ఫ్లోరోసిస్.. తాగునీళ్ల రూపంలో మన సమాజం వెన్ను విరుస్తున్న సమస్య. మనుషులను క్రమేపీ మంచాలకు అంకితం చేస్తున్న ఉపద్రవం. పిల్లల నుంచి పెద్దల వరకూ తరతరాలను నిర్వీర్యులను
చేసేస్తున్న విపత్తు.ఫ్లోరోసిస్ అంటే దంతాల మీద వికారమైన పచ్చటి గార మాత్రమే కాదు. ఫ్లోరోసిస్ అంటే ఎముకలను రబ్బరు గొట్టాల్లా అడ్డదిడ్డంగా వంచేసే అడ్డగోలు జబ్బు మాత్రమే కాదు. ఫ్లోరోసిస్ అంటే
వెన్ను విరిచే విలయం. సున్నితమైన వెన్ను చుట్టూ ఉండే మృదువైన పొరలను కూడా గట్టి ఎముకల్లా మార్చేసి.. వెన్నుపామును నొక్కేసి.. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య కూడా.
ఫ్లోరోసిస్ రాష్ట్రంలోని ఎన్నో జిల్లాలను కబళిస్తోంది. మన ప్రభుత్వాల నిర్లిప్తతకు నిలువెత్తు నిదర్శనంగా ఎన్నో ఊళ్లలో ఎంతోమంది.. నిలబడే శక్తి కూడా లేకుండా.. అష్టవంకర్లతో దేకుతూ
దర్శనమిస్తున్నారు. మరెంతో మంది కీళ్ల నొప్పులతో నిత్యం కునారిల్లుతున్నారు. నిలబడలేక, నడవలేక తడబడుతున్నారు.
ఒకరకంగా ఇది మన సమస్య. పాశ్చాత్య దేశాలకు పెద్దగా తెలియని సమస్య. కాబట్టి దీనికి పరిష్కారాలు సైతం మన దగ్గరి నుంచే రావాలి. అందుకే మన వైద్యరంగం ఇప్పుడు దీనిపై పరిశోధనలు
ఆరంభించింది. ఫ్లోరైడ్ చెరలో చిక్కుకుని వెన్నుపాము సమస్యలతో సతమతమవుతున్న బాధితులను.. కాస్త ముందుగా గుర్తించి.. వారికి ఓ ప్రత్యేకమైన పద్ధతిలో సర్జరీ చేస్తే.. తిరిగి మళ్లీ దాని
బారినపడే అవకాశం ఉండదని అధ్యయన పూర్వకంగా నిరూపించారు.
* మన దేశంలో.. 22 రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో ఈ బెడద ఉంది. నల్గొండ జిల్లాతో పాటు అనంతపురం, ప్రకాశం, కృష్ణా తదితర జిల్లాల్లో ఎక్కువగా కనబడుతోంది.
* తీవ్రంగా ప్రభావితమవుతున్నది పేదవారు. నిండా పదేళ్లు లేని పిల్లలు కూడా కర్రతో నడవాల్సిన దుస్థితికి చేరుతున్నారు.
* అసలు నీటిలో ఫ్లోరైడ్ లేకపోవటం ఉత్తమం. దాన్ని పూర్తిగా తీసెయ్యలేం కాబట్టి 1 పీపీఎం మాత్రం ఉండొచ్చు. కానీ మన దేశంలో కొన్నికొన్ని చోట్ల 20 పీపీఎం కూడా ఉంటోంది.
* ఫ్లోరైడ్‌కు సంబంధించి ప్రపంచంలోనే తొట్టతొలి కేసు మన ఆంధ్రప్రదేశ్‌లో, పొదిలి ప్రాంతం నుంచి 1937లో నమోదైంది.
ఫ్లోరైడ్ పేరు వింటేనే రాష్ట్రంలోని చాలా జిల్లాలు ఉలిక్కిపడతాయి. ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా ఘోరంగా ప్రభావితమైతే ప్రకాశం, గుంటూరు, కృష్ణా, అనంతపురం వంటి దాదాపు 19 జిల్లాల్లో ఎంతోమంది దీని
కారణంగా ప్రభావితమవుతున్నారు. భూగర్భ జలాల్లో, తాగునీటిలో 'ఫ్లోరైడ్' శాతం ఎక్కువగా ఉండటం సమస్యకు మూలం. ఈ నీటిని తాగినప్పుడు అధిక మోతాదుల్లో శరీరంలోకి ప్రవేశించే ఫ్లోరైడ్..
