* పట్టణ జనాభాలో 25 ఏళ్లు దాటినవారిలో 16% మంది మధుమేహులే! ఇక 65 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహుల సంఖ్య 50% వరకూ ఉంది.
* 45-65 ఏళ్ల మధ్య తొలిసారిగా మధుమేహం బయటపడ్డవారిలో 50% మందికి అప్పటికే దాని మూలంగా ఏదో ఒక దుష్ప్రభావం ఉండే అవకాశం ఉంది.
* 65 ఏళ్లు దాటిన తర్వాత మధుమేహం బయటపడిన దాదాపు అందరిలోనూ కూడా ఏదో దుష్ప్రభావం కచ్చితంగా ఉండి ఉంటుందన్నది ప్రస్తుత వైద్య అవగాహన.
65 ఏళ్లు పైబడిన వారిని మధుమేహ విషయము లో ముసలివారుగా పరిగణిస్తారు . ముసలితనం.. మరో బాల్యం లాంటిది! పండుటాకులకూ.. పసిబిడ్డలకూ పెద్దగా తేడా ఉండదు.
అందుకే వృద్ధులతో వ్యవహరించేటప్పుడు కాస్త 'సున్నితంగా' ఉండటం చాలా అవసరం. మధుమేహ నియంత్రణలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. సగటు ఆయుర్దాయం పెరగటంతో మన దేశంలో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వృద్ధుల సంఖ్యతో పాటే.. మలివయసులో మధుమేహం బారినపడేవారి సంఖ్యా పెరుగుతోంది. అందుకే 'వృద్ధుల్లో మధుమేహం' అన్నది దానికదేగా ఓ ప్రత్యేకాంశంగా మారుతోంది. మధుమేహాన్ని ఎంత కచ్చితంగా అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ఎంత కఠినంగా నియంత్రిస్తే అంత మేలు జరుగుతుంది. ఇది సాధారణ సూత్రం. కానీ సున్నితమైన వృద్ధుల విషయంలో దీన్ని అంత కచ్చితంగా... అంత కఠినంగా.. అంత ఉద్ధృతంగా.. అమలు చేయటానికి లేదు! కావటానికి మలివయసేగానీ ఈ స్థితికి వచ్చేసరికి వృద్ధులంతా ఒకే తీరుగా ఉండరు. కొందరు నిశ్చింతగా తమ పని తాము చేసుకుంటుంటే మరికొందరు ఇతరుల మీద ఆధారపడే దశకు చేరుకుంటారు. కొందరికి కుటుంబంలో అన్నీ చూసుకునే సంరక్షకులు ఉంటే ఉమ్మడి కుటుంబాలు అంతరిస్తున్న ఈ రోజుల్లో కొందరు పూర్తి ఒంటరిగానే బండి లాగాల్సి ఉంటుంది. ఈ వయసుకు వచ్చేసరికి ఇతరత్రా మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉండే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- వృద్ధులందరికీ మధుమేహాన్ని ఒకే తీరులో నియంత్రించటం సాధ్యం కాదని, అది సరైన పద్ధతి కూడా కాదని వైద్యరంగం గుర్తించింది.
