బట్టతల కి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ , Hair Transplantation for Baldhead.
అందం. ఆకర్షణ. ఆత్మవిశ్వాసం... ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన మథనం మొదలవుతుంది. ఇక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్, వీవింగ్ వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఉన్న ఒకే ఒక్క శాశ్వత పరిష్కారం.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్! ఇటీవలి కాలంలో ఈ విధానం మరింత మెరుగులు దిద్దుకుంది. తలకట్టును దాదాపు సహజసిద్ధంగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుని, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం సాధించింది. ఇంతకీ ఈ విధానంలో ఏం చేస్తారు? ఏమిటి దీని ప్రత్యేకత?
బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్ అయిన 'టెస్టోస్టిరాన్'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో 'డీ హైడ్రో టెస్టోస్టిరాన్'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.
బట్టతల వస్తున్న తొలినాళ్లలో వెంట్రుకలు వూడిపోకుండా ఉండేందుకు వైద్యులు 'మినాక్సిడిల్' 'ఫినాస్టిరైడ్' వంటి కొన్ని లోషన్లు సిఫార్సు చేస్తారు. అయితే వీటిని జీవితాంతం వాడుకుంటూనే ఉండాలి, వీటితో కొన్ని దుష్ప్రభావాలూ ఉంటాయి. ఇక విగ్గులు ధరించటం, సిలికాన్ గమ్మింగ్, హెయిర్ వీవింగ్ వంటి చాలా కృత్రిమ పద్ధతులున్నాయిగానీ ఏవీ సహజంగా, శాశ్వతంగా ఉండేవి కావు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బట్టతల సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' విధానాన్ని ఆశ్రయిస్తున్నారు.
స్థూలంగా...
తల వెనక భాగంలో రాలిపోకుండా దట్టంగా మిగిలి ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసుకువచ్చి... మాడు మీద, ముందు భాగంలో నాటటం 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' విధానం ప్రత్యేకత. ఈ వెంట్రుకల కుదుళ్లు హార్మోన్ల ప్రభావానికి లొంగే రకం కాదు కాబట్టి.. నాటిన తర్వాత ఇవి రాలకుండా అలాగే ఉండిపోతాయి. జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. అందుకే 'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' పూర్తిగా విజయవంతమైన ప్రక్రియగా నిలబడింది. దీనితో ఎలాంటి హానీ ఉండదు.
* బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది.
* చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ. బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం.
* తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు.
* హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో మెదడుకు ప్రమాదమని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఇది కేవలం చర్మం పై భాగానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే. దీంతో ఎలాంటి హానీ ఉండదు. మరికొందరు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమోనని అపోహ పడుతుంటారు. అన్ని ఆపరేషన్ల అనంతరం వాడినట్టుగానే ఐదారు రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3-6 నెలల పాటు విటమిన్ మాత్రలు వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఈ మందులు పెద్దగా ఖరీదైనవేమీ కాదు.
* ఇతరుల వెంట్రుకలు, కృత్రిమ సింథటిక్ వెంట్రుకల వంటివాటిని మన శరీరం తిరస్కరిస్తుంది. కాబట్టి ఎవరి వెంట్రుకలు వారికే అమర్చే విధానంతో ఏ ఇబ్బందీ ఉండదు.
* గడ్డం, మీసం దగ్గర వెంట్రుకలు లేనివారికి కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయొచ్చు. ఇందులో ఒక వెంట్రుక, రెండు వెంట్రుకలను మాత్రమే తీసి నాటుతారు.
* కనుబొమల్లో తేడాలను కూడా సరిచేయొచ్చు. వీటిని నాటేటప్పుడు దిశ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. సాధారణంగా కనుబొమలు అంతగా పెరగవు. కానీ ఇతర ప్రాంతం నుంచి తెచ్చి నాటిన వెంట్రుకలు త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి.
* ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం తలపై అంతగా జుట్టు లేకపోతే ఇప్పుడు శరీరంలోని మిగతా భాగాల్లోంచి తీసిన వెంట్రుకలను కూడా ఉపయోగిస్తున్నారు. గడ్డం కింది నుంచి, ఛాతీ మీది వెంట్రుకలను తీసి నాటొచ్చు. అయితే ఇలా ఎక్కువ వెంట్రుకలు తీయటానికి వీలుండదు. కొన్ని కొన్ని వెంట్రుకలను మాత్రమే నాటే అవకాశం ఉంటుంది. మరిన్ని కావాలంటే దీన్ని దశల వారీ చేస్తారు.
