Tuesday, November 29, 2011

పోలియో, Polioఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --పోలియో, Polio-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


పోలియో అని సాధారణంగా పిలవబడే 'పోలియోమైలెటిస్' (Poliomyelitis) అనే వ్యాధి వైరస్ ద్వారా కలిగి,నాడీ మండలాన్ని దెబ్బ తీసే ఒక వ్యాధి. వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వచ్చే జబ్బులలో పోలియో వ్యాధి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. బిడ్డ చిన్నతనంలో అవగాహనా లోపంతో తల్లిదండ్రులు చేసే చిన్న పొరపాటు కారణంగా బిడ్డ జీవితాంతం పోలియో వ్యాధిగ్రస్తుడుగా మిగిలిపోవల్సి రావడం నిజంగా దురదృష్టమే! అందుకే పోలియో వ్యాధి లక్షణాలనూ, పోలియో వ్యాధి రాకుండా తీసుకోవల్సిన ముందు జాగ్రత్తలనూ ప్రతి వ్యక్తీ
తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 • వ్యాపించే విధానము :
ముఖ్యంగా రెండు విధాలుగా ఈ జబ్బు రావచ్చు. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఇదొక రకం.
మరొక విధం ఏమిటంటే - ఈ వ్యాధి క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార

పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. మలం మీద వాలిన ఈగలు, మళ్ళీ ఆహార పదార్థాలమీద వాలడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. గొంతులో చేరిన క్రిములు , రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.

కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి క్రిములు ఒక సారి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్దిపొందుతూ, క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు

రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడి మండలం దెబ్బతిని కదల్చడానికి వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి. రెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇది త్వరితగతిన సోకుతుంది. కాబట్టి అతి చిన్న శిశువు దశ నుండి బిడ్డకు రెండున్నర మూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకూ వ్యాక్సిన్లు తీసుకోవడం అవసరం. అంతే కాకుండా శిశువైద్యనిపుణుల సలహాలను పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం బిడ్డ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

 • లక్షణాలు :
పోలియో అనేది జ్వరం, జలుబు, వాంతులు, కండరాల నొప్పులతో ప్రారంభమవుతుంది. కొంతమందిలో ఈ లక్షణాలు మాత్రమే ఉండగా, ఇంకొంతమందిలో మాత్రం కొన్నిసార్లు శరీరంలో ఒక భాగం బలహీన మవుతుంది. సామాన్యంగా ఒక కాలికి గానీ, లేదా రెండు కాళ్ళకూ గానీ ఈ విధంగా జరగవచ్చు. కాలక్రమేణా శక్తివిహీనమైన కాలు రెండవ కాలు పెరిగినంత వేగంగా పెరగదు.

ఒకసారి ఈ జబ్బు వచ్చాక ఇంక ఏ మందూ అవయవం చచ్చుపడిపోకుండా నివారించలేదు. ఏంటీ బయోటిక్స్‌ పని చేయవు. నొప్పి పుట్టే కండరాలకు నొప్పి తగ్గించేందుకు మందులు వాడవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ మాత్రమే బిడ్డకు ఈ వ్యాధి రాకుండా నివారించే ముందు జాగ్రత్త చర్య! పోలియో వ్యాధి రావడానికి వైరస్‌ ప్రధాన కారణం. ఈ వైరస్‌ మన శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థలోకి ప్రవేశించడం వల్లనే పోలియో వ్యాధి వస్తుంది. వైరస్‌ ఎంత త్వరితంగా వ్యాప్తి చెందుతోందన్న దానినిబట్టే పోలియో ప్రభావం కూడా ఉంటుంది. కొందరిలో ఇది నరాల బలహీనతకు దారి తీస్తుంది. తద్వారా నరాలు బలహీనపడి కొద్దికాలానికి చచ్చుపడిపోతాయి.

కొంతమందిలో పోలియో పక్షవాతాన్ని పోలి ఉంటుంది. నిజం చెప్పాలంటే- పోలియో పక్షవాతం, రెండూ దాదాపుగా ఒకే లక్షణాలతో ఉంటాయి కూడా!

 • వ్యాధి నిరోధక శక్తి
ఒక విచిత్రం ఏమిటంటే , ఈ జబ్బు అశుభ్రవాతావరణంలో పుట్టి పెరిగిన పసిపిల్లలకి అనగా మురికి వాడలలోనూ, గుడిసెలలోనూ పుట్టి పెరిగిన పిల్లలకు సాధారణంగా రాదు. కాని మంచి పరిశుభ్రమైన వాతావరణంలో - ఆధునిక నగరాల్లో పుట్టి పెరిగే పిల్లలకే సులభంగా ఈ వ్యాధి సోకుతుంది. దీనికి కారణం ఏమిటో మీకు తెలుసా?.

