Monday, November 28, 2011

మహిళల్లో పురుష లైంగిక హార్మోనులు, Male sexual hormones in Females


  • image : courtesy with Prajashakti News paper.

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మహిళల్లో పురుష లైంగిక హార్మోనులు(Male sexual hormones in Females)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్త్రీ పురుష లింగ బేధం ఏ దశలో ఏర్పడుతుందనే విషయాన్ని అనేక పరిశోధనల ద్వారా తెలుసుకొన్నారు. పురుష బీజం స్త్రీ గర్భంలోని అండాన్ని చేరుకొన్న క్షణంలోనే స్త్రీ పురుష లింగ బేధం ఏర్పడుతుందని నిర్ధారించ బడింది. కాని భౌతికంగా బాహ్య చిహ్నాలు కన్పించటానికి కొంతకాలం పడుతుంది. గర్భం దాల్చిన ఆరు వారాలకు పురుషలింగ చిహ్నం కన్పిస్తుంది. స్త్రీ మర్మావయవాలు రూపురేఖలు దిద్దుకోవడానికి మూడు నెలలు పడుతుంది. మెదడు లింగబేధానికి అవసరమైన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి కార్యప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తుంది. గర్భస్త శిశువు తన భావిజీవితానికి అవసరమైన శక్తి యుక్తులను పుట్టకపూర్వమే సంతరించుకొంటుంది. అందువల్లే పుట్టిన క్షణం నుండి ఆడపిల్లల, మగ పిల్లల ప్రవర్తనలలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. జన్యుకణాల ద్వారాను, హార్మోనుల ద్వారాను గర్భస్థ శిశువు తన కవసరమైన శక్తియుక్తులను సంపాదించుకొంటుంది.


పురుషుల్లో బీజాల నుండి, ఎడ్రినల్‌ నుండి టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి అవుతుంది. పురుషుల మగతనానికి ఇది అత్యంత ముఖ్యమైంది. ఇది లేకపోతే మీసాలు, గడ్డాలు పెరగవు. గొంతులో మార్పు రాదు. సెక్స్‌లోపం కూడా సంభవిస్తుంది. మహిళల్లో కూడా టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉంటుంది. కాకపోతే పురుషుల్లో కన్నా బాగా తక్కువగా ఉంటుంది. మహిళల్లో ఎడ్రినల్‌ గ్రంథుల నుండి టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి అవుతుంది. పురుషుల్లో ప్రతి 100 మిల్లీలీర్ల రక్తంలో 300 నానోగ్రాముల నుండి 1200 నానోగ్రాముల దాకా టెస్టోస్టిరాన్‌ ఉంటుంది. మహిళల్లో ప్రతి 100 మిల్లీలీరట్ల రక్తంలో 15 నుండి 100 నానోగ్రాముల పరిమాణంలో టెస్టోస్టిరాన్‌ ఉంటుంది.


ఆండ్రోజన్లు ... అంటే పురుషు లైంగిక హార్మోనులు మహిళల్లో లైంగిక వాంఛను, శక్తిని, ఎముకల సాంధ్రతను, కండరాల పటుత్వాన్ని పెంచుతాయి. అండాల్లోని పురుష హార్మోనుల చురుకుదనం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అండాశయంలో ఫాలికిల్స్‌ ఉంటాయి. ఇవి కూడా ఒక రకమైన కణాలు. ఫాలికిల్స్‌ నుండి అండాలు విడుదలవుతాయి. పురుష హార్మోనులు ఫాలికిల్‌ పెరుగుదల, ఎదుగుదల ,అభివృద్ధిని నియంత్రిస్తాయి. అదే సమయంలో పెరుగుతున్న అండాలు కలిగున్న ఫాలికిల్స్‌ క్షీణించడాన్ని నివారిస్తాయి.


