Wednesday, November 2, 2011

వృత్తి తో ఆరోగ్యము ,ఆక్యుపేషనల్‌ హెల్త్‌ , Occupational Health




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- ఆక్యుపేషనల్‌ హెల్త్‌ , Occupational Health-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...



ఒకరు భారీ యంత్రాల కోరలు తోముతుంటారు. మరొకరు హలం పట్టుకుని పొలం దున్నుతుంటారు. ఇంకొకరు కణ కణ మండే కొలుముల ముందే... రాళ్లు పగిలే రోళ్ల మధ్యే ఉపాధి వెతుక్కుంటారు. వేరొకరు రేయనకా పగలనకా గస్తీలు కాస్తుంటారు. మరొకరు కఠోర సాధనతో కంఠంలోనే సంగీతాన్ని మథిస్తుంటారు.. సహస్ర వృత్తుల విభిన్న ప్రపంచమది! కూటి కోసం.. తృప్తి కోసం.. కోటి వృత్తులు! ఏ వృత్తి విశిష్టత దానిది! దేని ప్రత్యేకత దానిదే.. స్వభావంలోనే కాదు... వెన్నంటి ఉండే వ్యాధుల విషయంలో కూడా...!

ప్రతి వృత్తినీ.. ప్రతి పనినీ వెన్నంటి ఏదో ఒక వ్యాధీ ఉంటుంది! వైద్య పితామహులు ఈ విషయాన్ని 17వ శతాబ్దంలోనే గుర్తించారు. అందుకే అప్పటి నుంచీ దీనిపై మరింత లోతుగా అధ్యయనాలు జరుపుతున్నారు. పారిశ్రామికీకరణ తర్వాత కార్మిక ప్రపంచం విస్తృతంగా విస్తరించిన తర్వాత ఈ వృత్తి వైద్యానికి ప్రాశస్త్యం మరింత పెరిగింది. గనిలో, పనిలో, కార్ఖానాలో కార్మికులు ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు.. వ్యాధుల రూపంలో పలకరిస్తుండవచ్చు. అయితే కేవలం కార్మికులకు, కర్మాగారాలకే కాదు.. ఈ ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అత్యాధునిక ఉద్యోగాలకూ, వృత్తులకూ కూడా ఈ వ్యాధుల బెడద అనివార్యం. కంప్యూటర్‌ నిపుణుల నుంచి క్యాంటీన్‌ పనివారి వరకూ ప్రతి ఒక్కరికీ వృత్తిపరంగా ఏదో రూపంలో వ్యాధుల ముప్పు ఉంటూనే ఉంది.

మన వృత్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపినట్టే.. మన ఆరోగ్యం కూడా మనం చేసే పని మీద, పని సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వృత్తి వైద్యానికి.. ఆక్యుపేషనల్‌ మెడిసిన్‌కు ప్రాముఖ్యత పెరుగుతోంది. వృత్తిపరంగా వచ్చే వ్యాధులను పూర్తిగా నయం చెయ్యటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏ వృత్తిలో ఉన్న వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందో గుర్తించటం, అవగాహన పెంచుకోవటం ద్వారా వాటిని మనం చాలా వరకూ నివారించుకోవచ్చు. నిత్యం రకరకాల జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యాధుల బారినపడినా వెంటనే గుర్తించి, తదునుగుణంగా తక్షణం చికిత్స తీసుకోవచ్చు. అది మళ్లీ రాకుండా.. వృత్తిపరంగా రక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఇది డాక్టర్లు, చిరు ఉద్యోగుల నుంచి కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తుంది.

సమాజంలో తరచుగా కనబడే వ్యాధులు బయటపడటానికి తక్కువ సమయం పడుతుంది. కానీ వృత్తిసంబంధమైన వ్యాధులు పూర్తిగా బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పైగా ఇవి చూడటానికి సాధారణ వ్యాధుల్లాగే ఉంటాయి కాబట్టి వీటికి మూలాలను పట్టుకోవటం కూడా కష్టం కావచ్చు. పైపై చికిత్సలతో తగ్గినట్టే తగ్గినా.. పని పరిస్థితుల్లో మార్పు రానంత వరకూ ఇవి మళ్లీ మళ్లీ వేధిస్తుండవచ్చు. ఉదాహరణకు ఒక కార్మికుడు 'మాంగనీస్‌' రసాయన ప్రభావానికి లోనైతే అచ్చం పార్కిన్సన్స్‌ వ్యాధి లక్షణాలే కనబడతాయి. సీసం ప్రభావానికి లోనైతే కడుపు నొప్పి వేధిస్తుంది. రోగి పూర్వాపరాలు తెలియకపోతే వీటిని పట్టుకోవటం కష్టం. ఆధునిక ఉద్యోగాలు వీటికి మినహాయింపేం కాదు. 'పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి' అన్నట్టు ఏసీ రూముల్లో రోజంతా కూర్చుని పనిచేసే వారికీ వ్యాధుల ముప్పు తక్కువేం కాదు. ఇలా ఎన్నో వృత్తులు. మారుతున్న ప్రవృత్తులు. మారుతున్న జీవనసరళి..ఇవన్నీ వృత్తుల పట్ల, వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని మరింత పెంచుతున్నాయి. అందుకే వృత్తివైద్యం ఇప్పుడు మరింత అవసరంగా మారింది!.