మధుమేహం కారణంగా తలెత్తే దుష్ప్రభావాల ముప్పు నడివయసులో కంటే వృద్ధుల్లో చాలా ఎక్కువ. అలాగే కేవలం వృద్ధుల్లోనే కనబడే దుష్ప్రభావాలూ కొన్ని ఉన్నాయి. మన సమాజంలోని మొత్తం మధుమేహుల్లో 40% మంది 65 ఏళ్లు పైబడినవారే. ఇది ఇప్పటికే మధుమేహం నిర్ధారణ అయిన వారి లెక్క. పెద్ద వయసులో మధుమేహం ఉండి కూడా ఆ విషయం ఇంకా గుర్తించని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద వయసులో రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. అంటే ఇప్పటికే మధుమేహం వచ్చినప్పటికీ.. దానికి సంబంధించిన లక్షణాలేవీ కూడా ప్రస్ఫుటంగా కనబడవు. దీంతో వీరిలో మధుమేహాన్ని అనుమానించటం, గుర్తించటం కష్టతరంగా మారుతుంది. అలాగని వదిలేస్తే సంభవించే నష్టం అపారంగా ఉంటుంది. 65 ఏళ్ల తర్వాత మధుమేహం తొలిసారిగా గుర్తించిన వారిలో (అప్పటి వరకూ దాన్ని మనం గుర్తించలేకపోయినా, లేక అది అప్పుడే వచ్చినా సరే) అప్పటికే శరీరంలో మధుమేహానికి సంబంధించిన తీవ్ర దుష్ప్రభావం, అనర్థం (ఇర్రివర్సిబుల్ కాంప్లికేషన్) ఏదో ఒకటి వచ్చి ఉండే అవకాశం ఉంది. మధుమేహం దుష్ప్రభావాల్లో- రక్తనాళాలు దెబ్బతినటం కారణంగా వచ్చే గుండె, మెదడు, కాళ్లు, కిడ్నీలు, కళ్ల జబ్బులు.. వీటికి తోడు నాడులు దెబ్బతిని వచ్చే 'న్యూరోపతి' కీలకమైనవి. 40-65 ఏళ్ల మధ్య మధుమేహం బయటపడిన వారికి ఈ సమస్యల్లో ఏదో ఒకటైనా వచ్చి ఉండే అవకాశం 50% వరకూ ఉంటుంది. అదే 65 ఏళ్ల తర్వాత బయటపడితే ఈ వ్యాధుల ముప్పు 100% ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో మధుమేహం వచ్చిందని గుర్తించగానే వీరికి మధుమేహం చికిత్సతో పాటు తప్పనిసరిగా ఇతరత్రా ఏయే సమస్యలున్నాయో గుర్తించి వాటికీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది!
కనబడని లక్షణాలు
* అతి మూత్రం ఉండదు: సాధారణంగా అతిమూత్రం, అతిదాహం, అతిఆకలి.. ఈ మూడింటినీ మధుమేహం లక్షణాలుగా చెబుతుంటారు. కానీ మధుమేహం ఉన్న వారందరిలో ఇవి తప్పకుండా కనబడాల్సిన పనేం లేదు. రక్తంలో గ్లూకోజు 250 కంటే ఎక్కువుంటే ఎవరైనా రాత్రిపూట కనీసం 4 సార్త్లెనా మూత్రానికి వెళ్తుంటారు. అయితే వృద్ధుల్లో మాత్రం సాధారణంగా ఈ లక్షణం కనబడదు. (ప్రోస్టేట్ సమస్యలుండి, దాని కారణంగా ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంటే అది వేరే విషయం) ఎందుకంటే మధుమేహం ఉన్న వృద్ధుల్లో నాడులు దెబ్బతినే 'అటనమిక్ న్యూరోపతి' సమస్య ఉంటుంది. మామూలుగా 400 మిల్లీలీటర్ల మూత్రం చేరితేనే విసర్జనకు వెళ్లాలన్న భావన కలిగించే మూత్రాశయం.. ఈ పెద్ద వయసు మధుమేహుల్లో 'అటనమిక్ న్యూరోపతి' కారణంగా 600 నుంచి 700 మి.లీ. వరకూ నిండిపోయినా ఆ విషయం మెదడుకు చేర్చలేదు. రెండోది- వీరిలో దాహం కూడా కొంత తగ్గుతుంది. దీనివల్ల నీళ్లు తగినంతగా తాగరు. ఇది కూడా రాత్రి మూత్రం తగ్గిపోవటానికి కారణమవుతుంటుంది. వీటివల్ల వీరిలో మధుమేహం ఎక్కువున్నా 'అతి మూత్రం' లక్షణం కనబడదు.
* కండర క్షీణత: మధుమేహం నియంత్రణలో లేకపోవటం వల్ల కండర క్షీణత జరుగుతుంది. అలాగే సాధారణంగా పెద్దవయసులో ఎంతోకొంత కండరాలు శుష్కిస్తుంటాయి. కాబట్టి పెద్దవయసు వారిలో మధుమేహం వచ్చి దాని కారణంగా కండరాలు క్షీణిస్తున్నా కూడా.. 'ఏదో వయసుతో పాటు బరువు తగ్గుతున్నాం, మామూలే' అని తోసేసుకు తిరుగుతుంటారు. పెద్దవయసులో మధుమేహాన్ని గుర్తించటంలో జాప్యానికి ఇది కూడా కారణమవుతోంది.