లోపల పేరుకుపోయి ఒంట్లో విలయం సృష్టించటం ఆరంభిస్తుంది. ఇదే 'ఫ్లోరోసిస్' సమస్యకు మూలం. అందుకే కొన్నికొన్ని ప్రాంతాల్లో దీని తీవ్రత, ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నాయి.
దంతాల నుంచి వెన్ను వరకూ!
ఫ్లోరైడ్ అనేది కీలకమైన మూలకం. తాగునీటిలో ఇది ఒక మోతాదు మించి ఉండకూడదు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇది అంతకు చాలా రెట్లు ఎక్కువ ఉంటోంది. ఈ నీటిని తాగటం వల్ల ఫ్లోరైడ్ శరీరంలో పేరుకుపోయి.. 'ఫ్లోరోసిస్'కు దారి తీస్తోంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటే దంతాలు పచ్చగా గారపట్టటం నుంచి ఎముకలు వంగిపోవటం, విరిగిపోవటం వరకూ ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా- ఇది తీవ్రమైన వెన్ను, నాడీమండల సమస్యలకూ కారణమవుతోంది.
ఫ్లోరోసిస్‌తో కనబడే సమస్యలు ప్రధానంగా మూడు.
1. దంతాలు దెబ్బతినిపోవటం. (డెంటల్ ఫ్లోరోసిస్)
2. ఎముకలు దెబ్బతినటం (స్కెలటల్ ఫ్లోరోసిస్).
3. నాడీమండల సమస్యలు(న్యూరోలాజికల్ ఫ్లోరోసిస్).
డెంటల్ ఫ్లోరోసిస్: చిన్నతనంలోనే ఫ్లోరైడ్ ప్రభావానికి గురైన వారిలో పళ్లు పచ్చగా గార పట్టినట్టు అయిపోతాయి. దీంతో తీవ్రమైన హాని లేకపోయినప్పటికీ ఇది అందాన్ని దెబ్బతీస్తుంది. ఫ్లోరోసిస్ కారణంగా
కొన్నికొన్ని జిల్లాల్లో ఎంతోమంది అమ్మాయిలు నోరారా నవ్వలేకపోతున్నారు. ఆ ప్రాంతాల ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావటం కూడా కష్టంగా ఉంది. అయితే ఇది చాలావరకూ చూడటానికి ఎబ్బెట్టుగా ఉండటం, అందానికి సంబంధించిన ఇబ్బంది తప్పించి దీనివల్ల మరీ తీవ్రమైన విపత్తులేమీ ఉండవు.
వెన్నులోపల ఒత్తిడి
ఫ్లోరైడ్ సమస్యల్లో అత్యంత తీవ్రమైనది, ముందు గుర్తిస్తే ఎంతోకొంత సరిదిద్దటానికి అవకాశం ఉన్నది నాడీమండల సమస్య. బాగా ముదిరిన దశలో ఎముకలు క్షీణించటమే కాకుండా.. సాధారణంగా ఉండాల్సిన లిగమెంట్ల వంటివి కూడా గట్టిబడిపోయి.. ఎముకల్లా తయారవుతుంటాయి. దీన్నే 'ఆసిఫికేషన్' అంటారు. ముఖ్యంగా వెన్ను పూసల్లోపల మెత్తటి పొరలు ఇలా గట్టిగా, మందంగా తయారైపోవటం వల్ల వెన్నుపాము నొక్కుకుపోవటం మొదలవుతుంది. ఇది అత్యంత కీలకమైన.. మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేసే దశ.
