Tuesday, May 8, 2012

ఎముకల్లో కణితులు,bone-cancer



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఎముకల్లో కణితులు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



కణవిభజనపై అదుపు తప్పి అసాధారణంగా కణాలు పెరగడం వల్ల వాపులా కనిపించే భాగాన్నే కణితి అంటారు. ఈ కణుతులు అన్నీ క్యాన్సర్‌వే కానక్కర లేదు. కొన్ని హానికరం కానివి కూడా ఉంటాయి. వీటిని బినైన్ ట్యూమర్లు అంటారు. ఇవి ఏర్పడిన చోట మాత్రమే ఉంటాయి. ఇతర భాగాలకు వ్యాపించవు. అందుకే బినైన్ కణుతుల వల్ల ప్రమాదం ఉండదు. మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. వీటినే క్యాన్సర్ కణుతులు అంటాం. ఈ కణుతులు అవి పుట్టిన భాగాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపించి అక్కడి కణాలకు కూడా హాని చేస్తాయి. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.మాలిగ్నెంట్ కణుతులు ఎక్కడ పుట్టాయన్నదాన్ని బట్టి క్యాన్సర్లు చాలా రకాలున్నాయి. ఉదాహరణకు సార్కోమా, కార్సినోమా, లుకేమియా. ఎముక కణజాలంలో కూడా రొమ్ములు, ప్రొస్టేట్, థైరాయిడ్, కిడ్ని, ఊపిరితిత్తుల మాదిరిగానే కణాలలో లాగే విభజన చాలా త్వరగా జరిగి త్వరగా వ్యాపిస్తుంది. ఎముకలో ఏర్పడే ట్యూమర్లు చాలా సందర్భాల్లో క్యాన్సర్ ట్యూమర్లు కాకపోవచ్చు. ఎముకలో ఏర్పడిన క్యాన్సర్ కణాలతో ఏర్పడిన ట్యూమర్లు రెండు రకాలుగా ఉంటాయి. ప్రైమరీ ట్యూమర్లు, సెకండరీ ట్యూమర్లు. ప్రైమరీ ట్యూమర్లను సార్కోమా అంటారు. సెకండరీ ట్యూమర్లు ఏర్పడడానికి ప్రత్యేకమైన కారణాలేవీ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు.త్వరగా వ్యాప్తి చెందే కణాలతో ఏర్పడిన ట్యూమర్లు ఎముకలోని ఇతర ఆరోగ్య కణాలను ఆక్రమిస్తాయి. అందువల్ల ఎముక బలహీన పడి విరిగి పోవడానికి కారణమవుతాయి. చాలా త్వరగా పెరిగే ఈ ట్యూమర్ల వల్ల ముఖ్యంగా లక్షణాలు కనిపించనపుడు లేదా కనిపించిన చిన్న లక్షణాలు కూడా అశ్రద్ధ చేసినపుడు అంగవైకల్యం ఏర్పడవచ్చు, అప్పుడప్పుడు మరణం కూడా సంభవించవచ్చు.

రకాలు :
ఎముకలో ఏర్పడే ట్యూమర్లు నాలుగు రకాలుగా ఉంటాయి. ఆస్టియోసార్కోమా, ఎవింగ్స్ సార్కోమా అనేవి సాధారణంగా చిన్నపిల్లల్లో కనిపించే ట్యూమర్లు, మల్టిపుల్ మైలోమా, కాండ్రోసార్కోమా సామాన్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తాయి.

లక్షణాలు :
సాధారణంగా ఇతర శరీర భాగాలలో కాన్సర్లు ఏర్పడినపుడు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. ఏర్పడినట్టు తెలిసేసరికే చాలా వరకు పరిమాణంలో పెద్దగా పెరిగిపోయి ఉంటాయి. కానీ ఎముకలో ట్యూమర్ ఉన్నపుడు సాధరణంగా కనిపించే లక్షణాలు వాపు, నొప్పి. కొన్ని సార్లు కాళ్లు చేతులు కదల్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో ఎముకలో క్యాన్సర్ ఎముక విరగటం ద్వారా బయటపడుతుంది. ఎటువంటి నొప్పి లేకుండా ఏర్పడిన చిన్న కణితి పెరిగే కొద్దీ దాని పరిసరాల్లో ఉన్న నాడులు, కండరాల మీద ఒత్తిడి పెంచడం వల్ల వాపు, నొప్పి రావడం ప్రారంభమౌతుంది.

