Monday, November 28, 2011

కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్లు , Joint Infectionsఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్లు , Joint Infections- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  • ప్రతి ఒక్కరిలో సహజ రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది మనల్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది. మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల రోగనిరోధకశక్తి సన్నగిల్లుతుంది. ఈ సందర్భంలో జబ్బులు రావడం సహజం. ఇది శరీరానికే కాదు ఎముకలకు కూడా వర్తిస్తుంది. ఇన్‌ఫెక్షన్ల వల్ల ఎముకల్లో చీము చేరి ఎముక దెబ్బతినే ప్రమాదముంది. దీన్ని గుర్తించిన 24 గంటల్లోనే చికిత్స చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఒక్కోసారి ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఎముకలో కొంత భాగాన్ని తొలగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎముకల్లో ఇన్‌ఫెక్షన్లు ఎందుకొస్తాయి, చికిత్స వివరాలు మీ కోసం..

ఎముకల్లోని ఏ భాగంలోనైనా వివిధ రకాల సూక్ష్మక్రిములు చేరి ఎముకను దెబ్బతీయడాన్ని, ఇన్ఫెక్షన్‌ కలుగజేయడాన్ని ఆస్టియో మయోలైటిస్‌ అంటారు. ఇందులో మూడు రకాలున్నాయి. అవి...
  • నాన్‌స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌.
  • స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌.
  • సెకండరీ ఆస్టియో మయోలైటిస్‌.
నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ సాధారణంగా 5 నుండి 12 ఏళ్ల వయసులో ఎక్కువగా ఏర్పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, పెద్ద జబ్బు వచ్చినప్పుడు రక్తంలో స్టెఫైలోకోకస్‌ సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. ఇవి ఎముకల్లోని మైటాఫైసిస్‌ వద్ద చేరతాయి. అక్కడి నుండి డయాఫైసిస్‌లోనికి ప్రయాణిస్తాయి. ఫలితంగా నెమ్మదిగా ఎముక దెబ్బతింటుంది. చీము పడుతుంది. చిన్న పిల్లల్లో ఎముకపైన ఉన్న పెరిఆస్టియమ్‌ పొర మందంగా ఉంటుంది. మైటాఫైసిస్‌ వద్ద ఏర్పడిన చీము పెరియాస్టియా కిందుగా డయాఫైసిస్‌లోకి ప్రయాణించి ఎముక పొడవునా చీము ఏర్పడుతుంది. దీంతో ఎముక పూర్తిగా దెబ్బతిని బలహీనపడుతుంది. రక్త సరఫరా తగ్గి ఉపరితల ఎముక కణజాలం నశిస్తుంది.

  • లక్షణాలు
మొదటి దశ అంటే నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ విపరీతమైన జ్వరం, ఎముక చివరి తలలో వేడి, ఎరుపు, వాపు నొప్పి కలుగుతుంది. తీవ్రమైన ఎముక కీలునొప్పి వల్ల కాలు కదలించడం కూడా కష్టమౌతుంది. ఎముక కొనభాగం నుంచి నిదానంగా వాపు ఎముక పైభాగానికి పాకుతుంది. వైద్యం ఆలస్యమైనపుడు ఎముక పైభాగాన ఉన్న కండలలోనికి, చర్మం కిందికి పెరియాస్టియంలో రంధ్రాలు ఏర్పరచుకొని చీము బయటకు చేరుతుంది. చర్మంలో కూడా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి చీము బయటకు వస్తుంది. దీర్ఘకాలంగా ఇలా చీము బయటకు రావడంలో చర్మరంధ్రాలు చుట్టు ప్రక్కలగల చర్మం గట్టి పడుతుంది. దీనిని సైనస్‌ అంటారు. ఒక చోట రంధ్రం మూసుకొని ఒక్కోసారి వేరొక ప్రదేశంలో పక్కనే సైనస్‌ దగ్గర చర్మం ఫైబ్రస్‌ కణజాలంతో కప్పబడి గట్టిపడుతుంది. ఒక్కోసారి దెబ్బతిన్న ఎముక చిన్నచిన్న ముక్కలుగా మారి సైనస్‌ నుండి బయటకు వస్తాయి. ఒక్కోసారి రంధ్రం పెద్దదై లోపల పొడవునా కుళ్ళినప్పుడు ఎముక భాగం ఏకమొత్తంగా ఒక ట్యూబ్‌లాగా బయటపడుతుంది. ఈ దశలో తగినంత కొత్త ఎముక తయారవకుంటే ఎముక విరిగే ప్రమాదం వుంటుంది. ఈ రకంగా విరిగిన ఎముకను చాలా జాగ్రత్తగా, దీర్ఘకాలికంగా కట్టు స్పింట్స్‌, డ్రస్సింగ్స్‌ ద్వారా వైద్యం చేయడంతో ఎముక అతుక్కుంటుంది. సాధారణంగా ఎముక అతుక్కోవడానికి పట్టే సమయం కన్నా ఈ దశలో చాలా ఎక్కువ సమయం పడుతుంది. చాలా ఎక్కువగా మోకాలి దగ్గర గల ఫీమర్‌, టీబియా ఎముకల మెటాఫైసిస్‌లో, చేయి భాగంలో గల హ్యూమరస్‌ కింది భాగంలోనూ తరువాతి టిబియా క్రింద భాగంలోనూ ఎక్కువగా ఆస్టియో మయోలైటిస్‌ ఏర్పడుతుంది.