వృత్తివృత్తికో వ్యాధి!
వెల్డింగ్‌ పనివారు: వెల్డింగ్‌ చేసే సమయంలో వెలువడే పొగలతో ఒక సమస్య. పని చేస్తున్న లోహాన్ని బట్టి కూడా సమస్యలుంటాయి. ఇనుము మీద పనిచేసినప్పుడు ఆ ఇనుప రజను, మాంగనీస్‌ వంటివి; అలాగే మిశ్రమ లోహాలపై పనిచేసినప్పుడు నికిల్‌, క్రోమియం వంటి రేణువులు లోపలికి వెళ్లి పలురకాల ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వెల్డింగ్‌ సమయంలో పుట్టే వేడి మరో సమస్య. ఇక మిరుమిట్లు గొల్పే వెల్డింగ్‌ కాంతి నుంచి కళ్లకు సరైన రక్షణ అద్దాలు ధరించకపోతే- ఆ కాంతిలోని పరారుణ (ఇన్‌ఫ్రారెడ్‌) కిరణాలు కంటికి సోకుతాయి. ఇలా కొన్నేళ్ల పాటు జరిగే సరికి వీరికి చాలా త్వరగా కంట్లో శుక్లాలు (ఆక్యుపేషనల్‌ క్యాటరాక్ట్‌) వస్తాయి. అలాగే ఆ కాంతిలోని అతినీలలోహిత (అల్ట్రావయొలెట్‌) కిరణాలు సోకితే ఉన్నట్టుండి కళ్లు ఎర్రబడటం, నీరు కారటం వంటి సమస్యలు వస్తాయి. ఇలా రెండు మూడు రోజులైనా వేధిస్తాయి. దీన్నే 'వెల్డర్స్‌ ఐ' అంటారు. రక్షణ అద్దాలు పెట్టుకోకుండా ఒక్కసారి చూసినా కూడా ఈ సమస్య రావచ్చు. ఇది వెల్డింగ్‌ పని వల్ల వస్తుందని తెలియకపోతే ఏదోనని పొరబడే ప్రమాదం ఉంది. ఇక చేతి గాజుల తయారీ కార్మికుల్లో, గాజు పనివారిలోనూ శుక్లాలు రావొచ్చు. వాళ్లూ కళ్లకు రక్షణగా గాగుల్స్‌ పెట్టుకోవాలి. వీరంతా క్రమం తప్పకుండా కంటిపరీక్ష చేయించుకోవాలి.