పరగడుపున పెరగదు
సాధారణంగా రక్తంలో గ్లూకోజు పరగడుపున 125, అంతకన్నా ఎక్కువగానీ.. ఆహారం తిన్న రెండు గంటలకు 200 కన్నా ఎక్కువుంటే మధుమేహంగా నిర్ధరిస్తారు. అయితే చాలామంది వృద్ధుల్లో- ఆహారం తినక ముందు రక్తంలో గ్లూకోజు శాతం మామూలుగానే ఉంటుంది. తిన్నాక రెండు గంటలకు మాత్రం పెరుగుతుంటుంది. దీంతో పరగడుపున రక్తపరీక్ష చేసి మామూలుగానే ఉందని, మధుమేహం లేదని పొరపడే అవకాశం ఉంది. అందువల్ల ఆహారం తిన్న తర్వాత పరీక్షించి.. అది 200 కన్నా ఎక్కువుంటే మధుమేహంగా గుర్తించాలి. ఒకవేళ 140-200 మధ్య ఉంటే మరోసారి రక్తపరీక్ష చేసి, అప్పుడూ అలాగే ఉంటే వీరిలో గ్లూకోజు నియంత్రణ తప్పుతోందని (ఇంపెయిర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్) గుర్తించి, నెలనెలా పరీక్షించాలి. వీరికి మందులు ఇవ్వకపోయినా జాగ్రత్తగా గమనించటం అవసరం.
ఆహారం.. పరి'మితంగా' స్వేచ్ఛ!
గర్భిణులు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులు- వీరు మధుమేహం ఉన్నా ఆహారం విషయంలో కఠిన నియమాలు పాటించాల్సిన పని లేదు. ఇది ముఖ్య సూత్రం. వృద్ధులు- చాలాకాలంగా తాము తింటున్న ఆహారం.. తమ నోటికి నచ్చిన ఆహారం.. తమకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం.. అందుబాటులో ఉండే ఆహారాన్నే తీసుకోవటం మంచిది. మధుమేహం కారణంగా వృద్ధాప్యంలో ప్రత్యేకంగా తమ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు! ఉదాహరణకు- అప్పటి వరకూ వరి అన్నం తింటున్న వాళ్లు ఉన్నట్టుండి చపాతీలు, రాగులు, జొన్నల వంటివాటికి మారనవసరం లేదు. తమకు అలవాటైన ఆహారాన్నే మితంగా తీసుకోవటం మంచిది.
* మామూలుగా మధుమేహులంతా తేలికగా జీర్ణమయ్యే పిండిపదార్థాలను తగ్గించి తీసుకోవాలి. అయితే వృద్ధుల విషయానికి వచ్చేసరికి కొంత మినహాయింపు అవసరం. ఈ వయసుకు వచ్చేసరికి ఆహారం జీర్ణం కావటం, తిన్నది పేగులు గ్రహించటం, ఒంటికి పట్టి అది కణాల్లోకి వెళ్లటం వంటి ప్రక్రియలన్నీ మందగిస్తాయి. వీరికి మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను అరిగించుకునే శక్తి తగ్గుతుంది. కాబట్టి వృద్ధులు తమ ఆహారంలో 60% వరకూ పిండి పదార్థాలు తీసుకోవాలి. అది కూడా తేలికగా జీర్ణమయ్యేవి, జంక్ ఫుడ్ కాకుండా ఇంట్లో వండుకున్నవి తింటే మంచిది.
* వృద్ధులు పూర్తిగా ఉప్పు, కారం వంటివేమీ లేని చప్పిడి ఆహారం తినాల్సిన పని లేదు. దీనివల్ల ఆహారం మీద ఆసక్తి తగ్గి తిండి తగ్గిపోయి పోషకాహార లోపంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తమ నోటికి నచ్చిన ఆహారమే 'మితంగా' తినాలి.
