Tuesday, November 22, 2011

లైంగిక అసంతృప్తి అవగాహన ,అంగస్తంభన సమస్యలు , Awareness in Sexual disappointment


  • image : courtesy with Eenadu newspaper


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --లైంగిక అసంతృప్తి అవగాహన , Awareness in Sexual disappointment- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఆమెకు అదో సందిగ్ధం! పెద్ద ఇబ్బంది!! ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో.. మనసు విప్పి మాట్లాడితే తను ఎలా స్పందిస్తారో.. ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. నిజానికి సమస్య అతనిది! కానీ ఫలితం అనుభవించేది ఇద్దరూ. అందుకే ఈ సమస్యను కేవలం 'అతని సమస్య'గానే చూడటానికి లేదు. పరిష్కారంలో అరమరికలు లేని తన చొరవ, భాగస్వామ్యం, ప్రేరణ, ప్రోత్సాహం కీలకం! అందుకే పురుషుడి పటుత్వ లోపం, ఈ విషయంలో భాగస్వాములు ఇరువురి భావపరంపరను స్త్రీల కోణం నుంచి కూడా చూడటం అవసరమని విశ్లేషిస్తున్నారు ప్రముఖ ఆండ్రాలజిస్ట్‌ డా|. సుధాకర్‌ కృష్ణమూర్తి. అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఏర్పాటు చేసిన 'లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తి, పరిశోధన కమిటీ'కి ఆసియా దేశాల ప్రతినిధిగా నియమితులైన ఆయన అందిస్తున్న వ్యాసం ఈ వారం ప్రత్యేకం.

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఏకాంతం ఆ రోజు దొరికింది. ఆయనా, నేనూ.. ఆ సాయంత్రం గురించి చాలా కలలు కన్నాం. నేనెంతగాప్రోత్సాహం, ప్రేరణనిచ్చినా ఎందుకో స్పందన లేదు. ప్రయత్నించినకొద్దీ తను మరింత అసహనానికి, అశక్తతకు లోనయ్యాడేగానీ ఫలితం లేకపోయింది. చివరికి 'ఈ మధ్యేంటో ఇలా అవుతోంది' అంటూ తను చాలా ముభావంగా అయిపోయాడు. తన వల్ల నాకూ తృప్తి దక్కటం లేదని అపరాధ భావనలోకి జారిపోయాడు. నాకూ ఏదో కొరతగా, వెలితిగా అనిపించటం ఆరంభమైంది. నిజం చెప్పొద్దూ.. కొద్దిగా కోపం కూడా వచ్చింది. ఇదే మొదటిసారి కూడా కాదు. అంతకు ముందూ కొన్నిసార్లు అంతా సజావుగా సాగుతున్నట్టే ఉండేంది, అంతలోనే పట్టుజారిపోయేది. ఏమైనా తనని బాధపెట్టటం ఎందుకులెమ్మని 'ఏం ఫర్వాలేదులే. కలిసి గడపటం ప్రధానంగానీ అదంత ముఖ్యమేం కాదు..' అని అనునయంగా మాట్లాడేశాను. కానీ జీవితాంతం ఇలా సర్దుకోవటం అన్నంత తేలిక కాదు కదా..!''

...ఇది ఈమె ఒక్కరికే ప్రత్యేకమైన సందర్భమేం కాదు. ఒక వయసు వచ్చాక తమ భాగస్వాములతో ఎంతోమంది స్త్రీలు తరచూ ఎదుర్కొనే అనుభవమే ఇది. అసంతృప్తి పురుషునికే కాదు.. స్త్రీకీ ఉంటుంది. మరి ఈ విషయంలో పురుషుడు ఏం చెయ్యాలి? దీన్ని అధిగమించటంలో స్త్రీ పాత్ర ఎంత?