ప్రయోజనం : టెస్టోస్టిరాన్‌, ఆండ్రోస్టెనిడియోన్‌ ప్రధానమైన ఆండ్రోజన్లు. ఇవి పురుషుల్లో అధికంగా ఉంటాయి. ఇవి మగతనానికి ప్రతీక. సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇతర ఆండ్రోజన్లు... డిహైడ్రోటెస్టోస్టిరాన్‌, డీహైడ్రో ఎపియన్‌డ్రొస్టిరాన్‌, డీహైడ్రో ఎపియన్‌డ్రొస్టిరాన్‌-సల్ఫేట్‌. ఈస్ట్రోజన్లుగా మారడమే ఈ ఆండ్రోజన్ల ప్రధాన ఉద్దేశం. వీటినే మహిళా హార్మోన్లని అంటారు. మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోను సంయోగానికి ఆండ్రోజన్ల అవసరం ఎంతైనా ఉంది. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళల్లో ఎముకల బలహీనతను, లైంగిక వాంఛ, సంతృప్తిని నివారించడంలో కీలక పాత్రపోషిస్తాయి. మెనోపాజ్‌కు ముందు, తర్వాత శరీర చర్యలను నియంత్రిస్తాయి.


ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే? : కొంత మంది మహిళల్లో ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే అది ప్రమాదానికి దారితీస్తుంది. మొటిమలు రావడం, పైపెదవి లేదా గడ్డంపై వెంట్రుకలు రావడం, వెంట్రుకలు పలుచబడడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. అత్యధిక స్థాయిలో టెస్టోస్టిరాన్‌ ఉన్న మహిళల్లో పాలిసిస్టిక్‌ ఒవరి సిండ్రోం రుగ్మత ఉంటుంది. దీని వల్ల పీరియడ్స్‌ వచ్చే క్రమం తప్పుతుంది. సంతానోత్పత్తి సమస్యలేర్పడతాయి. బ్లడ్‌షుగర్‌ వ్యాధులొస్తాయి. ఈ సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే, పాలిసిస్టిక్‌ ఒవరీ సిండ్రోమ్‌ ఉన్నా లేకున్నా మహిళల్లో తీవ్ర అనారోగ్య పరిణామాలు ఏర్పడతాయి. ఇవి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటుకు, గుండె జబ్బుకు దారితీస్తాయి.


ఆండ్రోజన్‌ స్థాయి తక్కువైతే..? : ఆండ్రోజన్‌ స్థాయి ఎక్కువైతే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులొస్తాయని తెలుసుకున్నాం. మరి ఆండ్రోజన్‌ స్థాయి తక్కువైనా కూడా సమస్యలే. దీని వల్ల లైంగిక వాంఛ తగ్గుతుంది. అలసటగా ఉంటుంది. ఎముకల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా మహిళల్లో ఏ వయసులోనైనా తక్కువ ఆండ్రోజన్‌ స్థాయి ప్రభావం కనిపించొచ్చు. అయితే ముఖ్యంగా మెనోపాజ్‌ దశకు చేరుకుంటున్న తరుణంలో లేక మెనోపాజ్‌ దశకు ముందు ఎక్కువ కనిపించొచ్చు. 20 ఏళ్ల వయసుకు చేరుకునే సరికి ఆండ్రోజన్‌ స్థాయి తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్‌ దశకు చేరుకునే సరికి యాభైశాతం తగ్గుతుంది.


చికిత్స : ఆండ్రోజన్‌ సమస్య ఉన్న వారికి నోటి ద్వారా లేదా ఇంజక్షన్‌ ద్వారా తీసుకునే ఈస్ట్రోజన్‌/టెస్టోస్టిరాన్‌ మందులు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రోజన్‌ లోపమున్న వారిలో లైంగిక వాంఛను, సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచడంలో ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. అంతేకాక ఎములక బలహీనత నుంచి రక్షణ పొందొచ్చు. అయితే ఈ మందుల వల్ల ఒక ప్రమాదముంది. వీటిని వాడడం వల్ల రొమ్ము, ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదమే కాక, బ్లడ్‌ కొలెస్ట్రాల్‌, కాలేయం విషపూరితమవుతాయి. ఆండ్రోజన్‌ లోపానికి, భావోద్వేగానికి, ఆరోగ్యంగా ఉండడానికి సంబంధముంది. మెనోపాజ్‌కు ముందు, తర్వాత మహిళకు చేసే టెస్టోస్టిరాన్‌ థెరపీ ప్రయోజనం చూకూరుస్తుంది
  • ==========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.