ఆక్సిజన్ దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద జీవులందరికీ అత్యవసరం. దీని సంకేత అక్షరం "O", మరియు ఫార్ములా "O2". గాలిలో నత్రజని తర్వాత అత్యధికంగా లభించే వాయువు. వృక్షాలు, జంతువులు శ్వాసించడానికి ఆక్సిజన్ ఎంతో అవసరం. ఇది దహన శీల వాయువు కాదు. ఇది దహన సహకారి. కాబట్టి ఇంధనాలు మండడానికి ఆక్సిజన్ అవసరం. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 01 ఆగష్టు 1774 తేదిన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్దతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. రసాయనశాల పద్ధతిలో పొటాషియం క్లోరేట్ ను వేడి చేసినపుడు అది వియోగం చెంది ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది .
శరీరంలోని అన్ని కణాలకు ‘ఆక్సిజన్’ అత్యవసరం అన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు నిముషాలపాటు ఆక్సిజన్ కణజాలాలకు అందకపోతే అవి నశించి పోతాయి. సాధారణంగా మూడు నిమిషాల తర్వాత చనిపోతాడు. కాని చిన్న మెదడు వెనుక నున్న ‘మెడుల్లా అబ్లాంగేటా’ ఏడు నిముషాలపాటు నశించదు. అందుకే ‘బ్రెయిన్ డెడ్’ అయినా మనిషి కొంతసేపు బతికే వుంటాడు.
* ధ్యానం చేసే యోగాలు ఊపిరి బిగపట్టి చాలాసేపు వుంటారు. ‘అనాపానసతియోగ’ అనే యోగంలో గంటల తరబడి ఆక్సిజన్ లేకుండా ఉంటారని గ్రంథాలలో రచించి ఉంది.
* మన శరీరంలో కూడా ఒక్కోసారి ‘ఆమ్లజని’ తగ్గిపోతూ ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతుంది. చిరాకు, తలనొప్పి, నిస్సత్తువ వస్తాయి. ఉదయాన్నే వాకింగ్ శరీరంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. అందుకే పార్కుల్లోను, అడవుల్లోను వాకింగ్ చేస్తే ఎక్కువ ఆక్సిజన్ మనకు దొరికి ఆహ్లాదకరంగా వుంటాం!
* ఎనిమియా’లో రక్తహీనత ఉంటుంది. ఆక్సిజెన్‌ను మోసుకెళ్లే ఐరన్ శాతం పడిపోవడం వల్ల ఆయాసం కూడా వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇచ్చినా లాభం లేదు.
*పసిగుడ్డు తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన కొద్ది క్షణాలు ఆక్సిజన్ అందకపోతే మెదడు దెబ్బ తింటుంది.. నరాలు దెబ్బ తింటాయి. స్పాస్టిక్ లక్షణాలు నిలదొక్కుకుంటాయి. మనం ఏనాడూ ఆలోచించకపోయినా నిముషానికి 54 సార్లుగా - సంవత్సరాలూ, దశాబ్దాలూ, కొండొకచో శతాబ్దాలూ గాలి మనకి ఆక్సిజన్ ని పంచుతోంది. మన ప్రాణాల్ని నిలబెట్టుతోంది.
* ఉరి, పాయిజన్ తీసుకోవడం, కొన్నిరకాల రక్త వ్యాధులు, గుండె సంబంధ వ్యాధుల్లో ఆక్సిజన్ ఇవ్వడంవల్ల రోగికి మంచే జరుగుతుంది. గాంగ్రీన్, టిటానస్ అనే కండరాల చెడు తగ్గిపోవడానికి ఆక్సిజెన్ యిస్తారు.
*జనరల్ అనస్తీషియా సమయం లోఆక్సిజన్ మాస్క్ ద్వారా అందిస్తారు .
