Saturday, March 19, 2011

ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌,Essential Hypertension

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -Essential Hypertension- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నూటికి సుమారు 95మందిలో రక్తపోటు పెరగ టానికి కారణాలు ఇతమిత్థంగా తెలియవు. దీనిని ఎసెన్షియల్‌ (ప్రైమరీ) హైపర్‌టెన్షన్‌ అంటారు. 5 నుంచి 10 శాతం రోగుల్లో అధిక రక్తపోటుకు కొన్ని ప్రత్యేక వ్యాధులు కారణం కావచ్చు. వీటిని సెకండరీ హైపర్‌ టెన్షన్‌ అంటారు.

ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌ రావడానికి వంశానుగత కారణాలు ముఖ్యపాత్ర వహిస్తాయని వైద్య శాస్త్రవే త్తలు విశ్వసిస్తున్నారు. అధిక రక్తపోటు వంశపారం పర్యంగా వచ్చే వ్యాధుల్లో ఒకటని చెప్పవచ్చు.

రక్తపోటు మామూలుగా ఉన్నవారిలో కంటే రక్త పోటు అధికంగా ఉన్నవారి రక్త బంధువుల్లో అధిక రక్తపోటు, పక్షవాతం, కరొనరీ గుండె జబ్బులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. అధిక రక్తపోటు ఉన్నవారి తల్లిదండ్రుల్లో, రక్తబంధువుల్లో పక్షవాతం (పెరాలి సిస్‌) 3 నుంచి 5 రెట్లు ఎక్కువని వైద్యశాస్త్ర నివేది కలు పేర్కొంటున్నాయి.

వయస్సు పెరిగే కొద్దీ పురుషుల్లోనూ, స్త్రీలలోనూ రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. 50 సంవత్సరాల వయస్సు వరకు ఈ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా ఉంటున్నది. తరువాతి వయస్సులో అధిక రక్తపోటు స్త్రీ పురుషుల్లో దాదాపు సమంగానూ, వృద్ధాప్యంలో స్త్రీలలో కొంత ఎక్కువగాను ఉంటున్నది.

-ఫ్రామింగ్‌హామ్‌ అధ్యయనం ప్రకారం 30 నుంచి 65 సంవత్సరాల వరకు సిస్టోలిక్‌ రక్తపోటు సగటున 20 మిల్లీమీటర్ల చొప్పున, డయస్టోలిక్‌ రక్తపోటు 10 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉంటుందని వెల్లడైంది. రక్తపోటు అధికంగా ఉన్నవారిని 20 సంవత్సరాలపాటు పరీక్షించగా, వయస్సు పెరిగే కొద్దీ కరొనరీ గుండెజబ్బు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ అవుతాయని స్పష్టమైంది.
స్థూలకాయం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఉదాహ రణకు 10 శాతం బరువు పెరిగితే సిస్టోలిక్‌ రక్తపోటు 6.5 మిల్లీమీటర్లు పెరుగుతుంది.
అధిక రక్తపోటు ఉన్న వారిలో 38 శాతం మంది స్థూలకాయులని వెల్లడైంది. మద్యపానం వల్ల సిస్టోలిక్‌ రక్తపోటు పెరుగుతుంది. అధి కంగా పొగ తాగే వారిలో రక్త పోటు, గుండెపోటు, హఠాన్మ రణం ఎక్కువ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పొగాకులోని నికోటిన్‌ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతుంది. రోజువారీ వ్యాయామం చేసే వారిలో కంటే శారీరక వ్యాయామం చేయకుండా సోమరి జీవనాన్ని గడిపే వారిలో అధిక రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా వినియోగిం చడానికి, అధికరక్తపోటుకు సంబంధం ఉన్నదని అధ్య యనాల్లో వెల్లడైంది.
ఆహారంలో రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడే వారిలో (ఉదాహరణకు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, దక్షిణ పసిఫిక్‌ దీవుల్లోని కొన్ని జాతులు) అధిక రక్తపోటు దాదాపు లేదనే చెప్పవచ్చు.

