ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -- గౌట్ , Gout-- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ... కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది మృదువుగా కదలాల్సిన కీళ్లలో ఉప్పు గడ్డల్లాంటి స్ఫటికాలు తయారై... అవి సూదుల్లా పొడుస్తుంటే? ఆ బాధ వర్ణనాతీతం. ఉన్నట్టుండి వాపు.. లోపల నిప్పు రగులు తున్నట్టు మంట.. సరిగ్గా ఇలాంటి లక్షణాలతోనే మొదలవుతుంది గౌట్. సాధారణంగా కాలి బొటనవేలు మీద వాపుతో ఆరంభమై.. వదిలేస్తే మిగతా కీళ్లనూ కొరికేస్తుందిది! మొదటిసారి వచ్చినప్పుడు కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు గానీ నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు చెడిపోవటం వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. మన జీవనశైలి.. వూబకాయం వంటివీ దీనికి వూతమిస్తుండటంతో గౌట్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సరిగ్గా గుర్తిస్తే... చక్కటి చికిత్స తీసుకుంటే... మందులతో పూర్తిగా నయం చేయటానికి వీలున్న కీళ్ల సమస్య ఇది! రాత్రి పడుకుంటాం. అర్థరాత్రో.. తెల్లవారుజామునో.. కాలి బొటనవేలు కీలు నొప్పి మొదలవుతుంది. ఇక అది లావుగా వాచిపోతుంది. ఎర్రగా కందినట్త్లె.. విపరీతమైన నొప్పి. ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. 12-24 గంటల్లో నొప్పి తీవ్రస్థాయికి చేరుతుంది. ఏవో నొప్పి మందులు వేసుకున్నా.. ఏమీ వేసుకోకపోయినా కూడా 4, 5 రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఎందుకో వాపు వచ్చి పోయిందిలే అనుకుంటాం! కానీ అసలు సమస్య అక్కడ్నుంచే ఆరంభమవుతుంది. తర్వాత కొన్ని నెలలకో.. ఒకటి రెండు సంవత్సరాలకో.. బొటన వేలు మాత్రమే కాదు.. ఒంట్లోని చాలా కీళ్లలో మొదలవుతుందీ గౌట్ దాడి! వాపు. బాధ అక్కడి నుంచీ కొన్ని వారాల తేడాలోనో.. నెలల తేడాలోనో... కీళ్ల వాపు, నొప్పి వేధిస్తూనే ఉంటాయి. కీళ్లలో ఇసుక పోసినట్లుగా ఒకటే మంట. ఎర్రగా వాచిపోయి కదిలికలు కష్టం. ఇదీ 'గౌట్'... లేదా 'గౌటీ ఆర్త్థ్రెటిస్' ప్రధాన లక్షణం. ఇది ఏ కీలులోనైనా ఆరంభం కావచ్చుగానీ.. ఎక్కువగా కాలి బొటనవేలు కీలుతో ఆరంభమవటం దీని ప్రత్యేకత. మనకు కీళ్ల నొప్పులు రకరకాల కారణాల వల్ల రావచ్చు. కాస్త పెద్దవయసులో కీళ్లు అరిగిపోయి (ఆస్టియో ఆర్త్థ్రెటిస్) నొప్పులు రావచ్చు. కీళ్లలో వాతం మార్పులతో (రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్) నొప్పులు రావచ్చు. 