ఆమె మనసులో..
భాగస్వామి నుంచి లైంగికంగా తగినంత తృప్తి లభించని పరిస్థితుల్లో స్త్రీ మనసులో రేగే భావ పరంపర.. పరిపరివిధాలుగా ఉండొచ్చు.
''బహుశా శారీరకంగా తనలో ఏదైనా లోపం, సమస్యలు తలెత్తుతున్నాయేమో!''
85% పురుషుల లైంగిక పటుత్వ సమస్యలకు స్పష్టమైన కారణాలుంటాయి. వీటిని గుర్తించి చికిత్స చెయ్యచ్చు. కొన్నింటిని పూర్తిగా నయం చెయ్యచ్చు. వైద్యులతో చర్చించటం అవసరం.
''మా దాంపత్య బంధంలో ఏదైనా లోపం తలెత్తుతోందా? అన్న అనుమానం వేధిస్తోంది.''
కొన్నిసార్లు దాంపత్య బంధంలో తలెత్తిన ఇతరత్రా భావోద్వేగ, మానసిక సమస్యలు ఈ పటుత్వ లోపాల రూపంలో ప్రతిఫలించొచ్చు. అన్యోన్యంగా కలిసుండాలన్న భావన బలంగా ఉంటే ఈ పటుత్వ లోపాలను సరిదిద్దుకోవటంలో భాగంగానే ఆ భావోద్వేగ సమస్యలూ సర్దుకుంటాయి.

''నామీద లోపల కోపం ఉందేమో. బహుశా నాకే తన మీద అంత గాఢమైన భావన లేదేమో!''

రోజువారీ చికాకులు, కోపతాపాలూ సహజమేగానీ తీవ్రమైన కోపం గూడుకట్టుకుని ఉంటే పైకేమీ కనబడకపోయినా అది లైంగిక వాంఛలను ప్రభావితం చెయ్యచ్చు. సమస్య పరిష్కారానికి, చికిత్స సమర్థంగా పనిచేయటానికి కూడా ఈ కోపాన్ని పరిష్కరించుకోవటం అధిగమించటం అవసరం.

''హమ్మయ్య. నాకు ఆసక్తిలేదుగానీ.. ఆ నెపమేదో తన మీది నుంచే పోతోంది!''

రకరకాల కారణాల రీత్యా నడి వయసుకు వచ్చేసరికి కొందరు స్త్రీలకు సంభోగం మీద ఆసక్తి కొంత తగ్గుతుంది. పైకి చెప్పలేక, భాగస్వామి కోరికను మన్నించలేక సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి భాగస్వామి పటుత్వలోపం ఒక సదవకాశంగా పరిణమిస్తుంటుంది.

సమస్య ఒకరిది.. ఇబ్బంది ఇద్దరిదీ!
స్తంభన లోపాలు, శీఘ్రస్ఖలనం.. ఈ రెండూ దాంపత్య జీవితంలో కనిపించని అలజడి సృష్టిస్తాయి! నిజానికి ఈ రెండూ ఏమంత అరుదైన సమస్యలేం కాదు. స్తంభన సమస్యలు ఎంత సర్వసాధారణమైనవంటే కనీసం 10% పురుషులు ఏదో సమయంలో వీటిని ఎదుర్కొంటూనే ఉంటారు. చాలామందిలో ఇవి దీర్ఘకాలికంగానూ పరిణమిస్తాయి. నిజానికి ఇవి పురుషుడికి సంబంధించిన సమస్యలే అయినా.. వీటి ఫలితాన్ని, పరిణామాలను మాత్రం ఇద్దరూ పంచుకోవాల్సి వస్తుంది. సంభోగం ఇరువురికీ సంతృప్తికరంగా సాగేందుకు అవసరమైనంత పటుత్వం, స్తంభన లేకపోవటం ఒక సమస్య అయితే.. మొదట్లో బాగానే ఉన్నా రతిక్రీడ సంతృప్తికరంగా ముగిసేంత వరకూ గట్టిదనం లేకుండా శీఘ్రంగా స్ఖలనమైపోవటం మరో సమస్య. వీటివల్ల పురుషుడు తీవ్ర అసహనానికి, నిస్సహాయతకు లోనవటమే కాదు.. భాగస్వామి కూడా మౌన, మానసిక వ్యథకు, ఆవేదనకు, అసంతృప్తికి గురవుతుంటుంది. వీటిని గురించి పైకి మాట్లాడితే పరిణామాలెలా ఉంటాయో... మాట్లాడకపోతే పరిస్థితేమిటో ఏమీ తెలియని సందిగ్ధం! అందుకే ఈ సమస్యలను కేవలం పురుషుడి వైపు నుంచే కాదు.. స్త్రీ వైపు నుంచీ విశ్లేషించి పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇవి పురుషుడిలో తలెత్తే సమస్యలే అయినా వీటిని అధిమించటానికి స్త్రీ భాగస్వామ్యం అనివార్యం, అత్యవసరమని గుర్తించటం ముఖ్యం!

