ఎందుకో తెలీదుగానీ.. ఈ మధ్యే కాళ్లు వాస్తున్నాయి. నొక్కితే గుంటలు పడుతున్నాయి. సాయంత్రానికల్లా కాళ్లు బండల్లా తయారై ఏదో తెలీని అసౌకర్యం. భయంతో మనసూ బరువెక్కుతోంది. ఏ పని చేస్తున్నా మనసు మాత్రం కాళ్ల మీదే ఉంటోంది. ఎందుకిలా..? ఈ వాపులు దేనికి సంకేతాలు..? కాళ్లవాపు తరచుగా కనిపించేదే అయినా అదంత తేలికగా తీసుకోవటానికి వీల్లేని సమస్య! ఎందుకంటే సర్వసాధారణమైన కారణాల నుంచి తీవ్రమైన వ్యాధుల వరకూ ఎన్నో సందర్భాల్లో కాళ్లవాపు కనిపిస్తుంది. చాలా వ్యాధులను పట్టుకునేందుకు అదో కీలకమైన లక్షణం! అందుకే కాళ్లు వాచినప్పుడు కారణమేమిటో తెలుసుకోవటం.. చికిత్స తీసుకోవటం చాలా అవసరం.
రెండు కాళ్లూ వాచటమన్నది చాలా వ్యాధుల్లో కనిపించే లక్షణం. ఇలాంటి సందర్భాల్లో దీనికి కారణమవుతున్న సమస్య ఏమిటన్నది గుర్తించటమే కీలకం.
రక్తహీనత: మనదేశంలో ఎక్కువ మందిలో కాళ్లవాపు రావటానికి ఈ రక్తహీనతే ముఖ్య కారణం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం గణనీయంగా పడిపోవటం వల్ల రక్తంలో, ఒంట్లో నీటి శాతం పెరిగిపోయి కాళ్లు వాస్తుంటాయి. కాబట్టి కాళ్ల వాపు వచ్చినప్పుడు రక్తహీనత ఉందేమో చూడటం ముఖ్యం. మన దేశంలో స్త్రీలు, వృద్ధులతో సహా అన్ని వయసుల వారిలోనూ రక్తహీనత ఎక్కువగానే కనిపిస్తుంటుంది. ఇందుకు పోషకాహార లోపం, బీ12 విటమిన్, ఇనుము లోపించటమూ, పొట్టలో పురుగులుండటం వంటివి దోహదం చేస్తున్నాయి. ఇనుము లోపించినపుడు ఒంట్లో నీరు పెరిగి గోళ్లు పలుచబడి చెంచా ఆకారంలోకి మారటం, వెంట్రుకలు, చర్మం పాలిపోవటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇక బీ12 లోపిస్తే పాలిపోవటంతో పాటు కాళ్లు, చేతులు, నాలుక నల్లబడతాయి. రక్తపరీక్ష ఆధారంగా రక్తహీనత గుర్తించి.. ఈ లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తే వీరికి కాళ్ల వాపులు తగ్గిపోతాయి.
మందులు: రక్తహీనత తర్వాత కాళ్ల వాపులు కనబడటానికి మరో అతి ముఖ్య కారణం రకరకాల సమస్యలకు వాడే మందులు! ముఖ్యంగా నొప్పులు తగ్గటానికి తరచూ వాడుతుండే 'నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఎన్‌ఎస్‌ఏఐడీ)' రకం మందుల వల్ల మన శరీరంలో సోడియం స్థాయి పెరుగుతుంది. దీంతో నీరు ఎక్కువగా లోపలే నిలిచిపోయి కాళ్లవాపు రావచ్చు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల బీపీ మందులు (అమ్లోడిపిన్, నిఫిడపిన్, డిల్టియాజమ్ వంటివి), స్టిరాయిడ్లు, మానసిక చికిత్స కోసం వాడే మందుల వల్ల కూడా కాళ్ల వాపులు రావచ్చు. గర్భ నిరోధక మాత్రలు, ఇతరత్రా హార్మోన్ మాత్రల వల్ల కూడా కాళ్లవాపులు రావచ్చు. ఈ మందులను గుర్తించి వైద్యుల సలహాతో వాటిని మార్చుకుంటే కాళ్ల వాపులు అవే తగ్గిపోతాయి.