అశుద్ధ వతావరణంలో పుట్టి పెరిగే పిల్లల కడుపులోకి ఈ క్రిములు ఆహార పానీయాదుల ద్వారా కొద్దికొద్దిగా ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పిల్లల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి క్రొత్తగావచ్చే క్రిముల్ని చంపి వేయడం జరుగుతుంది. అందుచేత ఈ పిల్లలకు పోలియోవ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువ.

పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కడుపుల్లో వ్యాధి క్రిములు ప్రవేశించి నిరోధక శక్తి ఏర్పడే అవకాశం లేదుగదా! అందువల్ల చుట్టుపట్ల ఈ వ్యాధి క్రిములు బాహాటంగా వ్యాపించినప్పుడు, పిల్లల కడుపులోకి ఆ క్రిములు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ పిల్లలకు పోలియో జబ్బు వస్తుంది.
 • వ్యాధి తీవ్రత
మొట్ట మొదటి 48 గంటల కాలం మిక్కిలి వేగంగానూ, ఆ తర్వాత 2, 3 రోజులపాటు కొంచెం మెల్లగానూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నాడీ మండలం, కండరాలూ దెబ్బ తినడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అప్పుడు జబ్బు తీవ్ర రూపం దాల్చినట్టు భావించాలి. బలహీనమైన కండరాలలో బాధ ఆరంభమవుతుంది. తర్వాత కండరాలు కుంచించుకుపోయి, బిగుసుకుపోతాయి. ఆ ప్రదేశాలను తాకితే విపరీతమైన నొప్పి కలుగుతుంది. తర్వాత రెండు మూడు రోజులలో ఆ కండరాలు బిగుసుకుపోవడం పోయి మళ్ళీ అవి సడలిపోతాయి.
మెడచుట్టూ వున్న కండరాల తాలుకు జీవకణాలూ, శ్వాసకోశాన్ని కదిల్చే కండరాల తాలుకు జీవకణాలూ దెబ్బ తిన్నప్పుడు మెడ వాలిపోవడం, శ్వాసకోశం , పనిచేయకపోవడం జరగవచ్చు. ఆహారం మ్రింగే ప్రదేశంలో వున్న కండరాలు దెబ్బ తిన్నప్పుడు మ్రింగడం కష్టమై, ఆహారం శ్వాసకోశంలోకి ప్రవేశించడం జరగవచ్చు. కొన్ని సందర్భాలలో శ్వాసకోసం పూర్తిగా మూసుకుపోవడం కూడ సంభవం! చివరికి శ్వాసకోశ కండరాలు బిగుసుకుపోయి, శ్వాసకోశం పని చేయడం నిలిచిపోవచ్చు. • కొన్ని ముఖ్య విషయాలు :
 • * పోలియో వ్యాధి పూర్తి పేరు-- Poliomyelitis.
 • * పోలియో దేని ద్వారా వ్యాపిస్తుంది-- వైరస్.
 • * పోలియో వ్యాధికి తొలిసారిగా వ్యాక్సిన్‌ను ఎవరు కనుగొన్నారు-- జోనస్ సాల్క్.
 • * జోనస్ సాల్క్ ఏ దేశానికి చెందినవారు-- అమెరికా.
 • * పోలియో వాక్సినేషన్ ప్రారంభమైన సంవత్సరం-- 1952.
 • * పోలియో వ్యాధికి ఓరల్ వ్యాక్సిన్ (చుక్కల మందు) కనుగొన్న శాస్త్రవేత్త-- ఆల్బర్ట్ సాబిన్.
 • * ఆల్బర్ట్ సాబిన్ పోలియో వాక్సిన్ రూపొందించిన సం.-- 1954.
 • * పోలియో వచ్చిన పిల్లలకు సాధారణంగా వచ్చే వ్యాధి-- కుంటితనం.
 • * పోలియో వైరస్ ఏ భాగంపై ప్రభావం చూపుతుంది-- నాడీమండలంపై.
 • * భారతదేశంలో తొలి పోలియో రహిత జిల్లా-- పతనంతిట్ట (కేరళ).

 • ========================
Visit my website - > Dr.Seshagirirao.com/

1 comment:

 1. nice blog ......... & nice post ...i am a polio patient sir .... దీని గురించి మరింత సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుంది ...
  ఇది నా బ్లాగు సార్ http://ourtechworld.weebly.com/

  ReplyDelete

Your comment is very important to improve the Web blog.