Tuesday, November 15, 2011

మశూచి , Smallpox




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు --మశూచి , Smallpox - గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


మశూచి (Smallpox) ఒక భయంకరమయిన అంటువ్యాధి. మశూచి పేరు వింటేనే ఒకప్పుడు అందరూ ఉలిక్కిపడేవారు. కారణం అది సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించేవారు. అలా 1700 నుంచి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య 6 కోట్లకు పైమాటే! అలాంటి మశూచి (స్మాల్‌పాక్స్‌) ఈనాడు ఎక్కడా కనబడడం లేదంటే దానికి కారణం ఓ శాస్త్రవేత్త పరిశోధనే. అతడే ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 'ప్రపంచంలో అత్యధికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తి' గుర్తింపును పొందిన వ్యక్తి. ఈ వ్యాధికి " వేరియోలా మేజర్(Variola major) " అనే వైరస్ క్రిమి కారణము .

ఇంగ్లండ్‌లోని బెర్కిలీలో 1749 మే 17న ఓ క్రైస్తవ మతాధికారికి పుట్టినఎడ్వర్డ్‌ జెన్నెర్‌, వైద్య విద్యపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్‌ కావాలంటే, మరో పెద్ద వైద్యుడి దగ్గర శిక్షణ పొందే అవకాశం ఉండేది. అలా 14 ఏళ్లకే ఓ శస్త్ర చికిత్సకారుడు (సర్జన్‌) వద్ద ఎనిమిదేళ్ల పాటు అభ్యాసం చేశాడు. ఆపై లండన్‌ సెయింట్‌ జార్జి ఆసుపత్రిలో జాన్‌ హంటర్‌ వద్ద వైద్యాన్ని అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో డిగ్రీ పొందిన తర్వాత సామాన్యుల కోసం స్వగ్రామంలో వైద్యవృత్తిని ప్రారంభించాడు.

ఆ సమయంలోనే జెన్నర్‌ దృష్టి మశూచిపై పడింది. ఆవులకు కూడా మశూచి లాంటి వ్యాధి సంక్రమిస్తుంది. దానిని 'గోమశూచి' (cowpox)అంటారు. ఇది ఆవుల నుంచి పశువుల కాపరులకు సోకేది. ఇది ప్రమాదకరం కాకపోవడమే కాకుండా, ఒకసారి వచ్చి తగ్గిన వారికి స్మాల్‌పాక్స్‌ రాకపోవడాన్ని జెన్నర్‌ గమనించాడు. దాంతో కౌపాక్స్‌కి కారకమయ్యే వైరస్‌ను కొందరి ఆరోగ్యవంతులకు వారి అనుమతితోనే సూక్ష్మమైన మోతాదులో ఎక్కించేవాడు. వారికి కౌపాక్స్‌ వచ్చి తగ్గిన తర్వాత స్మాల్‌పాక్స్‌ వైరస్‌ను సూక్ష్మ స్థాయిలో ఎక్కించి పరీక్షించేవాడు. చిత్రంగా వారికి మశూచి సోకలేదు. ఇలా చేసిన పరిశోధన ఫలితాలను ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఆ పరిశోధన ఫలితంగానే ఈనాటికీ కౌపాక్స్‌ మోతాదును టీకాల ద్వారా ఎక్కించడం ద్వారా మశూచి రాకుండా ఉండే రోగనిరోధక శక్తిని కల్పిస్తున్నారు. మశూచిని మట్టికరిపించాడు!

జెన్నర్‌ను బ్రిటిష్‌ పార్లమెంట్‌ 'నైట్‌' బిరుదుతో సన్మానించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ఇస్తే, రష్యా చక్రవర్తి ఉంగరాన్ని బహూకరించాడు. ఫ్రాన్స్‌ అధినేత నెపోలియన్‌ దేశంలో అందరూ మశూచి టీకాలు వేయించుకోవాలని శాసనం చేశాడు. అమెరికన్‌ ప్రభుత్వం అనేక బహుమతులు అందించింది.