ఎవరికి చేస్తారు?
'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్' అందరికీ పనికి రాదు. 20 ఏళ్ల లోపు వారికి, జుట్టు అంతగా వూడిపోనివారికి, అప్పుడప్పుడే బట్టతల ఆరంభమైన వారికి, చుండ్రు ఇతరత్రా అనారోగ్య కారణాలతో వెంట్రుకలు రాలినవారికి.. దీన్ని వెంటనే చెయ్యరు. ముందు అసలు జుట్టు ఎందుకు రాలిపోయింది? అన్నది గుర్తించి.. ఇతరత్రా సమస్యలేమీ లేవు, అది బట్టతలే అని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను సిఫార్సు చేస్తారు.
ఎవరికి..?
జుట్టు వూడిపోతున్న తీరును బట్టి బట్టతలను 7 దశలుగా విభజిస్తారు. దీన్నే 'నార్‌వుడ్ క్లాసిఫికేషన్' అంటారు.
కణతల పైభాగంలో జుట్టు క్రమంగా రాలిపోవటం మొదటి దశ. కణతల పైభాగంలోనూ రాలిపోయి 'యు' ఆకారం ఏర్పడితే అది రెండో దశ. ఇలా రాలిపోతూ.. మాడు మీద జుట్టు పూర్తిగా రాలిపోయి అర్ధ చంద్రాకారంలా కనిపిస్తోందంటే దాన్ని ఆరో దశగా గుర్తిస్తారు. ఇక ఆ అర్ధచంద్రాకారం మరింతగా విస్తరించి కేవలం చెవుల పైన, వెనకాల మాత్రమే జుట్టు మిగిలి ఉంటే దాన్ని ఏడో దశగా భావిస్తారు. ఈ నార్‌వుడ్ దశల్లో- ఒకటి, రెండు దశల్లో ఉన్న వారికి ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం ఉండదు. మిగిలిన దశల్లో వారికి ఎవరికైనా ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఇలా చేస్తారు
'హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్'లో ప్రధానంగా మూడు దశలుంటాయి.
1. జుట్టును తీయటం: తల వెనక భాగంలో జుట్టు ఒత్తుగా ఉన్న చోటి నుంచి వెంట్రుకలను కుదుళ్లు, కొంత కణజాలంతో సహా తీయటం. ఈ జుట్టును తీయటానికి ప్రధానంగా రెండు పద్ధతులున్నాయి. 1. ఒక పట్టీ మాదిరిగా.. జుట్టుతో సహా కొద్దిపాటి చర్మాన్ని తియ్యటం. (స్ట్రిప్ పద్ధతి) 2. వెంట్రుకలతో ఒక్కో కుదురునూ తియ్యటం (ఫాలిక్యులార్ యూనిట్ ఎక్‌ట్రాక్షన్ పద్ధతి)
* స్ట్రిప్ పద్ధతి: ఇందులో చెవి వెనకాల నుంచి వేలెడు వెడల్పుతో అర్ధ చంద్రాకారంలో చర్మంతో పాటు వెంట్రుకలను తీస్తారు. తర్వాత ఆ తీసిన భాగాన్ని దగ్గరగా లాగి కుట్టేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం మంది సర్జన్లు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ఈ పద్ధతిలో తీసిన వెంట్రుకలు దాదాపుగా అన్నీ నాటటానికి అనువుగా ఉంటాయి. పట్టీ తీసి, చర్మాన్ని కుట్టిన చోట సన్నగా మచ్చ ఉంటుందిగానీ ఇది వెంట్రుకల్లోనే ఉండిపోతుంది కాబట్టి ఎవరికీ కనబడదు. ఎప్పుడైనా పూర్తిగా గుండు చేయించుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది.