చికిత్సలోనూ తేడాలు
వృద్ధుల విషయంలో.. మధుమేహం ఉందని గుర్తించిన తర్వాత దాన్ని నియంత్రించే తీరులోనూ, చికిత్స చేసే విధానంలో కూడా కొంత తేడా ఉంటుంది. మధుమేహ చికిత్స విషయంలో- వృద్ధులు తమ పని తాము చేసుకోగలుగుతున్నారా? లేక ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడుతున్నారా? అన్నది కీలకాంశం. అన్ని పనులకూ ఇతరులపై ఆధారపడే వారిని 'ఎల్డర్లీ- ఫ్రెయిల్' అంటారు. ఇలాంటి వారికి ఉద్ధృత చికిత్స ఇస్తూ మిగతా వారిలా రక్తంలో గ్లూకోజును పరగడుపున 125కి, ఆహారం తిన్న తర్వాత 200కి తగ్గించాలని ప్రయత్నించకూడదు. ఇలా తగ్గించటం వల్ల కలిగే అదనపు ప్రయోజనమేం ఉండదు, పైగా నష్టం కూడా ఉండొచ్చు. వీరిలో పరగడుపున 150, ఆహారం తిన్నాక 200 వరకూ ఉన్నా ఇబ్బంది లేదు. ఇతరుల మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటున్న వృద్ధులకు (ఎల్డర్లీ- ఫిట్) మాత్రం- ఈ అంకెలు 125, 200 ఉండేలా చూడటం, అందుకు తగ్గట్టుగా చికిత్స చెయ్యటం తప్పనిసరి.
* సాధారణంగా మధుమేహులకు గ్త్లెకే టెడ్ హిమోగ్లోబిన్ (ఏ1సీ) పరీక్షాఫలితం 7 కన్నా తక్కువుండాలి. కానీ 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో ఇది 8 ఉన్నా ఫర్వాలేదు. అంతకన్నా తక్కువకు తగ్గించాలని ప్రయత్నించకూడదు. ముఖ్యంగా ఇతరుల మీద ఆధారపడిన వృద్ధుల్లో దీన్ని తప్పకుండా పాటించాలి.
* ఇతరుల మీద ఆధారపడిన వృద్ధులకు రక్తపోటు విషయంలోనూ కొంత మినహాయింపు (140/90 వరకూ) ఉంది. అయితే ఈ రక్తపోటు, గ్లూకోజుల స్థాయులను ఉన్నట్టుండి ఒకే రోజులోనే తగ్గించటానికి ప్రయత్నించరాదు. క్రమేపీ తగ్గించుకుంటూ రావాల్సి ఉంటుంది.
* బరువు: మామూలుగా ఎవరికైనా ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా ఎక్కువుంటే స్థూలకాయుల కిందే లెక్క. కానీ వృద్ధుల్లో దీనికన్నా 20% ఎక్కువున్నా స్థూలకాయంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అలాగే వృద్ధులెవరూ నెలకు 2 కేజీల కన్నా ఎక్కువగా బరువు తగ్గటం మంచిది కాదు. ఒకవేళ 65 ఏళ్లు పైబడిన వాళ్లు అలా నెలకు 2 కేజీల కంటే ఎక్కువ తగ్గిపోతుంటే- ఇతరత్రా ముప్పులేమైనా ఉన్నాయేమో పరీక్షించటం చాలా అవసరం. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో క్యాన్సర్ వంటి ముప్పులు ఎక్కువగా పొంచిఉంటాయి. బరువు తగ్గిపోవటం వాటికి సంకేతం కావచ్చు.
కఠిన వ్యాయామం వద్దు
వృద్ధులు పెద్ద పెద్ద కఠిన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. సాధారణ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. వ్యాయామ సమయంలో గుండె కొట్టుకునే రేటు పెరగకుండా చూసుకోవాలి. ఇది 120 కన్నా పెరగకుండా జాగ్రత్తపడాలి.
ఈ సమస్యలు.. వీరికే ప్రత్యేకం!
