Saturday, October 8, 2011

తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన ,Hip Joint replacement process-awarenessఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తుంటి కీలు మార్పిడి విధానము-అవగాహన - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...మోకాలి కీళ్ల గురించి మనందరికీ తెలుసు. మన శరీరం బరువు మొత్తం అవే మోస్తుంటాయని భావిస్తుంటాం. అది కొంత వరకూ నిజమేగానీ... వాటికంటే ముందు మన శరీరం బరువును మోస్తుండేవి...మన తుంటి కీళ్లు! శరీరం పైభాగం మొత్తాన్ని..కాళ్లకు అనుసంధానించే అత్యంత కీలకమైన, సున్నితమైన కీళ్లు ఇవి! కటి ఎముకల చట్రానికి ఇరువైపులా ఉండే ఈ కీళ్ల నిర్మాణమే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 'బంతి-గిన్ని' ఆకృతిలో ఒకదానిలో ఒకటి స్వేచ్ఛగా కదులుతూ.. ఒకవైపు బరువు మోస్తూనే.. మనం కాళ్లను ముందుకు, వెనక్కు, పక్కలకు.. ఇలా ఎన్నో కోణాల్లో కదల్చటానికి ఇవి సహకరిస్తుంటాయి.

అందుకే తుంటి కీళ్లలో ఏదైనా సమస్య తలెత్తితే జీవితం నరకప్రాయం అవుతుంది. కాలు కదపాలంటే కష్టం. గజ్జల్లో ఒకటే నొప్పి. సున్నితమైన.. ఎన్నో కోణాల్లో తిరుగుతుండే కీలు కాబట్టి దీన్ని సరిచెయ్యటం కూడా అంత తేలికేం కాదు. క్లిష్టమైన ప్రక్రియ. వైద్య రంగానికి ఇది ఎంతోకాలం పెను సవాల్‌గా నిలిచింది. అయితే ఆధునికమైన 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఈ సమస్యను చాలా వరకూ విజయవంతంగా జయించామని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సాధారణంగా తుంటి కీలుకు తలెత్తే సమస్యలేమిటి? -మార్పిడి ఆపరేషన్‌ ప్రత్యేకత ఏమిటన్నది వివరంగా తెలుసుకుందాము .


మన శరీరంలో బరువు మోసే కీళ్లలో అత్యంత కీలకమైనది తుంటి కీలు! కాబట్టి దీనికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తోసేసుకుని తిరగటం చాలా కష్టం. ఈ తుంటి కీలు అన్నది 'గిన్నిలో బంతి'లా ఆడుతుంటుంది కాబట్టి దీన్ని 'బంతి-గిన్ని' (బాల్‌ సాకెట్‌ జాయింట్‌) కీలు అనే పిలుస్తుంటారు. కటి ఎముక చివర్లో 'గిన్ని' లాంటి నిర్మాణం ఉంటుంది. తొడ దగ్గరి నుంచి వచ్చే పొడవాటి ఎముక.. చివర్లో బంతి ఆకృతిలా ఉండి.. అది ఈ గిన్నిలో కూర్చుంటుంది. ఈ కదలికలు సున్నితంగా ఉండేందుకు బంతిపైన సున్నితమైన మృదులాస్థి పొరలు ఉంటాయి. బరువు మోస్తుండటంతో నిర్మాణపరంగా ఈ కీలు ఎంత సంక్లిష్టమైందో అంత సున్నితమైనదనీ చెప్పక తప్పదు. అందుకే ఒక్కో వయసులో ఈ కీలుకు ఒక్కో రకమైన ముప్పు పొంచి ఉంటుంది.

ముఖ్యంగా ప్రమాదాల్లో దెబ్బలు తగలటం, వృద్ధులు తూలిపడటం వంటి సందర్భాల్లో ముందుగా ఈ కీలు దెబ్బతినే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కారణమేదైనా ఈ కీలు తీవ్రంగా ప్రభావితమైనప్పుడు దీన్ని మార్చటం మినహా మరో మార్గం ఉండదు. 1920ల నుంచీ కూడా ఈ కీలు మార్పిడి కోసం పరిశోధకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు.

