Sunday, November 13, 2011

ఆరోగ్యానికి పౌష్టికాహారం-అవగాహన , Nutritional food for health-Awareness


  • Image : courtesy with Eenadu Newspaper


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- ఆరోగ్యానికి పౌష్టికాహారం-అవగాహన , Nutritional food for health-Awareness-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఏం తినాలి? ఎంత తినాలి? ఏం తినకూడదు? ఎందుకు తినకూడదు? వూబకాయులంటే ఎవరు? ఆ జాబితాలో చేరకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?...అనేకానేక సందేహాలకు జాతీయ పోషకాహార సంస్థ (NIN) తాజా నియమావళి జవాబు చెబుతోంది. భారతీయుల ఆరోగ్యానికి సంబంధించి ఇది రాజ్యాంగం లాంటిదే.

పౌష్టికాహారం ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ యువకులకు ఇన్ని కేలరీలు అవసరం అవుతాయనో, వృద్ధులకు ఇన్ని కేలరీలు తప్పనిసరి అనో నిపుణులు బల్లగుద్ది చెబుతుంటారు. తీరా చూస్తే అవి అంతర్జాతీయ అధ్యయనాలు. ఏ అమెరికన్‌ హెల్త్‌ జర్నల్స్‌ నుంచో తీసుకుని ఉంటారు. అది ఎంతవరకు సమంజసం? దేశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి. పోషక అవసరాలూ మారతాయి. అమెరికన్లు అమెరికన్లే. భారతీయులు భారతీయులే. ఎవరి కోసవో తయారు చేసిన పోషక విలువల జాబితా మనకెలా సరిపోతుంది? మనకంటూ ఓ నియమావళి అవసరం. దాన్ని తయారుచేసే బాధ్యత జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) తీసుకుంది. తాజా పరిశోధనల వివరాలు జోడిస్తూ, సమకాలీన జీవనశైలి ప్రభావాల్ని ఉటంకిస్తూ దశాబ్దానికి ఒకసారి సరికొత్త నియమావళిని రూపొందిస్తుంది ఆ సంస్థ. అలా, పన్నెండేళ్ల తర్వాత వెలువడిందే ఇది. ఇంకో పదేళ్లదాకా, ఈ అంకెలే భారత పోషకాహార వ్యవస్థకు మార్గదర్శనం చేస్తాయి. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఆధారం అవుతాయి. తాజా నియమావళిలో సలహాలున్నాయి, హెచ్చరికలున్నాయి, ముందుజాగ్రత్తలున్నాయి. నవజాత శిశువుల నుంచి వయోధికుల దాకా...అన్ని వయసులవారినీ దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలు చేసింది ఎన్‌ఐఎన్‌.

'బరువు' :
భారతీయుల్లో 30 నుంచి 50 శాతం అధిక బరువుతో బాధపడుతున్నారు. వూబకాయం రోగాల పుట్ట. దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, గుండె జబ్బులు తదితర సమస్యలకు దారితీస్తుంది. కొన్నిరకాల మానసిక రుగ్మతలకూ కారణం అవుతుంది. నానాటికీ పెరుగుతున్న వూబకాయ సమస్యపై జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలా అని, కృత్రిమ పద్ధతుల్లో బరువు దించుకోవాలన్న తొందరపాటూ మంచిదికాదని సలహా ఇస్తోంది. దానివల్ల నష్టాలే ఎక్కువని హెచ్చరిస్తోంది. వూబకాయాన్ని నియంత్రించడానికి కొన్ని సూచనలు కూడా చేస్తోంది.