*బిడ్డకు ఊపిరి అందకపోతే... కాన్పు ముందర, కాన్పు సమయంలో, కాన్పు తర్వాత అవసరమైన ఆక్సిజన్ వాయువు శిశువుకి అందకపోవడం వల్ల, బిడ్డ పుట్టిన తర్వాత ఊపిరి తీసుకోలేకపోవడం, ఏడవకుండా ఉండిపోవడం వంటివి జరుగుతాయి. దీన్నే ‘బర్త్ ఏస్‌ఫిక్సియా’ అంటారు. శిశువుకు ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోతే కీలకమైన అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె, పేగులు పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనిని ఎంత తొందరగా గుర్తించి, నార్మల్ డెలివరీ అయితే ఫోర్‌సెప్ డెలివరీ, వ్యాక్యూమ్ పద్ధతిలో... అలా వీలుకాకపోతే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బయటకు తీసి చికిత్సను అందించడం వల్ల బిడ్డకు ఫిట్స్, వికాసంలో లోపాలు, మానసిక వైకల్యాలు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి అనేక సమస్యలు రాకుండా నివారించవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... నూటికి నూరు పాళ్లు పై పరిస్థితులను నివారించలేని పరిస్థితి రావచ్చు. పైగా అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు కూడా గ్రహించడం సాధ్యం కాకపోవచ్చు.
* శృంగారంలో ఆక్సిజెన్ ఎక్కువ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదిలిపెట్టటం వల్ల ఆరోగ్యంగా..ఉల్లాసంగా ఉంటారు.
నీళ్ళల్లో ఉండే చేపలు గాలిని ఎలా పీల్చుకుంటాయి? అనుకుంటున్నారా...! ఈ భూ ప్రపంచంపై ఉన్న ప్రాణులలాగే చేపలు కూడా గాలి పీల్చుకుంటాయి. అన్ని జీవరాశులకు ఆక్సిజన్ అవసరమైనట్లే వీటికి కూడా అవసరమే...!అయితే, గాలి పీల్చుకునేందుకు ముక్కుకు బదులుగా చేపలకు రెండువైపులా మొప్పలు ఉంటాయి. ఆ మొప్పలపైన చిన్న చిన్న రక్తనాళాలు అనేకం ఉంటాయి. ప్రాణవాయువైన ఆక్సిజన్ నీటిలో కూడా కరుగుతుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఆక్సిజన్ కరిగిన నీటిని చేప నోటినుంచి తీసుకుని మొప్పల ద్వారా బయటకు పంపేస్తుంది. అప్పుడు నీటిలో కరిగిన ఆక్సిజన్ మొప్పలలో ఉండే రక్తనాళాల ద్వారా శరీరమంతటికీ చేరుకుంటుంది. కాబట్టే... చేపల మొప్పలు ఎప్పుడూ గాలి పీలుస్తున్నట్లుగా అటూ, ఇటూ కదలాడుతుంటాయి. వీటిని గనుక నీటి నుండి తీసి బైట వేశామంటే... ఊపిరాడక చనిపోతాయి.
ఐఎల్‌డీ(ILD) లో ఆక్సిజన్
పీల్చే గాలికి అనుగుణంగా సాగి దేహానికి ఆక్సిజన్ అందేలా చేయడం ఊపిరితిత్తుల లక్షణం. సాగడానికి వీలుగా ఉండే ఇవి... ఆ గుణం కోల్పోతే? ఊపిరి అందదు. ఫలితంగా గుండెపై, మెదడుపై దుష్పరిణామాలుంటాయి. ఊపిరితిత్తుల సహజగుణమైన సాగే తత్వాన్ని కోల్పోవడం వల్ల ఇలాంటి పరిణామాలు కలగజేసే జబ్బే ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డీ). దీన్ని మందులతోనే పూర్తిగా తగ్గించలేకపోయినా స్టెరాయిడ్స్ వంటి మందులతో రోగి పరిస్థితిని మెరుగుపరచి, ఆయుః ప్రమాణాన్ని చాలావరకు పెంచవచ్చు. దాంతో పాటు ఇటీవల ప్రాచుర్యం పొందిన ఆక్సిజన్ థెరపీ తీసుకుంటే ఐఎల్‌డీ రోగులు సాధారణమైన జీవితాన్ని గడపవచ్చు. చికిత్స లేదని భావించే ఈ ఐఎల్‌డీపై అవగాహన, ఆక్సిజన్ థెరపీ వంటి ఆధునిక చికిత్స ప్రక్రియలపై అవగాహన కోసం... ఈ కథనం.