బరువు మోసే కీలకమైన జాయింట్‌ కాబట్టి త్వరగా అరిగిపోకుండా.. పక్కకు వైదొలగిపోకుండా 'బంతి-గిన్ని' స్థిరంగా ఉండేలా చూడటం కోసం ఎన్నో కృత్రిమ నమూనాలతో ప్రయోగాలు చేశారు. బ్రిటన్‌కు చెందిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌ సర్‌ జాన్‌ ఛార్న్‌లీ ఆధునిక మైన తుంటి మార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఎన్నో మెరుగులు దిద్దుకుని ఈ మార్పిడి సర్జరీ ఇప్పుడు.. తుంటికి సంబంధించి అత్యంత సమర్థమైన విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

తుంటి సమస్యల్లో ఏవి ఎక్కువ?
* రక్తప్రసారం దెబ్బతినటం: మన దేశంలో బంతికి రక్తప్రసారం తగ్గటమన్నది (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) చాలా ఎక్కువగా కనబడుతోంది. పైగా మన దేశంలో చాలామందికి దీనికి ప్రత్యేకమైన కారణం కూడా ఏదీ ఉండటం లేదు. మద్యం మితిమీరి తాగేవారిలో, రుమటాయిడ్‌ ఆర్త్థ్రెటిస్‌, కొన్ని రకాల చర్మవ్యాధులకు, కిడ్నీ మార్పిడి తర్వాత తప్పనిసరిగా స్టిరాయిడ్స్‌ తీసుకునేవారికి ఈ రక్తప్రసారం తగ్గే సమస్య ఎక్కువ. వీరిలో రెండు తుంటి కీళ్లూ పాడవ్వచ్చు, వీరికి మార్పిడి అనివార్యమవుతోంది.

* తొలగిపోవటం: పుట్టుకతోనే బంతి-గిన్ని సరిగా ఒకదాన్లో ఒకటి కూర్చుని ఉండకపోవటం, ప్రమాదాల వంటి కారణాల రీత్యా తుంటి కీలు తొలగిపోవటం వంటి కారణాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి.

* ఒక ఆపరేషన్‌ తర్వాత: దెబ్బతగలటం తదితర కారణాల రీత్యా తుంటికి ఒకసారి ఆపరేషన్‌ చేసిన తర్వాత.. క్రమేపీ కీలు అరిగిపోవటం ఆరంభం కావచ్చు. దీనికీ మార్పిడి అనివార్యమవుతుంది.


* మన దేశంలో మోకాలి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ. దానితో పోలిస్తే వాటంతట అవేగా తుంటి కీళ్లు అరగటమన్నది తక్కువ. కానీ పాశ్చాత్య దేశాలు ఇందుకు విరుద్ధం. అక్కడ తుంటి కీళ్లు అరగటమన్నది చాలా ఎక్కువ.

* తుంటి మార్పిడి అన్నది 97% విజయవంతమైన సర్జరీ. ఈ కృత్రిమ కీళ్లు కూడా 20-25 ఏళ్లు మన్నికగా ఉంటున్నాయి.

* సరిగా చెయ్యకపోతే దీనివల్ల దుష్ప్రభావాలూ ఉంటాయి. ఉదాహరణకు కీలు తొలగిపోవచ్చు. అమరిక సరిగా లేకపోతే అవి త్వరగా అరిగిపోవచ్చు. ప్లాస్టిక్‌ కారణంగా కొన్నిసార్లు ఎముక మొత్తం దెబ్బతినిపోవచ్చు (ఆస్టియోలైసిస్‌). నైపుణ్యంతో చేసినప్పుడు ఈ ఇబ్బందులన్నీ తక్కువనే చెప్పుకోవాలి.