'గౌటీ ఆర్త్థ్రెటిస్' కూడా ఇలాంటి కీళ్ల నొప్పుల సమస్యే అయినా.. దీన్ని సరిగ్గా గుర్తించి చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని కచ్చితంగా నయం చేసుకోవచ్చు. తరచూ దాడి చెయ్యకుండా అడ్డుకోవచ్చు. వదిలేస్తే కిడ్నీల్లాంటి కీలక అవయవాలకూ ముప్పు తెచ్చిపెడుతుందని తెలుసుకోవటం ఎంతైనా అవసరం. గుర్తించటమెలా? లక్షణాలు ప్రధానం. గతంలో కాలి బొటనవేలు లేదా మోకాలు వద్ద వాపు, నొప్పి ప్రారంభమవటం, కీలు బాగా వాచి.. చర్మం కంది.. నొప్పి, ముట్టుకుంటే వేడిగా ఉండటం, వాపు తగ్గుతున్న దశలో పైన చర్మం పొరలు పొరలుగా వూడి రావటం.. ఈ లక్షణాల ఆధారంగా గౌట్‌ను తేలికగానే గుర్తించవచ్చు. నిర్ధారణకు కొన్ని పరీక్షలున్నాయి. * రక్త పరీక్ష: రక్తంలో యూరిక్ ఆమ్లం ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది. * ఎక్స్‌రే: యూరిక్ ఆమ్లం స్ఫటికాలు కీలులోని ఎముకలను తినేస్తుంటాయి. ఎక్స్‌రేలో ఆ ఎముక కొరుకుడు పడినట్టుగా స్పష్టంగా చిత్రంగా (ఓవర్ హ్యాంగింగ్) కనిపిస్తుంది. * కీలలోని ద్రవం పరీక్ష: వాపు వచ్చిన కీలులోంచి సైనోవియల్ ద్రవాన్ని తీసి పోలరైజ్డ్ మైక్రోస్కోపు కింద పరీక్షిస్తే.. యూరిక్ ఆమ్లం స్ఫటికాలు కనబడతాయి. పురుషుల్లో ఎక్కువ గౌట్ సమస్య స్త్రీలలో కంటే పురుషుల్లో గౌట్ ఎక్కువ. ఎక్కువగా 30-45 ఏళ్ల మధ్య వస్తుంది. అయితే మెనోపాజ్ దాటిన తర్వాత స్త్రీలలో కూడా ఎక్కువగానే కనబడుతుంటుంది. లంకెల జబ్బులు గౌట్ బారినపడ్డ వారికి మధుమేహం, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్, హైపో థైరాయిడిజమ్ వంటివీ ఉండే అవకాశం ఉంది. అధిక బరువు, స్థూలకాయం కూడా వీరిలో ఎక్కువే. ఈ సమస్యలు మొదట్లో లేకపోయినా గౌట్‌ను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి గౌట్ బాధితులు మిగతా సమస్యల విషయంలోనూ జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. ఎక్కడుంది దీనికి మూలం? మనందరి రక్తంలోనూ యూరిక్ ఆమ్లం ఉంటుంది. ఇందులో మూడింట రెండొంతులు మన శరీరంలోని కణాల్లోనే తయారవుతుంది. కొంత మన ఆహారంలోని 'ప్యూరిన్ల' నుంచి వస్తుంది. ఈ యూరిక్ ఆమ్లం శరీరంలో చాలా ఎక్కువగా తయారవుతుండటం, లేదా తయారైన దాన్ని కిడ్నీలు సరిగా బయటకు పంపించలేకపోవటం వల్ల రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదు పెరిగిపోతుంది. ఇదే గౌట్‌కు మూలం. దీనికి జన్యు పరమైన కారణాల వంటివీ దోహదం చేస్తాయి. మాంసం (రెడ్‌మీట్), సముద్రపు ఆహారం తినేవారు.. మద్యం అలవాటు గలవారి రక్తంలోనూ యూరిక్‌యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీని మోతాదు 6-7 వరకు ఉంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అంతకు మించితే మాత్రం ఈ యూరిక్ యాసిడ్ కీళ్లలోని