Thursday, October 27, 2011

పిల్లలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన , Awareness on Paediatric health problems.ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పిల్లలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మన దేశంలో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మన పరిస్థితి పొరుగున ఉన్న చిన్నచిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, శ్రీలంకల కంటే కూడా హీనంగా ఉండటం మనందరికీ కూడా బాధాకరం.పుట్టగానే శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. 1. పుట్టగానే శ్వాస తీసుకోకపోవటం. ఇది పెద్ద సమస్య. కేవలం పుట్టగానే ఏడ్వక పోవటం, శ్వాస తీసుకోకపోవటం మూలంగానే ఎంతోమంది మరణిస్తున్నారు. ఇది తెలియక చాలామంది బిడ్డలు కడుపులోనే చనిపోయారని భావిస్తుంటారు కూడా. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇప్పుడు గట్టి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా- కాన్పు చేసే వారికి తగినంత నైపుణ్యం ఉంటే ఈ సమస్య తలెత్తకుండా ఎంతోమంది శిశువులను కాపాడొచ్చు. పుట్టగానే శిశువు ఏడ్వకుండా... తనంతట తానుగా శ్వాస తీసుకోలేకపోతుంటే.. వెంటనే 'బ్యాగ్‌-మాస్క్‌' పరికరంతో బిడ్డ శ్వాస తీసుకునేలా ప్రోత్సహించాలి. ఈ పని బిడ్డ పుట్టిన తొలి నిమిషంలోపే చెయ్యటం అవసరం. ఎందుకంటే బిడ్డ పుట్టిన తొలి నిమిషం చాలా కీలకం. అందుకే దీన్ని 'గోల్డెన్‌ మినిట్‌' అంటారు. ప్రసూతి నిపుణుల సంఖ్య పెరిగితే మనం ఈ పుట్టగానే శ్వాస సమస్యను చాలా వరకూ నివారించవచ్చు.

2. ఇన్‌ఫెక్షన్లు: పిల్లల విషయంలో శుభ్రత చాలా అవసరం. వారిని కనిపెట్టుకుని ఉండేవారు, తాకేవారు తమ చేతులను తప్పనిసరిగా సబ్బుతో 2 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. వూరికే చేతులు రుద్దుకుంటే చాలదు. పిల్లలకు తల్లిపాలు పట్టటం.. ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసే ముఖ్యమైన నివారణ చర్య. ఇదేమీ ఖర్చుతో కూడుకున్నది కాదు. తల్లుల్లో, కుటుంబాల్లో ఈ అవగాహన, చైతన్యం పెరిగితే చాలు.

3. తక్కువ బరువుతో పుట్టటం: పిల్లలు తక్కువ బరువుతో పుట్టటానికి ప్రధాన కారణం- యుక్తవయసు గర్భధారణే. ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చెయ్యటం ద్వారా ఈ సమస్యను చాలా వరకూ తొలగించవచ్చు. ఈ విషయంలో చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచటం ఎంతో అవసరం. కౌమారంలో ఉన్న ఆడపిల్లలకు, యవ్వన స్త్రీలకు రక్తహీనత తలెత్తకుండా 'ఐరన్‌' మాత్రలు ఇవ్వటం మంచిది. వారానికి 100 గ్రా. మోతాదు ఐరన్‌ మాత్ర ఒకటి ఇచ్చినా రక్తహీనత చాలావరకూ తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల భవిష్యత్తులో బరువు తక్కువ బిడ్డలు పుట్టటాన్ని అరికట్టొచ్చు.

పుట్టగానే శిశువుల మరణాలకు చాలా వరకూ ఈ మూడు అంశాలే కారణమవుతున్నాయి. కాన్పులు ఆసుపత్రుల్లో జరిగేలా చూడటం, బిడ్డ పుట్టిన 48 గంటల వరకూ అక్కడే ఉండటం, బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలివ్వటం ద్వారా ఎన్నో శిశుమరణాలను అరికట్టవచ్చు.