తినే ప్రతి వస్తువులో ఉప్పు వేసుకునే వారిలో అధిక రక్తపోటు ఎక్కువ. శరీరానికి ఉప్పు అవసరమే. ప్రతి జీవకణంలోను ఉప్పు ఉంటుంది. రక్తంలోనూ, శరీర కణాల్లోనూ ఉప్పు ఒక నిర్ణీత స్థాయిలో ఉండే విధంగా మూత్ర పిండాలు నియంత్రి స్తాయి. ఒక మామూలు వ్యక్తికి రోజుకు 2 నుంచి 3 గ్రాముల ఉప్పుకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఉప్పు మనం తీసుకునే ప్రాథమిక ఆహారాల్లోనే ఉంటుంది. దీనికి ఉదాహరణగా పండ్లు, పచ్చి కూరగాయలను చెప్పుకోవచ్చు.భారతీయులు సాధారణంగా రోజుకు 5 నుంచి 15 గ్రాముల వరకూ అంటే సగటున 8 గ్రాముల ఉప్పు తీసుకుంటారు. మనకు అవసరమైన 2 నుండి 3 గ్రాముల ఉప్పు కాకుండా, వంటలో కాని, భోజనం చేసేప్పుడు కాని మరింత ఉప్పును (3 నుంచి 10 గ్రాముల వరకూ) అదనంగా కలిపి తింటారు.

మామూలు వ్యక్తుల్లో ఈ అదనపు ఉప్పును మూత్ర పిండాలు రక్తంనుండి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. వంశానుగతంగా సంక్రమించిన లోపాల వల్ల, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల్లో, ఆహారం ద్వారా అదనంగా చేరిన ఉప్పును మూత్ర పిండాలు విసర్జించకపోవడం వల్ల మరింత సోడియం, నీరు, రక్తంలోను, కణాల్లోనూ నిలువ ఉండిపోతుంది.

ధమనుల గోడల్లోని కణాల్లోకి మరింత సోడియం, నీరు చేరడం వల్ల ధమనులు కుంచించుకుపోయి, గుండె నుండి రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడి, మొత్తం వాస్క్యులార్‌ రెసిస్టెన్స్‌ పెరిగి తద్వారా రక్తపోటు అధికమవుతుంది. రక్తపోటు పెరిగే అవకాశం ఉన్నవారిలో, ఎక్కువ ఉప్పు వినియోగించడం వల్ల, అధిక రక్తపోటు వస్తుందని వైద్య పరిశోధకుల నిశ్చితాభిప్రాయం.

జపాన్‌, కొరియా దేశాల ప్రజల్లో రోజుకు 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునే అలవాటు ఉంది. పక్షవాత వ్యాధి మిగతా దేశాలకంటే జపాన్‌లో ఎక్కువగా ఉంటున్నది. జపాన్‌ దేశీయులు 1971 - 1981 మధ్య కాలంలో ఉప్పును రోజుకు 4 గ్రాముల కంటే తక్కువ వినియోగించడం ప్రారంభించాకా, అధిక రక్తపోటు తగ్గుముఖం పట్టింది.
బెల్జియం దేశంలో 1968 - 81 మధ్య కాలంలో ఉప్పు వినియోగం తగ్గించిన తరువాత పక్షవాతం తగ్గుముఖం పట్టింది. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తుల సంతానంలో కూడా ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల, ఆందోళన కలిగించే సందర్భాల్లోనూ, చిన్నవయస్సులోనే రక్తపోటు పెరగవచ్చు.

ఎసెన్షియల్‌ హైపర్‌టన్షన్‌కు దారి తీసే మరి కొన్ని కారణాలను వైద్య శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు. వంశానుగత కారణాల వల్ల మానసిక ఒత్తిళ్ల వల్ల, మెదడులోని సింపథిటిక్‌ నాడీ మండలం ప్రభావితం చెంది ఎడ్రినలిన్‌, నార్‌ ఎడ్రినలిన్‌ల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది.