''మశూచికాన్ని చూపించండి. వెయ్యి రూపాయలు గెలుచుకోండి'' అనే నినాదంతో పట్టణాలలో, పల్లెటూళ్ళలో దేశమంతా 25, 30సంవత్సరాల క్రితం ప్రభుత్వం గోడలపై వ్రాసి ప్రచారం చేసింది. కాని 10వేలు ఖర్చుపెట్టినా ఏ వ్యక్తికీ మశూచికం వచ్చిందని ప్రజలు నిరూపించలేకపోయారు. ఎందుకంటే మశూచికం మనదేశంలో తగ్గిపో యిందని ప్రభుత్వానికి రూఢిగా తెలుసు. కాని వేలాది సంవత్సరాలు లక్షలాది మంది మశూచికం వల్ల జబ్బుపడి వేలాది మంది మరణించారు. దాదాపు 2వేల సంవత్సరాలు నుంచి మశూచికం ఒక ప్రాణాంతకమైన జబ్బు అని గుర్తించి దాని నివారణకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆ జబ్బు ఎలా వస్తుందో ప్రజలకు అవగాహన లేదు. పర్షియాలో వైద్యులు రాజన్‌ క్రీ.శ.100 సంవత్సరంలో మశూచికం గురించి పేర్కొన్నాడు. క్రీ.శ.570 యూరప్‌లో మశూచికం వునికి గుర్తించారు.17వ శతాబ్దంలో యూరప్‌లో ఇది తీవ్రతరం అయింది. సిఫిలిస్‌ జబ్బుకు, మశూచికి తేడాను చాలాకాలం గుర్తించలేకపోయారు. అందుకే సిఫిలిస్‌ను గ్రేట్‌ఫాక్స్‌ అని, మశూచికాన్ని స్మాల్‌ ఫాక్స్‌అని అనేవారు.అట్లమ్మ(పొంగు)కి, మశూచికి తేడాను 18వ శతాబ్దంలో గుర్తించారు. మనదేశంలో మశూచికం వల్ల లక్షలాదిమంది మరణించారు. 1944లో మనదేశంలో 74.178 మశూచికం కేసులు వస్తే, వారిలో 17,743మంది చనిపోయారు. మశూచికం మచ్చలు జీవితాంతం ఆ వ్యాధి సోకినవారి మొహాలపై ఉండిపోయేవి. స్వాతంత్య్రానంతరమే మనదేశంలో ఈ మశూచి వ్యాధిని వ్యాక్సినేషన్‌ ద్వారా పూర్తిగా అరికట్టడం సాధ్యమైంది. అయితే మనదేశంలో మూఢన మ్మకాలు అధికంగా ఉండడంతో వ్యాక్సినేషన్‌ చేయించుకోవడానికి చాలా వ్యతిరేకత ఉండేది. పెద్ద అమ్మవారు, చిన్న అమ్మవారు అంటూ వ్యాక్సినేషన్‌ చేయించుకోకుండా భీష్మించుకుని కూర్చునేవారు. ఆరోగ్య విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతా లలో కొన్ని మూఢ నమ్మకాలు తగ్గడానికి మార్గం సుగమం అయింది. విద్యా, విజ్ఞా నం పెరిగిన తరు వాతనే మశూ చికం వచ్చినప్పుడు జాత రలు, కొలువులు అని కూర్చోకుండా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో ప్రజలు స్వచ్ఛందంగా మశూ చికం టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడం ప్రారంభించారు.

మౌఢ్యంపై సైన్స్‌ విజయానికి, మశూచిని అంతమొందించడానికి మార్గం సుగమం చేసిన మహనీయుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌. 1749లో ఇంగ్లండులోని గ్లౌచెస్టర్‌లో జన్మించాడు. వైద్య విద్యనభ్యసించి మశూచి నిరోధక టీకాల మీద పరిశోధన చేసి, తన కుమారుని మీదే ప్రయోగించి విజయం సాధించిన ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు. జెన్నర్‌ సాధించిన విజయం వైద్యశాస్త్ర చరిత్రలో నూతన అధ్యాయాన్ని సృష్టించింది. మహారాజుల నుండి సామాన్యుల వరకు జన్నర్‌ కనుగొన్న శాస్త్రీయమైన పద్ధతిని అంగీకరించి, మశూచి వ్యాధి నుండి విముక్తి చెందారు. ఈ విధంగా జెన్నర్‌ శాస్త్రీయమైన వైద్య విజ్ఞానంతో మానవజాతికి మహోపకారం చేశాడు. చిన్న విషయాలలోనే పెద్ద అర్థాలు ఉంటాయి. ఇంగ్లండులో మశూచికం వచ్చినపుడు జెన్నర్‌ కుటుంబానికి పాలు పోసే అమ్మాయి తనకు మశూచి రాదని జెన్న ర్‌తో గర్వంగా చెప్పింది.''నా ఆవు లకు మశూచికం వచ్చింది. నేను పాలు పితుకుతూవుంటే నా చేతికి ఉన్న గాయా నికి ఆవుపుండ్ల రసి తగిలింది. అందుచేత నాకు మశూచికం రాదు'' అని ఆమ్మాయి చెప్పిన మాట జెన్నర్‌ తీవ్రంగా మశూ చికంపై పరిశోధన చేయడానికి దారి చూపింది. ఎన్నో దేశాల నుంచి వివ రాలు సేకరించి మశూచికి వ్యాక్సిన్‌ కనుగొన్నాడు..