ఇక ఆ తర్వాతి దశలో పిల్లల మరణాలకు చాలా వరకూ కారణమవుతున్న అంశాలు న్యుమోనియా, డయేరియా. టీకాలతో నివారించదగ్గ వీలున్న జబ్బులతో మరణించే పిల్లల సంఖ్యా మన దగ్గర తక్కువేం లేదు. ముఖ్యంగా మీజిల్స్‌. వీటి గురించి వివరంగా చూద్దాం.

1. న్యుమోనియా: ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా బిడ్డను సంరక్షించుకోవచ్చు. బిడ్డ శ్వాస తీసుకునే వేగాన్ని బట్టి దీన్ని గుర్తించటం తేలికే. రెండు నెలల వయసు వరకూ పిల్లలు నిమిషానికి 60 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా, రెండు నెలల నుంచి ఏడాది పిల్లలు 50 కన్నా ఎక్కువ సార్లు గాలి తీసుకుంటున్నా, ఏడాది దాటిన తర్వాత 40 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా బిడ్డకు 'న్యుమోనియా' వచ్చిందేమోనని అనుమానించి ఆసుపత్రికి తీసుకువెళ్లటం మంచిది.

2. నీళ్ల విరేచనాలు: బిడ్డకు నీళ్ల విరేచనాలు అవుతుంటే ప్రధానంగా ఇవ్వాల్సింది 'చిటికెడు ఉప్పు-చారెడు పంచదార' మిశ్రమమైన ఓరల్‌ రీహైడ్రేషన్‌ ద్రావణం (ఓఆర్‌ఎస్‌). దీనితో పాటు జింక్‌ కూడా ఇవ్వటం చాలా అవసరమని చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య అందరికీ నొక్కి చెబుతోంది. ఈ జింక్‌ మాత్రలు, సిరప్‌ల రూపంలో లభిస్తున్నా వైద్యులు దీన్ని అందరికీ ఇవ్వటం లేదు. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు దీన్ని 6 నెలలు దాటిన పిల్లలకు రోజుకి 20 మి.గ్రా మోతాదులో 14 రోజుల పాటు ఇవ్వాలన్నది సిఫార్సు. వీటిని తప్పకుండా ఇవ్వాలి. ఇక నీళ్ల విరేచనాలు అవుతుంటే యాంటీబయాటిక్స్‌తో ప్రయోజనం ఉండదు. రక్తబంక విరేచనాలు అవుతుంటేనే (డిసెంట్రీ) యాంటీబయాటిక్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నీళ్ల విరేచనాలను తగ్గించటంలో 'ప్రోబయాటిక్స్‌' పాత్ర కూడా పెద్దగా లేదు. అయినా చాలామంది వైద్యులు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఈ విషయంలో వైద్యులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

3. టీకాలు: బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించటం ద్వారా కూడా శిశు మరణాల రేటును బాగా తగ్గించవచ్చు. ముఖ్యంగా పొంగు/తట్టు (మీజిల్స్‌) టీకాను 9 నెలల వయసులో పిల్లలందరికీ తప్పనిసరిగా ఇప్పించాలి. ఇది దాదాపు 15 ఏళ్ల నుంచీ ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇస్తున్నదే అయినా ఇప్పటికీ ఇది పిల్లలందరికీ చేరటం లేదు. ఈ టీకాలను బిడ్డకు జలుబు జ్వరం వంటివి ఉన్నప్పుడు కూడా ఇప్పించవచ్చు. అందుకే ఏ కారణంతో ఆసుపత్రికి వెళ్లినా వీటిని వేయించటానికి సందేహించాల్సిన పని లేదు. దీని విషయంలో శ్రద్ధ పెట్టాలి. బిడ్డ చక్కటి పోషకాహారం తింటుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. త్వరగా జబ్బుల బారినపడరు. బిడ్డను వెచ్చగా ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన రక్షణ చర్య.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 97 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తుండగా.. వీరిలో 21 లక్షల మంది మన దేశంలోనే మరణిస్తున్నారు.
మన దేశంలో ప్రతి 1000 మందిలో 37 మంది రోజుల బిడ్డలుగానే మరణిస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు.
దేశంలో ఏటా 2.7 కోట్ల కాన్పులు జరుగుతున్నాయి. కాన్పులు చేసే నిపుణులు సుమారు 3 లక్షల మందైనా కావాలి.
డయేరియాతో బాధపడే పిల్లల్లో సగటున 27% మందికే ఓఆర్‌ఎస్‌ ఇస్తున్నారు.
మన దేశంలో తట్టు/పొంగు (మీజిల్స్‌) కారణంగా ఏటా 2 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది మన దేశంలోనే అత్యధికం.

