ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు
--ఎత్తును పెంచే మందులున్నాయా?-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
- పుట్టినప్పటి నుంచి అబ్బాయిల్లో 18 ఏళ్ల వరకు, అమ్మాయిల్లో 16 సంవత్సరాల వరకు ఎముకల్లో పొడవు పెరుగుదల ఉంటుంది. ప్రతి ఎముకలోను కింద భాగానా, పైభాగాన కల రెండు మెటాఫైసిస్ యూనిట్లలో పెరుగుదలకు సంబంధించిన కణజాలం ఉంటుంది. దీన్ని గ్రోత్‌ప్లేట్ అంటారు. ఈ కణజాలం ప్రతి వ్యక్తిలోను తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన (జీన్స్) అనువంశిక లక్షణాలకు లోబడి వ్యక్తి పొడవు నిర్ణయమవుతుంది. కొంతవరకు ఆహార పోషక పదార్థాలు ఎత్తు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకానీ రకరకాల వ్యాపార ప్రకటనలతో మోసపోయి ఎక్కువ ఎత్తు పెరగడం అనే అపోహను వదులుకోవాలి.
- ఎత్తును పెంచే హార్మోన్ థెరపీ
కన్నబిడ్డలు నిలువెత్తు పెరగాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది.కానీ, కొంతమంది పిల్లల్లో ఆ ఎదుగుదల సవ్యంగా సాగకుండా ఏవో అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎత్తు పెరగడం అన్నది బాల్యంతో ముడిపడిన అంశం. అందుకే ఎదగడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే అన్ని చర్యలూ ఇప్పుడే చేపట్టాలి.
అందుకు పిల్లల ఎదుగుదలను పిన్న వయసు నుంచే నిశితంగా గమనిస్తూ ఉండాలి. లోపాలను చక్కదిద్దే విషయంలో ఏ ప్రయత్నం చేసినా 16 మహా అయితే 18 ఏళ్ల లోపే. ఆ వయసు దాటిపోతే ఇంక ఏ వైద్య విధానాలూ ఏమీ చేయలేవు. పిల్లలు ఏపుగా ఎదగాలని కోరుకుంటే సరిపోదు. అది కుంటుపడిపోతున్నపుడు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి ....
- ఎలా తెలియాలి ? తమ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారో లేదో తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి రూపొందాయి. సాధారణంగా 4నుంచి 8 ఏళ్లలోపు పిల్లలంతా దాదాపుగా ఒకే ఎత్తుతో ఉంటారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే తమ పిల్లలు చదివే తరగతిలోని మిగతా పిల్లలందరితో అప్పుడప్పుడు పోల్చి చూస్తుంటే ఆ తేడా తెలిసిపోతుంది. తరగతిలోని 97 శాతం మంది పిల్లలు తమ పిల్లవాడి కన్నా ఎక్కువ ఎత్తుతో ఉంటే అప్పుడు ఇతన్ని పొట్టిగా గుర్తించాలనేది ఒక శాస్త్రీయ నిర్ధారణ, అయితే, తమకు తామే తమ పిల్లలు పొట్టి అనే భావనతో ఉండిపోవడం కాదు. పిల్లల వైద్యుడు గానీ, ఎండోక్రినాలజిస్టు గానీ పరీక్షలు నిర్వహించి ఆ విషయాన్ని నిర్ధారించినప్పుడే లోపాలు ఉన్నట్లు భావించాలి. తల్లిదండ్రుల ఎత్తు ,వారి నేపథ్యంతో పాటు ఒక నిర్థారిత పట్టికను అనుసరించి నిపుణులు మాత్రమే ఆ లోపాలను సరిగ్గా అంచనా వేయగలుగుతారు. ఎదుగుదలలో కనిపించే అన్ని లోపాలూ శాశ్వతమైనవేమీ కావు. దీర్ఘకాలికంగా వ్యాధులబారిన పడి ఉన్న పిల్లల్లో ఎదుగుదల కొంత కాలం ఆగిపోవచ్చు. అయితే వ్యాధి పూర్తిగా నయం కాగానే ఎదిగే వేగం మళ్లీ పుంజుకుంటుంది. ఎదుగుదలలో నిజంగానే ఏదైనా ఆటంకం ఉన్నట్లు పరీక్షల్లో తేలితే అప్పుడు ఆ మూలాలను పరిశీలించవలసి ఉంటుంది.