మౌనం.. కాదు మార్గం!
దాంపత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఈ ఇబ్బంది గురించి చాలామంది భార్యాభర్తలు మౌనంగా లోపల్లోపల వ్యథ చెందుతుంటారేగానీ పైకేమీ మాట్లాడరు. కనీసం తమలో తాము కూడా దీని గురించి చర్చించుకోరు. ముఖ్యంగా తమకీ సమస్య ఉందన్న విషయాన్ని అంగీకరించటానికి పురుషులు ఇష్టపడరు, దాన్ని గురించి మాట్లాడితే పరిణామాలు ఎలా ఉంటాయోనన్న శంక, భయంతో స్త్రీలూ పన్నెత్తరు. దీంతో రెండిందాలా నష్టం. భావోద్వేగాలన్నీ మనసులోనే దాచుకుని పైకి సమస్యేమీ లేనట్టు నటిస్తుంటే ఇద్దరిలో ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఇక కలయికనే వాయిదా వేస్తూపోతుంటారు, క్రమేపీ ఇద్దరి మధ్య ఎడం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఎక్కడో అన్యోన్యత తగ్గి.. మౌనం అడ్డుపడుతుంటుంది. ఇటువంటి సందర్భాల్లో కోరికలను అణుచుకోవటం, శృంగారం అంత ముఖ్యమైందేం కాదన్నట్టు బింకాలు పోవటం సరికాదు.

అతని మనసులో..
భాగస్వామిని లైంగికంగా తృప్తి పరచలేని పరిస్థితుల్లో పురుషుడి మనసులో రేగే అలజడి చెప్పనలవి కానిది. ఇది రకరకాలుగా కలవరానికి గురిచేస్తుంది.
''తనను తృప్తిపరచలేకపోతే మగవాడిగా అది నా వైఫల్యం అవుతుంది. అందుకే దీని గురించి మర్చిపోలేకుండా ఉన్నాను''
లైంగిక సంతృప్తి అంటే కేవలం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవటమే అని భ్రమించే పురుషుల్లో ఈ వైఫల్య భావం పెరుగుతుంది. దీంతో ఆత్మవిశ్వాసం కొరవడి న్యూనత వెంటాడుతుంది. చాలామంది దీని గురించి మర్చిపోలేకపోతున్నామని, దేనిమీదా ఏకాగ్రత కూడా కుదరటం లేదని చెబుతుంటారు.
''నేను కాస్త ప్రేమగా ఉంటే.. తను శృంగారాన్ని కోరుకోవచ్చు. అప్పుడేం చెయ్యాలి?''
స్తంభన లోపాలున్న పురుషులు శారీరకంగా, భావోద్వేగపరంగా భాగస్వాములకు దూరం జరుగుతుంటారు, దగ్గరైతే ఎక్కడ తన వైఫల్యం బయటపడుతుందోనని భయపడుతుంటారు. దీంతో స్త్రీలూ అంత చనువుగా, సాంత్వనగా ఉండలేకపోవచ్చు.
''నాలో ఏదో లోపం ఉండే ఉంటుంది. ఏమైనా శృంగార జీవితం అనేదే లేకపోతే ఇక నేను ఒంటరిని అయిపోతానేమో''
పెద్దవయసుకు వచ్చేసరికి ప్రేమ, చనువు, గాఢమైన అనుబంధాన్ని ఆశించటం తప్పేమో అనుకునే పురుషులూ ఉన్నారు. పైగా వైఫల్యం వెంటాడుతుంటే తమలోని భావాలను అణచుకుని ఇక పూర్తిగా ఒంటరివాళ్త్లెపోతుంటారు. భాగస్వామి ఇక తనకు దూరమవుతుందేమోనన్న భయాలూ మొదలవుతాయి.
''నాలో ఈ సమస్య తలెత్తక ముందు ఆమె ఎంతో ప్రేరణగా నిలిచేది. ఇప్పుడా థ్రిల్‌ పోయింది.''
పటుత్వం తగ్గుతోందన్న భావన ఆవహించినప్పుడు చాలామంది పురుషులు అసలు శృంగార భావాల్నే అణుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. భాగస్వామినీ మానసికంగా అందుకు అనుగుణంగా సిద్ధం చేస్తుంటారు.