జ్వరమంటే భయమేల?---డా. జీసన్‌ ఉన్ని-కొచ్చి, ఔషధ సిఫార్సుల విభాగం, ఐఏపీ
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాభరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్‌' వేస్తుంటారు. నిజానికి అంత ఆదుర్దా అవసరం లేదు. ఎందుకంటే జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో మన శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలి. కేవలం ఒళ్లు వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్‌ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. చాలామంది ఒళ్లు వేడిగా ఉందనగానే వెంటనే థర్మామీటర్‌తో కొలవటం మొదలుపెట్టేస్తుంటారు. అంత అక్కర్లేదు. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నా ప్యారాసిటమాల్‌ వేయాలి. వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్‌ ఇవ్వచ్చు. ఈ రెండూ ఐపీఏ సూచిస్తున్న మందులు. ఒకవేళ వైద్యులు వైరల్‌ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే- ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయోటిక్‌ల వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డోసు యాంటీబయోటిక్‌ వాడితే మూత్ర, రక్త పరీక్షల్లో తేడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత్ర ఇన్ఫెక్షన్ల వంటివి ఉంటే గుర్తించటం కష్టం. కాబట్టి కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తెలుసుకోవాలి.

జ్వరం మరీ పెరిగితే ఫిట్స్‌ వస్తాయని భావించి తల్లిదండ్రులు వెంటనే ప్యారాసిటమాల్‌ వంటివి వేస్తుంటారు. నిజానికి జ్వరం ఒకేసారి అసాధారణంగా పెరిగినప్పుడు మాత్రమే ఫిట్స్‌ వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుందో ముందు గుర్తించటం కష్టం. అందుకని దాన్ని మనమెలాగూ నివారించలేం.

* ఒకవేళ ఫిట్స్‌ 15 నిమిషాల కన్నా ఎక్కువసేపున్నా, శరీరంలో ఒక భాగంలోనే వస్తున్నా, రోజుకి రెండుసార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, 6 నెలల్లో 4 సార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, కుటుంబంలో ఎవరికైనా ఫిట్స్‌ వ్యాధి ఉన్నా.. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమాల్‌ వంటి మాత్రలు వేయాల్సి అవసరం ఉంటుంది. అది కూడా ఆరేళ్ల వయసు వరకే. ఆ తర్వాత వారి మెదడు ఎదుగుతుంది. ఈ సమస్య చాలా వరకూ తొలగిపోతుంది.
జ్వరంలో ఫిట్స్‌ ఒకసారి వచ్చినంత మాత్రాన ఏ హానీ ఉండదు. తరచూ వస్తుంటే మాత్రం మున్ముందు అది 'మూర్ఛ'గా మారుతుందేమో గమనించాలి. జ్వరం వచ్చినవారిలో 3% మందిలోనే ఫిట్స్‌ వస్తుంటాయి. మళ్లీ వీరిలో కూడా అది మూర్ఛగా మారే అవకాశంకేవలం 0.2% మందిలోనే!

