వర్ణాంధత్వము అంటే కలర్ బ్లయిండ్‌నెస్. అంటే రంగులను గుర్తిచలేకపోవడం. ఈ వర్ణ దృష్టి లోపాన్ని 1794లో డాల్టన్ అనే శాస్తవ్రేత్త గమనించాడు. మనుషులకు ఈ లోపం పుట్టుకతోనే సంక్రమిస్తుంది. దీనికి నివారణోపాయం ఏమీలేదు. ఈ లోపం డాల్టన్‌కే ఉండడంవల్ల గుర్తించగలిగాడు.
ఈ కలర్ బ్లయిండ్‌నెస్ మగవారిలోనే ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా ఈ దోషం వస్తుందని అనుకునేవారు. ఆ తరువాత పరిశోధనలలో ఇది ఎక్స్-క్రోమోజోమ్‌వల్ల వస్తుందని తెలుసుకున్నారు. జన్యు లోపాల కారణంగా వర్ణద్రవ్యాల్లో సమతుల్యత దెబ్బతిని ఆకుపచ్చ లేదా ఎరుపు రంగును గుర్తించడంలో విఫలమవుతారు.
కంటి నిర్మాణంలో రెటీనా, రాడ్స్, కోన్స్ ముఖ్య భాగాలు. రెటీనా తెరపై వస్తు ప్రతిబింబాలు పడతాయి. రాడ్స్, కోన్స్ ప్రతిబింబాలు రెటీనాపై పడి వాటిని మనం గుర్తించేందుకు సహాయపడతాయి.
తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలము, పసుపు ముఖ్యమైనవి. ఈ రంగులను గ్రహించేందుకు వీలుగా రెటీనాలో వీటికి సంబంధించిన పిగ్మెంట్లు ఉంటాయి. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలము పిగ్మెంట్స్ ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో ఉన్నప్పుడే ఆ వర్ణ మిశ్రమం తెల్లగా కన్పిస్తుంది. ఈ రకమైన అమరికగల వారిని ‘సాధారణ ట్రైకోమేట్లు’ అంటారు.
మూడు పిగ్మెంట్సు
ఈ అమరికలో తేడా ఉంటే వారిని ‘అసాధారణ ట్రైకోమేట్లు’ అంటారు. ఉండాల్సిన మూడు పిగ్మెంట్సులో ఏ రెండు ఉన్నా కొందరు తెలుపు రంగును చూడగలరు. వీరిని ‘డైక్రోమేట్లు’ అంటారు.
ఇందులో ఎరుపు పిగ్మెంటు లేనివారిని ‘ప్రోటోనోపులు’ అంటారు. వీరు ఎరుపురంగు గుర్తించలేరు. ఆకుపచ్చ పిగ్మెంట్ లేనివారిని ‘డ్యుటిరోనోపులు’ అంటారు. వీరు ఆకుపచ్చ రంగు గుర్తించలేరు. నీలము పిగ్మెంటు లేని ‘ట్రెటనోపులు’ నీలం రంగును గుర్తించలేరు. అరుదుగా చాలా తక్కువమందిలో మాత్రమే ఏదో ఒక పిగ్మెంట్ మాత్రమే ఉంటుంది. వారిని ‘మోనోక్రోమేట్లు’ అంటారు. ఇటువంటివారే సంపూర్ణ వర్ణాంధులు. వీరు కేవలం తెలుపు, బూడిద రంగులు మాత్రమే చూడగల్గుతారు.
ఈ వర్ణాంధులలోని కళ్లల్లో కోన్స్ పూర్తిగా లేకపోవడం, ఉన్నా లోపభూయిష్టంగా ఉండడం జరుగుతుంది. వర్ణాంధత్వమువల్ల నిత్య జీవితంలో పనులకు పెద్ద ఇబ్బంది ఉండదు. కాని నగరాలు, పట్టణాలలో సిగ్నెల్ లైట్స్ సరిగా గుర్తించలేక ప్రమాదాలకు లోనుకావచ్చు. రైలు, ఇతర వాహనాలు నడిపేవారు, రక్షక దళాలలోనివారు ఇటువంటి దోషంవల్ల నష్టాలకు లోనవుతారు. వీరివల్ల వారికేగాక ఇతరులకు కూడా ప్రమాదాలు వస్తాయి.