కారణాలు అనేకం : పలురకాల కారణాలు పిల్లల సహజమైన ఎదుగుదలకు అడ్డుపడుతుంటాయి. వాటిలో ముఖ్యంగా --
పోషకాహారమే తీసుకుంటున్నా అని జీర్ణం కాకపోవడం, తరుచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, క్షయ వంటి తీవ్రవ్యాధులతో శరీరం క్షీణించిపోవడం, రక్తహీనత, కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు పొట్టి తనానికి దారి తీస్తాయి. అయితే, ఈ సమస్యలన్నీ వైద్య చికిత్సలతో సరిచేయగలిగేవే. సకాలంలో సమస్యను గుర్తించి పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తే పిల్లల ఎదుగుదల సహజవేగాన్ని పుంజుకుంటుంది. వ్యాయామం పాలు... ఎత్తు పెరగడానికి అవసరమయ్యే గ్రోత్ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎంతగా అందించినా వ్యాయామం లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. కండరాలు పెరగడానికేకాక ఎముకల వృద్ధికీ వ్యాయామం తప్పనిసరి.
ఎదుగుదల అన్నది పూర్తిగా శారీరకమేమీ కాదు. మానసిక ఒత్తిళ్ళు కూడా ఎదుగుదలను కుంటుపరుస్తాయి. శక్తికి మించిన మానసిక శ్రమ, కుటుంబసభ్యుల మధ్య నిరంతర కలహాలు, తల్లిదండ్రులు విడిపోవడంతో పిల్లలు నిరాదరణకు గురికావడం, లేదా అనాథలుగా మిగిలిపోవడం వంటివి ఎదుగుదలను బాగా దెబ్బతీస్తాయి.
తల్లిదండ్రులు, ఆపై వంశీకులంతా పొట్టివారైతే వారిపిల్లల్లో ఎక్కువ మంది ఆ లక్షణాలతో ఉంటారు. ఈ తరహా సమస్యలను సరిచేయడం మాత్రం కష్టమే. వంశీకులందరి ఎత్తు తక్కువే అంటే అది జన్యుపరమైన లక్షణమే తప్ప వ్యాధి కాదు. వీరికి జన్యుపరమైన చికిత్స చేసినా వాటి వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. తల్లిదండ్రులు ఇద్దరూ పొడుగ్గానే ఉన్నా పిల్లలు మాత్రమే పొట్టిగా ఉంటేఅప్పుడు ఆ లోపాలను పూర్తిగా పిల్లలకు సంబంధించినవిగానే భావించాలి. ఈ రకం లోపాలను చాలా సులభంగానే తొలగించవచ్చు. కాకపోతే చిన్న వయసులోనే ఆ ప్రయత్నాలు చేయాలి.
శరీరగ్రంథుల్లోంచి ఉత్సత్తి అయ్యే హార్మోన్లు నిరంతరం రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఎత్తు పెరగడానికి సంబంధించిన థైరాయిడ్ హార్మోన్లు, సెక్స్ హార్మోన్లు, గ్రోత్‌హార్మోన్లు సంయుక్తంగా తమ విధులను నిర్వహిస్తూ ఉంటాయి. వీటిలో గ్రోత్‌హార్మోన్లదే కీలక పాత్ర, మెదడు కింద అంటే నుదురు భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథి ఈ గ్రోత్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఎదిగే వయసులో ఈ హార్మోన్ల ఉత్పత్తి అధికంగా ఉండి క్రమేపీ తగ్గి మామూలు స్థాయికి చేరుతుంది. గ్రోత్ హార్మోన్ల లోపం ఎదుగుదలలో పెద్ద అవరోధంగా ఉంటుంది. అయితే ఈ హార్మోన్ల లోపం కొందరిలో పుట్టుకతోనే ఉంటే కొందరిలో మధ్యలోనూ తలెత్తవచ్చు. పిట్యూటరీ గ్రంథిపైన కణుతులు ఏర్పడినా, తలకు బలంగా దెబ్బ తగిలినా హార్మోన్ సమస్యలు తలెత్తవచ్చు. దీనివల్ల గ్రోత్‌హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి, ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. ఎదుగుదలలో