* మామూలుగా వెన్ను పూసలన్నీ విడివిడిగా కదులుతూ ఉంటాయి. కానీ ఈ ఫ్లోరైడ్ కారణంగా మెడ దగ్గర, వీపు మీది వెన్ను పూసలన్నీ కూడా అతుక్కుపోయినట్టు, కర్రలాగా తయారైపోతాయి. వీటిచుట్టూ ఉండే లిగమెంట్లు గట్టిగా ఎముకల్లా మారిపోయి.. పూసలన్నింటినీ బిగువుగా పట్టేసినట్టు.. అతుక్కుపోయినట్టు మార్చేస్తాయి. వెన్ను చుట్టూ ఉండే లిగమెంట్లు ఫ్లోరైడ్‌ను తీసుకుని.. దాని ప్రేరణతో కొత్తగా ఒక ఎముకలా మారిపోతాయి. ఎక్స్-రే, ఎమ్మారైలలో చూస్తే ఆ ప్రాంతంలో అదనంగా కొత్తగా ఎముక ఏర్పడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే- సాధారణంగా వెన్నుపూసల మధ్య గుండ్రటి ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ గుండా వెన్నుపాము నాడులు కిందికి వస్తుంటాయి. దాని చుట్టూ రక్షణగా మృదువైన పొరలు ఉంటాయి. ఫ్లోరైడ్ బాధితుల్లో ఆ మృదువైన పొరలూ గట్టి ఎముకలా మందంగా తయారైపోతాయి. దీంతో వెన్ను కదలికలు ఉండవు, సరళత్వం ఉండదు. పైగా ఆ మధ్య ఖాళీ మార్గం ఎముకతో పూడిపోవటం వల్ల వెన్నుపాము నాడులపై ఒత్తిడి పడుతుంది. అవి నొక్కుకుపోవటం మొదలవుతుంది. ఫలితంగా వీరిలో సమస్యలు బయల్దేరతాయి. మెత్తగా చర్మంలా ఉండాల్సిన లిగమెంట్లు గట్టిగా ఎముకలా ఎలా తయారవుతున్నాయన్నది కీలకమైన అంశం. దీనిపై ఇప్పటి వరకూ పెద్దగా పరిశోధనలేవీ లేవు. అది ఎముకలా ఎలా మారుతోందో తెలియకపోతే దాన్ని అడ్డుకోవటం కష్టం. అందుకే దీనికి మందుల వంటివేమీ పెద్దగా లేవు.
లక్షణాలేమిటి?
మెడ దగ్గరి వెన్నుపూసల్లో ఇలా కొత్తగా ఎముకలు ఏర్పడి.. వెన్నుపాము నొక్కుకుపోతుంటే ఆ కింది భాగమంతా కూడా స్పర్శ, స్పందనలు లేకుండా పోతుంది. దీనితో వచ్చే అతి పెద్ద సమస్య ఇది.
మెదడు నుంచి చేతులు, కాళ్లు.. శరీర భాగాలన్నింటికీ సంకేతాలు రావాల్సింది ఈ వెన్నుపాము గుండానే. కాబట్టి ఇది నొక్కుకుపోవటం వల్ల సంకేతాలు దెబ్బతిని.. చేతులు బలహీనంగా అనిపించటం.. అడుగులు తడబడటం వంటి లక్షణాలు మొదలౌతాయి.ఈ లక్షణాలు, బాధలు కనబడేది చేతులు, మోకాళ్లలోనే అయినప్పటికీ సమస్య మెదడు నుంచి వచ్చే వెన్నుపాము.. వెన్నుపూసల మధ్య నొక్కుకుపోవటం వల్లనే.
* మొదటి లక్షణం నడక వేగం తగ్గిపోవటం, బ్యాలెన్స్ కుదరకపోతుండటం, మద్యం తాగినవాళ్లు నడిచినట్లుగా నడుస్తుండటం, చీకటిలో నడవలేకపోవటం, పెద్దపెద్ద అంగలు వేసి నడుస్తుండటం, చేతులు కాళ్లు మొద్దుబారినట్లవటం.. ఈ లక్షణాలు కనబడుతుంటే రోగి తనకు తానుగా గుర్తుపట్టలేకపోయినా పక్కవాళ్లు గుర్తించొచచ్చు.
* బ్యాలెన్స్ ఉండదు. వీళ్లు కాళ్లు ఎక్కడున్నాయన్నది కళ్లతో చూస్తూ ఎలాగోలా నెట్టుకొస్తుంటారు. కళ్లు మూసుకుంటే అవేవీ తెలియదు కాబట్టి బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు. తలస్నానం చేసేటప్పుడు లేదా వాష్‌బేసిన్ దగ్గర ముఖం కడిగేటప్పుడు కళ్లు మూసుకోవటం వల్ల బ్యాలెన్స్ కోల్పోయినట్లు అవుతుంటుంది. వెంటనే గోడ వంటివి పట్టుకుని నిలబడటానికి ప్రయత్నిస్తుంటారు. బ్యాలెన్స్ కాపాడుకునేందుకు పెద్దపెద్ద అంగలేస్తుండటం, అడుగుల్లో అడుగులు వేస్తుండటం వంటి లక్షణాలు కనబడతాయి.