న్యూనత నుంచి నిస్సహాయతలోకి!
అనుభవంలో తృప్తి, గాఢత తగ్గి.. ఏదో కొరత మొదలైనప్పుడు ఇరువురిలోనూ మానసిక సమస్యలు మొదలవుతాయి. పటుత్వ సమస్యల వల్ల పురుషుడిలో నిస్పృహ, న్యూనత పెరుగుతుంటే స్త్రీ నిరాశకు గురవుతుంది. పురుషుడిని వైఫల్యం వెన్నాడుతుంటే స్త్రీలో తాను తిరస్కరణకు గురవుతున్నానన్న భావం పెరిగే అవకాశం ఉంటుంది. తనలో అందం, ఆకర్షణ తరిగిపోతున్నాయేమోనన్న భయాలు ఆమెలో, తన సామర్థ్యం సన్నగిల్లిపోతోందేమోనన్న ఆందోళన అతనిలో... ఇలా ఎవరికి వాళ్లు తమను తాము నిందించుకోవటం, ఏదో కోల్పోతున్నామన్న భావనకు లోనవటం, నిస్సహాయ ఆగ్రహం, మానసికంగా కుంగుబాటు, వ్యథకు లోనవటం.. ఇవన్నీ ఇరువురిలోనూ ఎదురయ్యే మానసిక భావనలే. ఈ గందరగోళ సమయంలో అభద్రతాభావానికి లోనవుతూ చాలామంది స్త్రీలు తమ భావోద్వేగాలను తాత్కాలికంగానైనా దాటవేసేందుకు ఆలోచనలను, శక్తియుక్తులన్నింటినీ కుటుంబం, బాధ్యతల మీదికి మళ్లిస్తుంటారు. పురుషులేమో గతంలో అనుభవించిన సాంగత్య భావన, సంతృప్తి కోసం తపించటం ఆరంభిస్తారు. కానీ తరచూ ఆశాభంగం అవుతుండటంతో న్యూనత పెరిగి నిస్సహాయ స్థితిలో పడిపోవటం, భాగస్వామి దృష్టిని లైంగిక ఆసక్తుల మీది నుంచి ఇతర అంశాలకు మళ్లించే ప్రయత్నం చేయటం.. తన అశక్తతను, సామర్థ్యలోపాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందోనన్న భయంలో గడపటం ఆరంభిస్తారు. నిజానికి ఈ ప్రతికూల మానసిక భావాలు తీవ్రంగా వేధించటమే కాదు.. కొన్నిసార్లు అర్థరహితంగా కూడా తయారవ్వచ్చు. తన అసమర్థత బయటపడుతుందేమోనని అతను దూరం జరిగితే.. ఏరికోరి తనకు వైఫల్యాన్ని గుర్తుచేయటమెందుకని ఆమె దూరం కావచ్చు. ఈ విషయంలో స్త్రీ పురుషుల మానసిక భావోద్వేగాలను వేర్వేరుగా అర్థం చేసుకోవటం, వాటిని వాస్తవిక దృక్కోణం నుంచి చూడటం చాలా అవసరం.