* కుదుళ్లతో తీసే పద్ధతి: ఇందులో ఒక్కొక్క కుదురునూ వెంట్రుకలతో సహా తీస్తారు. ఇలా ఎన్ని గ్రాఫ్ట్‌లు కావాలంటే అన్ని కుదుళ్లు తియ్యాల్సి ఉంటుంది. దీనిలో చర్మంపై కోత పెట్టే అవసరం లేదు కాబట్టి పొడవాటి మచ్చ ఉండదు. కుదురు తీసిన చోట చిన్నచిన్న మచ్చలు ఏర్పడతాయి. ఇలా ఒక్కొక్క కుదురునూ జాగ్రత్తగా తియ్యాలి కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు కుదుళ్లు దెబ్బతినొచ్చు కూడా.
పట్టీనిగానీ, కుదుళ్లనుగానీ స్థానికంగా మాత్రమే మత్తు ఇచ్చి తీస్తారు కాబట్టి దీనితో ఎటువంటి సమస్యా ఉండదు.
2. గ్రాఫ్ట్‌లు సిద్ధం చేయటం: వెంట్రుకల కుదుళ్లను వేర్వేరుగా సిద్ధం చేయటం రెండో దశ. కొన్ని కుదుళ్లలో ఒకే వెంట్రుక ఉంటే కొన్నింటిలో 4-5 కూడా ఉంటాయి. సగటున ఒక్కో కుదురులో 2.5 ఉంటాయనుకోవచ్చు. వీటిని నాటటానికి అనువుగా మైక్రోస్కోపులో చూస్తూ గ్రాఫ్ట్‌లు సిద్ధం చేస్తారు. వెంట్రుక చుట్టూ కొంచెం కణజాలం అంటి పెట్టుకొని ఉండేలా చూస్తారు. ఇలా సిద్ధమైన వాటిని చల్లటి సెలైన్‌లో భద్రపరుస్తారు.
3. నాటటం (ట్రాన్స్‌ప్లాంటేషన్): స్ట్రిప్ పద్ధతిలో తీస్తే దట్టంగా జుట్టు గలవారికి ఒక చెవి నుంచి మరో చెవి దాకా 3,000 - 6000 వరకు వెంట్రుకలు వస్తాయి. పలుచగా ఉంటే 1,500 వెంట్రుకల వరకు లభిస్తాయి. ఇలా తీసినవాటిని.. మాడు మీద, వెంట్రుకలు ఉండాల్సిన చోట.. సూదులతో గానీ సూక్ష్మమైన కత్తుల సాయంతో గానీ చిన్నచిన్న రంధ్రాలు చేసి ఆ చర్మంలో నాటుతారు. సహజంగా కనబడేందుకు తలపై ముందు భాగంలో సన్నటి వెంట్రుకలు నాటాల్సి ఉంటుంది. అందువల్ల అక్కడ ఒకట్రెండు వెంట్రుకల గ్రాఫ్ట్‌లను ఎంచుకుంటారు. మాడు మీద జుట్టు దట్టంగా కనిపించటానికి వీలుగా రెండుమూడు వెంట్రుకలు గలవి, ఆ వెనకాల నాలుగు వెంట్రుకలు ఉండే గ్రాఫ్ట్‌లను ఉపయోగిస్తారు. దీనివల్ల తల కట్టు చాలా సహజంగా కనిపిస్తుంది.
* గతంలో కేవలం వెంట్రుకలను ఒకచోట నుంచి తీసి మరోచోట నాటితే సరిపోతుందని భావించేవారు. కానీ ఇప్పుడు వీటిని సౌందర్య దృష్టితో, నాటే క్రమంలో సహజత్వాన్ని తీసుకొస్తున్నారు. సాధారణంగా మన తల మీద వెంట్రుకలు ఒక క్రమంలో ఉండవు. ఏదో ఒకవైపు వాలి ఉంటాయి. కాబట్టి నాటే సమయంలోనూ ఈ పద్ధతినే అనుసరిస్తుండటంతో సహజమైన రూపు వస్తుంది.