నొప్పి కీలకం
* తుంటి కీలు అరగటం (ఆర్త్థ్రెటిస్‌), దెబ్బతినటం ఇలా కారణమేదైనా అన్నింటిలోనూ కూడా ప్రధానంగా కనిపించే సమస్య... గజ్జల్లో లోపలగా నొప్పి. ఉదయం లేవగానే కీలు కొద్దిగా బిగుతుగా అనిపిస్తుండటం.. నడుస్తున్నప్పుడు కీలు మీద బరువు పడగానే కలుక్కుమన్నట్టుండటం. అడుగేసినప్పుడల్లా నొప్పితో బాధ. రాత్రి కూడా వేధించే నొప్పి. మెట్లు ఎక్కటం మహా కష్టం. కూర్చుని లేవాలంటే ఇబ్బంది. క్రమేపీ నడక కూడా కష్టం కావచ్చు. అయితే లోపల కీలు దెబ్బతింటున్నా పైకి వాపులాంటి లక్షణాలేవీ కనబడవు. కీలు ఎక్కడో లోపలగా ఉంటుంది కాబట్టి బాధ కూడా ఎక్కడో లోపలగానే అనిపిస్తుంటుంది.

* పరీక్షలు: గజ్జల్లో నొప్పి, నడవటం కష్టంగా ఉందని గుర్తించినప్పుడు ముందు రెండు వైపులా తుంటి కీళ్లు కనబడేలా ఎక్స్‌రే తీస్తారు. దీనిలో కీలుకు సంబంధించిన సమస్యలు చాలా వరకూ బయటపడతాయి. అయితే తుంటి కీలులోని బంతికి రక్తప్రసారం సరిగా ఉందా? లేదా? (ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌) వంటివి దీనిలో స్పష్టంగా తెలియవు కాబట్టి అవసరమైతే ఎమ్మారై స్కానింగ్‌ కూడా చేయిస్తారు. కీలులో ఏ కొంచెం తేడా ఉన్నా దీనిలో బయటపడుతుంది.

జాగ్రత్తలు
నొప్పికి కారణం ఏదైనా మొదట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* తుంటి కీలు మీద బరువు పడకుండా చూడటం ముఖ్యం. కింద కూర్చోకుండా ఉండాలి. వెస్ట్రన్‌ టాయ్‌లెట్స్‌ వాడుకోవాలి.
* బరువు తగ్గటం కూడా అవసరం.
* నొప్పి తగ్గేందుకు మందులు ఇస్తారు.
* తుంటి దగ్గరి 'అబ్డక్టార్‌' కండరాన్ని (మన ప్యాంటు జేబులో చేతులు పెట్టినప్పుడు సరిగ్గా కింద ఉండే కండరం) బలోపేతం చేసేందుకు 'అబ్డక్టార్‌ ఎక్సర్‌సైజులు' సూచిస్తారు. ఈ కండరాలు బలపడితే కీలు మీద భారం తగ్గుతుంది, కీలు స్థిరత్వం పెరుగుతుంది.

ఈ చర్యలతో నొప్పి తగ్గి మంచి ఫలితం ఉంటుంది. అయితే క్రమేపీ కీలు అరుగుతూ, ఆర్త్థ్రెటిస్‌ ముదిరిన కొద్దీ.. మళ్లీ నొప్పి పెరుగుతుంటుంది. ఆ స్థితిలో ఉన్న ఒకే ఒక సమర్థవంతమైన మార్గం 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌.

మార్పిడి ఆపరేషన్‌

సర్‌ జాన్‌ ఛార్న్‌లీ తొలిగా తుంటి మార్పిడి చేసినప్పుడు పైన ప్లాస్టిక్‌ గిన్ని, దానిలో స్టీలు బంతి వాడారు. ఆ తర్వాత పరిశోధనా రంగం అభివృద్ధి చెందిన కొద్దీ.. దీనిలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకటి లోహం/ మరోటి ప్లాస్టిక్‌, సెరామిక్‌/సెరామిక్‌, లోహం/లోహం, సెరామిక్‌/పాలీఎథిలీన్‌.. ఇలా ఎన్నో రకాలు వచ్చాయి. వీటన్నింటి ప్రధాన లక్ష్యం- త్వరగా అరిగిపోకుండా మన్నికగా ఉండేలా చూడటమే.