తన పరిశోధన ఫలితంగా ఆవుదూడలకు మశూచికం వస్తే, వాటి నుండి మశూచి వ్యాధి క్రిములను తీసి, కొద్ది మోతాదులో టీకాగా మనుషులకు వేస్తే మనిషిలో మశూచిక నిరోధన శక్తి పెరుగుతుందని జన్నర్‌ కనుగొన్నాడు. తాను కనుగొన్న విషయాలను జెన్నర్‌ సవివరంగా ఒక పరిశోధనా వ్యాసంగా వ్రాసి, ఇంగ్లండులో రాయల్‌ సొసైటీకి పంపిస్తే, దానిని రాయల్‌ సొసైటీ పెద్దలు అసలు పట్టించుకోలేదు. వైద్యులు అతనిని ఎగతాళి చేశారు. అయినా జెన్నర్‌ నిరాశ చెందలేదు. అంతకు ముందు టర్కీ రాయబారి భార్య మశూచికంపై చెప్పిన విషయాలను కూడా 18వ శతాబ్దం ప్రారంభంలో రాయల్‌ సొసైటీ పట్టించుకోలేదు. అతి చిన్న సూక్ష్మక్రిమి ఏవిధంగా మశూచికి కారణం అవుతుందో, వాక్సినేషన్‌ ద్వారా మశూచిని ఎలా నివారించవచ్చో జెన్నర్‌ చారిత్రక, శాస్త్రీయ ఆధారాలతో తన పరిశోధనా ఫలితాలు పట్టుదలతో, దీక్షతో శాస్త్రజ్ఞుల ముందు ఉంచాడు. 1798లో ఎంతోమంది జెన్నర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా 1800సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది అతని మాటవిని మశూచికం టీకాలు వేయించుకొని రక్షింపబడ్డారు. అమెరికా హార్వర్డ్‌ మెడికల్‌ స్కూలు, థామస్‌, జఫర్‌సన్‌ జెన్నర్‌కు అండగా నిలిచారు. మనిషికి ఆవులోని మశూచికపు క్రిములు ఎక్కిస్తే మనిషి పశువైపోతాడని, ఆవులాగా అరుస్తాడని, ఎద్దులాగా మనిషికి కొమ్ములు వస్తాయని కట్టు కథలు ప్రచారం చేశారు. క్రైస్తవ మత గురువులు కూడా జెన్నర్‌ను దుమ్మెత్తిపోశారు.''పాపం చేసిన మనిషిని శిక్షించడానికి దేవుడు మశూచికం వ్యాధిని పంపుతాడు. దేవుడు విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జెన్నర్‌ది దైవధిక్కారం అని మతగురువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా జెన్నర్‌ చెప్పింది, చేసింది దాచేస్తే దాగని సత్యం. మత మౌఢ్యాన్ని వదిలి దేశదేశాలలో ప్రజలు మశూచి వ్యాక్సిన్‌ను చేయించుకోవడం ప్రారంభించారు. దానితో వైద్యశాస్త్రంపై మతగురువులో పెత్తనం మంచులాగా కరిగిపో యింది. మతంకాదు. సైన్స్‌ కావాలి అని, సైన్సే ప్రాణాల్ని రక్షిస్తుందని ప్రజలు స్పష్టంగా 20వ శతాబ్దం ఉత్తరార్థంలో గుర్తించారు.

source : Visalandha News paper Sun, 30 Oct 2011
  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.