Saturday, February 5, 2011

మోకాళ్లలో కీలు మార్పిడి విధానం , Knee replacement surgery


  • డాజె.విద్యాసాగర్‌.చీఫ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌,అవేర్‌ గ్లోబల్‌ హాస్పిటల్‌,ఎల్‌.బి.నగర్‌, హైదరాబాద్‌.ఫోన్‌:24111111



ఎక్స్‌రే రిపోర్టులో కీళ్ల మధ్య ఉండే ఖళీ బాగా తగ్గిపోయినట్లు కనిపిస్తే ఇదిది మూడో దశకు సూచిక అవుతుంది. ఒకప్పుడైతే ఈ సమస్యకు ఆస్టియాటమీ అనే శస్త్ర చికిత్స చేసేవారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తాత్కాలికంగానే ఉండేవి. కానీ, అధునికంగా వచ్చిన మోకాలి కీలు మార్పిడి చికిత్స మాత్రం అత్యంత ప్రామాణికమైనది. ఈ శస్త్ర చికిత్సలు 98 శాతం దాకా విజయవంతం అవుతున్నాయి. మిగతా రెండు శాతం ఇన్‌ఫెక్షన్ల కారణంగా గానీ, కీలు వదులైపోవడం వల్లగానీ ఏదైనా ఇబ్బంది రావచ్చు. అయితే వాటిని కూడా ఆ తరువాత సరిచేసే వీలుంటుంది. ఈ కృత్రిమ కీలును అమరుస్తాం. ఇది 15 ఏళ్ళకు పైగానే మన్నుతుంది.

ఈ శస్త్ర చికిత్సలో అరిగిపోయిన కార్టిలేజ్‌ను తొలగించి కృత్రిమ కీలును అమరుస్తాం. ఒక పక్క స్టీలుతోనూ మరోపక్క ప్లాస్టిక్‌తోనూ ఉండే కృత్రిమ కీలు ఎంతో ధృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్‌ క్రోమ్‌తో తయారైన కృత్రిమ కీళ్లు వచ్చేవి. వీటికి త్వరగా అరిగిపోయే లక్షణం ఎక్కువ. అందుకే చిన్న వయసు వారికి వీటిని ఉపయోగిస్తే కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య మొదలవడం జరిగేది. ఇప్పుడు స్టీలుతో కాకుండా సెరామిక్‌(ఆక్సీనియం)తో తయారు చేసిన కీళ్ళు వస్తున్నాయి. వీటికి తోడు ప్లాస్టిక్‌ ఉండే వైపున క్రాస్‌ లింక్డ్‌ పాలిఎథీలిన్‌తో తయారైనవి వస్తున్నాయి. ఇవి మామూలు వాటికన్నా పదిరెట్లు దృఢమైనవి.

అందువల్ల ఎముకల మధ్య ఒరిపిడి తగ్గి అవి ఎక్కువ కాలం అంటే సుమారు 15 నుంచి 20 ఏళ్ల దాకా మన్నుతున్నాయి. అందుకే ప్రమాదాల్లో గానీ, ఇతర కారణాలతో గానీ చిన్న వయసులోనే మోకాలి కీళ్ళు దెబ్బతిన్న వారికి కూడా వీటిని అమర్చడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. ఫిజియోథెరపీలో వచ్చిన కొత్త నైపుణ్యాల వల్ల కండరాలు త్వరగా బలపడి చాలా వేగంగా కోలుకునే స్థితి ఏర్పడింది. ఒకప్పుడు రెండు మోకాళ్లలోనూ కీలుమార్పిడి అవసరమైతే ముందు ఒక కాలుకు మాత్రమే చేసి కొన్ని నెలల తరువాత ఆ రెండవ కాలుకు చేసే వాళ్లం. ఇప్పుడు అదేమీ లేదు. ఒకేరోజు ఒకే సమయంలో రెండు కాళ్లకూ చేయడం సాధ్యమవుతోంది.


అపోహలు
కీలు మార్పిడి చికిత్స చేసుకున్న తరువాత నెలల తరబడి మంచం మీదే పడి ఉండవలసి ఉంటుందన్న భావన చాలా మందిలో ఉంది. నిజానికి ఆ వ్యక్తిని శస్త్ర చికిత్స జరిగిన మూడవ రోజే నడిపిస్తాం.

శస్త్ర చికిత్స తరువాత కింద కూర్చోవడం గానీ, మెట్లు ఎక్కడం కానీ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా కొందరిలో ఉండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన(హైఫ్లెక్స్‌ నీ రిప్లేస్‌మెంట్‌) కృత్రిమ కీళ్లతో మెట్లు ఎక్కడమే కాదు, ఏ ఇబ్బందీ లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. శస్త్ర చికిత్స జరిగిన నెలరోజుల్లో స్టిక్‌ సహాయం కూడా లేకుండా నడిచే స్థితి ఏర్పడుతుంది.

శస్త్ర చికిత్స తరువాత భరించలేని నొప్పి వస్తుందేమోనని కొందరు భయపడుతూ ఉంటారు. కానీ, ఇటీవల వచ్చిన కొన్ని కొత్త రకాల మాత్రలు, ఇంజెక్షన్ల వల్ల ఇప్పుడు ఆ నొప్పి చాలా తక్కువగా ఉంటోంది.

పాటించాల్సిన జాగ్రత్తలు
శస్త్ర చికిత్స తరువాత ఎక్కువ బరువు మోయడం గానీ, ఎక్కువగా మెట్లు ఎక్కడం గానీ చేయకూడదు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉంటూ రోజు వ్యాయమం చేయడం చాలా అవసరం. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా ఉండి కీళ్లు ఎక్కువ కాలం ధృఢంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. వ్యాయామాల్లో వాకింగ్‌, స్విమ్మింగ్‌లు చేయవచ్చు కానీ, రన్నింగ్‌ మాత్రం చేయకూడదు.ఏమైనా కీలు మార్పిడి చికిత్స నడకల్లో మళ్లీ వేగాన్ని నింపుతోంది. కదల్లేని ప్రాణానికి ఒక కొత్త జీవితాన్నిస్తోనం



=========================================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.