-గ్లకోమా వ్యాధిని నీటికాసుల వ్యాధి నల్ల ముత్యం అని సాధారణ పరిభాషలో వ్యవహరిస్తుంటారు. కంటిపాప వద్ద స్రావాల ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి కంటి నరం వద్ద ఒత్తిడి అధికమై అది బలహీనపడుతుంది. ఫలితంగా దృష్టిక్షేత్రం తగ్గడం ఆరంభమై నెమ్మదిగా సంపూర్ణ అంధత్వం ఏర్పడుతుంది.
గ్లకోమాలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. అవి 1.ఓపెన్ యాంగిల్ గ్లకోమా, 2.ఎక్యూట్ యాంగిల్ క్లోజ్డ్ గ్లకోమా.
గ్లకోమా గురించి నాలుగు ప్రధానాంశాలు
1) అంధత్వానికి ముఖ్య కారణం : అంధత్వం కలగడానికి కారణమయ్యే అంశాల్లో గ్లకోమా ముఖ్యమైనది. గ్లకోమాకు చికిత్స చేయకుండా వదిలివేస్తే సంపూర్ణ అంధత్వం ఏర్పడుతుంది. గ్లకోమాతో బాధపడుతూ, చికిత్స తీసుకున్నప్పటికీ సుమారు 10 శాతం మంది దృష్టి కోల్పోవడం జరుగుతుంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లకోమాను అంధత్వం కలగడానికి రెండవ అతి పెద్ద కారణంగా పేర్కొంది.
2) గ్లకోమా పలు రకాల చికిత్సలు: దీనిని పూర్తిగా నయం చేయడం కాని, కోల్పోయిన దృష్టి మళ్లీ వచ్చేలా చేయడం కాని సాధ్యం కాదు. అయితే, మందులతో కాని, శస్త్ర చికిత్సతో కాని, లేదా ఈ రెండింటి అనుసంధానంతో కాని ఈ వ్యాధి కారణంగా దృష్టి మరింతగా కోల్పోకుండా చేయవచ్చు. గ్లకోమా దీర్ఘకాలిక వ్యాధి కనుక జీవితాంతం దీనిని పరీక్షించుకుంటూ ఉండాలి. దృష్టి కోల్పోకుండా కాపాడుకోవడానికి వ్యాధి నిర్ధారణే తొలిమెట్టు.
3) ప్రతి ఒక్కరికీ గ్లకోమా రావచ్చు : వయస్సుతో సంబంధం లేకుండా అతి చిన్న ప్రాయంలోని పిల్లలనుంచి వృద్ధుల వరకూ ఎవరైనా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. కాగా, వృద్ధులలో ఈ వ్యాధి సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. పిల్లలలో ఈ వ్యాధి పుట్టుకతోనే ఉంటుంది. మధ్యవయస్కుల్లోనూ ఈ వ్యాధి కనిపించే అవకాశాలు ఎక్కువ.
4) ముందస్తు లక్షణాలేమీ కనిపించకపోవచ్చు : గ్లకోమాకు గురవుతున్నారని ముందుగా హెచ్చరించడానికి అవసరమైన వ్యాధి లక్షణాలేమీ దీనిలో కనిపించవు. అత్యంత సాధారణంగా కనిపించే ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనే రకంలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించవు. కంటిలో ఒత్తిడి పెరిగినప్పటికీ నొప్పి ఉండకపోవచ్చు.
కంటి చివరి భాగంనుంచి కానీ, ఇరుప్రక్కలా కాని వస్తువులు / దృశ్యాలు కనిపించకపోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితిని బాధితులు తమ తలను పక్కకు తిప్పి చూడటం ద్వారా సరి చేసుకుంటూ ఉంటారు తప్ప తమ దృష్టి క్షేత్రానికి ఏదో సమస్య ఉత్పన్నమవుతున్నదని గ్రహించలేరు.
ప్రత్యేకించి దృష్టిలోపం ఏర్పడినట్లు తెలిసే వరకూ బాధితులు ఈ సమస్య గురించి తెలుసుకోలేరు. గ్లకోమా ఉందా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి నేత్ర వైద్యులను సంప్రదించడం అవసరం.
ప్రాధమిక అవగాహన :
కంటి ఆకృతిని పరిరక్షించడానికి కంటిలో ఒకరకమైన ద్రవం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దాన్నే ‘యాక్వస్ హ్యూమర్’ అంటారు. అది నిత్యం ఉత్పత్తి అయ్యే క్రమంలో కొత్తద్రవం ఉత్పత్తి అయిన కొద్దీ పాతది బయటకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ ఇది బయటకు వెళ్లడంలో ఏదైనా అడ్డుపడితే? అప్పుడు కంటి నరంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతుంటుంది. ఇలా ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ నరం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడం వల్ల వచ్చే ప్రమాదాన్ని ‘గ్లకోమా లేదా గ్లుకోమా’ అంటారు. మనం నేరుగానే కాదు... పక్కలకు కూడా చూడగలం. దీన్నే ఫీల్డ్ ఆఫ్ విజన్ లేదా విజువల్ ఫీల్డ్ అంటారు. మనమిలా పక్కగా చూడగల విస్తృతి, సామర్థ్యం గ్లకోమా వ్యాధి వల్ల క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రోజులో జరిగేది కాదు. అందుకే తమ చూపు తగ్గిపోవడాన్ని చాలామంది చాలాకాలం వరకు గమనించలేరు.