పరీక్షలు :

ఎముక క్యాన్సర్‌ను నిర్ధారించడానికి చాలా రకాల పరీక్షలు అంచెలంచెలుగా నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి
- పేషెంట్ పూర్తి ఆరోగ్య వివరాలు, ఏవైనా ఇతర సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన వివరాలు
- రక్తపరీక్షలు
- ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు
- బయాప్సీ : ఇది ఒక చిన్న సర్జరీ వంటి పరీక్ష. క్యాన్సర్‌గా భావిస్తున్న కణితి నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపుతారు.

క్యాన్సర్ స్థాయి :
ఏ క్యాన్సర్ చికిత్సలోనైనా క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వ్యాధి ప్రారంభమైన చోటనే ఉందా లేక ఇతర అవయవాలకు వ్యాపించిందా అనే దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఎముక క్యాన్సర్‌లో క్యాన్సర్ స్థాయి తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పరీక్షలు చేస్తారు. అవి ఛాతి, ఎముకలకు సీటీ స్కాన్, కొన్ని సార్లు పెట్ స్కాన్ అవసరముంటుంది. 90 శాతం ఎముక క్యాన్సర్లు ఇతర ఎముకలకు, ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

చికిత్స :
-ఎముక క్యాన్సర్ చికిత్సలో ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు డాక్టర్లు కూడా టీమ్‌గా కలిసి పనిచెయ్యాల్సి ఉంటుంది. ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేసి క్యాన్సర్ కణితికి చికిత్స చేస్తే, మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ద్వారా, రేడియాలజీ ఆంకాలజిస్ట్ రేడియేషన్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ఈ అన్ని చికిత్సల ద్వారా క్యాన్సర్‌కు చికిత్స అందించడమే కాదు ఎముక నష్టాన్ని కూడా నివారిస్తారు.

చికిత్సలో చేసే సర్జరీల్లో రెండు రకాలు ఉంటాయి. మొదటి పద్ధతిలో క్యాన్సర్ వచ్చిన ప్రదేశంలోని అవయవాన్ని కాపాడడానికి చేసే సర్జరి. ఇందులో కేవలం క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగించి, ఎముక నష్టాన్ని నివారించడానికి కావల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అవయవాన్ని కాపాడతారు. దీనిని లింబ్ సాల్వేజ్ సర్జరీ అంటారు.కొన్నిసార్లు వ్యాధి ముదిరిపోవడం వల్ల అవయవాన్ని కాపాడలేకపోతారు. అటువంటి సందర్భాల్లో ప్రాణాలు కాపాడడానికి ఆ అవయవాన్ని తొలగిస్తారు. దీన్ని ఆంప్యు అంటారు.
సర్జరీ, కీమో, రేడియోథెరపీలతో చికిత్స పూర్తయిందనుకుంటే అది తప్పే అవుతుంది. చికిత్స అనంతరం క్రమం తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించడం, అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం ఎందుకంటే పూర్తిగా నయమైందని అనుకున్న వారిలో క్యాన్సర్ తిరగబెట్టవచ్చు. కాబట్టి డాక్టర్ అవసరం లేదని చెప్పే వరకు తరచుగా డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

క్యాన్సర్ కానీ ట్యూమర్లు చాలా రకాలుగా ఉండవచ్చు. మృదువైన కణజాలాల్లో ఏర్పడే ట్యూమర్లు చాలా వరకు ఎముకలో వచ్చే ట్యూమర్లలాగానే కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్ ట్యూమర్లు కావచ్చు, కాక పోవచ్చు.
క్యాన్సర్ కానీ కణితుల్లో సాధరణంగా కణితి ఏర్పడిన ప్రాంతంలో సర్జరి చేసి కణితి తొలగించడం ద్వారా ఎముక లేదా కీలు నష్టాన్ని నివారించవచ్చు. ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత తేలికవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ ట్యూమర్లు మళ్లీమళ్లీ రావచ్చు. ఏది ఏమైనా సరియైన సమయంలో గుర్తించిన ట్యూమర్లకు చికిత్స సలభంగానే చేయవచ్చు.

-- Article : courtesy with Dr.Kishore @ Namasthe Telangana.com
  • =======================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.