మన పిల్లలకు మన పాలు!--డా. గదాధర్‌ సారంగి--భువనేశ్వర్‌, ఐఏపీ
ఆవుపాలు ఆవుదూడల కోసమేగానీ.. మన పిల్లల కోసం కాదు! దీనర్థం మన పిల్లలకు కావాల్సిన పాలు తల్లుల నుంచే వస్తాయిగానీ వేరే వాటి నుంచి కాదు అని. మనకూ జంతువులకూ ఎంతో తేడా ఉంది. ఆవుదూడ పుట్టిన 6 గంటలకల్లా లేచి నిలబడి తల్లి నుంచి పాలు తాగుతుంది. మూడేళ్లకల్లా అది పాలివ్వటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన పిల్లలు అలా కాదే! పసిబిడ్డలు మొదటి ఆర్నెల్లూ తల్లిపాల మీదే ఆధారపడతారు. రెండేళ్ల వరకూ పాలు తాగుతారు, తాగాలి కూడా. మన పిల్లల మెదడు జంతువులమెదడు కన్నా వేగంగా, పెద్దగా ఎదుగుతుంది. ఏనుగు మెదడు 800 గ్రాములు కూడా ఉండదు. అదే పిల్లల్లో పుట్టేటప్పటికే 800 గ్రాములుంటుంది, మూణ్ణాలుగేళ్లకల్లా 1,400 గ్రాములకు చేరుకుటుంది. కాబట్టి మన మేధస్సుకు మించిన సామర్థ్యం మరే జంతువుకూ లేదు. మన అవసరాలు వేరు.

తల్లిపాలలో లాక్టోజ్‌ శాతం 7 గ్రాములు ఉంటుంది. అదే ఆవుపాలలో అయితే 3 గ్రాములే. ఈ లాక్టోజ్‌ తర్వాత దశలో గాలక్టోజ్‌గా రూపొందుతుంది. ఇది ఇతర హార్మోన్లతో కలిసి గాలక్టోలిపిడ్స్‌గా మారుతుంది. మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఇదే ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోతే నాడీ వ్యవస్థకు సరిపడిన ఆహారం లభించదు. పైగా తల్లీబిడ్డల మధ్య మానసిక బంధం కూడా అంతగా బలపడదు. ఇది కౌమారదశలో విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొదటి ఆర్నెల్లూ తల్లిపాలు, ఆ తర్వాత ఇతర పదార్థాలతో పాటుగా పాలివ్వటం అవసరం. ఆ తర్వాత కూడా పిల్లలకు ఆహారం ప్రేమగా, ఆప్యాయతతో పెట్టాలి. లేకపోతే వాళ్లు తిరస్కరిస్తారు. ఈ దశ ఏడాది వరకు కొనసాగుతుంది.

ఏడాది దాటేసరికి పిల్లలు తీపి, పులుపు, చేదు వంటి భిన్న రుచులను బాగా గ్రహించే స్థితికి చేరుకుంటారు. ఇష్టాయిష్టాలను బాహాటంగా ప్రదర్శిస్తారు. వీరికి ఇంట్లో తయారు చేసుకునే ఆహారం సరిపోతుంది. అయితే- పెరుగుతున్న పిల్లలకు శరీరం ఎదగటానికి అవసరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా అవసరమే. ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్‌, రాజ్మా, జొన్నలు, చేపలు, మాంసం, పాలు వంటి వన్నీ ప్రోటీన్లు ఇస్తాయి. పాలల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయిగానీ దాని నుంచి ఎక్కువ శక్తి కేలరీలు రావు. కాబట్టి తల్లిదండ్రులు ఎదిగే పిల్లలకు పాలు పట్టాల్సిందేగానీ కేవలం అదే సరిపోతుందని భావించకూడదు.
బిడ్డకు పుట్టిన గంటలోపే కేవలం 26-46% మందే తల్లిపాలు పడుతున్నారు.
* 22% తల్లులే బిడ్డకు ఆర్నెల్లు వచ్చే వరకూ కేవలం తల్లిపాలు పడుతున్నారు.
పిల్లలు ఏడుస్తుంటే తల్లులు తన పాలు సరిపోవటం లేదని భావిస్తూ డబ్బా పాలు మొదలెడుతుంటారు. దాని ఖర్చు చాలా ఎక్కువ. సరిగ్గా పడితే ఒక డబ్బా 2, 3 రోజులు కూడా రాదు. దీంతో నీళ్లెక్కువ, పొడి తక్కువేసి కలపటం మొదలుపెడతారు. అది పిల్లల అవసరాలకు చాలదు. పిల్లల్లో పోషకాహార లోపానికి తల్లిపాలివ్వకపోవటమే ముఖ్య కారణం. ఇలా 47% పిల్లలు బాధపడుతున్నారు.