* వెన్నుపాము నొక్కుకుపోవటం వల్ల మూత్రం ఆపులేకపోతుండటం, తరచుగా వెళ్లాల్సి వస్తుండటం, వెళ్లినా పూర్తిగా విసర్జన చేసిన భావన కలగకపోవటం.. ఇలాంటి లక్షణాలూ ఉంటాయి.
* అన్నం చేతి వేళ్లతో కలుపుకొని తినటం కష్టంగా ఉండటం, స్పూన్‌తో మాత్రమే తినగలగటం వంటివీ సమస్య తీవ్రతను చెబుతాయి.
* చేతిరాత మారిపోతుంటుంది, ఒక పేజీ రాయగానే చెయ్యి సహకరించదు.
* కాళ్లు, చేతులు మొద్దుబారి తిమ్మిరెక్కినట్లుంటాయి. చేతి పట్టు తగ్గిపోయి.. ఏం చెయ్యాలన్నా చేతిలోని వస్తువులు జారిపోతుంటాయి.
* చాలామంది కాళ్లు కట్టెల్లా మానుల్లా బండబారిపోయి ఏదోగా ఉన్నాయని, నిద్రలో జెర్క్‌లు వస్తున్నాయని, నడవలేకపోతున్నామని చెబుతుంటారు.
* చాలామంది ఈ లక్షణాలన్నీ వయసుతో పాటు వచ్చేవేనని తోసేసుకుని తిరుగుతుంటారు. కానీ ఫ్లోరోసిస్ కారణమని గుర్తించి ఈ దశలోనే పట్టుకుని సర్జరీ చెయ్యగలిగితే ఫలితాలు బాగుంటాయి.
ఎముకల్లో ఫ్లోరోసిస్
మనదేశంలోని 2.5 కోట్ల మంది ఫ్లోరైడ్ బాధితుల్లో 60 లక్షల మంది 14 ఏళ్లలోపు పిల్లలే! ఎముకల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా చేరిపోయి.. ఎముక క్షయం కావటం, కొందరిలో ఎముకలు పెళుసుగా ఇంకొందరిలో మెత్తగా అయిపోవటం.. తీవ్రమైన సమస్య. కాళ్లు వంకర్లు తిరిగిపోవటం, నడవలేకపోవటం.. మనకు తరచూ కనబడే దయనీయమైన గాథలన్నీ వీరివే.
ఎముకలు ఎందుకు ప్రభావితమవుతాయి?
ఎముకల్లో సాధారణంగా క్యాల్షియం ఉంటుంది. ఎముకలకు బలాన్నిచ్చేది ఇదే. కానీ ఎముకల్లో ఈ క్యాల్షియం చేరకుండా ఫ్లోరైడ్ అడ్డుకుంటుంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అది నేరుగా ఎముకల్లోకి వెళ్లిపోయి పేరుకుపోతుంటుంది. చివరికి ఇదే క్యాల్షియంలా పనిచేస్తూ.. ఎముకల్లో క్యాల్షియాన్ని తగ్గించేసి.. దాని స్థానాన్ని ఆక్రమించెయ్యటం ఆరంభిస్తుంది. దీంతో ఎముకల్లో క్యాల్షియం తగ్గిపోయి- ఎముక దృఢత్వం తగ్గిపోయి.. అవి మెత్తగా తయారై.. అడ్డదిడ్డంగా వంగిపోతుంటాయి. దీన్నే 'ఆస్టియో మలేషియా' అంటారు. మరికొందరిలో- ఫ్లోరైడ్ పెరగటం వల్ల ఎముక బోలుగా, పెళుసుగా తయారవుతుంది. చాక్‌పీసులాగా ఎముక చూడటానికి గట్టిగానే ఉంటుందిగానీ పుటుక్కున విరిగిపోయేలా మారిపోతుంది. ఇదే ముదిరిన దశ అనుకుంటే... ఇక ఈ ఎముక క్షయానికి తోడు.. శరీరంలోని అస్థిబంధనాలు (లిగమెంట్లు) కూడా గట్టిపడిపోయి ఎముకల్లా తయారై.. కదిలికలు కష్టంగా మార్చివెయ్యటమన్నది మరింత తీవ్రమైన దశ.