* గిన్నిని కటి ఎముకలో కూర్చోబెట్టేందుకు అప్పట్లో ఛార్న్‌లీ బోన్‌ సిమెంట్‌ (పాలీ మిథైల్‌ మిథాక్రిలేట్‌) వాడారు. తర్వాత్తర్వాత ఆ సిమెంట్‌కు ప్రాచుర్యం తగ్గి.. సిమెంట్‌ అవసరం లేకుండానే కటి ఎముకతో కలిసిపోయే రకం కృత్రిమ కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఎముక క్రమేపీ దానిలోకి పెరిగి అది అక్కడ స్థిరపడిపోతుంది.

* తొలిరోజుల్లో ఛార్న్‌లీ వాడినప్పుడు 22 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే చిన్న బంతి ఉన్న కీలు వాడారు. కానీ క్రమేపీ దాని సైజు పెంచుకుంటూ వస్తూ.. ఇప్పుడు 40 మిల్లీమీటర్ల వరకూ కూడా వాడుతున్నారు. ఇలా బంతి సైజుపెద్దగా ఉన్నందువల్ల కీలుకు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎముక ఆకృతిని బట్టి సాధ్యమైనంత పెద్దసైజు బంతి వెయ్యటం వల్ల ఉపయోగం ఉంటుంది.

* తొలినాళ్లలో తుంటి మార్పిడి తర్వాత కింద కూర్చో కూడదు, పరుగెత్తకూడదు వంటి రకరకాల నిబంధనలు విధించేవారు. అప్పట్లో అమర్చే బంతి సైజు చిన్నగా ఉండేది కాబట్టి ఎప్పుడు కీలు బెసిగిపోతుందో, ఎప్పుడు తొలిగిపోతుందోనని భయం. అయితే ఇప్పుడు బంతి సైజు పెద్దగా ఉంటోంది కాబట్టి కీలుకు స్థిరత్వం వస్తోంది. దీంతో ఎటువంటి ఆంక్షలూ ఉండవు. ఇప్పుడు తుంటి మార్పిడి చేయించుకున్నవారు జాగింగ్‌ వంటి వ్యాయామాలు, టెన్నిస్‌ వంటి క్రీడలు కూడా ఆడుతున్నారు. ఏదైనా కారణాన యుక్త వయస్కులకు మార్పిడి ఆపరేషన్‌ చేయాల్సి వచ్చినా.. వారి జీవనశైలిలో ఎటువంటి మార్పుల అవసరం ఉండదు.

సర్జరీ ఎలా చేస్తారు?


1. తుంటి ప్రాంతంలో కోత బెట్టి గిన్ని-బంతి కీలును చేరుకుంటారు.
2. కీలులో గిన్ని భాగాన్ని సరిచేసి.. అక్కడ లోహం/సిరామిక్‌/ప్లాస్టిక్‌ ఇలా ఎంపిక చేసిన కృత్రిమ గిన్నిని అమరుస్తారు. దీనికి సిమెంట్‌ వాడేవి కొన్ని రకాలు, సిమెంట్‌ లేని రకాలూ ఉన్నాయి.
3. తొడ ప్రాంతం నుంచి వచ్చే ఎముక చివరి భాగం బంతిలా ఉంటుంది.
4. పాడైపోయిన ఈ బంతి ఎముక భాగాన్ని తొలగిస్తారు.
5. ఆ తొలగించిన భాగంలో- పొడవాటి దృఢమైన స్టెమ్‌ సాయంతో కృత్రిమ బంతిని అమరుస్తారు. ఈ బంతుల్లో కూడా చాలా రకాలున్నాయి.బంతి సైజు ఎంత పెద్దగా ఉంటే కీలు అంత స్థిరంగా ఉంటుంది.
6. బంతిని గిన్నిలో కూర్చోబెట్టి.. కీలుకు స్థిరత్వాన్ని తెస్తారు. అది అలాగే లోపల ఉండిపోతుంది.