పంజరం బంగారానిదే అయినా..!--డా|| పి.సుదర్శన్‌ రెడ్డి--హైదరాబాద్‌

*మన దేశంలో ఎదుగుతున్న పిల్లలను.. పోషకాహార లోపం తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా రక్తహీనత కారణంగా ఎంతోమంది చదువుల్లో వెనకబడుతున్నారు. వారిలో బుద్ధివికాసం మందగిస్తుంది. నీరసం, ఏకాగ్రత కుదరకపోవటం, చికాకు, మొండితనం, తిక్క.. ఇలాంటి ప్రవర్తన సమస్యలు పెరుగుతాయి. చక్కటి పోషకాహారం, ఐరన్‌ మాత్రలతో ఈ పరిస్థితిని చక్కగా నివారించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు దీనిపై దృష్టిపెట్టాలి. ఈ వయసు పిల్లలు కొత్తగా బయటకు వెళ్లటం, బయట తినటం, బయట నీరు తాగటం వంటివి చేస్తుంటారు కాబట్టి వీరికి 'శుభ్రతగా జీవించటం' నేర్పాలి.

* అన్నింటికంటే ఈ వయసులో ఎక్కువగా ఎదురయ్యేది- స్కూలు, చదువు సమస్యలు. 'మా పిల్లాడు సరిగా చదవటం లేదని' చదవమంటే కడుపునొప్పి, తలనొప్పి అంటారని.. తల్లిదండ్రులు రకరకాలుగా ఫిర్యాదులు చేస్తుంటారు. కొత్తగా మొదలైన స్కూలు, చదువు, పోటీ, పరీక్షలు, దండన, భయం, అపోహలు.. ఇవన్నీ కూడా ఈ వయసు పిల్లల్లో ఒత్తిడిని పెంచేవే. మరోవైపు తల్లిదండ్రులేమో- తమ చిన్నతనంలో తాము పొందలేకపోయిన వాటన్నింటినీ ఇప్పుడు తమ పిల్లలకు సమకూర్చి పెట్టినా వాళ్లెందుకు సరిగా చదవటం లేదని విపరీతంగా మధనపడుతుంటారు, పిల్లల మీద మరింత ఒత్తిడి పెడుతుంటారు. ట్యూషన్లు, చదువులు, పోటీల పేరుతో పసివయసులో వారి స్వేచ్ఛను, స్వతంత్రతను కట్టడి చేస్తుంటే వాళ్లు హాయిగాఉండలేరు. చక్కగా ఎదగలేరు. పంజరం బంగారంతో చేసినదే అయినా.. ఏ చిలకా దానిలో హాయిగా ఉండలేదన్న వాస్తవాన్ని తల్లిదండ్రులంతా గుర్తించాలి. వాళ్ల బాల్యాన్ని వాళ్లు హాయిగా ఆస్వాదించేలా చేసినప్పుడే చక్కగా ఎదుగుతారు. వారితో ఎక్కువ సమయం గడపాలి, వారి సాంగత్యాన్ని ఆస్వాదించాలి. వారి లేత మనసులను ఆప్యాయతతో గెలిచి.. ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవరచాలి. లేకపోతే పిల్లల్లో మానసిక, ప్రవర్తనాపరమైన సమస్యలు బయల్దేరతాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో మానసిక వైద్యనిపుణులను సంప్రదించే పిల్లల సంఖ్య పెరుగుతుండటాన్ని చూసి.. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది! 2-8 సంవత్సరాల పిల్లల్లో ఆహారపోషణ సరిగా లేక ఎదుగుదల లోపాలు ఎక్కువ. 50% మంది ఉండాల్సిన ఎత్తుబరువుల కంటే తక్కువవే ఉంటున్నారు. 70% రక్తహీనతతో బాధపడుతున్నారు.
  • ========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.