ఎముకల కంటే ముందు దంతాలు ఫ్లోరైడ్‌ను ఎక్కువగా తీసుకుంటాయి, అందుకే ముందుగా అవి గారపట్టినట్టు తయారవుతాయి. అందుకే చిన్నతనం నుంచీ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి దంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 10-15 ఏళ్ల వరకూ కూడా మంచినీటి ప్రాంతంలో ఉండి, ఆ తర్వాత ఫ్లోరైడ్ ఎక్కువుండే ప్రదేశానికి వెళ్లిన వారికి దంతాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చు. పాలపళ్లు రాలిపోయి శాశ్వత దంతాలు వచ్చేసిన తర్వాత.. దంతాల్లోకి ఫ్లోరైడ్ ఎక్కువగా వెళ్లలేకపోవచ్చు. కానీ ఎముకలు మాత్రం 20 ఏళ్ల వరకూ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
ఎముల్లో ఫ్లోరైడ్ సమస్యల వల్ల ప్రధానంగా ఎదురయ్యే బాధలు.. ఒళ్లు, తీవ్రమైన కీళ్ల నొప్పులు! కాళ్లు, ఎముకలు వంగిపోవటం వంటివన్నీ బాగా ముదిరిన తర్వాత ఎదురయ్యే సమస్యలు. ఎక్కువ మందిలో కనిపించే బాధలు ఈ నొప్పులే. కానీ సమస్య ఏమంటే ఎవరైనా బాధితులు కీళ్ల నొప్పులతో వైద్యులను సంప్రదించినప్పుడు.. వైద్యులు కూడా అది ఎముకలు అరిగిపోవటం వల్ల వచ్చిందా? కీళ్ల వాతమా? లేక ఇతరత్రా మరేదైనా సమస్యా? అన్నదే ఆలోచిస్తారుగానీ దానికి ఫ్లోరైడ్ కారణమణమవుతోందా? అన్నది చూడరు. అందుకే ఫ్లోరైడ్ ప్రాంత బాధితులు వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పటం అవసరం.
సర్జరీలో నూతన మార్గం
ఈ దశలో సర్జరీ ఒక్కటే మార్గం. వెన్నుపూసల చుట్టూ ఉండే లిగమెంట్ల వంటివన్నీ గట్టిగా తయారై వెన్నును నొక్కుతున్నప్పుడు.. వెనకున్న ఎముకలు తొలగిస్తారు, దాంతో వెన్నుపాము క్రమేపీ వెనక్కి జారి.. దానిపై ఒత్తిడి తగ్గుతుంది. దీన్నే 'లామినెక్టమీ' అంటారు. ఈ సర్జరీతో క్రమేపీ లక్షణాలన్నీ పోతాయి. కానీ సర్జరీ అనంతరం ఆ ప్రాంతంలో రక్షణగా ఒక పొర ఏర్పడుతుంది. ఫ్లోరైడ్ ప్రభావం కారణంగా క్రమేపీ మళ్లీ ఆ పొర, మిగిలిన లిగమెంట్లు గట్టిపడటం ఆరంభమై.. మళ్లీ కొద్ది సంవత్సరాల్లో ఇదే లక్షణాలు, బాధలు మొదలవుతున్నాయని గుర్తించారు. వీరు మళ్లీ అదే ఫ్లోరైడ్ నీరు తాగుతుండటం వల్లనే వీరిలో మళ్లీ సమస్యలు వస్తున్నాయని ఇన్నాళ్లుగా భావించేవారు. కానీ మళ్లీ అదే నీరు తాగినా అదే ప్రదేశంలో మళ్లీ ఎందుకు రావాలి? అన్నది పెద్ద ప్రశ్న.