ఒకప్పుడు తుంటి కీలుకు క్షయ రావటమన్నది మన దేశంలో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పటికీ పల్లెల్లో ఇది ఎక్కువగానే కనబడుతుంది. అలాగే తుంటి కీలులో చీము చేరటమన్నదీ (పయోజెనిక్‌ ఆర్త్థ్రెటిస్‌) ఎక్కువగా ఉండేది. కాన్పు పద్ధతుల వంటివి సరిగా లేని రోజుల్లో రకరకాల కారణాల రీత్యా పిల్లలకు ఇన్ఫెక్షన్‌ వచ్చి అది తుంటి కీలులో చేరేది. ఇటీవలి కాలంలో ఇవి గణనీయంగా తగ్గాయని చెప్పుకోవాలి.
రీ సర్ఫేస్‌మెంట్‌--బంతి, గిన్నితో సహా కీలు మొత్తాన్ని మారిస్తే దాన్ని 'టోటల్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌' అంటారు. అయితే సహజమైన ఎముకను ఎక్కువ భాగం తొలగించాల్సిన అవసరం లేకుండా.. దెబ్బతిన్న బంతి భాగం మొత్తాన్ని తియ్యకుండా దాన్నే చెక్కి.. దాని ఆకృతి మార్చి.. దానిపై లోహపు బంతిని అమర్చే విధానం కూడా అందుబాటులోకి వచ్చింది. దీన్నే 'రీ సర్ఫేస్‌మెంట్‌' అంటారు. అయితే దీనికి పరిమితులు ఎక్కువ. సమస్యను బట్టి దీన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

వయసు వయసుకో సమస్య!
తుంటి కీలుకు సంబంధించి... పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకూ కూడా ప్రతిదశలోనూ కొన్ని రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పుట్టగానే: తుంటి కీలు అన్నది 'బంతి-గిన్ని' కీలు. గిన్నిలాంటి కటి ఎముకలో బంతి స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. కొందరికి పుట్టేసరికే ఈ బంతి.. గిన్నిలో కుదురుగా కూర్చుని ఉండదు. పక్కకు వైదొలగి, ఉంటుంది. దీన్నే 'కంజెనిటల్‌ డిస్‌లొకేషన్‌ ఆఫ్‌ హిప్‌' అంటారు. గిన్నిలోంచి బంతి బయటకు వచ్చేసి ఉంటుంది. దీన్ని పసివయసులోనే పట్టుకోకపోతే- కీలు (ముఖ్యంగా గిన్ని) సరిగా ఎదగదు. అర్థ చంద్రాకారంగా ఉండాల్సిన గిన్ని భాగం.. పెద్దగా, ఖాళీగా ఉండిపోతుంది. దీన్నే 'డిస్‌ప్లాస్టిక్‌ హిప్‌' అంటారు. అందుకే బిడ్డ పుట్టగానే వైద్యులు తుంటి కీలు స్థిరంగా కూర్చుని ఉందా? లేదా? అన్నది తప్పనిసరిగా చూస్తారు. ఒకవేళ అది స్థిరంగా లేకపోతే వెంటనే ప్రత్యేకమైన పద్ధతిలో 'బిగుతుగా కట్టు కట్టటం(పావ్‌లిక్‌ హార్నెస్‌)' వంటి వాటితో దాన్ని సరిచెయ్యచ్చు. పెద్దవయసు వరకూ గుర్తించకపోతే మాత్రం ఆపరేషన్ల వంటివి తప్పవు. ఎందుకంటే బంతి-గిన్ని కీలులో- బంతిని బట్టి గిన్ని, గిన్నిని బట్టి బంతి పెరుగుతుంటాయి. చిన్నతనంలో ఒకటి బయటకు తొలగిపోతే రెండోదాని ఎదుగుదలా ప్రభావితమవుతుంది.

