మెనోపాజ్. ఎప్పుడో 45-55 ఏళ్ల మధ్య రావాల్సిన ఇదిప్పుడు ఎంతోమంది యువతులను ముప్పైల్లోనే భయపెడుతోంది. మనదేశంలో సుమారు 4% మంది 35 ఏళ్లకు ముందుగానే ముట్లుడిగిపోయే స్థితికి చేరుకుంటున్నారని బెంగళూరులోని సోషల్ అండ్ ఎకనామిక్ ఛేంజ్ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. దీంతో పిల్లలను కనే సామర్థ్యాన్ని కోల్పోయి కుమిలిపోతున్నారు. ముందే ముంచుకొచ్చే మెనోపాజ్‌కు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వీటిని ఆదిలోనే గుర్తిస్తే చాలావరకు సరిదిద్దొచ్చు. కానీ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ (పీఓఎఫ్) కోవకు చెందినవైతే మాత్రం కష్టం. వీరిలో అండాలు అతి కొద్దిగానో, అసలే విడుదల కాకుండానో ఉంటాయి. పీఓఎఫ్ బాధితుల్లో మూడొంతుల మందిలో దీనికి జన్యు పరమైన అంశాలే కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పీఎఫ్‌ఓలో జన్యువుల పాత్ర గురించి మనదేశంలో ఎలాంటి అధ్యయనాలు జరగలేదు. ఇటీవల సీసీఎంబీ దీనిపై ఓ పరిశోధన చేసింది. పీఎఫ్‌ఓలో పాలుపంచుకుంటున్న జన్యువులకు అండాల విడుదలతో నేరుగా సంబంధమేమీ లేకపోయినా.. వాటి ఉత్పత్తి, విడుదలకు అనువైన వాతావరణాన్ని సృష్టించటంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. బీసీఎల్ 2 జన్యువులోని ఉత్పరివర్తనలు అండాలు తగ్గిపోవటానికి దోహదం చేస్తున్నట్టు గుర్తించారు. అలాగే అండకణాల ఉత్పత్తి, వృద్ధికి సహకరించే ఎఫ్‌ఎస్‌హెచ్ హార్మోన్ విడుదల కావటంలో ఇన్‌హిబిన్ అనే జన్యువు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది. పీఓఎఫ్ బాధితుల్లో 10.5 శాతం మందిలో ఇన్‌హిబిన్ జన్యువు మార్పు చెందినట్టు తేలింది. లింగ నిర్ధారణ చేసే ఎక్స్ క్రోమోజోమ్.. అండాశయ పనితీరులోనూ కీలకపాత్ర పోషిస్తోంది. సహజంగా ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోమ్‌లు ఉంటాయి. వీటిల్లో ఏ ఒక్కదానిలోనైనా తేడా ఉంటే పీఎఫ్‌ఓకు దారి తీస్తున్నట్టు తేలింది. ఈ పరిశోధన ఆధారంగా కొత్త నిర్ధరణ పరికరాలు రూపొందించి, పీఎఫ్‌ఓ రాబోయే మహిళలను ముందుగానే గుర్తించొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అలాంటి వాళ్లు ముందుగానే సంతానం విషయంలో ఒక నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది.
గర్భస్థ పిండంలోనే అండాలు
తల్లి కడుపులో ఉండగానే ఆడశిశువు అండాశయంలో 20 వారాల సమయానికి 60-70 లక్షల అండ బీజకణాలు ఏర్పడతాయి. అయితే ఇవి వేగంగా తగ్గిపోతూ శిశువు పుట్టే సరికి కేవలం 10 లక్షలే మిగులుతాయి. రజస్వల వచ్చేసరికి వీటి సంఖ్య 3-5 లక్షలకు తగ్గిపోతుంది. తర్వాత అండాల ఉత్పత్తి ప్రక్రియలో నెలకు 1,000 చొప్పున తగ్గుతూ వస్తాయి. ఈ అండకణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతే మెనోపాజ్ దశ వస్తుంది. అప్పుడు సహజంగా పిల్లలు పుట్టే అవకాశం పోతుంది.
- ===============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.