* స్పందన సమస్యలు: మధుమేహ వృద్ధుల్లో స్వయంచాలిత (అటనామిక్) నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా తీవ్రమైన గుండె జబ్బు ఉన్నా వీరికి నొప్పి తెలియదు. సాధారణంగా మన ఉఛ్వాస, నిశ్వాసాలను బట్టి గుండె కొట్టుకునే వేగం మారుతుంటుంది, కానీ వృద్ధుల్లో ఈ విధానం దెబ్బతిని గుండె ఎప్పుడూ ఒకే వేగంతో (ఫిక్స్‌డ్ హార్ట్‌రేట్) పని చేస్తుంటుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హృదయ స్పందన సమస్యలకు (బ్రాడీకార్డియా, అరిత్మియా వంటివి) దారితీస్తుంది. అలాగే ఎలాంటి లక్షణాలు లేకుండానే మెదడులోని రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. పిత్తాశయం వ్యాధులు, ప్రోస్టేట్ వాపు, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్లు, క్షయ వంటివి వస్తే.. ఈ అటనామిక్ న్యూరోపతి కారణంగానే వీరిలో జ్వరం వంటి లక్షణాలు కనబడవు. కడుపులో నొప్పి ఉండదు. దీంతో వ్యాధి త్వరగా బయటపడదు. వీరిలో నీరసం, ఇతరుల మీద ఆధారపడటం ఎక్కువవుతుంది. మంచం మీది నుంచి లేవలేకపోవటం, ఆకలి తగ్గిపోవటం వంటివి కనిపిస్తాయి తప్ప ఫలానా చోట నొప్పి అనిగానీ, జ్వరం రావటం గానీ జరగదు. ఇది కూడా అటనామిక్ న్యూరోపతీ లక్షణమే.
* మధుమేహ వృద్ధుల్లోనే ప్రత్యేకంగా కనిపించే మరో సమస్య- డయాబెటిక్ న్యూరోపతిక్ కకెక్సియా. దీనిలో కాళ్ల మంటలు, నొప్పులు, తిమ్మిర్ల వంటి న్యూరోపతి లక్షణాలతో పాటు మనిషి
వేగంగా బరువు తగ్గిపోతుంటారు. మానసికంగా కుంగుబాటు వంటివీ ఒక్కసారే బయల్దేరతాయి. దీనికి ఇన్సులిన్‌తో చికిత్స మంచి ప్రయోజనకారి.
* లేవటం కష్టం: కండరాలకు అనుసంధానంగా ఉన్న నాడీ చివళ్లు దెబ్బతింటాయి. తొడల్లోని కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల కుర్చీలోంచి త్వరగా లేవలేకపోవటం, కారులోంచి
వెంటనే బయటకు రాలేకపోవటం, మెట్లు ఎక్కటం కష్టం కావటం వంటివన్నీ కనిపిస్తాయి. మధుమేహ వృద్ధుల్లో న్యూరోపతీ ఇలా 'డయాబెటిక్ ఎమయోట్రోఫీ' రూపంలో
బయటపడుతుంది.
* మూత్రనాళ ఇన్ఫెక్షన్లు: ప్రోస్టేట్ సమస్యలు, మూత్రాశయంలో మూత్రం అధికంగా నిల్వ ఉండటం, వీటికి మధుమేహం తోడవటం వల్ల వీరిలో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతాయి.
ఈ బెడద మరింత తీవ్రమైతే ఇది మూత్రపిండాలకూ వ్యాపించి 'పాపిలరీ నెక్రోసిస్' అనే సమస్యకూ దారితీస్తుంది. దీంతో కిడ్నీల వైఫల్యం కూడా రావొచ్చు. కొందరు మధుమేహ వృద్ధుల్లో
మూత్రం ఆపుకోలేని సమస్యా వస్తుంది.
* ఎముకలు బోలుబోలు: మధుమేహ వృద్ధుల్లో ఎముకలు గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్) ఎక్కువ. ఇది విటమిన్-డి లోపం వల్లనే కాదు. మధుమేహ వృద్ధుల్లో ఎముకల
పునర్నిర్మాణం కంటే కూడా ఎముక క్షీణతపాళ్లు ఎక్కువ. ఇది ఆస్టియోపొరోసిస్‌కు దోహదం చేస్తుంది. నాడులు దెబ్బతిన్న కారణంగా పట్టు తప్పి పడిపోయే అవకాశాలు ఎక్కువ,
ఆస్టియోపొరోసిస్ కారణంగా పడినప్పుడు ఎముకలు విరిగే అవకాశాలూ పెరుగుతాయి.
