Sunday, May 13, 2012

మెనోపాజ్‌ మహిళల్లో హృద్రోగాలు , Heart diseases in Women after menopause



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో హృద్రోగాలు- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పురుషులతో పోలిస్తే.. మహిళల్లో హృద్రోగాలు తక్కువ. కానీ ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడా ప్రమాదం మహిళల్లోనూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతోన్న జీవనవిధానం.. క్రమపద్ధతిలేని నిద్రాహారనియమాలు.. పనుల ఒత్తిళ్లు.. వంటివన్నీ ఆ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఫలితంగానే గుండెజబ్బులు.
ఉన్నట్టుండి గుండెలో అసౌకర్యంగా అనిపించడంతో అప్పటికప్పుడు ఆసుపత్రికి పరుగెత్తింది యాభైఆరేళ్ల తులసి. వైద్యులు అవసరమైన పరీక్షలు నిర్వహించి గుండె రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లు నిర్థారించి చికిత్స చేశారు. ఈ రోజుల్లో రక్తపోటు, మధుమేహం, మరికొన్ని అనారోగ్యాల్లా మహిళల్లోనూ హృద్రోగాలు సర్వసాధారణమయ్యాయి. వాస్తవానికి వివిధ జబ్బులతో మరణించే మహిళల్లో గుండె రక్తనాళాలకు సంబంధించిన అనారోగ్యం కూడా ప్రధాన కారణమని అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒకరు గుండెజబ్బులతోనే మరణిస్తున్నారు. మరో అధ్యయనం ప్రకారం.. సమస్యని సరిగ్గా గుర్తించకపోవడం, లేదా నిర్ధారణ కాకపోవడం వల్ల మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతున్నారు. మన దేశంలో కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్నతహోదాలో సగటున నలభై ఏళ్ల వయసుండే స్త్రీలపై ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఏం చెబుతోందంటే.. దాదాపు నలభైనాలుగు శాతం మంది మెటబాలిక్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. అది క్రమంగా హృద్రోగాలకు దారితీస్తుంది.

మధుమేహం.. అప్రమత్తం
మహిళల్లో వచ్చే హృద్రోగాల్లో గుండెకు రక్తసరఫరా అందించే రక్తనాళాలు సన్నగా కావడం లేదా మూసుకుపోవడంతో సమస్య ఎదురవుతుంది. కొరొనరీ ఆర్టరీ డిసీజ్‌గా పేర్కొనే ఈ ప్రమాదమే గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యంగా దాడిచేస్తుంది. మెనోపాజ్‌ తరవాత మాత్రం ఇది ప్రమాదంగా మారవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో కొన్నిసార్లు అంతకన్నా ముందే కూడా ఎదురుకావచ్చు. ప్రమాద సూచికలు గమనిస్తే.. వయసు, కుటుంబ చరిత్ర, అధికరక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటం, స్థూలకాయం, క్రమపద్ధతిలేని జీవనవిధానం, ఒత్తిడి లాంటివన్నీ గుండెజబ్బులకు దారితీసే కారణాలే. వయసును బట్టి ప్రమాదం పెరుగుతుందని తెలుసుకోవాలి. మెనోపాజ్‌ తరవాత గుండె సమస్యలు ఎక్కువవుతాయి. దానికీ కారణం లేకపోలేదు. మలి వయసు వరకు స్త్రీ శరీరంలో విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌ హార్మోను గుండెకు, రక్తనాళాలకు రక్షణగా నిలుస్తుంది. అందుకే పురుషులతో పోలిస్తే.. నెలసరి వస్తోన్న మహిళల్లో గుండె రక్తనాళాలు మూసుకుపోయే సమస్య పెద్దగా కనిపించదు. అయితే మధుమేహం ఉన్న స్త్రీలలో మాత్రం వయసుతో నిమిత్తం లేకుండా హృద్రోగాలు ఎదురుకావచ్చని మరవకూడదు.

మెనోపాజ్‌ తరవాత శరీరానికి మేలుచేసే కొలెస్ట్రాల్‌ తగ్గి చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరాయిడ్లు పెరుగుతాయి. వయసుతోపాటు అధికరక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ప్రమాదాన్ని సూచిస్తాయి. అయితే మలివయసులో హార్మోన్లు తీసుకుంటే ఆ ప్రమాదం ఉండదనుకుంటాం. అందులో వాస్తవం లేదు.