ప్రపంచ వ్యాప్తంగా దీనిపై పెద్దగా పరిశోధనల్లేవు. దీనికి సరైన పరిష్కారం ఏమిటి, ఏం చేస్తే మంచిదన్నది అస్పష్టంగా తయారైంది. ఇటువంటి ఫ్లోరోసిస్ సమస్యలు విదేశాల్లో పెద్దగా లేవు కాబట్టి వాళ్ల నుంచి మనం సమాచారాన్నీ, పరిష్కారాలనూ ఆశించలేం. అందుకే ఈ దిశగా జరిగే అధ్యయనాలకు ప్రాధాన్యం పెరిగింది.
ఇలా సమస్య మళ్లీ మొదటికి రాకుండా శాశ్వతంగా నివారించేందుకు కొత్తగా ఆవిష్కరించిన విధానం 'ల్యామినో ప్లాస్టీ'. దీనిలో వెనక భాగం మొత్తం తొలగించకుండా.. కేవలం ఓ వైపు మాత్రమే కట్ చేసి.. వెనక చట్రాన్ని ఒకచోట తెరిచినట్టు ఉంచెయ్యటం దీని ప్రత్యేకత. దీనివల్ల పొరలు గట్టిపడటమన్నది లేదు. ఒకవేళ గట్టిపడినా అది తెరచి ఉంచిన చోటే జరుగుతోంది, ఇది నేరుగా వెన్నును నొక్కే అవకాశం ఉండటం లేదని గుర్తించారు. సర్జరీ విధాన పరంగా దీని ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయి. లిగమెంట్లు గట్టిపడుతూ.. వెన్నుపాము నొక్కిడికి గురవుతున్న తొలిదశలోనే ఈ సర్జరీ చెయ్యటం వల్ల ఫలితాలు బాగుంటాయి. మెడ దగ్గరి పూసలు మాత్రమే నొక్కుకున్న వారికీ, వీపుభాగంలో కూడా నొక్కుకున్న వారికీ.. పరిస్థితిని బట్టి రెండూ తెరవాల్సి ఉంటుంది.
సమస్యను చెప్పే తేలిక పరీక్షలు
వెన్నుపాము నొక్కుకుపోతుండటం వల్ల వీరిలో 'హైపర్ ఎక్సైటబిలిటీ' అన్న సమస్య బాగా కనబడుతుంటుంది. దాన్ని గుర్తించటానికి:
* చకచకా చేతి వేళ్లను తెరుస్తూ.. ముడుస్తూ వేగంగా చెయ్యమంటే సాధారణంగా ఎవరైనా 10 సెకన్లలో 20 సార్త్లెనా చేస్తారు. కానీ ఈ వెన్ను సమస్య ఉన్నవారు.. ఇంత వేగంగా చెయ్యలేరు.
* కాళ్లు రెండూ దగ్గర పెట్టుకుని కళ్లు మూసుకుంటే బ్యాలెన్స్‌తప్పినట్టు పక్కకు ఒరిగిపోతుంటారు.
* చేతి వేళ్లు నాలిగింటినీ ముందుకు చాపి దగ్గరగా పెట్టమన్నప్పుడు ఎవరైనా తేలికగానే పెట్టగలుగుతారు. కానీ వీరిలో చివరి రెండు వేళ్లూ క్రమేపీ కిందికి, దూరంగా జారిపోతుంటాయి.
* ఒక వేలిని కదిపితే అదొక్కటే కదలాలి. కానీ వీరిలో ఒక వేలు నొక్కితే పక్క వేళ్లు కదులుతుంటాయి.
* చేతి మీద చిన్నగా తడితే కిందికి వెళ్లాలి. కానీ వీరిలో చేయి చిత్రంగా పైకి వస్తుంది.
* వెన్ను నొక్కుకుపోతోందని గుర్తించేందుకు ఇవన్నీ స్క్రీనింగ్‌కు ఉపయోగపడతాయి. ఈ పరీక్షలను ఎవరైనా చెయ్యచ్చు. వీటిలో అనుమానం బలంగా ఉంటే అప్పుడు ఎమ్మారై చేసి నిర్ధారించుకుని..
వెంటనే సర్జరీ చేసి దుష్ప్రభావాలు రాకుండా చూడొచ్చు. నిర్లక్ష్యం చేస్తే నడక కూడా కష్టంగా తయారవుతుంది.
-డా. జె.నరేష్ బాబు,స్పైన్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్,హైదరాబాద్.
- ======================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.