ముందుగా, ప్రతి చిన్నపనికీ యాంత్రికశక్తిపై ఆధారపడటం మానేయాలి. బట్టలు ఉతుక్కోవడం, పుస్తకాలు సర్దుకోవడం, బూజు దులపడం, మెట్లు ఎక్కడం, రివోట్‌ వాడకుండా ఛానళ్లు మార్చడం...వంటి పనులు కొంతమేర అదనపు కేలరీలను కరిగిస్తాయి. రోజూ ఓ గంటసేపు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి. ఆహారం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిరుదుల చుట్టూ పేరుకుపోయే కొవ్వు (సాధారణంగా మహిళల్లో) కంటే పొట్ట చుట్టూ తిష్టవేసే కొవ్వే (సాధారణంగా పురుషుల్లో) ఎక్కువ ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారతీయ బీఎమ్‌ఐ
ఒక వ్యక్తి ఎంత బరువు ఉంటే వూబకాయుల జాబితాలో ఉన్నట్టు? ఈ విషయాన్ని లెక్కగట్టడానికి బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఓ సూచిక... బీఎమ్‌ఐ 18.5 కంటే తక్కువ ఉంటే పోషక విలువల లోపంతో ఇబ్బంది పడుతున్నట్టు. 25 నుంచి 30 మధ్య ఉంటే అవసరానికి మించి బరువు ఉన్నట్టు. 30 దాటితే వూబకాయుల జాబితాలో చేరినట్టు. 21-22 ఆదర్శవంతమైన బీఎమ్‌ఐ. ఇవన్నీ పాశ్చాత్యుల లెక్కలే. మరీ పొట్టి, మరీ పొడుగూ కాని భారతీయుల శరీరాకృతి ప్రకారం... బీఎమ్‌ఐ 23 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అధిక బరువుకూ 27 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వూబకాయానికీ సూచికగా తీసుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయని జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది.

సేంద్రియ సందేహాలు
సేంద్రియ పంటలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అసలే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న పరిస్థితులు. సేంద్రియ దుకాణాల్లో అయితే, ఆ ధరలు రెట్టింపు! అంత ధర పెట్టి సేంద్రియ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం ఉందా? 'సేంద్రియమైనా కాకపోయినా ఆహారపదార్థాల పోషక విలువల్లో ఎక్కువ తేడా ఉండదు. వండే ముందు శుభ్రంగా ఉప్పు నీళ్లతో కడిగితే, క్రిమిసంహారకాల అవశేషాలు ఎనభైశాతం దాకా పోతాయి. ఉడికించినప్పుడూ, వేయించినప్పుడూ ఇంకొన్ని నాశనమైపోతాయి' అని భరోసా ఇస్తోంది జాతీయ పోషకాహార సంస్థ నియమావళి. మనం కొన్నది నిజంగానే సేంద్రియ పద్ధతుల్లో పండిన పదార్థాలే అయితే (నిజానికి, భారతదేశంలో సేంద్రియ ఉత్పత్తులను నిర్ధారించే అధికారిక సంస్థల్లేవు) ఆ కొద్దిశాతం కూడా రసాయనాల ప్రభావం ఉండదు.

ఒవెన్లు ఓకేనా...
మైక్రోవేవ్‌ ఒవెన్ల విషయంలో పోషకాహార సంస్థ కొన్ని సూచనలు చేస్తోంది. 'వాటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే, తిరిగి వేడిచేసుకుని తింటున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని ఒకేసారి భారీపరిమాణంలో వేడిచేయడం అస్సలు మంచిది కాదు. అలాంటప్పుడు, ఎక్కడో ఓ చోట ఎంతోకొంత ఆహారం చల్లగానే ఉండిపోతుంది. హానికరమైన బాక్టీరియా అందులో పోగైపోయి, శరీరంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్య రాకూడదంటే, మధ్యమధ్యలో బాగా కలపాలి. పాక్షికంగా వేడిచేసిన ఆహారాన్ని తిననే తినకూడదు. ఫ్రీజర్‌ లోంచి తీసిన వెంటనే మైక్రోవేవ్‌ ఒవెన్‌లో పెట్టేయడమూ మంచిది కాదు' అని హెచ్చరిస్తోంది.

