వ్యాధుల బారిన పడకుండా మనలోని రోగనిరోధకశక్తి నిరంతరం కాపాడుతుంటుందని తెలిసిందే. అయితే కొన్నిసార్లు ఇది పొరపాటున మన శరీరం మీదే దాడి చేస్తుంది. దీంతో కణజాలం దెబ్బతినటంతో పాటు క్షీణత వ్యాధులుగా పిలిచే ఆటో ఇమ్యూన్ జబ్బులకూ రావటానికి దోహదం చేస్తుంది. మల్టిపుల్ స్ల్కెరోసిస్, కీళ్లవాతం, క్రాన్స్ వంటివి అలాంటి జబ్బులే. ఇవి చాలావరకు జన్యు కారణంగా వచ్చేవే కానీ ఇన్‌ఫెక్షన్లు, మందుల వంటి పలు అంశాలు వీటిని ప్రేరేపిస్తుంటాయి. ఈ ఆటో ఇమ్యూనిటీని ఆహారం ఏమైనా ప్రభావితం చేస్తుందా? అన్న దానిపైనా చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనిపై ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఆలస్యం చేయటం లేదా వెనక్కి మళ్లించటం, నివారించటంలో ఆహారం పాత్ర కూడా ఉంటున్నట్టు బయటపడుతోంది. ముఖ్యంగా ఇందుకు విటమిన్ డి, విటమిన్ ఏ, సెలీనియం, జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రొ బయోటిక్స్, గ్లుటమైన్, ఫ్లావనోల్స్ వంటివి బాగా ఉపయోగపడుతున్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, క్యాల్షియం సమతుల్యతకు విటమిన్ డి దోహదం చేస్తుంది. మల్టిపుల్ స్ల్కెరోసిస్, కీళ్లవాతం జబ్బులకూ విటమిన్ డి లోపానికి సంబంధం ఉంటున్నట్టు తేలింది. పేగుల్లో వాపు, ఆటో ఇమ్యూనిటీని విటమిన్ ఏ, సెలీనియం నిరోధిస్తాయి. చేపలు, అవిసెగింజల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల నివారణకు మాత్రమే కాదు.. ఆటో ఇమ్యూనిటీ ముప్పును కూడా తగ్గిస్తాయి. అందువల్ల ముందునుంచే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జబ్బులు మొదలుకాగానే ఆహారంపై శ్రద్ధ పెట్టినా మంచిదే. సమతులాహారం తీసుకోవటం ద్వారా వ్యాధుల నుంచి కాపాడుకుంటూ మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
- ==========================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.