* ఉప్పు కార్మికులు: రోజంతా సముద్రం ఒడ్డున ఉప్పు పంటలో.. తెల్లటి వెలుతురులో గడిపే ఉప్పు పనివారిలో చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. వీటికి తోడు వీరిలో అధిక రక్తపోటు, మూత్రంలో సోడియం పోవటం, సీరమ్‌ పీహెచ్‌ పెరగటం వంటివీ ఎక్కువని అధ్యయనాల్లో గుర్తించారు. తెల్లటి ఉప్పు మళ్ల మధ్య ఎండ కాంతి ఎక్కువగా ఉండటం కారణంగా వీరిలో కంటి సమస్యలూ వస్తున్నాయని గుర్తించారు.
.
కంప్యూటర్‌ ఉద్యోగులు: టెలీ కమ్యూనికేషన్స్‌, కాల్‌సెంటర్లు, బ్యాంకు ఉద్యోగుల వంటివారు కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చునే పని చేస్తుంటారు. దీనివల్ల వీరిలో మెడ, నడుము నొప్పుల వంటి శారీరక సమస్యల నుంచి మధుమేహం, వూబకాయం వంటి రుగ్మతల వరకూ ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరాకృతికి సహకరించే కుర్చీలు టేబుళ్లు (ఎర్గానమిక్స్‌) లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి తదితరాల వల్ల ఒళ్లు, మెడ, నడుము నొప్పుల బాధలు ఎక్కువ. నిద్రలేమి కారణంగా షిఫ్టు ఉద్యోగులను జీర్ణ వ్యాధుల నుంచి మానసిక కుంగుబాటు వరకూ ఎన్నో బాధలు వేధిస్తున్నాయి. వృత్తిపరమైన ఈ సమస్యలపై అవగాహన పెంచుకుని, సమర్థంగా ఎదుర్కొనటం ఒక్కటే దీనికి పరిష్కారం.
.
పోలీసులు, గార్డులు: ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఎండలో ఎక్కువసేపు నిలబడటం, వాహనాల రణగొణధ్వనుల మధ్య గడపటం వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం బారిన పడుతున్నారు. గాలిలో సీసం, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ వంటివి ఎక్కువుండటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే వీరిలో మానసిక ఒత్తిడి కూడా చాలా ఎక్కువ. నిరంతరం నిలబడే ఉండాల్సి రావటం వల్ల కాళ్లలో రక్తనాళాల సమస్యలు, ముఖ్యంగా 'వెరికోస్‌ వెయిన్స్‌' వంటివి వేధిస్తుంటాయి. ఈ కాళ్ల రక్తనాళాల సమస్య పోలీసులు, గార్డులు, రిక్షా కార్మికుల్లో, దర్జీల్లో కూడా ఎక్కువ.
.
క్వారీ ఉద్యోగులు: రాళ్లు పగలగొట్టేవారు, పలక రాయి తీసేవారు, బలపాల తయారీ ఉద్యోగులు.. వీరంతా ఇసుక, రాళ్లలో ఉండే సిలికాన్‌ డైఆక్సైడ్‌ వంటివి దీర్ఘకాలం పీల్చటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు (సిలికోసిస్‌), ధూళి సంబంధ వ్యాధుల బారినపడుతుంటారు.
.
పెట్రోలు బంకు ఉద్యోగులు: రోజంతా పెట్రోలు వాతావరణంలో, ఆ గాలిలో గడిపే వారిలో బెంజీన్‌, టొలీన్‌ వంటి రసాయనాల ప్రభావంతో ఎప్పుడూ మగతగా ఉండటం తరచూ ఎదురయ్యే సమస్య. కండరాల బలహీనత, మొద్దుబారినట్టుండటం వంటివీ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా నిదానంగా తలెత్తే సమస్యలు. వీరిలో కళ్ల మంట, కళ్ల నుంచి నీరు, దగ్గు, తలనొప్పి, డస్సిపోవటం, గొంతులో నస, దురద వంటి ఇబ్బందులు తరచుగా కనిపిస్తాయి. చర్మం పాలిపోవటం, రక్తహీనత కూడా బాధిస్తున్నాయి. అందుకే ఇటువంటి సమస్యలు కనబడినప్పుడు బంకులో పనిచేస్తున్న విషయాన్ని కూడా వైద్యుల దృష్టికి తీసకువెళ్లటం అవసరం.
.
క్రోమియం, ప్లేటింగ్‌ కార్మికులు:తోళ్లను శుద్ధి చేయటానికి ఉపయోగించే క్రోమియం ప్రభావం వల్ల ఆ పరిశ్రమ ఉద్యోగులకు ముక్కు దూలానికి రంధ్రాలు పడుతుంటాయి. ఈ క్రోమ్‌ పడని వారికి చర్మం మీద అలర్జీ వస్తుంది. క్రోమియం, క్యాడ్మియం వంటి వాటివల్ల మూత్రనాళాలు దెబ్బతినటం, శరీరంలోని కణజాలం తీవ్రమైన ఒత్తిడికి గురికావటం (ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌) వంటివీ ఎక్కువ.
.
హమాలీ కూలీలు: ఆహార ధాన్యాలను నిల్వచేసే ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, హమాలీలకు కీళ్లనొప్పులు, వెన్నునొప్పి రావొచ్చు. అలాగే ధాన్యం బస్తాల్లోని ధూళి వల్ల ఉబ్బసం తరహా (ఆక్యుపేషనల్‌ ఆస్థమా) సమస్యలకు దారి తీయొచ్చు.
.
డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది: రోగుల మధ్య గడుపుతూ నిరంతరం సూదులు, కత్తెరల వంటివి వాడుతుండటం వల్ల డాక్టర్లు, నర్సులు, దంతవైద్యులు, ల్యాబొరేటరీ సిబ్బంది వంటివారికి తరచూ గాయాలు కావటంతో పాటు వాటి ద్వారా హెపటైటిస్‌-బి, సి, హెచ్‌ఐవీ వంటివి సోకే ప్రమాదం ఎక్కువ. ఆపరేషన్‌ థియేటర్‌లో మత్తుమందు వాయువుల ప్రభావం, శరీర భంగిమలతో వచ్చే నడుం నొప్పి కూడా బాధిస్తాయి. ముఖ్యంగా దంతవైద్యులకు అమాల్గమ్‌ల వల్ల శరీరంలోకి పాదరసం చేరటం, ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.

