Saturday, October 29, 2011

యవ్వనంలోనే పక్షవాతం , paralysis at an early age


  • -
ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --యవ్వనంలోనే పక్షవాతం , paralysis at an early age-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పక్షవాతం అంటే ఇప్పటివరకు వృద్ధుల సమస్యగానే భావిస్తున్నాం. కానీ ఇప్పుడిది యవ్వనంలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. మనదేశంలో పక్షవాతానికి గురవుతున్న ప్రతి నలుగురిలో ఒకరు 40 ఏళ్లలోపు వారే ఉంటుండటం వైద్యులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విద్యార్థులు, గర్భ సంబంధ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలల్లో ఎంతోమంది ప్రస్తుతం పక్షవాతం బారిన పడుతున్నారు. భారత్‌లో మెదడు సంబంధ వ్యాధులపై ఎయిమ్స్‌ వైద్యులు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నెలకు సుమారు 250-300 మంది పక్షవాతం బాధితులు కొత్తగా వస్తుంటే.. వారిలో 70-75 మంది యువకులే కావటం విశేషం. వీరిలో స్కూలు, కాలేజీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. ఇందుకు పొగ, మద్యపానం అలవాట్లు విపరీతంగా పెరిగిపోతుండటమే కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పొగ, మద్యం మూలంగా రక్తనాళాల గోడలు మందం కావటం.. శరీరంలో కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయులు అస్తవ్యస్తం అవుతాయి. విద్యార్థుల్లో పక్షవాతానికి ఇదొక కారణమవుతోందని వైద్యులు వివరిస్తున్నారు. నిజానికి మనదేశంలో చాలా కుటుంబాల్లో మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ గలవారు ముందునుంచే ఉంటున్నారు. దీనికి తోడు కొత్త తరం పాశ్చాత్య జీవనశైలిని అనుకరిస్తూ.. జంక్‌ఫుడ్‌, మద్యపానం, మాదకద్రవ్యాలకు అలవడుతున్నారు. దీంతో పక్షవాతంతో పాటు ఇతర మెదడు సంబంధ జబ్బుల బారిన పడుతున్నారు. యువతుల్లో గర్భ నిరోధక మాత్రల వినియోగం పెరుగుతుండటమూ దీనికి కారణమవుతోంది.

కాన్పు సమయంలో అధిక రక్తస్రావం, ఇన్‌ఫెక్షన్ల వంటి గర్భ సంబంధ సమస్యలు.. బిడ్డ పుట్టిన కొద్దిసేపటి వరకు తల్లికి నీళ్లు తాగించకపోవటం వంటి వాటి వల్లా ఎంతోమంది స్త్రీలు పక్షవాతానికి గురవుతున్నారు. చాలామందికి పక్షవాతం లక్షణాలు తెలియకపోవటం వల్ల ఆసుపత్రికి వచ్చేసరికే సమస్య ముదిరిపోతోంది కూడా. అకస్మాత్తుగా, తీవ్రమైన తలనొప్పి, చూపు కోల్పోవటం, చెప్పటానికి అలవికాని మగత వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మంచి అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి సంబంధ జబ్బుల పట్ల అవగాహన పెంచుకోవటం వంటి వాటి ద్వారా ముందే ముంచుకొస్తున్న ఈ పక్షవాతం సమస్యను అడ్డుకోవచ్చనీ వివరిస్తున్నారు.

అప్రమత్త లక్షణాలు
* అకారణంగా హఠాత్తుగా, తీవ్రమైన తలనొప్పి
* అకస్మాత్తుగా చూపు తగ్గటం లేదా కోల్పోవటం (ముఖ్యంగా ఒక కన్నులో)
* మాటల్లో తడబాటు
* చెప్పటానికి వీల్లేని మగత, తూలటం, హఠాత్తుగా కింద పడిపోవటం
* శరీరంలో ఒకవైపు కాళ్లూ చేతులు, ముఖంలో బలహీనత లేదా మొద్దుబారటం

అడ్డంకులతోనే ఎక్కువ--
మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు పక్షవాతం వస్తుంది. ఇందుకు మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం కానీ.. మెదడులో, చుట్టుపక్కల రక్తనాళాలు దెబ్బతిని చిట్లి పోవటం వల్ల రక్తస్రావం కావటం కానీ కారణం కావొచ్చు. నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల 80-85 శాతం మందికి పక్షవాతం వస్తుంటే.. రక్తనాళాలు దెబ్బతిని రక్తస్రావం అవటం వల్ల సుమారు 15 శాతం మంది దీని బారిన పడుతున్నారు.
  • ==========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.