మృదులాస్థిలోకి చేరి, అక్కడ పేరుకుపోవటం మొదలవుతుంది. అలా పేరుకున్నది క్రమేపీ చిన్నచిన్న సూదుల్లాంటి ఆకృతిలో స్ఫటికాల్లా తయారవుతుంది. ఈ స్ఫటికాలు క్రమేపీ కీలు మధ్య భాగంలో చేరి చుట్టూ అదే పనిగా గుచ్చుతూ.. చికాకు పుట్టిస్తాయి. కంట్లో నలుసుపడితే నీళ్లు వచ్చినట్టే.. ఈ స్ఫటికాల తాకిడికి కీలులో ద్రవం ఊరటం మొదలవుతుంది. దీంతో వాపు, నొప్పి, ఎర్రగా కందిపోవటం వంటివన్నీ బయల్దేరతాయి. నొప్పి.. స్ఫటికాలు కీలులో ఎంత మొత్తంలో చేరాయన్నదాన్ని బట్టి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ వైఫల్యం గౌట్ నొప్పి తొలిసారి వచ్చినపుడు దానంతట అదే తగ్గిపోతుంది. రెండోసారి రావటానికీ చాలా సమయం పడుతుంది. దీంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తప్పు. దీంతో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. * గౌట్‌కు చికిత్స తీసుకోకపోతే కీళ్లు బాగా దెబ్బతిని రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ అంత తీవ్రంగా బాధించే ప్రమాదముంది. నొప్పి ఇతర కీళ్లకూ వ్యాపిస్తుంది. * చెవి తమ్మెల వద్ద, వేళ్ల కణుపుల వద్ద యూరిక్ ఆమ్లం స్ఫటికాలు పేరుకుని.. నొప్పి లేకున్నా.. చూడ్డానికి చర్మం మొద్దుబారినట్టు వికారంగా కనిపిస్తుంది. * గౌట్ వల్ల కిడ్నీల వైఫల్యం రావొచ్చు. కిడ్నీ వైఫల్యం వల్లా గౌట్ రావొచ్చు. గౌట్‌కు సరిగా చికిత్స తీసుకోకపోతే మూత్రనాళాల్లో యూరిక్ ఆమ్లం రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రాళ్లు మూత్రం సరిగా బయటకు వెళ్లకుండా అడ్డుపడటంతో కిడ్నీల్లో నీరు చేరి వాపు (హైడ్రో నెఫ్రోసిస్)కు దారితీస్తుంది. ఒకవేళ కిడ్నీలోనే స్ఫటికాలు చేరితే వడపోత ప్రక్రియ కూడా దెబ్బతిని, కిడ్నీ వైఫల్యం రావొచ్చు. * గౌట్ నొప్పికి చికిత్స చేయకపోతే.. కీలులోని ద్రవం బయటకు వచ్చి పుండ్లు పడొచ్చు. ఇవి ప్రత్యేకం! * గౌట్ తొలిసారి వచ్చి తగ్గిన తర్వాత రెండోసారి దాడి చేయటానికి ఒకట్రెండు సంవత్సరాలు పట్టొచ్చు. చికిత్స తీసుకోకపోయినా ఇలా నొప్పి, వాపు వంటివేవీ లేకుండా చాలాకాలం కొనసాగటం గౌట్‌లోనే కనిపించే ప్రత్యేక లక్షణం. అదే ఇతర ఆర్త్థ్రెటిస్ రకాల్లో అయితే నొప్పి నిరంతరం ఉంటుంది. * గౌట్‌కు చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినకొద్దీ.. వాపు, దాడి తరచుదనం పెరుగుతూ పోతుంది. అప్పటికీ చికిత్స తీసుకోకపోతే కీళ్లవాతం (రుమటాయిడ్ ఆర్త్థ్రెటిస్) మాదిరిగా చాలా కీళ్లల్లో నొప్పి, వాపు వచ్చే ప్రమాదం ఉంది. * గౌట్ ఒకేసారి చాలా కీళ్లల్లో వస్తే రుమటాయిడ్‌గానూ, తొలిసారి మోకాలు కీలులో వస్తే సెప్టిక్ ఆర్త్థ్రెటిస్‌గానూ పొరపడే అవకాశం ఉంది. గౌట్ వాపు కాలిబొటనవేలికే కాదు.. మడమలు, మోకాళ్లు, మోచేతులు, మణికట్టు, వేళ్లల్లోనూ రావొచ్చు. వెన్నెముక, భుజాలు, తుంటి వంటి భాగాల్లో రావటం మాత్రం చాలా అరుదు. చికిత్స ఏమిటి? కీళ్లనొప్పుల సమస్యలన్నింటిలోకీ ఒక్క గౌట్‌కు మాత్రమే పూర్తిగా నయం చేసే చికిత్స ఉంది. మందులను క్రమం తప్పకుండా వేసుకుంటే గౌట్ కోసం తరచుగా వైద్యులను సంప్రదించాల్సిన అవసరమే ఉండదు. * మొదటిసారి గౌట్ దాడి చేసినప్పుడు కేవలం నొప్పి తగ్గటానికి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. ఐబూప్రొఫేన్, డైక్లోఫెనాక్, కోల్చిసిన్ (గౌట్‌నిల్) వంటి మందులతోనే ఈ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. నొప్పి తీవ్రంగా ఉండే ఈ దశలోనే గౌట్‌ను తగ్గించే ప్రత్యేక మందులు (జైలోరిక్ వంటివి) ఇస్తే వ్యాధి మరింత ముదరొచ్చు. కాబట్టి తొలి నొప్పి, వాపు తగ్గిపోయిన తర్వాత మాత్రమే యూరిక్ ఆమ్లం మోతాదును తగ్గించే మందులు వాడాల్సి ఉంటుంది. గౌట్ మందుల్లో రెండు రకాలున్నాయి. 1. మూత్రం ద్వారా యూరిక్ ఆమ్లాన్ని బయటకు పంపించేవి 2. యూరిక్ ఆమ్లం ఉత్పత్తిని తగ్గించేవి. ప్రొబెనిసిడ్ వంటి మందులు కిడ్నీల్లో యూరిక్ ఆమ్లం వడపోతను పెంచి బయటకు పంపేస్తాయి. అల్లోప్యూరినాల్ (జైలోరిక్) వంటివి యూరిక్ ఆమ్లం ఉత్పత్తిని తగ్గిస్తాయి. ప్రస్తుతం ఫెబుక్జోస్టాట్ (జ్యూరిగ్) అనే కొత్త మందు కూడా అందుబాటులో ఉంది. * స్టిరాయిడ్స్: గౌట్ చికిత్సలో తాత్కాలిక స్టిరాయిడ్స్‌తోనూ మంచి ఫలితం కనబడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు గలవారికి, కిడ్నీ సమస్యలు గలవారికి నొప్పి నివారిణి మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీ) పనికిరావు. కొందరికి కోల్చిసిన్‌తో నీళ్ల విరేచనాల వంటివి రావచ్చు. ఇలాంటి వారికి స్వల్పకాలం స్టిరాయిడ్స్ బాగా పనిచేస్తాయి. * గౌట్ చికిత్సతో కొరుకుడు పడిన ఎముక తిరిగి సరికాకపోవచ్చు గానీ కీలు పనితీరు బాగా మెరుగుపడుతుంది. అన్ని కీళ్లు మామూలుగానే పనిచేస్తాయి. దీర్ఘకాలంగా గౌట్‌తో బాధపడేవారికి మాత్రం ఇందుకు ఎక్కువ సమయం పడుతుంది. * నొప్పి లేకున్నా మందులు: కీళ్లల్లోకి స్ఫటికాలు వెళ్లినపుడు మాత్రమే గౌట్ నొప్పి వస్తుంది. అందుకే చాలామందిలో యూరిక్ ఆమ్లం ఎక్కువున్నా చికిత్స తీసుకోకపోయినా గౌట్ రాదు. రక్తంలో యూరిక్ ఆమ్లం 8-9 ఉన్నా ఆహార నియమాలతో నియంత్రణలో ఉంచుకోవచ్చు. అయితే అది 10 దాటితే తీవ్ర సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి వారిలో కీళ్లల్లో నొప్పి లేకపోయినా కూడా గౌట్‌కు.. అంటే