లోపం ఉందని అనుమానం కలిగిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం కూడా చాలా ముఖ్యం. గ్రోత్ హార్మోన్ల లోపం వల్ల వచ్చే సమస్య ఎదుగుదల కుంటుపడటం ఒక్కటే కాదు. ఇది ఎముకలను బలహీనపరిచే ఆస్టియోపొరోసిస్ వ్యాధికీ, రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడానికి దారి తీస్తుంది. దీనితో పాటు కొలెస్ట్రాల్ పెరగడానికీ, గుండె రక్తనాళాలు గట్టిపడటానికి కూడా దారి తీస్తుంది. అలాగే ఆందోళన, వ్యాకులత, నిలకడలేనితనం వంటి మానసిక సమస్యలు కూడా గ్రోత్ హార్మోన్ల లోపం వల్ల సంక్రమిస్తాయి. అందుకే పిల్లల ఎదుగుదల లోపాలను పట్టించుకోకపోవడం అంటే అది మరికొన్ని ఇతర వ్యాధులను ఆహ్వానించడం కూడా అనే నిజాన్ని గ్రహించాలి. కృత్రిమ హార్మోన్లు ఇతర హార్మోన్లు కూడా కొంత తోడ్పడినా ఎత్తును పెంచడంలో గ్రోత్‌హార్మోన్లదే ప్రధాన పాత్ర. మొత్తం శరీర నిర్మాణంలోనూ ఈ హార్మోన్లే మూలధాతువుల్లా పనిచేస్తాయి. పొట్టితనానికి లోనయిన అత్యధికుల్లో ఈ హార్మోన్ లోపాలే ఉంటాయి. ఈ స్థితిలో కృత్రిమ గ్రోత్ హార్మోన్లను ఎక్కించడం ద్వారా ఈ సమస్యను తొలగించవచ్చు. జన్యువు మూల్యాంశాలతో ఈ హార్మోన్లను పరిశోధనాశాలల్లో కృత్రిమంగా తయారుచేస్తారు. వీటిని హ్యూమన్ రికాంబినెంట్ గ్రోత్ హార్మోన్లు అంటారు. ఇవి పూర్తిగా సురక్షితమైన ర్మోన్లు. గ్రోత్ హార్మోన్ల లోపంతో ఎదుగుదల నిలిచిపోయిన వారికి ఈ హార్మోన్లు సిరంజి ద్వారా ఇస్తారు. ఎదుగుదల సహజ స్థాయికి వచ్చేంత వరకు రోజు ఒకటి చొప్పున ఈ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కొంత ఎక్కువ కాలమే. ఈ చికిత్స అవసరమవుతుంది. హార్మోన్ లోపం లేని వారికి ఈ హార్మోన్లు ఇస్తే వచ్చే ఫలితం ఏమీ ఉండదు. గ్రోత్ హార్మోన్లు విటమిన్ మాత్రల్లాంటివి కావు.అనవసరంగా తీసుకుంటే వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. పిల్లలు లేత వయసులో అంటే 5 నుంచి 8 ఏళ్లలోపు ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అస్థిపంజరం లేతగా ఉన్న కాలంలో అయితేనే హార్మోన్ చికిత్స బాగా పని చేస్తుంది. అందుకే అనుమానం కలిగిన వెంటనే పిల్లల డాక్టర్‌ను గానీ, ఎండోక్రినాలజిస్టును గానీ సంప్రదించడం తప్పనిసరి. ఎక్కడో అరుదుగా తప్ప 16 ఏళ్లు దాటిన పిల్లల్లో చాలా మందికి హార్మోన్ల చికిత్స వల్ల పెద్ద ఫలితం ఉండదు. ఇక 18 ఏళ్లు దాటిన తరువాత ఎత్తు పెంచే మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎత్తును పెంచే ఇతరత్రా మందులు గానీ, మాత్రలు గానీ ఏమీ లేవు. హార్మోన్ చికిత్స ఒక్కటే ఇందుకు సరియైన మార్గం. అవసరమయ్యే గ్రోత్ హార్మోన్లను ఉత్తేజితం చేయడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాలు ఎంతగా అందించినా వ్యాయామం లేకపోతే ఎదుగుదల కుంటుపడుతుంది. కండరాలు పెరగడానికేకాక ఎముకల వృద్ధికీ వ్యాయామం తప్పనిసరి.
Visit my website - >
Dr.Seshagirirao.com/
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.