ఇవి గుండె వేగాన్ని, గుండెనుండి ప్రవహించే రక్త పరిమాణాన్ని పెంచడమే కాకుండా, ధమనులను కుంచింప చేయడం ద్వారా రక్తపోటును పెంచు తాయి. సింపథిటిక్‌ నాడీ మండలం ప్రోద్బలం వల్ల మూత్ర పిండాలు, ఎడ్రినల్‌ గ్రంథుల్లోని ఎంజైములు (రెనిన్‌, ఏంజియోటెన్సిన్‌ - ఆల్డో స్టిరోన్‌ సిస్టమ్‌) చైతన్యవంతం అవుతాయి.
ఏంజియోటెన్సిన్‌ ధమనులను అధికంగా కుంచింపజేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎడ్రినల్‌ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్‌ ఆల్డో స్టీరోన్‌ వల్ల మూత్రపిండాలు మరింత సోడియంను, నీటిని శరీరంలో నిలువ చేయడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. ఇంకా అనేక పరిశోధనలు జరుగు తున్న ఈ రంగంలో ఎసెన్షియల్‌ హైపర్‌టెన్షన్‌కు సరైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.

స్త్రీలలో కుటుంబ నియంత్రణకు వాడే మదుల వల్ల కొంతమందిలో కొద్దిగా రక్తపోటు పెరుగవచ్చు. ఈ మందులు వాడటం మానివేశాకా, 6 నెలల్లో రక్తపోటు తిరిగి మామూలు స్థితికి వస్తుంది. స్టీరాయిడ్‌ ఔషధాలు, ఉబ్బస వ్యాధికి, జలుబుకు, కీళ్ల నొప్పులకు వాడే మందుల వల్ల కూడా కొంతమందిలో రక్తపోటు పెరగవచ్చు. డాక్టర్‌ సలహా లేనిదే స్వంతంగా ఏ మందులూ వాడకూడదు.

updates for Hypertension :
అధిక రక్తపోటుకు వైరస్సే కారణం?--Eeandu newspaper 16/08/2011

గట్టి ఆధారాలు సేకరించాం: చైనా శాస్త్రవేత్తలు--నలభై ఏళ్ల వయస్సు వారందరికీ తప్పదీ సమస్య--

వాషింగ్టన్‌: గుండె జబ్బులు, పక్షవాతానికి, మూత్రపిండాల వ్యాధికి దారితీస్తున్న అధిక రక్తపోటుకు కారణం సాధారణ వైరస్‌ అని తాజా పరిశోధనలో తేలింది. హ్యూమన్‌ సైటోమెగాలోవైరస్‌ (హెచ్‌సీఎంవీ)కు అధికరక్తపోటుకు మధ్య లంకెపై గట్టి ఆధారాలను సేకరించినట్లు చైనా వైద్యుల బృందం తెలిపింది. ఈ వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా అందరిలోనూ సోకుతుంది. ఇది హెర్పెస్‌ వైరస్‌ కుటుంబానికి చెందింది. అన్ని వయస్సుల వారికీ సోకుతుంది. పుట్టుకతోవచ్చే ఇన్‌ఫెక్షన్లకు ఇది ప్రధాన కారణం. అవయవ మార్పిడి చేయించుకున్న రోగుల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లను ఇది కలిగిస్తుంది. 40 ఏళ్లు వచ్చేసరికి దాదాపు అందరూ ఈ వైరస్‌ బారినపడతారు. అయితే చాలా మందిలో ఎలాంటి రోగలక్షణాలు కనిపించవు. ఒకసారి ఇది శరీరంలోకి ప్రవేశిస్తే.. ఇది శరీరంలోనే అచేతనంగా ఉంటుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గాక ఇది పునరుత్తేజం పొందుతుంది. తాజా పరిశోధన.. పెను మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది అధికరక్తపోటుతో బాధపడుతున్నారు.

  • ====================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.