కాఫీ, టీ లేదా..
కాఫీ తాగాలా, టీ తాగాలా?-ఎప్పుడూ సందేహమే. నిజానికి రెండూ అనారోగ్యకరమే. భోజనానికి గంట ముందు, భోజనం తర్వాత ఓ గంట అస్సలు పుచ్చుకోకూడదు. ఎందుకంటే, అవి ఆహారంలోని ఐరన్‌ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. కార్బొనేటెడ్‌ పానీయాలూ మంచిది కాదు. జీర్ణవ్యవస్థను దారితప్పిస్తాయి. వాటి బదులుగా పళ్లరసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. పచ్చిపాలు తాగితే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం ఉంది. అందులో శాస్త్రీయత లేదు. పాలను ఓ స్థాయి వరకు మరిగించడం వల్లే, వాటిలోని హానికర సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. వేడిచేసుకోకుండా తాగడం అంటే, అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే.

పళ్లెంలో పోషకాలు
అన్నిరకాల కూరగాయలూ వండుకోవాలి. అన్నిరకాల ఆకుకూరలూ తినాలి. అన్నిరకాల ఫలాలూ ఆరగించాలి. ప్రతి వ్యక్తీ రోజుకు మూడువందల గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. అందులో ఆకుకూరలు 50 గ్రాములు, కూరగాయలు 200 గ్రాములు, దుంపకూరలు 50 గ్రాములు. వీటికితోడు వందగ్రాముల తాజా పళ్లు తినాలి. గర్భిణులైతే, ఇనుమూ ఫోలిక్‌ యాసిడ్‌ చాలా అవసరం కాబట్టి ఇంకో యాభైగ్రాముల ఆకుకూరల్ని అదనంగా తీసుకోవాలి. ఆయా రుతువుల్లో దొరికే ఏ ఫలాలైనా ఆరోగ్యానికి మంచిదే. వాటిలో సూక్ష్మపోషకాలు అపారంగా ఉంటాయి. ఒకే పండులో అన్నిరకాల పోషక విలువలూ దొరకవు. అందుకే, రకరకాల రుచులు ఆస్వాదించాలని ఎన్‌ఐఎన్‌ సలహా ఇస్తోంది.

మరిన్ని పిండిపదార్థాలు...
జాతీయ పోషకాహార సంస్థ, పన్నెండేళ్లనాటి నివేదికలో మనిషికి నూటయాభైగ్రాముల కూరగాయలు సరిపోతాయని చెప్పింది. ఇన్నేళ్లలో పోషక అవసరాల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకేనేవో ఆ పరిమాణాన్ని రెట్టించింది. ప్రస్తుత పరిస్థితుల్లో, మూడువందల గ్రాముల కూరగాయలు తినాల్సిందే. పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్లు) విషయంలోనూ పోషకాహార సంస్థ సిఫార్సులో తేడాలొచ్చాయి. ఇడ్లీ, ఉప్మా, దోసె, అన్నం, పప్పు తదితరాల్లో పిండిపదార్థాలు దొరుకుతాయి. మనం తీసుకున్న కేలరీల్లో 50 నుంచి 60 శాతం కార్బొహైడ్రేట్లు ఉండవచ్చన్నది తాజా సూచన. గత నివేదికలో అరవై నుంచి డెబ్భైశాతం ఉండాలని సిఫార్సు చేసింది. పిండిపదార్థాలు శరీరం రోజువారీ పనులు చేసుకోడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. గతంతో పోలిస్తే మనుషుల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఫలితంగా కార్బొహైడ్రేట్ల అవసరమూ తగ్గినట్టు భావించాల్సి ఉంటుంది.