* మందగించే విషయ గ్రహణ సామర్థ్యం: మధుమేహ వృద్ధులకు విషయాలను గ్రహించే శక్తి సన్నగిల్లుతుంది. గడియారం చూసి వెంటనే సమయం చెప్పలేకపోవటం, ట్రాఫిక్‌లో లైట్లను
సరిగా పోల్చుకోలేకపోవటం, ఫోన్ చేసి ఎవరికి చేశామో మరచిపోవటం, ఫోన్ ఎత్తినా కొంత సేపటి వరకూ సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోవటం.. ఇలాంటి మందగమన లక్షణాలు
కనిపిస్తాయి. మధుమేహ వృద్ధుల్లో మానసిక కుంగుబాటు (డిప్రెషన్) కూడా ఎక్కువగా కనబడుతుంది.
* మందగించే జీర్ణవ్యవస్థ: అటనామిక్ న్యూరోపతీ కారణంగా వృద్ధ మధుమేహుల్లో పేగుల్లో కదలికలు తగ్గి.. జీర్ణశక్తి మందగించటంతో పాటు మలబద్ధకం కూడా కనిపిస్తుంది.
* మధుమేహ వృద్ధుల్లో వినికిడి లోపమూ ఎక్కువే. వినికిడి చెవిలోని సూక్ష్మ రక్తనాళాలు, శ్రవణ నాడులు కీలకం. మధుమేహం వీటినీ దెబ్బతీస్తుంది. దీంతో వీరిలో వినికిడి లోపం పెరుగుతుంది.
మందులు.. అన్నీ పనికిరావు
* వృద్ధుల్లో ఉద్ధృతంగా చికిత్స చేస్తూ మధుమేహాన్ని మరీ కఠినంగా నియంత్రించటానికి ప్రయత్నించటం మంచిది కాదు. డయానిల్, గ్త్లెనేజ్ వంటి సల్ఫనైల్ యూరియా మందులు చాలా శక్తివంతమైనవి. కాబట్టి వృద్ధులకు వీటిని ఇవ్వకపోవటమే మేలు. డయానిల్ అనే మందు శరీరంలో 18 గంటల పాటు పనిచేస్తుంది. ఈ మాత్రను ఉదయం వేసుకుంటే సాయంత్రం దాటిన తర్వాత కూడా పనిచేస్తుంది. సాయంత్రం మరోటి వేసుకుంటే ఉదయం ప్రభావానికి ఇది తోడై (క్యుమిలేటివ్) రక్తంలో గ్లూకోజును మరింతగా తగ్గిస్తుంది. కాబట్టి ఈ రకం మందులను 65 ఏళ్లు దాటిన వారికి ఇవ్వకూడదు. కేవలం 3, 4 గంటలు మాత్రమే పనిచేసే నాటిగ్లినైడ్, రెపాగ్లినైడ్ మందులు వృద్ధులకు బాగా అనువైనవి, కాకపోతే ఇవి కొంచెం ఖరీదైనవి.
* మన దేశంలో వృద్ధులకు అకార్బోజ్, ఓగ్లిబోజ్, మిగ్లిటాల్ వంటి'ఆల్ఫా గ్లూకోసిడేజ్ ఇన్‌హిబిటార్' రకం మందులు ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి పిండిపదార్థాలను జీర్ణం కాకుండా, జీర్ణమైనదాన్ని రక్తము లోకి వెళ్లకుండా నిరోధిస్తాయి. వీటితో మల విసర్జన కూడా సాఫీగా అవుతుంది. ఇవి మంచివేగానీ వీటితో ఆహారం జీర్ణం కావటం ఆలస్యమవుతుంది కాబట్టి ఆకలి తక్కువగా ఉన్నవారికి, బరువు తగ్గుతున్న వృద్ధులకు ఇవి పనికిరావు.