గ్లకోమాలో రకాలు...
1. ప్రైమరీ గ్లకోమా
2. సెకండరీ గ్లకోమా
3. కంజెనిటల్ గ్లకోమా / పీడియాట్రిక్ గ్లకోమా
1. ప్రైమరీ గ్లకోమా:
నిర్దిష్టమైన కారణం ఏదీ లేకుండా ఈ వ్యాధి కనిపిస్తే దాన్ని ప్రైమరీ గ్లకోమా అంటారు. ఇందులోనూ మళ్లీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా (పీఓఏజీ) అని, క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమా (పీీసీఏజీ) అని రెండు రకాలున్నాయి. ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో యాక్వస్ హ్యుమర్ ద్రవం చాలా నెమ్మదిగా బయటకు వెళ్తుంది. అందువల్ల అంధత్వం కూడా చాలా నెమ్మదిగా వస్తుంది. అందుకే దీన్ని ఇంగ్లిష్‌లో నిశ్శబ్దంగా చూపును దెబ్బతీసే దొంగ (స్నీక్ థీఫ్ ఆఫ్ ది సైట్)గా చెబుతుంటారు. క్లోజ్‌డ్ యాంగిల్ గ్లకోమాలో కంటి ముందు ఉండే ‘యాంగిల్’ భాగం అకస్మాత్తుగా సన్నబడిపోతుంది లేదా మూసుకుపోతుంది. దాంతో యాక్వస్ బయటకు ప్రవహించడానికి అవకాశం లేక కంటినరంపై ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ తరహా కేసుల్లో నొప్పి, కన్ను ఎరబ్రారడంతో పాటు చూపును కాస్త వేగంగా కోల్పోతారు.
2. సెకండరీ గ్లకోమా:
ఈ తరహా గ్లకోమా కంటికి దెబ్బతగలడం (ట్రామా), కంటి కటకం (లెన్స్) దెబ్బతినడం, కంటిలో ఇన్ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల వస్తుంది.
3. కంజెనిటల్ గ్లకోమా :
ఇది చిన్నపిల్లల్లో వచ్చే గ్లకోమా. కొంతమందిలో పుట్టుకతోనే కంటిలో ఉండే యాక్వస్ ద్రవం బయటకు ప్రవహించదు. దాంతో కనుగుడ్డు మామూలు కంటే పెద్దదిగా ఉంటుంది. దీన్నే బూఫ్తాల్మస్ అంటారు. ఈ జబ్బు ఉన్న పిల్లల్లో కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. పిల్లలు కాంతిని చూడలేరు. ఈ పరిస్థితిని ఫొటోఫోబియా అంటారు.
- ప్రమాదకరాంశాలు
- 40 సంవత్సరాల వయస్సు దాటిన వారు
- కుటుంబ సభ్యులలో ఎవరికైనా గ్లకోమా వ్యాధి ఉన్నట్లయితే
- దగ్గరి చూపు కోసం వాడుతున్న కళ్లద్దాల నెంబరు తరచూ పెరుగుతూ ఉన్నట్లయితే
- తరచుగా తలనొప్పి వస్తుండటం
- దీపం చుట్టూ కాంతి వివిధ రంగుల్లో కనిపిస్తూ ఉండటం
- దృష్టి క్షేత్రంలో లోపాలు ఏర్పడటం
- మధుమేహంతో బాధపడే వారు,
- ధూమపానం చేసేవారు
- కంటికి బలమైన గాయం తగలడం
- అధిక రక్తపోటు
- కార్నియా మధ్యభాగం 0.5 మి.మీ. కంటే తక్కువ దళసరి కలిగి ఉండటం
మొదలైన అంశాలు గ్లకోమా సోకడానికి ప్రమాదకరాం శాలుగా పరిణమిస్తాయి. ఈ అంశాల్లో ఏమైనా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.
పరీక్షలు
గ్లకోమా అని అనుమానం కలిగినప్పుడు వైద్యులు ఈ కింద పేర్కొన్న పరీక్షలు నిర్వహిస్తారు.
- కంటిలో ఒత్తిడిని నమోదు చేయడం
- కంటి నాడి పరీక్ష
- దృష్టి క్షేత్ర పరీక్ష
- ప్రత్యేకమైన లెన్స్ సహాయంతో గొనియోస్కోపీ పరీక్ష
గ్లకోమా రకాలు : చికిత్స
ఓపెన్ యాంగిల్ గ్లకోమా : కంటిలో ఒత్తిడి పెరిగి కంటి నాడి నెమ్మదిగా దెబ్బ తినడం వల్ల దృష్టి క్షేత్రం
నెమ్మదిగా కుంచించుకుంటూ చివరకు శాశ్వత అంధత్వం ప్రాప్తిస్తుంది.