యూరిక్ ఆమ్లం తగ్గేందుకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. * చికిత్స తీసుకుంటున్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదును పరీక్షిస్తుండాలి. ఇది 5 దాటకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకసారి సమస్య నెమ్మదించాక ఏడాదికోసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదు పెరిగిన వారందరికీ గౌట్ రావాలనేం లేదు. కొందరిలో ఎలాంటి లక్షణాలు కనబడకుండా యూరిక్ ఆమ్లం ఎక్కువగా (ఎసింప్టమాటిక్ హైపర్ యురిసీమియా) ఉండొచ్చు కూడా. అందువల్ల యూరిక్ ఆమ్లం ఎక్కువున్నంత మాత్రాన చికిత్స చేయాల్సిన అవసరం లేదు. గౌట్ తరహా వాపు, దాడి మొదలైతేనే చికిత్స అవసరం. చాలామంది ఈ విషయం తెలియక గౌట్ దాడి చేయకపోయినా సరే.. యూరిక్ యాసిడ్ తగ్గటానికి మందులు వాడుతుంటారు. యూరిక్ ఆమ్లం స్ఫటికాలు ఒక్క కీళ్లలోనే కాదు.. ఒంట్లో మరికొన్ని ఇతర భాగాల్లోనూ పేరుకోవచ్చు. ముఖ్యంగా చెవి తమ్మెల మీద, కీళ్ల దగ్గర చర్మం కింద చిన్నగా, గట్టిగా గడ్డల్లా ఏర్పడతాయి. దీన్ని 'టోఫై' అంటారు. వీటితో నొప్పి ఉండదుగానీ కొన్నిసార్లు వీటిలోంచి చిక్కటి, తెల్లటి ద్రవం కారుతుంటుంది. స్ఫటికాలూ బయటకు వస్తుంటాయి. ఇతరత్రా వ్యాధుల్లో గౌట్ కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో వడపోత ప్రక్రియ దెబ్బతినటం వల్ల రక్తంలో యూరిక్ ఆమ్లం పెరిగి గౌట్ రావచ్చు. అలాగే క్యాన్సర్ బాధితుల్లో ఒంట్లో కణాల పెరుగుదల ఎక్కువై ఆ జీవక్రియలో భాగంగా యూరిక్ ఆమ్లం పెరిగి.. గౌట్ రావచ్చు. క్షయ చికిత్సలో వాడే కొన్ని ముందులు కూడా యూరిక్ ఆమ్లం పెరగటానికి కారణమవుతాయి. క్షయ మందుల కారణంగా వచ్చే గౌట్ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది కూడా. వీటిని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. * కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో గౌట్ వస్తే ముందు నొప్పి మందులు, గౌట్‌కు కారణమయ్యే ఇతరత్రా మందులేమైనా ఉంటే అవన్నీ ఆపెయ్యాలి. వీరు గౌట్ చికిత్స తీసుకోవటంతో పాటు కిడ్నీ జబ్బుకు కారణమైన డయాబెటిక్ నెఫ్రోపతీ, హైపర్‌టెన్షన్ నెఫ్రోపతీ వంటి వాటికీ మందులు వేసుకోవాల్సి ఉంటుంది. గౌట్‌లాంటిదే కానీ.. 