సమయానికి స్పందిస్తే.. తప్పే ముప్పు
పురుషులతో పోలిస్తే మహిళల్లో గుండె రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. ఇక, గుండెపోటు లక్షణాలంటే.. ఛాతిలో వచ్చే నొప్పి గురించే ఆలోచిస్తాం. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆ లక్షణాలు కొద్దిగా వేరుగానే ఉంటాయి. గుండె మధ్యభాగంలో మెలిపెట్టినట్లు మొదలయ్యే నొప్పి నెమ్మదిగా మెడ, లేదా భుజం, దవడ వరకు చేరడం, అదే సమయంలో విపరీతమైన చెమట, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం వంటి సమస్యలు పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని క్లాసికల్‌ సింప్టమ్స్‌ అంటాం. అయితే యాభైశాతం మహిళల్లో అవే కనిపించాలని లేదు. ఏ మాత్రం ఛాతినొప్పి లేకపోయినా తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీసుకున్న ఆహారం జీర్ణం కాలేదనే భావన, పైపొట్టలో అసౌకర్యం, కేవలం దవడ దగ్గరే నొప్పి, గొంతు లేదా భుజం నొప్పి.. వంటివన్నీ కనిపిస్తాయి. దాంతో చాలామంది పై లక్షణాలను తేలిగ్గా తీసుకుంటారు. కానీ అవి గుండెనొప్పిని సూచించవచ్చు. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రమాదమే. అందుకే సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి.

నడకతో నిండునూరేళ్లు
వయసుతో నిమిత్తం లేకుండా ముందు నుంచీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే హృద్రోగాలను చాలామటుకు అదుపులో ఉంచవచ్చు.
* ప్రతిరోజు కనీసం అరగంట నడక లేదా పరుగు లాంటి ఎరోబిక్‌ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదుసార్లు ఈ వ్యాయామాలు చేసినా గుండెజబ్బుల ప్రమాదాన్ని చాలావరకు నివారించవచ్చు.

* ఆహారంలో ఉప్పుశాతాన్ని పరిమితం చేయాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్‌ , ట్రాన్స్‌ ఫ్యాట్లున్న ఆహారాన్ని తగ్గించాలి. మాంసకృత్తుల కోసం మాంసం, చేపలు, పాల ఉత్పత్తుల్ని ఎంచుకుంటాం. కానీ వాటిల్లో కొవ్వుశాతం అధికం. బదులుగా వెన్నలేని పాల ఉత్పత్తులు, స్కిన్‌లెస్‌ చికెన్‌ లాంటివి ఎంచుకోవాలి. సాల్మన్‌ వంటి చేపల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలుంటాయి.. ఇవి ట్రైగ్లిసరాయిడ్ల స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. ఫలితంగా గుండె జబ్బుల వల్ల వచ్చే మరణాలు తగ్గుతాయి. చిక్కుడుజాతి గింజల్లోనూ కొవ్వు, కొలెస్ట్రాల్‌ శాతం పరిమితంగా ఉంటుంది. మాంసకృత్తులు అందించే మరో చక్కని ప్రత్యామ్నాయం సోయా. రాగి, జొన్నల నుంచి సమృద్ధిగా లభించే పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గిస్తుంది. అదే సమయంలో విటమిన్లు, ఖనిజలవణాలు వంటి పోషకాలు అందుతాయి.

* ఒత్తిడిని సాధ్యమైనంతవరకు తగ్గించాలి. రోజూ కనీసం పదినిమిషాలైనా ధ్యానం చేయాలి.

* నూనె పదార్థాలను పరిమితం చేయాలి. ఒక వ్యక్తి నెలలో అరలీటరుకు మించి నూనె వాడకుండా చూసుకోవాలి. కొన్ని పదార్థాలకు నూనె చెంచాల చొప్పున వేయడం కన్నా స్ప్రే చేయాలి. దీనివల్ల నూనె వినియోగం తగ్గుతుంది. పదార్థాలను ఉడికించి తాలింపు వేసుకోవడం వల్ల నూనె వాడకాన్ని తగ్గించవచ్చు.

* వయసును బట్టి వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.

* గుండెజబ్బులకు దారితీసే అంశాలపైనా దృష్టిసారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహం లాంటివి ఉన్నా అప్రమత్తంగా ఉండాలి. వాటి లక్షణాలు పైకి కనిపించవు కానీ పరోక్షంగా గుండెజబ్బుకు కారణమవుతాయి. కాబట్టి ఆ సమస్యల్ని అదుపులో ఉంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు పాటించగలిగితే గుండెజబ్బుల వల్ల వచ్చే మరణాలను ఎనభైశాతం దాకా నివారించవచ్చు.

-- హృద్రోగ నిపుణులు డాక్టర్‌ రమేష్‌ గూడపాటి @ ఈనాడు సుఖీభవ .

  • ===================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.