ఇంకాస్త ప్రొటీన్‌...
మన ఆహారంలో మాంసకృత్తుల (ప్రొటీన్లు) పరిమాణం పన్నెండు నుంచి పదిహేను శాతం ఉండాలన్నది (పాత నివేదికతో పోలిస్తే మూడుశాతం ఎక్కువ) తాజా సూచన. 'ప్రొటియోస్‌' అన్న గ్రీకుపదం నుంచి ప్రొటీన్‌ పుట్టింది. 'ప్రధానమైంది' అని ఆమాటకు అర్థం. ప్రొటీన్‌ సార్థకనామధేయురాలు. ఇది శరీరాన్ని రక్షించే పదార్థాన్ని తయారు చేస్తుంది. కండరాల కదలికకు సహకరిస్తుంది. జీవక్రియను ప్రోత్సహిస్తుంది. కణాల్నీ కణజాలాల్నీ నిర్మిస్తుంది. మాంసంలో, చేపల్లో, గుడ్లలో, పప్పుధాన్యాల్లో, పాలలో, పాల ఉత్పత్తుల్లో, సోయాలో మాంసకృత్తులు పుష్కలంగా దొరుకుతాయి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలనే విషయంలోనూ ఎన్‌ఐఎన్‌ పాత సూచనను సవరించింది. రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు (గతంలో అయితే ఒకటిన్నర లీటర్లే) ఒంట్లోకి వెళ్లితీరాలని చెప్పింది.

ఉప్పు...ముప్పు!
పన్నెండేళ్ల క్రితమే పోషకాహార సంస్థ ఉప్పు విషయంలో బోలెడు షరతులు పెట్టింది. రోజుకు ఎనిమిది గ్రాములకు మించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తాజా నియమావళిలో ఆ కోత ఇంకాస్త పెరిగింది. ఆరుగ్రాముల కంటే ఒక్క రవ్వ ఎక్కువైనా కష్టమేనని హెచ్చరిక జారీచేసింది. నిజానికి, ఉప్పు వాడకం 2.4 నుంచి 4 గ్రాములకు మించకూడదన్నది అంతర్జాతీయ సంస్థల హెచ్చరిక. సాధారణంగా భారతీయ కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రోజుకు పది గ్రాముల ఉప్పు వాడతారని అంచనా. శరీరంలో ఉప్పు వోతాదు ఓ స్థాయిని దాటితే అధిక రక్తపోటు, ఉదర క్యాన్సర్‌ వంటి సమస్యలు రావచ్చు.

  • image : courtesy with Eenadu Newspaper.

అమ్మపాలు...
తల్లిపాలు అమృతంతో సమానమని మరోసారి గుర్తుచేస్తోంది పోషకాహార సంస్థ. కనీసం నాలుగు నెలలవరకూ తల్లిపాలు అవసరమని పన్నెండేళ్లనాటి నివేదిక సలహా ఇచ్చింది. ఆ వ్యవధిని ఇప్పుడు ఆరు నెలలకు పొడిగించింది. గరిష్ఠంగా రెండేళ్ల వరకూ ఇవ్వవచ్చంది. తల్లిపాలలోని కొలెస్ట్రమ్‌లో అపారమైన పోషక విలువలు ఉన్నాయి. ఆ మురిపాలతో తల్లీబిడ్డల అనుబంధాలూ బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. పుష్కలంగా తల్లిపాలు తాగిన బిడ్డల్లో పెద్దయ్యాక కూడా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వూబకాయం, కొన్నిరకాల క్యాన్సర్లూ దరిచేరే ప్రమాదమూ తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.