టీనేజీలో: తొడ నుంచి వచ్చే ఎముక చివర ఎదుగుదలకు వీలుగా 'గ్రోత్‌ప్లేట్స్‌' అనేవి ఉంటాయి. ఎముక పొడుగు సాగుతుండటానికి ఇవి కీలకం. వీటి దగ్గర కొద్దిగా మృదులాస్థి కణజాలం ఉంటుంది. టీనేజీలో కొందరికి, ముఖ్యంగా లావుగా ఉండే మగపిల్లలకు ఈ గ్రోత్‌ప్లేట్స్‌ దగ్గర ఉండే మృదులాస్థి కణజాలం పక్కకు జారిపోయి.. కీలు ఆకృతి మారిపోతుంది. దీన్నే 'స్లిప్‌డ్‌ అప్పర్‌ ఫిమరల్‌ ఎపిఫైసిస్‌ (సూఫీ)' అంటారు. దీంతో క్రమేపీ నొప్పి, నడక తీరు మారిపోవటం వంటివన్నీ మొదలవుతాయి. దీన్ని వెంటనే గుర్తించి సరిచెయ్యటం చాలా అవసరం.

మధ్యవయసులో: 30-40 ఏళ్ల వయసు వారిలో 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అనే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే మోకాలి ఎముకలో బంతికి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అత్యంత కీలకమైనవి. ఈ రక్తప్రసార వ్యవస్థ చాలా సున్నితమైనది. దీనిలో ఏ తేడా వచ్చి బంతికి రక్తప్రసారం నిలిచిపోయి.. ఎముక దెబ్బతింటుంది. బంతి పాడైపోతుంది. దీన్నే 'ఎవాస్క్యులర్‌ నెక్రోసిస్‌' అంటారు. దీర్ఘకాలం పాటు మితిమీరి మద్యం తీసుకునేవారిలో, అలాగే స్టిరాయిడ్‌ మందులు నిత్యం వాడేవారికి కూడా ఇలా జరగొచ్చు. కానీ మన దేశంలో చాలామందికి ఇటువంటి స్పష్టమైన కారణమేదీ లేకుండా కూడా బంతికి రక్తప్రసారం దెబ్బతినటం చాలా తరచుగా చూస్తున్నాం. కాబట్టి 30-40 ఏళ్ల సమయంలో తుంటి కీలు నొప్పి వచ్చిందంటే కచ్చితంగా ఎంఆర్‌ఐ స్కానింగ్‌ తీసి చూడటం చాలా అవసరం. దీనికి 'తుంటి కీలు మార్పిడి' ఆపరేషన్‌ అవసరమవుతుంది.

వృద్ధాప్యంలో: ముసలి వయసులో రకరకాల కారణాల రీత్యా కింద పడిపోతుండటం, తుంటి ఎముకలు విరగటమన్నది చాలా ఎక్కువగా కనిపించే సమస్య. సహజంగా తుంటి కీలు కింది భాగం (ఫ్రాక్చర్‌ నెక్‌ ఆఫ్‌ ద ఫీమర్‌) విరుగుతుంటుంది. దీన్ని రకరకాల పద్ధతుల్లో సరిచేస్తారుగానీ ఆ తర్వాత క్రమేపీ తుంటి కీలు అరిగిపోవటమన్నది చాలా ఎక్కువమందిలో కనబడుతుంటుంది. ఒక్కోసారి పడిపోయినప్పుడు బంతి బయటకు తోసుకువచ్చేయవచ్చు. దాంతో పాటు బంతికి రక్తప్రసారం దెబ్బతిని కీలు పాడైపోవచ్చు. వీటన్నింటివల్లా తుంటి కీలు దెబ్బతింటుంది. చాలాసార్లు దాన్ని మార్చి, కృత్రిమ కీలు అమర్చాల్సిన అవసరం కూడా తలెత్తుతుంటుంది.

-- డా. ఎ.వి.గురవారెడ్డి-- జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జన్‌-- ఎండీ, సన్‌షైన్‌ హాస్పిటల్‌-- హైదరాబాద్‌.(Eenadu sukhibhava-సుఖీభవ)  • =====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.