  • వైద్యం
నాన్‌ స్పెసిఫిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ దశలో ఎక్కువ డోసులో పారా సిటమాల్‌ లేక మెఫినమిక్‌ ఆసిడ్‌ మాత్రలు జ్వరం కోసం వాడాలి. ఇన్ఫెక్షన్‌ కొరకు ఫ్లోరో అమైనోక్వినోలోన్స్‌ (సిప్రోఫ్లోక్సాసిస్‌, ఓఫోక్సాసిన్‌, స్పార్‌ఫ్లోక్సాసిన్‌, గాటిఫ్లోక్సాసిన్‌, జెమిఫ్లోక్సాసిన్‌) కానీ, లినెబోలిడ్‌, వాంకోమైసిన్‌, క్లిండామైసిన్‌, లింకోమైసిన్‌, కెఫిలోస్పోరిన్స్‌ (ముఖ్యంగా ఇంజెక్షన్‌ రూపంలో) ముందుదశలో వాడాలి. లోపలి నుండి చీమును 'నీడిల్‌ ఆస్పిరేషన్‌' ద్వారాతీసి, కల్చర్‌ సెన్సిటివిటీని బట్టి ఆంటీబయాటిక్‌ నిర్ధారించాలి. అదే సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాలి. పాలు, పెరుగు, పోషకాహారం ఇవ్వాలి. కాలికి చల్లటి తడిగుడ్డచుట్టి కీలు ముడుచుకుపోకుండా స్ప్లింట్స్‌ ఉపయోగించాలి.

  • శస్త్ర చికిత్స
అక్యూట్‌ ఆస్టియో మయోలైటిస్‌ దశలో వెంటనే ఆపరేషన్‌ చేస్తారు. ఎముకలోనికి డ్రిల్‌నుపయోగించి చిన్న రంధ్రాలు చేస్తారు. వీటిద్వారా చీము పూర్తిగా బయటకు వచ్చి ఎముక పూర్తిగా బాగవుతుంది. ఈ దశను గుర్తించిన 24 గంటలలోగా సర్జరీ చేస్తే పూర్తిగా ఇన్ఫెక్షన్‌ నిర్మూలించగలం. ఆలస్యమైతే ఇన్ఫెక్షన్‌ క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌గా మారుతుంది. ఈ దశలో ఎముకలో ఏర్పడిన చీము మెటాఫైసిస్‌ నుంచి పెరియాక్టియం అంతర్భాగంలో పైకి ఎగబాకి డయాఫైసిస్‌ పొడవునా చేరుతుంది. దీని తర్వాత ఏర్పడే సిక్వెస్ట్రమ్‌ ద్వారా ఎముక శాశ్వత ఇన్ఫెక్షన్‌కు గురౌతుంది. దీనివల్ల సంపూర్ణ నివారణ దుర్లభమౌతుంది. క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ కోసం కుళ్ళిన ఎముకను ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తారు. కుళ్ళిన ఎముక పైభాగాన్ని తొలగించి ఎముక అంతర్భాగంలోని మూలుగలోని చెడు కణాను పూర్తిగా తొలగించాకా, ఎముకలోపలి చేరిన కుళ్ళిపోయిన ఎముకలను తొలగిస్తారు. తరువాత కొన్ని ద్రవాలతో ఎముక భాగాన్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. 2,3 నెలలు క్రమబద్ధంగా డ్రస్సింగ్‌ చేస్తారు. 90 శాతం కేసులలో ఈ విధంగా మంచి ఫలితాలుంటాయి. కాని 10 శాతం కేసులలో ఇన్ఫెక్షన్‌ తిరిగిరావచ్చు. అవసరాన్ని బట్టి ఆంటి బయాటిక్స్‌ దీర్ఘకాలం కూడా వాడాలి. కిడ్నీ ఫంక్షన్‌ జాగ్రత్తగా గమనిస్తూ వుండాలి. సహజరోగనిరోధక శక్తి తగ్గినప్పుడు క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌ మళ్లీ వచ్చే అవకాశాలున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో క్రానిక్‌ ఆస్టియో మయోలైటిస్‌లో చేతి ఎముకలు, కాలి ఎముకల్లో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా వున్నప్పుడు కొంతభాగం ఎముకను తొలగించడం ద్వారా సంపూర్ణ రోగ నిర్మూలన సాధించవచ్చు.

/ డాక్టర్‌ జె. భాను కిరణ్‌-ఆర్థొపెడిక్‌ సర్జన్‌-డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌-సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ-బెంగళూరురోడ్డు, అనంతపురం.-ఫోన్‌ : 08854272881
  • ================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.