* మెట్‌ఫార్మిన్: మధుమేహుల్లో 90% మంది వాడే మందు ఇది. మూత్రపిండాల్లో ఏదైనా సమస్య ఉంటే మాత్రం దీన్ని వేసుకోకూడదు. సాధారణంగా వృద్ధాప్యంలో మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి. మూత్రపిండాల పనితీరును తెలిపే సీరమ్ క్రియాటినైన్ 1.5 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే మెట్‌ఫార్మిన్ మందు వాడొద్దని చెబుతుంటారు. అయితే వృద్ధుల్లో మూత్రపిండాల పనితీరును తెలుసుకోవటానికి సీరమ్ క్రియాటినైన్ పరీక్ష కంటే వడపోత సామర్థ్యాన్ని చెప్పే 'గ్లోమర్యులార్ ఫిల్టరేషన్ రేటు (జీఎఫ్‌ఆర్)' పరీక్ష మీద ఆధారపడటం మంచిది. ఇది 50 శాతం కన్నా తక్కువుంటే మెట్‌ఫార్మిన్ మందు తీసుకోకూడదు.
* గ్లిప్టిన్లు: ప్రస్తుతం సాక్సా గ్లిప్టిన్, సిటా గ్లిప్టిన్, విల్డాగ్లిప్టిన్ అనే మూడు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మంచివే గానీ జీర్ణశక్తిని తగ్గించే అవకాశం ఉంది. వృద్ధుల విషయంలో వీటిని అన్నీ పరిశీలించాకే వాడాలి.
* ఇన్సులిన్: మాత్రలు వేసుకుంటున్నా మధుమేహం నియంత్రణలో లేకపోతే ఇన్స్‌లిన్ తీసుకోవాలి. 65 ఏళ్లు దాటిన వృద్ధులు రోజుకి రెండుసార్లు ఇన్సులిన్ తీసుకుంటే సరిపోతుంది.
నాలుగుసార్లు తీసుకోవాల్సి వస్తే వైద్యుల సమక్షంలోనో, ఆసుపత్రిలోనో తీసుకోవాలి. గ్లూకోజు పరగడుపున 250 కన్నా ఎక్కువ, భోజనం తర్వాత 500 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు..
ట్రైగ్లిజరైడ్లు 600 మించితే ఇన్సులిన్ వాడాలి. మూత్రంలో అల్బుమిన్ పోతున్నా, ఈసీజీ, ఎక్స్‌రే, కంటి పరీక్షల్లో తేడాలున్నా ఇన్సులిన్ తీసుకోవటానికి ఏమాత్రం సందేహించకూడదు.
పరీక్ష ముఖ్యం
* మధుమేహ వృద్ధులు తరచుగా గ్లూకోజు పరీక్ష చేయించుకోవటం చాలా చాలా అవసరం. ఒక్కరిమే ఉంటున్నామని, బయటకు పోలేమని.. ఇలా సాకులతో పరీక్ష చేయించుకోకుండా ఉండటం సరికాదు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే మాత్రలు వేసుకోకపోవటం కన్నా పరీక్షలు చేయించుకోకుండా వేసుకుంటే వచ్చే ప్రమాదమే ఎక్కువ. వృద్ధుల్లో రక్తంలో గ్లూకోజు స్థాయి పడిపోయి 'హైపోగ్త్లెసీమియా' వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవటం ముఖ్యం.
* రాకపోయినా పరీక్షలు: 55 ఏళ్ల వరకు మధుమేహం రానివారికి 60 ఏళ్ల వయసులో వచ్చే అవకాశం లేదని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ హఠాత్తుగా గుండెపోటో, పక్షవాతం వచ్చినపుడు వీరిలో మధుమేహాన్ని గుర్తిస్తున్నారు. ఇది ప్రమాదకరమైన స్థితి. మన సమాజంలో 25 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరూ ఏటా ఓసారి మధుమేహ పరీక్ష చేయించుకోవటం అవసరం.
- ======================================
Thanks for this blog. You may be happy to know that nature has the solution to all the problems in your life. The fruit called Noni has the capability to maintain the normal blood sugar level of human body, so people may add them in their resgualr diet to maintain good health. Men are generally prone to diseases because of their unhealthy habits of smoking, taking alcohol etc. So they must add Noni for men formula in their regular diet to stay healthy in late years of your life.
ReplyDelete