వీరికి లేజర్ లేదా శస్త్ర చికిత్స ద్వారా కంటిలోని ఒత్తిడిని తగ్గించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు.
క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా : ఈ సమస్యలో ఓపెన్ యాంగిల్ గ్లకోమా మాదిరిగా నెమ్మదిగా కాకుండా అకస్మాత్తుగా కంటిలో ఒత్తిడి పెరగడం వల్ల కన్ను నొప్పితో ఎర్రబడుతుంది. వాంతులు తలనొప్పి మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి.
వీరికి అత్యవసర చికిత్స అవసరమవుతుంది. కంటిలోని ఒత్తిడిని తగ్గించి, లేజర్ ద్వారా ఆపరేషన్ చేస్తే కొద్దిగా దృష్టి నిలబడే అవకాశం ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా పక్కకంటికి కూడా చికిత్స చేస్తారు.
- చికిత్స :
కంట్లో చుక్కల మందులు వేయడం (ఈ చుక్కల మందులు జీవితాంతం వాడాలి)
2. లేజర్ చికిత్స:
కొన్ని రకాల గ్లకోమాలకు మాత్రమే ఈ చికిత్స ఉపయోగపడుతుంది
3. శస్తచ్రికిత్స:
పై పద్ధతుల వల్ల కంటిలోని ఒత్తిడి(ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్) నియంత్రణలోకి రాకపోతే శస్తచ్రికిత్స అవసరమవుతుంది.
ఈ చికిత్సల ద్వారా కంటిలో ఉండే యాక్వస్ ద్రవం ఒత్తిడిని స్థిరంగా ఉంచడం వల్ల ఇకపై చూపు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకసారి గ్లకోమా ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఆ రోగులు జీవితకాలం పాటు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణుడితో ఫాలో-అప్‌లో ఉండటం, వారు సూచించినట్లుగా పరీక్షలను క్రమం తప్పకుండా చేయిస్తూ ఉండటం అవసరం. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి తీసుకునే చికిత్స క్రమాన్ని డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. మందులను మారుస్తుంటారు.
Updates :
- Image : courtesy with Raksha@Prajasakti News paper
నీటి కాసులు-లేదా గ్లకోమా (Glaucoma) అనేది ఒక రకమైన కంటి వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వైద్యము లభించుచున్నది. ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్ల మంది ప్రజలు, అందులో 80 శాతం మంది ఆసియా వాసులను గ్లకొమ ప్రభావితం చేస్తోంది.ప్రైమరీ యాంజెల్ క్లొజర్ గ్లకొమ (పిఎసిజి)తో సంబంధం ఉన్న మూడు కొత్త జన్యువులను శాస్త్రవేత్తలు విడదీశారు. 1854 పిఎసిజి కేసులు, పిఎసిజి కేసులు కాని 9608 కేసులను శాస్త్రవేత్తల బృందం జీనోమ్- వైడ్ అసోసియేషన్ స్టడీని నిర్వహించింది. దీని కోసం ఆసియాలో ఒక్కొక్కరి నుండి ఐదు నమూనాల చొప్పున సేకరించారు. వీరు మరో 1917 పిఎసిజి కేసులు, పిఎసిజి కాని 8943 కేసులపై దృవీకరణ ప్రయోగాలు నిర్వహించారు. దీని కోసం వీరు ప్రపంచవ్యాప్తంగా నమూనాలు సేకరించారు. సింగపూర్ ఐ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సెరి), జీనోం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ (జిఐఎస్), నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యుఎస్), నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆఫ్తాల్మజి, టన్ టక్ సెంగ్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ పరిశోధనను చేపట్టాయి. జీనోమ్-వైడ్ పర్‌స్పెక్టివ్‌ను ఉపయోగిస్తూ, పిఎసిజిని అధ్యయనం చేయడం ఇదే తొలిసారి అని 'నేచర్ జెనిటిక్స్' అనే జర్నల్ పేర్కొంది. చాలా కాలం నుండి ఎన్‌యుఎస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అంగ్ టిన్ వ్యక్తం చేసిన అనుమానాలను ఈ ఫలితాలు నిర్ధారిస్తున్నాయి. టిన్ పదేళ్లకుపైగా పిఎసిజిపై పనిచేశారు. గ్లకొమ వ్యాధి వంశపారంపర్యంగా వస్తోందని భావించారు. 'పిఎసిజి వృద్ధి చెందడంలో జన్యుపరమైన కారణాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇది మరింత ఆధారాన్ని అందిస్తోంది. వ్యాధిని అర్థం చేసుకోవడానికి ఈ ఫలితాలు కొత్త మెళకువలకు దారితీస్తాయి. భవిష్యత్తులో కొత్త చికిత్స కనుక్కోవడానికి ఆస్కారమేర్పడింది. ముందే జబ్బును గుర్తించి నయం చేసే అవకాశముంది.
- ================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.