* గాయకులు, టీచర్లు: నిరంతరం గొంతును ఎక్కువగా ఒత్తిడికి గురిచేయటం వల్ల స్వర సమస్యలు, ముఖ్యంగా స్వర పేటిక మీద బుడిపెలు (సింగర్స్‌ నాడ్యూల్స్‌) వంటివి తలెత్తుతుంటాయి. ఇవి మతబోధకుల్లోనూ కనిపిస్తాయి.

* స్వర్ణకారులు: వెండి, ఫిలిగ్రా వంటివాటితో ఆభరణాలు చేసే వారికి లెడ్‌, క్యాడ్మియం వంటివి శరీరంలోకి పోయి రకరకాల వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.

* వ్యవసాయ కూలీలు: క్రిమిసంహారకాల అవశేషాల ప్రభావం, పేగుల్లో కొంకి పురుగులు చేరటం, రకరకాల గాయాల వంటివి ఎక్కువ. పొగాకు పొలంలో పనిచేసేవారిలో- వాన, మంచుల కారణంగా తడిగా ఉన్న పొగాకు నుంచి నికోటిన్‌ చర్మం ద్వారా ఎక్కువగా శరీరంలో ప్రవేశించి.. 'గ్రీన్‌ టొబాకో సిక్‌నెస్‌' అనే సమస్య బారినపడతారు. దీనివల్ల వికారం, తలనొప్పి, తీవ్రమైన బలహీనత వంటి సమస్యలు మొదలవుతాయి.

* ఇళ్లలో పనివారు: ఇళ్లలో పనివారు నిరంతరం తడిలో తిరగటం, పనులు చెయ్యటం వల్ల చేతులు, కాళ్లకు ముఖ్యంగా వేళ్ల మధ్య ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ.