డ్యుటిరోనోపులలో ఒక విచిత్ర లక్షణం ఇటీవల శాస్తవ్రేత్తలు గుర్తించారు. వీరు ఆకుపచ్చ రంగును కొంతవరకు గుర్తించగల్గుతున్నారు. ఇదెలా సాధ్యమో ఇంతవరకు శాస్తవ్రేత్తలు కనిపెట్టలేకపోయారు. ఎరుపు పిగ్మెంట్ ఎక్కువ తరంగ పొడవుగల్గిన ఎరుపురంగును గుర్తించగలదు. ఎరుపు తరువాత ఎక్కువ తరంగ పొడవుగల్గినది ఆకుపచ్చ రంగు. అందుకే ఈ ఎరుపు పిగ్మెంట్ ఆకుపచ్చ రంగును కొంతవరకు గుర్తుపట్టడంలో సహకరిస్తుందని ఇప్పుడు కనుగొన్నారు.
మనిషి ప్రతి కణంలోను 46క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఇందులో 22 జతలను ‘ఆటోసోమ్’లని మిగిలిన ఒక్క జతను సెక్స్‌క్రోమోజోమ్ అంటారు.
సెక్స్‌క్రోమోజోమ్‌లు
సెక్స్‌క్రోమోజోమ్‌లలో ఎక్స్ మరియు వై క్రోమోజోమ్‌లు ఉంటాయి. స్ర్తిలలో సెక్స్ క్రోమోజోమ్‌లు రెండూ ఎక్స్ తరగతికి చెందినవే ఉంటాయి. మగవారిలో ఒకటి ఎక్స్ మరియొకటి వై ఉంటాయి.
తల్లిదండ్రుల నుండి గర్భస్థశిశువుకు చెరొక ఎక్స్ క్రోమోజోమ్ సంక్రమిస్తే పుట్టే బిడ్డ ఆడశిశువు అవుతుంది. తండ్రినుండి వై-క్రోమోజోమ్, తల్లినుండి ఎక్స్-క్రోమోజోమ్ సంక్రమిస్తే మగబిడ్డ పుడుతుంది.
కలర్ బ్లయిండ్‌నెస్ అనేది ఆటోజోమ్‌ల ద్వారా సంక్రమిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరినుండి వర్ణాంధత్వం ఉండే ఆటోజోమ్‌లు బిడ్డకు సంక్రమించినప్పుడే బిడ్డకు సంపూర్ణ వర్ణాంధత్వం వస్తుంది. ఒక్కరినుండే సంక్రమిస్తేఈ లోపం బహిర్గతం కాదు. అందుకే ఈ కలర్ బ్లయిండ్‌నెస్ అరుదుగానే వస్తుంది.
ఎక్స్-క్రోమోజోమ్ ఈ లోపాన్ని రవాణా చేస్తుంది. ఆడవారిలో రెండు ఎక్స్-క్రోమోజోమ్‌లు వుండడంవల్ల ఒకదాని లోపాన్ని రెండవది బహిర్గతం కాకుండా చేస్తుంది. మగవారిలోని ఎక్స్-క్రోమోజమ్ లోపాన్ని సరిదిద్దగల క్రోమోజోమ్ లేదు. అందుకే మగవారిలో ఈ కలర్ బ్లయిండ్‌నెస్ అధికంగా కన్పిస్తుంది. స్ర్తిలలో సాపేక్షంగా చాలా తక్కువగా ఉంటుంది.
మగవారిలో కలర్ బ్లయిండ్‌నెస్ వచ్చిందంటే అది తల్లినుండి సంక్రమించినదే అవుతుంది. ఎందుకంటే తల్లి ఎక్స్-క్రోమోజోమ్, తండ్రి వై-క్రోమోజోమ్ అతడికి వచ్చాయి. ఆడవారిలో ఈ కలర్ బ్లయిండ్‌నెస్ తల్లిదండ్రులు ఇరువురినుండి సంక్రమిస్తుంది. మేనరికాలు చేసుకున్న వారిలో ఇటువంటి ఇబ్బందులు వారి పిల్లల్లో కన్పించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- =========================================
Verry Nice Article
ReplyDelete