'సూడో గౌట్' కొన్నిసార్లు గౌట్‌లాంటి లక్షణాలే కనిపిస్తాయిగానీ యూరిక్ ఆమ్లం ఎక్కువ ఉండదు. వీరిలో యూరిక్ ఆమ్లం స్ఫటికాలు కాకుండా.. క్యాల్షియం పైరోఫాస్ఫేట్ క్రిస్టల్స్ కనబడతాయి. దీన్నే 'సూడో గౌట్' అంటారు. కీలులోంచి ద్రవం తీసి చూస్తేనేగానీ ఈ విషయం తెలియదు. గౌట్‌తో పోలిస్తే ఇది కొంత అరుదే. ఆపరేషన్ చేయించుకున్నవారు, వృద్ధుల్లో ఎక్కువ. వీరిలో యూరిక్ ఆమ్లం మామూలుగానే ఉంటుంది. ఎక్స్‌రే తీస్తే ఎముక క్షీణించటం ఉండదు గానీ మృదులాస్థి గట్టిబడి (కాల్సిఫికేషన్) కనబడుతుంది. దీనికి నొప్పి నివారణ మందులు, తక్కువ మోతాదులో స్టిరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. జీవితాంతం మందులు వాడాలా? సాధారణంగా గౌట్ బాధితులు జీవితాంతం మందులు వేసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా మందులు వాడితే తిరిగి నొప్పి రావటమంటూ ఉండదు. అయితే స్థూలకాయులు బరువు తగ్గినపుడు, మద్యం అలవాటు గలవారు దాన్ని మానేసినపుడు రక్తంలో యూరిక్ ఆమ్లం స్థాయి తగ్గుతుంటే... వాళ్లు ఆయా కారకాలకు దూరంగా ఉంటూ... జీవనశైలిని మార్చుకుంటే సరిపోతుంది. జీవితాంతం మందులు వాడాల్సిన పనిలేదు. కొన్ని రకాల మందులతోనూ గౌట్ వచ్చే అవకాశం ఉంది. అలాంటివి వేసుకుంటున్న వాళ్లు వాటిని మానేస్తే సరిపోతుంది. పథ్యం ప్రధానం చాలామంది కీళ్లనొప్పులకు రకరకాల పథ్యాలు చెబుతుంటారు. వంకాయ, చింతపండు లాంటివి తినకూడదంటుంటారు. కానీ ఇది నిజం కాదు. ఏ రకం ఆర్త్థ్రెటిస్ కీళ్ల నొప్పులకూ.. ఎటువంటి పథ్యాలూ లేవుగానీ.. ఒక్క గౌట్ సమస్యకు మాత్రం పథ్యం అవసరం. గౌట్ బాధితులు ప్యూరిన్ (ప్రోటీన్లలో ఒక రకం) ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. అంటే మటన్, బీఫ్ వంటి రెడ్‌మీట్.. ముఖ్యంగా కాలేయం, కిడ్నీ, ఎముక మజ్జ, పేగుల వంటి జంతువుల అవయవాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే సముద్ర ఆహారం (చేపలు, రొయ్యల వంటివి)లో ఈ ప్యూరిన్ దండిగా ఉంటుంది. వీటిని తినటం మానెయ్యాలి. నిజానికి గౌట్ బాధితులు ఏ రకమైన మాంసాహారాన్నైనా మితంగానే తీసుకోవటం అన్ని విధాలా మంచిది. శాకాహారులు- పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, బీన్స్ వంటివి బాగా తగ్గించెయ్యాలి. తక్కువ కొవ్వు పాలు, ఛీజ్ వంటి పాల పదార్థాలు, విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే మంచిది.మద్యం రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదును పెంచుతుంది. కాబట్టి గౌట్ బాధితులు మద్యానికి దూరంగా ఉండటమే మేలు. ముఖ్యంగా బీరు తాగేవారికి ఈ ముప్పు అధికం. విస్కీ, జిన్, వోడ్కా రకాలు కూడా ప్రమాదకరమే.
--డా.శరత్ చంద్రమౌళి -రుమటాలజిస్ట్ - కిమ్స్ హాస్పిటల్ , సికింద్రాబాద్ .
- ====================================
Mee prayatnam chala abhinandaniyam. Inka vivaraalu pondupariste baguntundi.
ReplyDeletethank you very much sir vivaraalu chaala sahaayanga vunnayi
ReplyDelete