* సాధారణంగా జుట్టు ఒత్తుగా ఉండేవారికి ఒక చదరపు సెంటీమీటరులో 100-200 వెంట్రుకలుంటాయి. అంటే సుమారుగా 50-75 గ్రాఫ్ట్స్ అనుకోవచ్చు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ఇంత మొత్తంలో గ్రాఫ్ట్స్ అమర్చటం కష్టం. ఎందుకంటే ఒకవేళ 75 గ్రాఫ్ట్స్ పెట్టుకుంటూ వెళ్తే.. నాటేందుకు తీసిన వెంట్రుకలు తల అంతటికీ సరిపోవు. అందువల్ల తీసిన వెంట్రుకలను అన్ని భాగాల్లోకి వచ్చేలా సర్దుబాటు చేస్తారు. 30-35 గ్రాఫ్ట్స్ అమర్చితే సహజంగా కనిపిస్తుంది. 50 వరకు నాటితే అద్భుతంగా కనిపిస్తుంది. వెంట్రుకలను ఒక సెంటీమీటరు కన్నా తక్కువ లోతులోనే నాటుతారు కాబట్టి బ్లీడింగ్ వంటి సమస్యలేమీ ఉండవు. గ్రాఫ్ట్స్‌ను నాటేటప్పుడు సూదితో చర్మాన్ని కొంచెం వెడల్పుగా చేసి అమరుస్తారు. సూది బయటకు తీయగానే చర్మం మూసుకుపోయి వెంట్రుకను పట్టేసుకుంటుంది.
* మొత్తం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ పూర్తవటానికి 6-8 గంటల సమయం పడుతుంది.
తర్వాత?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత కొందరికి తల మీద డ్రెస్సింగ్ చేస్తారు. ఎలాంటి డ్రెస్సింగ్ చేయకపోయినా ఏమీ కాదు. ఒకట్రెండు రోజులు నీడ పట్టున ఉండటం మంచిది. ట్రాన్స్‌ప్లాంటేషన్ అనంతరం 48 గంటల తర్వాత సెలైన్ నీటితో తలస్నానం చేయిస్తారు. చిన్న చిన్న రక్తం గడ్డలు ఏవైనా ఉంటే తొలగిస్తారు. అవసరమైతే వెంట్రుకలను సరి చేస్తారు. రెండు రోజుల తర్వాత మరోసారి తలస్నానం చేయిస్తారు. దీంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నవారికి జుట్టు వూడిపోతుందేమోననే భయం తొలగిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో రోజు విడిచి రోజు షాంపూతో తలస్నానం చేసుకోవచ్చు. వాస్తవానికి రెండు రోజుల్లోనే వెంట్రుకలు బాగా స్థిరపడతాయి. రుద్దినా అవి బయటికేమీ రావు. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక తలను శుభ్రంగా ఉంచుకోవటం చాలా అసవరం.
* ముఖ్యం: కుదుళ్లు ఒకచోటి నుంచి తీసి మరోచోట పెట్టినప్పుడు.. ఆ తాత్కాలిక ప్రభావం వల్ల నాటిన రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఆ వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇది సహజం. ఈ దశలోనే చాలామంది భయపడిపోతుంటారు. కానీ కుదురు లోపల అలాగే ఉంటుంది కాబట్టి ఆందోళన అనవసరం. రెండు నెలల తర్వాత వెంట్రుకలు తిరిగి పెరగటం ప్రారంభిస్తాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన 6-9 నెలలకు జుట్టు పూర్తి ఒత్తుగా వచ్చేస్తుంది.
* హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక రెండు వారాల పాటు ఎక్కువసేపు వ్యాయామం చేయరాదు. రన్నింగ్, జాగింగ్, ట్రెడ్‌మిల్ వంటివి చేసినపుడు చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో దురద పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు తల మీద గోక్కుంటే వెంట్రుకలు వూడే అవకాశం ఉంది. నెల పాటు ఈత కొట్టటం మానెయ్యాలి. దీంతో వెంట్రుకలను నాటినపుడు చేసిన రంధ్రాల్లోకి క్లోరిన్ వంటి రసాయనాలు వెళ్లి కుదురు దెబ్బతినొచ్చు.నడవటం, ఇంట్లో చేసుకునే వంటి పనులన్నీ రెండో రోజు నుంచే చేసుకోవచ్చు. ఎప్పటిలాగానే పడుకోవచ్చు.
-డా. వై.వెంకటరావు, ప్లాస్టిక్ సర్జన్, వైవీరావ్స్ హెయిర్, ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్, హైదరాబాద్.
- ================================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.