కాలేయ వైఫల్యం: మన కాలేయంలో శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు (ప్రోటీన్లు) తయారవుతాయి. కాలేయానికి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఈ ప్రోటీన్ల తయారీ ప్రభావితమవుతుంది. ముఖ్యంగా కాలేయం గట్టిపడే సిరోసిస్ సమస్యలో రక్తంలో ప్రోటీన్లు తక్కువైపోయి, ఒంట్లో నీరు చేరి కాళ్లు వాస్తాయి.
కాళ్ల వాపులతో పాటు కళ్లు పచ్చబడటం, పురుషుల్లో జుట్టు రాలటం, రొమ్ములు పెద్దవవటం వంటి లక్షణాలు కూడా కనబడితే మనం లివర్ సమస్య ఏదైనా ఉందా? అన్నది అనుమానించాలి.
కిడ్నీ వైఫల్యం: మధుమేహం, హైబీపీ, నొప్పినివారిణి మందులు ఎక్కువగా వాడటం వీటన్నింటి వల్లా.. కిడ్నీలు దెబ్బతినొచ్చు. రక్తంలోని నీటిని బయటకు పంపటం కిడ్నీ ప్రధాన విధి కాబట్టి.. కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఒంట్లో నీరు నిలిచిపోయి కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. కొందరిలో 'అక్యూట్ గ్లోమరూలో నెఫ్రైటిస్' రకం కిడ్నీ సమస్యలో ఉన్నట్టుండి ఉదయాన్నే మొహం వాపు ఉంటుంది, క్రమేపీ మధ్యాహ్నానికి కాళ్ల వాపు ఎక్కువ వస్తుంది. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల్లో కేవలం కాళ్లే వాస్తాయి.
మొత్తమ్మీద కాళ్లవాపుతో పాటు ఉదయం లేవగానే ముఖం ఉబ్బి ఉండటం, సాయంత్రానికి ముఖం ఉబ్బు తగ్గి కాళ్ల వాపు పెరగటం, శరీరం పాలిపోయినట్టుగా ఉండటం, ఆకలి తగ్గిపోవటం, నిస్సత్తువ, రుచులు మారటం, కాళ్లల్లో చిరచిర (ఆర్‌ఎల్‌ఎస్-restless leg syndrome), కొందరిలో ఆయాసం.. ఇలాంటి వన్నీ ఉంటే కిడ్నీల్లో సమస్య ఉందేమో అనుమానించాలి.
గుండె జబ్బు: గుండె వైఫల్యం (కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్) ఉన్న వారిలో గుండె సరిగా రక్తాన్ని పంపింగ్ చెయ్యలేదు. దానివల్ల వూపిరితిత్తుల్లోనూ, ఒంట్లోనూ నీరు బాగా చేరిపోతుంది. ఇలాంటప్పుడు కాళ్లు బాగా వాచి ఉబ్బినట్టు కనబడతాయి. కాబట్టి కాళ్లవాపుతో పాటు నడిస్తే ఆయాసం, మెడ దగ్గర నరాలు ఉబ్బి ఉండటం, పడుకుంటే ఆయాసం పెరిగి, కూర్చుంటే తగ్గుతుండటం.. దీనికి తోడు ఇప్పటికే హైబీపీ, మధుమేహం వంటివి కూడా ఉన్నాయంటే అది కచ్చితంగా గుండె జబ్బేమోనని అనుమానించాల్సి ఉంటుంది.