ఊపిరితిత్తులకు సాధారణంగా ఉండే సాగే గుణం కోల్పోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇలా ఊపిరితిత్తులు తమ సాగే గుణాన్ని కోల్పోయే కండిషన్‌ను ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్ (ఐఎల్‌డి) అంటారు. దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా రెండు రకాలు.
1. పుట్టుకతో వచ్చే ఐఎల్‌డి : దీన్ని ఇడియోపథిక్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి కారణం ఏమీ ఉండదు. వంశపారంపర్యంగా వస్తుందన్న విషయమే రూఢీ అయ్యింది. ఈ జబ్బు ఉన్నప్పుడు యుక్తవయసులోనైనా ఆయాసం, దగ్గు వస్తుంటాయి. సాధారణంగా వచ్చే జబ్బే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఎక్కువ. దాంతో జబ్బు తీవ్రత పెరిగి గుండె మీద దుష్ర్పభావాలు కలిగితే... అప్పుడు జబ్బు బయటపడే అవకాశాలు ఎక్కువ.
2. సెకండరీ ఐఎల్‌డీ : ఇది ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే... తమ రోగనిరోధక శక్తి తమపైనే దుష్ర్పభావాలు చూపే జబ్బులైన రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్, సోరియాసిస్ వంటి చర్మ సంబంధమైన కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో ఊపిరితిత్తులకు ఉండే సాగే గుణం తగ్గడం వల్ల ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్‌లో ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కోల్పోయి గట్టిపడటం వల్ల సెకండరీ ఐఎల్‌డీ వస్తుంది.
లక్షణాలు : సాధారణంగా మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినా అన్ని వయసుల వారికీ రావచ్చు. లక్షణాలలో మొదట కనిపించేది దగ్గు. సాధారణంగా పొడి దగ్గు ఉంటుంది. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా దగ్గు, ఆయాసం రావడం జరుగుతుంది. రాత్రివేళలో కంటే పగలు పనిచేస్తున్న సమయంలో ఆయాసం ఎక్కువగా ఉండటం ఐఎల్‌డీలో ప్రత్యేకత.
ఈ ప్రధాన లక్షణంతో పాటు కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి ప్రమాదకరమైన కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగి మెదడుపై దుష్ర్పభావాలు పడినప్పుడు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. అంటే... మత్తుగా ఉండటం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, గురక పెరగడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ ఈ లక్షణాలు కనిపించినప్పటికీ చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు.
నిర్ధారణ పరీక్షలు :
ఐఎల్‌డీ జబ్బును ఎక్స్-రే పరీక్షతో గుర్తిస్తారు. ఎక్స్-రేలో రెటిక్యులార్ నాడ్యుల్స్ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపిస్తే అప్పుడు హై రెజల్యూషన్ సీటీ ఆఫ్ చెస్ట్ అనే పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్ల్కీరోడెర్మా, లూపస్ డిసీజ్, సొరియాసిస్ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నప్పుడు ప్రతి ఆర్నెల్లకోమారు ఎక్స్-రే పరీక్ష చేస్తే ఈ జబ్బును కనిపెట్టే అవకాశం ఉంది.
జబ్బు నిర్ధారణ అయిన తర్వాత దాని తీవ్రతను తెలుసుకోడానికి టూ-డీ ఎకో, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు చేస్తారు. (ఏబీజీ పరీక్ష వల్ల రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు తెలుసుకోవచ్చు).