మార్పులు తెచ్చే సమస్యలు
వయసుతో పాటు వచ్చేమార్పులు కొన్ని అయితే దీర్ఘకాలం శృంగారానికి దూరంగా ఉన్నవారిలో కూడా శారీరకంగా, మానసికంగా కొన్ని మార్పులు వస్తుంటాయి. వీటి గురించి పట్టించుకోవటం అవసరం. స్త్రీలలో యోని పొడిబారటం, కండరాలు బిగువు తగ్గటం, హార్మోన్లు అస్తవ్యస్తం కావటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, సంభోగం బాధాకరంగా మారటం వంటివి ఎదురవ్వచ్చు. ఇవన్నీ కూడా చికిత్సతో తొలగిపోయే సమస్యలే. వయసుతో వచ్చే మార్పుల్లో- స్త్రీ పురుషులు ఇరువురిలోనూ కూడా స్పందనల్లో వేగం తగ్గటం, ప్రేరణ ఎక్కువ అవసరమవ్వటం, భావప్రాప్తి శీఘ్రమవటం, పురుషుల్లో స్తంభన ఒకప్పటంత దృఢంగా లేకపోవటం వంటివన్నీ ఎదురవుతుంటాయి. స్త్రీలలో40లు, 50లలో వాంఛలు గాఢతరమవుతుంటే.. అదే సమయంలో వారి భాగస్వాములు గుండె జబ్బులు, ప్రోస్ట్రేట్‌ సమస్యల వంటివాటి బారిన పడి పటుత్వ సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాగే మానసిక కుంగుబాటు కూడా ఇరువురిలోనూ వాంఛలను తగ్గించొచ్చు. వీటన్నింటికీ చికిత్సలున్నాయి. కాబట్టి వైద్యులను సంప్రదించటం, ముఖ్యంగా ఏకాగ్రత తగ్గటం, ఎప్పుడూ నిస్సత్తువగా ఉండటం, ఉత్సాహకరమైన అనుభవాల పట్ల ఆసక్తి తగ్గిపోవటం, నిద్ర సమస్యలు, బరువు తగ్గటం లేదా బాగా పెరగటం.. ఇలాంటి లక్షణాలు కనబడితే తక్షణం వైద్య సహాయం తీసుకోవటం తప్పనిసరి.

కాలంతో మానేది కాదు!
ఎప్పుడన్నా పటుత్వ లోపం తలెత్తటం సహజం, దీన్ని గురించి అంతగా ఆందోళన అనవసరం. అయితే ఇది దీర్ఘకాలికంగా తయారైనప్పుడు.. కేవలం కాలమే పరిష్కరిస్తుందని వదిలేయటానికి, తాత్సారం చేయటానికి, వాయిదాలు వేసుకుంటూ పోవటానికి లేదు. కాలం గడిచేకొద్దీ ఇది మరింత జటిలం కావచ్చు. భాగస్వామిని ఒత్తిడి చేయలేని, తమలోని భావాలను బయటకు చెప్పుకోలేని వారిలో ఈ వేదన- తలనొప్పి, నడుము నొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి రకరకాల రూపాలను తీసుకుంటూ ఉంటుంది. కొందరు అందంగా తయారవ్వాలన్న కాంక్షను కూడా వదిలేసుకుని.. శరీరంపై శ్రద్ధ పెట్టటం కూడా మానేస్తారు. కొందరు మద్యం వంటి వ్యసనాల్లోనూ కూరుకుంటారు. మరికొందరు ఏదో ఒక పని మీద పని పెట్టుకుని.. 'పని రాక్షసుల్లా' కూడా తయారవుతుంటారు. వీటన్నింటినీ సమస్య మూలాలతో అర్థం చేసుకోవటం ముఖ్యం.
అర్థం చేసుకోవటం అవసరం.
చాలామంది పటుత్వలోపం వంటి సమస్యలను మానసికాంశాలుగా కొట్టిపారేస్తుంటారుగానీ 85% మందిలో ఇది శారీరక సమస్యల వల్లే తలెత్తుతోంది. కేవలం 15% మందిలోనే మానసిక అంశాలు దోహదం చేస్తున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. దీన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఐదుగురిలో కనీసం నలుగురికి- మధుమేహం(33%), రక్తనాళాల సమస్యలు (హైబీపీ, గుండెజబ్బులు, రక్తనాళాలు గట్టిపడటం)(25%), ప్రోస్టేట్‌, మూత్రాశయ సమస్యలు, హార్మోన్‌ లోపాలు(6%), వీరు వాడుకుంటున్న ఇతరత్రా మందుల దుష్ప్రభావాలు(8%), మద్యం వంటి అలవాట్లు(7%) కారణమవుతున్నాయి. సమస్య శారీరకంగా తలెత్తేదే అయినా దీనిలో ఒత్తిడి, కుంగుబాటు, కుటుంబ సమస్యల వంటి మానసిక అంశాలూ ముడిపడి ఉంటాయి. మన సమాజంలో పటుత్వ లోపానికి మధుమేహం అతి ముఖ్యకారణం. బీపీకి, మానసిక సమస్యలకు, కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా పటుత్వ లోపాలు రావచ్చు. కాబట్టి పటుత్వ లోపం బాధిస్తున్నప్పుడు కుటుంబ డాక్టరుతో, అవసరమైతే యూరాలజిస్ట్‌, అండ్రాలజిస్ట్‌లతో సంప్రదించటం, వీటన్నింటి గురించీ వైద్యులతో చర్చించటం ఎంతో అవసరం. అలాగే శీఘ్రస్ఖలనాన్ని ఎదుర్కొనేందుకు కూడా ఎన్నో సమర్థమైన పద్ధతులు, విధానాలున్నాయి. వీటి విషయంలో భాగస్వామి సహకారం, ప్రోత్సాహం ఎంతో మేలు చేస్తుంది. ఇరువురూ సమస్యను అధిగమిచాలని కలసికట్టుగా, దృఢమైన నిశ్చయంతో ఉండటం మేలు చేస్తుంది.