పోషకాహార లోపం: తీవ్రమైన పోషకాహార లోపం వల్ల కూడా రక్తంలో ప్రోటీన్లు, ఆల్బుమిన్ తగ్గి కాళ్ల వాపులు రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటూ ఆహారం సరిగా తీసుకోకపోయినా కూడా కాళ్ల వాపులు రావచ్చు. థైరాయిడ్ సమస్యలున్న వారిలో కూడా కాళ్ల వాపులు రావచ్చు.
ఇంకా ఇంకా..
డీవీటీ(DVT): ఒకటే కాలు వాచినప్పుడు నొక్కితే నొప్పిగా ఉండటం, ఇటీవలే దూరాలు ప్రయాణం చేసి ఉండటం, పిక్కల నొప్పి కూడా ఉండటం... ఇలాంటి సందర్భాల్లో.. కాళ్లలోని సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయేమో (డీవీటీ) చూడటం తక్షణావసరం. ఎందుకంటే ఆ గడ్డ ఒక్కోసారి రక్తప్రవాహంలో కలిసిపోయి ఊపిరితిత్తుల్లోకి చేరి.. 'పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం' అనే తీవ్రమైన సమస్యకు దారితియ్యచ్చు. ముఖ్యంగా ఇటీవల సుదీర్ఘ ప్రయాణాలు చెయ్యటం లేదా రోజంతా మంచాన పడుకుని ఉండటం వంటి చరిత్ర ఏదైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా 'డీవీటీ'ని అనుమానించాలి.
సెల్యులైటిస్: కాలు వాపుతో పాటు ఎర్రబడటం, నొప్పి, జ్వరం, ముట్టుకుంటే వేడిగా ఉండటం.. ఇవన్నీ కాలులో ఇన్ఫెక్షన్ చేరిందని (సెల్యులైటిస్) చెప్పటానికి కీలక లక్షణాలు. మధుమేహ బాధితుల్లో ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే గుర్తు పట్టటం చాలా అవసరం.
వెరికోస్ వీన్స్: కొందరిలో కాళ్లలోని సిరలు బలహీనంగా ఉండి.. అవి కింది నుంచి (చెడు)రక్తాన్ని సరిగా పైకి తీసుకురాలేవు. ఫలితంగా రక్తం కిందే ఎక్కువగా నిలిచిపోతూ కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంది. దీన్నే 'క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ' అంటారు. ఈ రకం సమస్య రోజంతా నిలబడి ఉండే టీచర్లు, పోలీసులు, గార్డుల వంటివారిలో ఎక్కువ. దీన్ని గుర్తించి వెంటనే చికిత్స తీసుకోకపోతే కాళ్ల మీద పుండ్లు పడటం, అవి మానకపోవటం వంటి రకరకాల తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి.
ప్రయాణంతో వాపు
* రాత్రంతా బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తాం. తెల్లవారే సరికి కాళ్లు పొట్లాల్లా వాచి ఉబ్బిపోతాయి. రోజంతా నిలబడి పని చేస్తాం. సాయంత్రానికి కొద్దిగా కాళ్లు వాయచ్చు. గంటల తరబడి విమానంలో ప్రయాణం చేస్తాం. క్యాబిన్‌లో వాయు పీడనం తక్కువ ఉండటం కారణంగా కాళ్లు కొద్దిగా ఉబ్బుతాయి. ఇది సహజం. కొద్ది గంటలు విశ్రాంతి తీసుకుంటే ఈ వాపులు తగ్గిపోతాయి. ఇవేమీ సమస్యలు కావు. వీటి గురించి ఆందోళన అవసరం లేదు.
* కొందరు స్త్రీలకు నెలసరి రావటానికి నాలుగైదు రోజులు ముందు నుంచీ హార్మోన్ల ప్రభావం కారణంగా కాళ్లవాపులు రావచ్చు. వీటిని గురించి ఆందోళన అవసరం లేదు.