అలాగే ఇమ్యూన్ జబ్బుల గురించి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఎల్‌ఈ సెల్స్, ఏఎన్‌ఏ, యాంటీ డీఎస్ డీఎన్‌ఏ, సీఆర్‌పీ వంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
చికిత్స : ఐఎల్‌డీని పూర్తిగా నయం చేసే మందులు లేకపోయినా, ఊపిరితిత్తుల డాక్టర్ పర్యవేక్షణలో సరైన పద్ధతిలో సక్రమంగా చికిత్స తీసుకోవడం వల్ల రోగుల జీవితకాలాన్ని చాలావరకు పెంచవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్ వాడతారు. అయితే స్టెరాయిడ్స్ అనగానే ప్రజల్లో ఉండే అపోహలతో రోగికి సరైన ట్రీట్‌మెంట్ తీసుకోకపోవడం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా జబ్బు పెరిగే అవకాశం ఎక్కువ. దీనికి స్టెరాయిడ్స్‌తో పాటు ఇమ్యూనో రెస్పాన్స్‌ను తగ్గించే మందులు అంటే... మెథోట్రెక్సేట్, కాల్చిసిన్, సైక్లోఫాస్ఫమైడ్ వంటివి వాడాలి. అయితే జబ్బు తీవ్రతతో పాటు అవి శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు చూపకుండా ఉండేలా వీటి మోతాదును నిపుణులు నిర్ణయిస్తారు. స్టెరాయిడ్స్ తాలూకు దుష్ర్పభావాలను నివారించేందుకు క్యాల్షియమ్ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్ కూడా ఉపయోగిస్తారు. దాంతోపాటు బలవర్థకమైన ఆహారం సూచిస్తారు. గతంలోలా కాకుండా ఇప్పుడు దుష్ర్పభావాలు చాలా తక్కువగా ఉండే స్టెరాయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే ఇలాంటి జబ్బులు ఉన్నవారు అపోహలను తొలగించుకుని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో చికిత్స తీసుకుంటే ఆయుప్రమాణాన్ని సాధారణ జీవితకాలం పొడిగించుకోవచ్చు.
ఆక్సిజన్ థెరపీ
ఈ జబ్బుకు చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌ను కూడా ఒక మందులా ఉపయోగిస్తున్నారు. గత పదేళ్లలో ఈ ఆక్సిజన్ చికిత్స మంచి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆక్సిజెన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఐఎల్‌డీ ఉన్నట్లు నిర్ధారణ కాగానే ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తుల మీద శ్రమ తగ్గించడంతో పాటు, మందులకు ఊపిరితిత్తులు సక్రమంగా రెస్పాండ్ అయ్యేలా చేయడం, రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెంచడం ఆక్సిజెన్ థెరపీ ప్రధాన ఉద్దేశం.
ఆక్సిజెన్ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు:
1. సిలెండర్స్ ద్వారా : గతంలోలా సిలెండర్స్ ద్వారా ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి పట్టే వ్యవధి వల్ల ఈ ప్రక్రియ క్రమంగా ఆదరణ కోల్పోతోంది.
2. ఆక్సిజన్ కాన్సట్రేటిక్ మెషిన్ ద్వారా: ఈ మెషిన్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడం పేషెంట్స్‌కూ సౌలభ్యంగా ఉంటుంది. వాతావరణంలో ఉండే 21 శాతం ఆక్సిజన్‌నే ఉపయోగించుకుని రోగికి అవసరమైన నిర్ణీత మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. ఇందులో మళ్లీ నింపాలనే అసౌకర్యం ఉండదు. పైగా ఆక్సిజన్ తీసుకుంటున్నామనే మానసికమైన ఫీలింగ్ ఉండదు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీని ధర రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుంది.
ఇటీవలి పరిశోధన ఫలితాలను బట్టి ఆక్సిజన్ థెరపీ తీసుకునే పేషెంట్స్ ఆయుప్రమాణం కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఆక్సిజన్ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే... ఆక్సిజన్ తీసుకునే ప్రక్రియలో భాగంగా అధిక మోతాదుల్లో దీన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను తీసుకోడాన్ని నియంత్రించే మెదడులోని కేంద్రం ఒక్కోసారి తన సహజగుణాన్ని (స్టిమ్యులేషన్) కోల్పోవచ్చు. ఫలితంగా రక్తంలో కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆక్సిజన్ థెరపీని తీసుకునే రోగులు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే దీన్ని తీసుకోవాలి.
- ====================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.