ఇబ్బందిలోనూ భాగస్వామ్యం
స్త్రీపురుషులు ఇరువురూ కూడా సమస్యను దాచాలని, దాటవెయ్యాలని ప్రయత్నించేకంటే దీన్ని గురించి మనసువిప్పి చర్చించుకోవటం, ఒకరి భావాలను ఒకరు అరమరికలు లేకుండా పంచుకోవటం, చికిత్స తీసుకునేలా ప్రోత్సహించటం, భాగస్వామి గురించి తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు కాబట్టి తన ప్రేరణ, ప్రోద్బలం గొప్ప మేలు చేస్తాయి. న్యూనతలో ఉన్న పురుషుడికి ఇప్పటికీ బలంగా ఉన్న తన శక్తియుక్తుల గురించి గుర్తుచేసేలా మాట్లాడటం, స్పృశించటం, ప్రేరేపించటం, హత్తుకోవటం, చుంబనం, ప్రేమగా మాట్లాడటం వంటి శృంగార ఉద్దీపన చర్యలను ప్రోత్సహించటం వల్ల మనోనిబ్బరం పెరుగుతుంది. కొందరు పురుషులు దీన్నో లోపంగా భావిస్తూ తన భాగస్వామికి తెలియకుండానే చికిత్సలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారుగానీ భాగస్వామితో మాట్లాడటం, ఈ దశను కలిసికట్టుగా అధిగమించటం కీలకం. చికిత్సలో భాగంగా ఎంతో ఉపయోగపడే 'వ్యాక్యూమ్‌' పరికరం వంటివి వాడకపోవటానికి భాగస్వామికి తెలియకుండా ఉండాలని చూడటం కూడా ముఖ్యకారణం. అందుకే స్త్రీలు కూడా ''నేనే రకంగా సహాయం చేస్తే ఉపయోగం ఉంటుందో చెప్పమని'' అడగటం వల్ల చెప్పలేనంత మేలు జరుగుతుంది. స్త్రీ ఈ సమస్య పట్ల సానుకూలంగా ఉండటం, సహకరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయటం.. రెండూ పరిష్కారంలో కీలక అంశాలు. మన మనసులోని విషయం భాగస్వామి గ్రహించటంలేదని మథనపడేకన్నా అరమరికలు, భేషజాలు వదిలేసి సున్నితంగానే అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

Treatment :

గుండె జబ్బులు లేనివారు .. వయగ్రా మందును వాడవచ్చును . వారానికి 2 లేదా 3 సార్లు Tab. penegra 25 mg or 50 mg per day 2-3 hours before the act.

సుగరు వ్యాది ఉన్నవారు ... వాటికి సంబంధిత మందులు క్రమము తప్పకుండా వాడాలి .

రోజూ ఒక బి.కాంప్లెక్ష్ మాత్ర వాడితే చాలా మంచిది .

  • మూలము --http://wikipedia.org/

  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

  1. what age person using the penegra tab and what is trouble to health problems when used the penegra tab

    ReplyDelete

Your comment is very important to improve the Web blog.