* బ్యూటీషియన్లు: అందాన్ని పెంపొందించే బ్యూటీషియన్లు, రోజంతా సెలూన్లలో పనిచేసే వారికి అలర్జీల బెడద ఎక్కువ.
.
రసాయనముల వలన --
*సీసం: మోటారు కారు బ్యాటరీల తయారీ, మన పింగాణీ వస్తువులపై ఉపరితలం మీద పాలిషింగ్‌కు 'లెడ్‌ గ్లేజింగ్‌' పని చేసేవారిలో, సీసం గనుల్లో పని చేసే వారిలో- సీసం సూక్ష్మమైన ధూళి రూపంలో శరీరంలోకి వెళ్తుంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో ఉండే సీసం చర్మం ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. సీసం దుష్ప్రభావాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కడుపు నొప్పి (లెడ్‌ కాలిక్‌). చాలామంది దీన్ని గుర్తించక అదేదో కడుపు నొప్పి అనుకుని బాధలు పడుతుంటారు. వైద్యులు కూడా దీనిపై దృష్టిపెట్టే అవకాశాలు తక్కువ. వీరిలో రక్తహీనత కూడా ఉండొచ్చు. వీరికి- రక్తంలో సీసం ఏ స్థాయిలో ఉందన్నది చూడటం, జింక్‌ ప్రోటోపార్ఫరిన్‌, మూత్రంలో సీసం, డెల్టా అమినోలెవలియానిక్‌ యాసిడ్‌ వంటి పరీక్షలు చేసి దాని మోతాదును గుర్తిస్తారు. సమస్యకు మూలం సీసమని గుర్తిస్తే- దీనికి చక్కటి చికిత్స ఉంది. అందుకే వీరు వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని చెప్పటం అవసరం.
*బ్యాటరీ తయారీ పరిశ్రమల్లో పనిచేసేవారు, పింగాణీ పనివారు, రసాయన ఫ్యాక్టరీల్లో పనిచేసేవారిలో ఈ సమస్యలు ఎక్కువ.
* దుమ్మూ ధూళి: ఉపరితల గనులు, భూగర్భ గనులు, తాపీ పనివారు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక రాళ్ల పనివారు, కంపెనీల్లో భారీ ఫర్నేస్‌ల కోసం రిఫ్రాక్టరీ బ్రిక్స్‌ తయారుచేసేవారు.. వీరందరికీ దుమ్మూధూళి సంబంధ సమస్యలు ఎక్కువ. ధూళిలో కూడా రెండు రకాలున్నాయి. మామూలు పొడి ధూళి వల్ల బ్రాంకైటిస్‌, ముక్కు కారటం వంటి సమస్యలు వస్తాయి. వీరిలో చాలామందికి ఆస్థమా లక్షణాలు (ఆక్యుపేషనల్‌ ఆస్థమా) తలెత్తచ్చు. ఇక 7 మైక్రాన్ల కన్నా సూక్ష్మపరిమాణంలో ఉండే ధూళి రేణువులైతే వూపిరితిత్తుల్లోనే ఉండిపోతాయి.. వీటినే న్యూమోకోనియోసిస్‌ అంటారు. ధూళి పదార్థాలను బట్టి సిలికోసిస్‌, యాంత్రొకోసిస్‌, సెడరోసిస్‌ వంటి రకరకాల వూపిరితిత్తుల సమస్యలు వేధిస్తాయి. వీటితో వూపిరితిత్తుల క్షయ (సిలికో- ట్యూబర్‌క్యులోసిస్‌) కూడా రావచ్చు. కాబట్టి వూపిరితిత్తుల సమస్యలు వస్తే ఇటువంటి వృత్తి నేపథ్యమేదైనా ఉందా? అన్నదీ చూడాల్సి ఉంటుంది. ఈ
వృత్తుల్లో వారికి తరచుగా వూపిరితిత్తుల సామర్థ్య పరీక్షలు చేయటం ద్వారా సమస్యలను ముందే గుర్తించవచ్చు.
* గని కార్మికులు, క్వారీ పనివాళ్లు, తాపీ పనివారు, ఇటుక తయారీదారులు.. వీరందరికీ ఈ సమస్యలు ఎక్కువ.
* రేడియేషన్‌: ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం ఎక్స్‌రేలను ఉపయోగించటం తెలిసిందే. అలాగే పెద్ద పరిశ్రమల్లో లోహాల నాణ్యత నిర్ధారణ కోసం కూడా ఎక్స్‌రేలను వాడతారు. ఈ టెక్నీషియన్లంతా రేడియో ధార్మికత ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది. వీరందరికీ 'బాబా అటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌' వారు బ్యాడ్జీలు ఇస్తారు. రోజూ పనిలో వాటిని ధరిస్తుండాలి. కొద్దికాలం తర్వాత ఆ బ్యాడ్జిలను పరీక్షకు పంపితే- ఒకవేళ ఎక్కువ మోతాదు 'గామా రేడియేషన్‌' ప్రభావానికి గురవుతుంటే దానిలో బయటపడుతుంది. అప్పుడు వారిని కొన్నాళ్ల పాటు పనికి దూరంగా ఉంచుతారు. రేడియేషన్‌కు గురైతే రక్తనాళాలు, ఎముక మూలుగ ప్రభావితమై రకరకాల తీవ్రమైన సమస్యలు చుట్టుముడతాయి.
*ఆసుపత్రుల్లోని ఎక్స్‌-రే టెక్నీషియన్లలో, భారీ పరిశ్రమల్లో లోహాల నాణ్యత నిర్ధారణ కోసం ఎక్స్‌-రేలు వాడే వారిలో ఈ సమస్యలు ఎక్కువ.
* విపరీతమైన వేడి: ఇందులో పొడి వేడి, ఆవిరితో కూడిన తడి వేడి అని రెండు రకాలు. బట్టల మిల్లుల్లో తడివేడి చాలా ఎక్కువ. వేడి పెరిగినపుడు చెమట ఎక్కువ పడుతుంది. కాబట్టి వేడితో పాటు గాలి వేగం, గాలిలో తేమ ఎలా ఉన్నాయన్నదీ కీలకమే. దీని కారణంగానే బట్టల మిల్లు పనివారిలో- కాలి పిక్కల నొప్పి (క్రాంప్స్‌), కాలి కండరాల బలహీనత వంటివి ఎక్కువ. తలనొప్పి, వికారం, వడదెబ్బలాంటి సమస్యలూ ఎక్కువ. అందుకే వేడి ప్రాంతాల్లో పనిచేసేవారికి మధ్యమధ్యలో ఎక్కువ విరామం ఇస్తుంటారు. వీరి ఒంట్లో నీరు తగ్గకుండా (డీహైడ్రేషన్‌ రాకుండా) ఉప్పు-పంచదార వంటివి కలిపిన నీరు ఎక్కువగా ఇస్తుంటారు. చుట్టుపక్కల నీటి నిల్వలూ ఉంచుతారు.
*భారీ కొలిమిలు ఉండే ఇనుము తయారీ, టెక్స్‌టైల్‌, గాజు తయారీ వంటి పరిశ్రమల్లో పనివారికి ఈ సమస్యలు ఎక్కువ.
* శబ్దాలు: శబ్దాలను ఎక్కువగా వినాల్సి రావటం వల్ల చాలా పరిశ్రమల్లోని ఉద్యోగులు, కార్మికులకు వినికిడి లోపాలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీరిలో పౌనఃపున్యం అధికంగా ఉన్న ధ్వనులు (హైఫ్రీక్వెన్సీ) వినపడటం మందగిస్తుంది. కాబట్టి వీరంతా తప్పనిసరిగా తరచుగా వినికిడి పరీక్ష (ఆడియోమెట్రీ) చేయించుకుంటూ ఉండాలి. చెవిలో ప్లగ్స్‌, ఇయర్‌ మఫ్స్‌ వంటివి తప్పనిసరిగా ధరించాలి.
*కంప్రెషన్‌ హౌజ్‌లు, జనరేటర్‌ హౌజ్‌లు, విద్యుత్తు ప్లాంట్లు, భారీ పరిశ్రమల ఉద్యోగులకు ఈ శబ్దాల, వినికిడి సమస్య ఎక్కువ.
.
వృత్తి వెంటే వ్యాధి
* ఆస్థమా: ఈ రకం ఉబ్బసం చాలా రకాల వృత్తుల్లో వారికి రావచ్చు. ముఖ్యంగా రబ్బరు ఫోమ్‌ బెడ్‌ల తయారీలో ఉపయోగించే ఐసోసైనైడ్‌ రకం రసాయనాల వల్ల ఇది ఎక్కువగా వస్తుంది.

