్లం వంటివి, 30, 40 శాతాల్లో వాడినా సరిపోతుంది. ట్రైక్లోరో ఎసిటిక్ ఆమ్లం వంటివీ ఉపయోగపడతాయి. మరీ లోతుగా వెళ్లేందుకు (డీప్ పీల్స్) కోసం ఫీనాల్ 88% వరకూ వాడతారు.
ఎక్కువగా ఆశించ కూడదు!
ప్రంపచ వ్యాప్తంగా ప్రజల చర్మాలను సాధారణంగా 6 రకాలుగా వర్గీకరించారు. ఇందులో మన భారతీయుల చర్మం 4వ రకం. కాస్త దక్షిణాదికి వచ్చిన కొద్దీ కొద్దిగా నలుపుదనం పెరుగుతూ 4 నుంచి 5వ రకం వరకూ వెళుతుంటుంది. 5వ రకం వరకూ పీల్స్‌తో రిస్కు తక్కువ. 6వ రకం నుంచీ అసలు పీల్స్ చెయ్యకపోవటం ఉత్తమం. బాగా నల్లగా ఉన్నవారికి పీల్స్‌తో రంగు రావటం మాట అటుంచి, క్రమేపీ నలుపుదనం మరింత పెరుగుతుంది. పీల్స్‌లోని రసాయనాలు కింది చర్మకణాలను, ముఖ్యంగా ఆ రంగునిచ్చే మెలనోసైట్ కణాలను బాగా ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి నల్లగా ఉండే వారికి పీల్స్ చేస్తే మరింత సమస్యలు ఎదురవుతాయి. జన్యుపరంగా, జన్మతః వచ్చే రంగును ఏదీ మార్చలేదు. కాబట్టి సహజంగా ఉన్న నలుపు రంగును మార్చుకోవాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు.
- పీలింగ్‌కు ముందూ.. తర్వాతా..
* పీల్స్ చేయించుకోవటానికి రెండు వారాల ముందు నుంచీ సన్‌స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా వాడాలి. ఒక వారం ముందు రెటినాయిక్ యాసిడ్స్ వంటివి వాడి.. తర్వాత ఒక వారం ఖాళీ ఇవ్వాలి. వీటివల్ల చర్మం రంగు ముందుగానే కొంత తగ్గుతుంది, పీల్స్‌లో వాడే రసాయనం ముఖానికి రాసినప్పుడు అది లోపలికి అంతా సమానంగా వెళుతుంది. వీటినే 'ప్రైమింగ్ ఏజెంట్స్' అంటారు.
* పీలింగ్ సమయంలో ముఖం మీద ఎటువంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు. గతంలో బొల్లి వంటివి ఉండకూడదు. ఆస్థమా చరిత్ర, అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, ఎగ్జిమా, పొడి చర్మం వంటివారు పీల్స్‌కు వెళ్లకపోవటం ఉత్తమం. మధుమేహం, థైరాయడ్ వంటి సమస్యలతో పొడిచర్మం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ పీల్స్‌కు వెళ్లే ముందరే ఇటువంటి సమస్యలేమీ లేవని నిర్ధారించుకోవాలి. పీలింగ్ అశాస్త్రీయంగా ఎవరికివారే చేసుకోవటం ప్రమాదకరం.
ఎలా చేస్తారు?
పీలింగ్ రోజున ఉదయం నుంచీ నీరు బాగా తీసుకోవాలి. పీలింగ్‌కు వెళ్లేటప్పుడు కూడా ఎక్కువగా ఎండ పడకుండా వెళ్లటం ఉత్తమం. తర్వాత పోల్చుకోవటానికి వీలుగా- ట్రీట్‌మెంట్ మొదలుపెట్టేటప్పుడే ఒక ఫోటో తీసుకుని అప్పుడు పీలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందు ముఖమంతా 'అసిటోన్'తో క్లీన్ చేస్తారు, దాంతో ముఖం మీద ఉండే జిడ్డు, దుమ్ము వంటివన్నీ పోతాయి. తర్వాత స్పిరిట్‌తో తుడుస్తారు. ఇది చర్మాన్ని శుభ్రం చెయ్యటంతో పాటు ఎక్కడన్నా బ్యాక్టీరియా వంటివి ఉన్నా తొలగిస్తుంది. ఆ తర్వాత జాగ్రత్తగా పీలింగ్ రసాయనాన్ని- నుదురు నుంచి మొదలుపెట్టి కళ్ల భాగం తప్పించి ముఖమంతా జాగ్రత్తగా రాస్తారు. పక్కనే 'టైమర్' పెట్టుకుని.. కచ్చితంగా ఎన్ని నిమిషాలు ఉండాలో అంతే సమయం ఉంచి.. వెంటనే.. దాని ప్రభావం పోగొట్టేందుకు 'న్యూట్రలైజింగ్ ఏజెంట్' రాసేస్తారు. ఇందుకోసం బాగా చల్లగా ఉండే నీరు లేదా కొన్నిసార్లు 'కార్బొనేట్' ద్రావణం కూడా వాడతారు. దీంతో పీలింగ్ రసాయనం ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీములు రాసుకోమని, తరచుగా సన్‌స్క్రీన్స్ రాసుకోమని సూచిస్తారు. ఎండలోకి వెళ్లకూడదు. ఇలా కనీసం ఐదారు దఫాలుగా చెయ్యాల్సి వస్తుంది. అప్పుడు గానీ పూర్తి ప్రభావం తెలియదు.