గర్భిణుల్లో వాపు
గర్భిణుల్లో నెలలు నిండుతున్న కొద్దీ కాళ్లవాపు రావచ్చు. ముఖ్యంగా 6-9 నెలల మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. గర్భాశయం బాగా పెరిగి, కాళ్ల నుంచి రక్తాన్ని పైకి తెస్తుండే సిరలను నొక్కుతుండటం వల్ల రక్తం ఎక్కువగా కిందే చేరిపోయి.. కాళ్లలో నీరు చేరుతుంది. ఇది సహజమేగానీ వీటిని తప్పనిసరిగా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం మంచిది.
ఒక కాలు వాపు
ఒక కాలు మాత్రమే వాస్తే ముందు- సమస్య ఆ కాలులోనే ఉందేమో ఆలోచించాలి. సాధారణంగా ఆ కాలుకి దెబ్బతగలటం, ఏదైనా గుచ్చుకోవటం, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ చేరి చీముపట్టటం, లేకపోతే ఆ కాలులోని సిరల్లో రక్తం గడ్డకట్టటం (డీవీటీ) వంటి వాటివల్ల ఒకే కాలు వాస్తుంది. అలాగే బోదకాలు (ఫైలేరియాసిస్) కూడా ఒక కాలు వాపుతో ఆరంభం కావచ్చు. కాకపోతే కాలు వాపుతో పాటు చలి, జ్వరం వచ్చిపోతుండటం, గజ్జల్లో బిళ్ల కట్టటం వంటి లక్షణాలూ లక్షణాలూ ఉంటాయి.
అరుదుగా
అరుదే అయినా ఒక్కోసారి నొప్పి లేకుండా ఒకే కాలు వాస్తే పైన ఉండే లింఫు/రక్త నాళాల్లో ఏవైనా అవరోధాలు ఏర్పడి అవి మూసుకుంటున్నాయా? అన్నది చూడాలి. వాచిన కాలు వైపు పొట్టలో క్యాన్సర్ గడ్డల వంటివేమైనా ఏర్పడి, అవి లింఫునాళాలను గానీ, సిరలను గానీ నొక్కటం వల్ల కూడా ఒక్కోసారి రక్త ప్రసరణకు అడ్డు తగిలి కాలు వాపు రావచ్చు.
నొక్కితే గుంట
కాళ్లు వాచినప్పుడు నొక్కితే గుంట పడటం సహజమే. దానర్థం కాళ్లలో నీరు చేరిందని! మన శరీరంలో ఉండాల్సిన నీటి కంటే ఎక్కువగా నీరు చేరితే కాళ్లు ఉబ్బరించినట్టు కనబడతాయి. నిజానికి ఈ స్థితిలో కాళ్లతో పాటు ఒళ్లంతా కూడా కొద్దిగా ఉబ్బరంగా ఉండొచ్చు. కాకపోతే అన్నింటికంటే ముందు కాళ్లవాపు ప్రస్ఫుటంగా కనబడుతుంది. చాలా సమస్యల్లో ఇలా వాపు ఉన్నచోట నొక్కితే గుంట/సొట్ట పడుతుంది కాబట్టి ఈ వాపునకు కారణాలేమిటన్నది తరచి చూడటం అవసరం.
అది తాత్కాలికం
* చాలామంది కాళ్లు వాపు వస్తే- 'ఏం ఫర్వాలేదు' అంటూ మూత్రం ఎక్కువగా అయ్యేలా చేసే 'డైయూరిటిక్' తరహా (లాసిక్స్, లాసిలెక్టోన్ వంటివి) మందులు సూచిస్తుంటారు. కానీ అది సరికాదు. కారణం ఏదైనా ఆ మందులు వాడితే తాత్కాలికంగా వాపు తగ్గొచ్చు. డీవీటీ, వారికోస్ వీన్స్, ఫైలేరియాల్లో ఆ మాత్రం కూడా తగ్గకపోవచ్చు. ఈ మందుల కంటే కూడా అసలు సమస్య ఎందుకు వచ్చిందో చూడటం ముఖ్యం.