కార్బరండం గ్రైండింగ్‌ వీల్స్‌ మీద పని చేసే వారికి కూడా ఆ ధూళి వల్ల ఈ రకం ఉబ్బసం రావొచ్చు. ధాన్యం బస్తాలు మోసే వారిలో కూడా ఇది ఎక్కువ. అలర్జీలూ ఎక్కువే.
* క్యాన్సర్‌: పెయింట్ల తదితరాల్లో ఉపయోగించే బెంజీన్‌ డెరివేటివ్స్‌ వంటివి వాడే పరిశ్రమల్లో వారిలో మూత్రాశయ క్యాన్సర్లు చాలా ఎక్కువ. రసాయన పరిశ్రమల్లో క్యాన్సర్లు అధికంగా వస్తుంటాయి.
.
మీరేం చేస్తుంటారు?
ఏదైనా ఆరోగ్య సమస్యతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు బాధల గురించీ, వంశంలో వ్యాధుల చరిత్ర గురించీ.. వైద్యులు రకరకాలుగా ప్రశ్నలు వేస్తుంటారు. కానీ వీటితో పాటు 'మీ వృత్తి ఏమిటి? రోజూ ఏం చేస్తుంటారు?' అన్న ప్రశ్న వెయ్యటం కూడా చాలా అవసరమని.. చేసే వృత్తుల వల్ల కూడా కొన్నికొన్ని రకాల వ్యాధులు తలెత్తే అవకాశం ఉందని బలంగా నొక్కి చెప్పిన మహానుభావుడు ఇటలీకి చెందిన బెర్నార్డినో రమజ్జిని. 17వ శతాబ్దానికి చెందిన ఆయనే 'ఆక్యుపేషనల్‌ మెడిసిన్‌' అనే ప్రత్యేక విభాగానికి పునాది వేశాడు. అందుకే వైద్యరంగం నేటికీ ఆయనను 'వృత్తి వైద్య పితామహుడి'గా గుండెల్లో పెట్టుకుంది.

డా. ఎ.ప్రభాకరరావు--ఆక్యుపేషనల్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌, విశాఖపట్టణం.
  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.