* పిగ్మెంటేషన్‌కు సాధారణంగా నెలకోసారి చొప్పున ఐదారుసార్లు చేసిన తర్వాత ఫలితాలు స్థిరపడతాయి. ఎండలోకి వెళుతూనే ఉంటాం కాబట్టి మళ్లీ కొంత పిగ్మెంటేషన్ పెరిగే అవకాశం ఉంటుది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మెలాస్మా వంటివి ఉన్నవారు ఆర్నెల్లకు, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే ఫలితాలు బాగుంటాయి.
ఉపయోగాలు
* ఇది సర్జరీలాంటి కోతలు, కుట్ల వంటి అవసరాలేమీ లేని తేలికపాటి ప్రక్రియ. చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.
* గత 30, 40 ఏళ్లలో పీలింగ్ రసాయనాల విషయంలో ఎన్నో ప్రయోగాలు, అధ్యయనాలు చేశారు. భారతీయ చర్మానికి ఏవి సరిపోతాయి, ఏవి సరిపడవన్నది సశాస్త్రీయంగా గుర్తించి దానికి అనుగుణంగానే విధానాలనూ అభివృద్ధి చేశారు. కాబట్టి ఇవి ఇప్పుడు చాలా సురక్షితంగా మారాయి.
* పీలింగ్‌తో పైచర్మంలో మార్పులు వెంటనే కనబడతాయి, చర్మం పొట్టులా రాలిపోయి ఛాయ పెరుగుతుంది. ఇది తక్షణ ఫలితం అనుకుంటే కింది పొరల్లో మార్పులు మెల్లగా వస్తాయి. నలుపు, గుంటలు, ముడతలు తగ్గుతాయి. ఇంకా లోపలగా ఉండే కొల్లాజెన్, ఫైబర్స్ రిపేర్ల వల్ల ముసలి రూపు తగ్గి చర్మం బిగువుగా మారుతుంది.
* దీన్ని లేజర్లు, బొటాక్స్, స్కిన్ పాలిషింగ్, ఫిల్లర్ల వంటి వాటితో కలిపి చేసుకోవచ్చు.
రిస్కులు
* పీలింగ్ అనుభవజ్ఞులైన వైద్యులు సశాస్త్రీయంగా చేస్తే రిస్కులు తక్కువ. జాగ్రత్తలు తీసుకోకపోతే దీనితో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
* పీలింగ్ చేసిన తర్వాత సాధారణంగా ఐదారు రోజులకు పైచర్మం పొట్టురాలిపోతుందిగానీ.. పొడిచర్మం ఉన్న వారికి- వారంపది రోజులకు ఊడిపోవాల్సింది ముందే ఊడిపోవచ్చు.
*పీలింగ్ లోతుగా చేసినప్పుడు ఎండలోకి వెళితే ముఖమంతా కందినట్లుగా ఎర్రగా అయిపోవచ్చు.
* వైద్యులు చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే- పిగ్మెంటేషన్ తక్కువ కావచ్చు, ఎక్కువ కూడా కావచ్చు. ఇది రసాయనాన్ని బట్టి, లోతును బట్టి ఆధారపడి ఉంటుంది.
* ఇటువంటి సౌందర్య చికిత్సల గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటూ, వీటి నుంచి అవాస్తవికంగా, చాలా ఎక్కువ ఆశిస్తుంటారు. ఇది సరికాదు. వీటికి పరిమితులున్నాయి. శాస్త్రీయంగా ఎంత వరకూ సమంజసమో అంత వరకే చేయించుకోవాలి.
* కొందరు ఫలితాలు ఆశిస్తుంటారుగానీ వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించరు. పీలింగ్ చేయించుకోవటానికి ముందు వైద్యులు చెప్పినట్టుగా సన్‌స్క్రీన్ లోషన్లు, ప్రైమింగ్ అన్నీ కచ్చితంగా పాటించటం ముఖ్యం.
* చర్మం మీద దెబ్బలు తగిలినప్పుడు ఉబ్బెత్తు మచ్చలు (కీలాయిడ్స్) వచ్చే తత్వం ఉన్నవారు డీప్ పీల్స్ చేయించుకోకూడదు. అలాగే వృద్ధులకు చర్మం తిరిగి పూడుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వారికి 'డీప్ పీల్స్' అంత సమంజసం కాదు.
కంటిచుట్టూ వలయాలకూ!
కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలకు (డార్క్ సర్కిల్స్)కు 'ఆర్జినింగ్ పీల్స్' అందుబాటులోకి వచ్చాయి. వీటితో నల్ల వలయాలు బాగా తగ్గుతాయి. అయిత ఈ నల్ల వలయాలు రక్తహీనత, నిద్రలేకపోవం, జన్యుపరంగా, ఎండలోకి వెళ్లటం వల్ల కూడా రావచ్చు. కాబట్టి సరైన కారణాలన్నీ విశ్లేషించిన తర్వాతే, అవసరాన్ని బట్టే పీలింగ్ చెయ్యాల్సి ఉంటుంది
Article Courtesy with--Dr.Putta Srinivas ,Prof-Dermatology,Osmania Hos. Hyd.@Eenadu Sukhibhava
Visit my website - >
Dr.Seshagirirao.com/