బీపీ - కాళ్లవాపులు
బీపీ ఉన్న వారికి కాళ్లవాపులు వచ్చాయంటే- వారికి కిడ్నీ వైఫల్యం వచ్చి, దాని కారణంగా కాళ్ల వాపులు రావచ్చు. అలాగే ఏ కారణంగా కిడ్నీ వైఫల్యం తలెత్తినా బీపీ పెరగొచ్చు. అలాగే బీపీ తగ్గించేందుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా కాళ్లవాపులు రావచ్చు. కాబట్టి వీటన్నింటి మధ్యా ఉన్న సంబంధాన్ని గుర్తించి.. బీపీ ఉన్నవారు, బీపీకి మందులు వాడేవారు.. ఏడాదికి ఒకసారైనా పరీక్షలు చేయించుకోవటం అవసరం.
పరీక్షలు :
కాళ్లవాపులు వచ్చినప్పుడు కొన్ని కనీస పరీక్షలు అవసరం.
ముందుగా మూత్రంలో ఆల్బుమిన్/ప్రోటీన్లు పోతున్నాయా? రక్తహీనత ఉందా? సీరం ప్రోటీన్ల స్థాయి ఎలా ఉంది? యూరియా క్రియాటినైన్ మోతాదులు ఎలా ఉన్నాయన్నది చూస్తారు. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే థైరాయిడ్ పరీక్షలు చేస్తారు. అవీ నార్మల్‌గా ఉంటే గుండె పనితీరు తెలుసుకునేందుకు ఈసీజీ, టూడీ ఎకో, ఛాతీ ఎక్స్-రే, పొత్తికడుపులో ఏవైనా రక్తనాళాలను నొక్కుతున్నాయేమో చూసేందుకు, లివర్ పరిస్థితి తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగు.. వీటితో పాటు కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలేమైనా కట్టాయా? అన్నది తెలుసుకునేందుకు కాళ్లకు డాప్లర్ పరీక్ష.. అవసరమవుతాయి.
కాళ్లు వాస్తున్నప్పుడు ఎవరైనా..చేయవలసిన పనులు :
* ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం మంచిది.
* రోజులో ఎక్కువ సమయం నిలబడి ఉండటం తగ్గించుకోవాలి.
* కాళ్ల కింద ఎత్తు పెట్టుకోవటం మంచిది.
* ప్రయాణాలు ఎక్కువ చేసేవారు.. తరచూ లేచి నాలుగు అడుగులు వేయటం అవసరం. గంటల తరబడి విమానాల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని వ్యాయామాలు చెబుతుంటారు, వాటిని చెయ్యటం అవసరం.
* రోజూ నడక చాలా మంచిది. దానివల్ల పిక్క కండరాలు బలపడి.. అవి రక్తనాళాలకు సహకరిస్తూ రక్తం చక్కగా పైకి వెళ్లేలా చూస్తాయి, దీంతో వాపు ముప్పు తగ్గుతుంది.
* సాధారణంగా రోజంతా కూర్చుని ఉంటే సాయంత్రానికి కొంత కాళ్లు ఉబ్బరించవచ్చు. ఇది సహజం. ఉదయం లేస్తూ కూడా వాపు ఉంటే దాన్ని వ్యాధిగా అనుమానించి వైద్యులను సంప్రదించటం అవసరం.
* వైద్యులు కాళ్లను గట్టిగా పట్టి ఉంచే ఎలాస్టిక్ స్టాకింగ్స్ సూచిస్తే వాటిని నిద్ర లేస్తూనే వేసుకోవాలి.
డా|| ఎం.వి.రావు-- కన్సల్టెంట్ ఫిజీషియన్-- యశోదా హాస్పిటల్- హైదరాబాద్.
- =================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.