పెరిగే పిల్లలకు...
పెరిగి పెద్దవుతున్న కొద్దీ, చిన్నారులకు మరింత శక్తిమంతమైన ఆహారం కావాలి. అప్పుడే పుట్టిన పసికందు బరువు ఐదునెలలు తిరిగేసరికి రెట్టింపు అవుతుంది. ఏడాది నిండేసరికి మూడురెట్లు ఎక్కువవుతుంది. బిడ్డలు రెండో ఏడాదికంతా, 7-8 సెంటీ మీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమార దశకు ముందు బాలబాలికలు...ఏటా 6-7 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 నుంచి 3 కిలోల బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక కౌమారం వెుదలైందంటే ఎన్నో శారీరకమైన, మానసికమైన మార్పులు! అమాంతంగా ఎత్తూ (10 నుంచి 12 సెంటీమీటర్లు) బరువూ (8 నుంచి 10 కిలోలు) మారిపోతాయి. ఆ మార్పులకు సరిపడా ఆహారం అందాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా ఇవ్వాలి. ప్రతి మనిషికీ రోజుకు 600 నుంచి 800 మిల్లీ గ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. ఎదిగే వయసులో ఆ అవసరం ఇంకా ఎక్కువ. పాల ద్వారా ఆ కొరత కొంత తీరుతుంది. నెయ్యి, వంటనూనెలు తగినంతగా (రోజుకు 25 నుంచి 50 గ్రా.) ఇవ్వాలి. ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. పొద్దస్తమానూ టీవీకి అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. పిజ్జాలూ బర్గర్లూ వంటి చిరుతిళ్ల విషయంలో హెచ్చరికలు చేస్తూ ఉండాలి. బాల్యం నుంచే ఆరోగ్యం మీదా పోషక విలువల మీదా అవగాహన కల్పించాలి. పిల్లల్లో పెరుగుతున్న వూబకాయ సమస్య పట్ల జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వూబకాయం బూచి చూపించి కడుపు మాడ్చడం కంటే, వ్యాయామాన్నీ ఆటపాటల్నీ ప్రోత్సహించడమే మంచి మార్గమని కన్నవారికి సలహా ఇస్తోంది.

పెద్దల ఆరోగ్యం జాగ్రత్త!
దేశ జనాభాలో దాదాపు పదిశాతం ఉన్న వయోధికులకు ఎన్‌ఐఎన్‌ చాలా జాగ్రత్తలే చెప్పింది. వయసు మీదపడేకొద్దీ సమస్యలు పెరుగుతాయి. శారీరక శ్రమ ఉండదు కాబట్టి, కేలరీల అవసరమూ తగ్గుతుంది. సాధారణ వ్యక్తులకు రెండువేల కేలరీలు సరిపోతే, వయోధికులకు పద్ధెనిమిది వందలు చాలు. నూనె, నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం తగ్గించుకోవాలి. పాలు, పప్పుధాన్యాలు, తెల్లసొన... పెద్దలకు మంచి చేస్తాయి. రోజూ 200 నుంచి 300 మిల్లీ లీటర్ల పాలూ పాల ఉత్పత్తులూ తీసుకోవాలి. కనీసం నాలుగువందల గ్రాముల కూరగాయలూ పళ్లూ తినాలి. ఉప్పు, మసాలాలూ బాగా తగ్గించాలి. కాల్షియం, జింక్‌, ఇనుము, విటమిన్‌-ఎ, యాంటీ ఆక్సిడెంట్లు... వృద్ధాప్య సమస్యల్ని అధిగమించడంలో సాయపడతాయి. వ్యాయామం చాలా అవసరం. నిపుణుల సహకారంతో సరైన వ్యాయామ పద్ధతుల్ని ఎంచుకోవాలి. ఆశావాదం, చురుకైన సామాజిక జీవితం కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి.

మాయదారి తిండి!
చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, చిప్స్‌, ఫ్రెంచిఫ్రైస్‌... వగైరాలు కమ్మకమ్మగా కడుపులో దూరిపోయి, మెల్లమెల్లగా మనల్ని కష్టపెడతాయి. వాటిలో పోషక విలువలు ఉండవు. ఉన్నా నామమాత్రమే. ఉప్పు, చక్కెర, కొవ్వుపదార్థాలు అధికం. కొన్నింట్లో అయితే ప్రమాదకర రసాయనాలూ ఉంటాయి. సంప్రదాయమైన చిరుతిళ్లే ఉత్తమం. ఇంట్లో వండుకుతినే ఆహారమే ఆరోగ్యకరం. 'రెడీ టు ఈట్‌' రుచులు కృతకమైనవి. పిల్లలైనా పెద్దలైనా వాటికి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది.

వంటింటి ముచ్చట్లు..
అన్నపూర్ణకు నుద్దియౌ అతని ఇల్లాలు! ప్రవరాఖ్యుడి అర్ధాంగే కాదు, ప్రతి భారతీయ మహిళా వండి వడ్డించడంలో దిట్ట. ఆ తపనను అభినందించి తీరాల్సిందే. దానికి శాస్త్రీయత తోడైతే...ఆ ఇల్లు ఆరోగ్యనిలయం అవుతుంది. మధుమేహాలూ అధిక రక్తపోట్లూ వూబకాయాలూ మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

ఇల్లాలికి ఎన్‌ఐఎన్‌ సలహాలివి...
* నిల్వపచ్చళ్లూ అప్పడాలూ వేపుళ్లూ బాగా తగ్గించాలి.
* కూరగాయల్నీ ఆకుకూరల్నీ ఉప్పు కలిపిన నీళ్లలో శుభ్రంగా కడిగాకే తరగాలి. తరిగాక కడగడం మంచి పద్ధతి కాదు.
* కూరగాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోయడంవల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. మరీ ఎక్కువసేపు నానబెట్టడం వల్ల, కొన్నిరకాల విటమిన్లూ ఖనిజాలూ నీటిలో కరిగిపోతాయి.
* సరుకులు కొంటున్నప్పుడు నాణ్యత విషయంలో రాజీపడకూడదు. అగ్‌మార్క్‌, ఐఎస్‌ఐ వంటి నాణ్యతాముద్రలు ఉన్నవాటినే కొనాలి. కల్తీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* వంటల్లో నూనెలు తక్కువగా వాడాలి. నెయ్యి, వెన్నలను సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి.
* పాల ఉత్పత్తులు, మాంసం, వండిన పదార్థాలు నిల్వచేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవి విషతుల్యంగా మారతాయి. రంగులో రుచిలో తేడా కనిపిస్తే చెత్తబుట్టలో పడేయడం మంచిది.
* మాంసాహారులు చికెన్‌, మటన్‌లను తగ్గించుకుని, వారానికి 100 నుంచి 200 గ్రాముల చేపలు తీసుకోవాలి. జంతువుల కాలేయం, మూత్రపిండాలు, మెదడు అసలే వద్దు.

* * *
ఆనందంగా ఉండాలన్నా, ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా, సాధించింది నిలబెట్టుకోవాలన్నా...ఆరోగ్యంగా ఉండాల్సిందే. ప్రతి ఆరోగ్యవంతుడి కళ్లలో ఓ మెరుపు ఉంటుంది. అది రోగులకు మాత్రమే కనబడుతుంది.

జాతీయ పోషకాహార సంస్థ నియమావళి ఆరోగ్య యాత్రలో రహదారి సూచిక లాంటిది. ఏ సూచికా మనల్ని గమ్యానికి తీసుకెళ్లదు. ఏ దార్లో వెళ్తే, తేలిగ్గా గమ్యాన్ని చేరుకోగలమన్నది మాత్రమే చెబుతుంది. మనవంతు ప్రయత్నం తోడైతేనే... ఆరోగ్య భాగ్యం!
పౌష్టిక పాకశాల!
పోషకాహార పరిశోధనలో దేశంలోనే అత్యున్నత సంస్థ...నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌). ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఆవరణలో ఎంతోమంది పోషకాహార పరిశోధకులు, వైద్యులు, గణకశాస్త్ర నిపుణులు పనిచేస్తున్నారు. భారతీయుల ఆహారంలో పోషక విలువల్ని పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ పోషకాహారానికి సంబంధించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ సూచనలూ అందిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఈ నివేదికలే ఆధారం. సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన పౌష్టికాహారాలపై ఇక్కడ అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి.

'సుదీర్ఘ పరిశోధనలూ అధ్యయనాల ఫలితంగా భారతీయుల కోసం ఈ ఆరోగ్య నియమావళిని రూపొందించాం' అంటారు ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. శశికిరణ్‌.

Source : Eenadu sunday magazine

  • =================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.