Monday, March 7, 2011

సొంత వైద్యం దుస్పరిణామాలు, Self medication and dangersఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -సొంత వైద్యం దుస్పరిణామాలు(Self medication and dangers)--గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఆలస్యం అమృతం విషయం అంటారు. కానీ దాన్ని ‘అలక్ష్యం ఔషధం విషం’ అని మార్చుకోవచ్చు. వైద్యుల సిఫార్సుతో వాడితే అద్భుతంగా పనిచేసే దివ్యౌషధాలు సైతం... ఇష్టం వచ్చినట్టు వాడితే తీవ్ర పరిణామాలే కలిగిస్తాయ్.
అస్సలు వైద్యుల ప్రమేయం లేకుండానే తలనొప్పికి అనాల్జిన్, ఆస్పిరిన్, జ్వరానికి పారాసెట్‌మాల్... గుండె నొప్పి, క్యాన్సర్లకు ఆస్పిరిన్... ఇలా సొంత వైద్యంతో మందులు మితిమీరి వాడుతున్నారు. ఆధునిక మందులన్నీ రసాయనాలే. వైద్యుల సలహాలు లేకుండా ఇవి మింగితే విషంతో సమానం.
ప్రొద్దుట్నుంచి కడుపులో బాగా నొప్పిగా ఉంది. మంచి టాబ్లెట్ ఇవ్వండి. ‘గొంతు బాగా వాచింది. నీళ్ళు కూడా మింగుడు పడట్లేదు. రెండు ఎరిత్రో మైసిన్ టాబ్లెట్స్ ఇవ్వండి’ ఏ మందుల షాపులకెళ్లినా కనబడే దృశ్యాలివి. వినబడే మాటలివి.
ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో ఎవరికో మలేరియా వచ్చిందని తెలియగానే అందరికన్నా ముందుగా వాలిపోయి ముందుజాగ్రత్త అంటూ మందులు మింగేసే సొంత డాక్టరు బాబాయిలకు సంగం నుంచి సిలికాన్ దాకా కొదవలేదు.
చాలాసార్లు ఆ సలహాలు బాగానే పనిచేస్తాయి. కానీ ఒక్కోసారి విపరిణామాలకూ దారితీస్తాయి. ఎందుకంటే ఒకరికి సరిపోయిన డోసు మరొకరి శరీరతత్వానికి ఎక్కువ అవుతుంది. కొంతమంది కయితే అసలు పడదు.
అసలు సొంత వైద్యానికి అనేక కారణాలున్నాయి. ప్రజల అమాయకత్వం, అన్నీ తెలిసిన వారి నిర్లక్ష్యం, ఎంతో రోగమైన ఇట్టే తగ్గాలనే తత్వం, ప్రభుత్వ వైద్యసేవల్లో లోపం, చిన్నా చితకా అనారోగ్యానికి ప్రైవేట్ డాక్టర్స్ చేతిలో పోసే స్థోమత లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల షాపులను ఆశ్రయించాల్సివస్తుంది. సొంత వైద్యాన్ని తీసుకోవాల్సి వస్తుంది.
అసలు ఆధునిక మందులన్నీ విషంతో సమానం. కావాలంటే చూడండి... ఏ మందు తీసుకున్నా అందులో అతి తక్కువ మోతాదులోనే అయినా రసాయనాలు ఉంటాయి. అలాంటి మందులను వైద్యులు సిఫారసుతో వాడినప్పుడే రోగుల విభిన్న శరీరతత్వాలను బట్టి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో చెప్పడం కష్టం. మరలాంటి వాటిని సొంతంగా వాడటం ఎంత ప్రమాదకరం. అలాగని చిన్నచిన్న తలనొప్పులకుకూడా వైద్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం లేదు. నిజానికి మామూలు తలనొప్పి, జ్వరం లాంటి తేలికపాటి అనారోగ్యాలు ఏ మందూ తీసుకోక పోయినా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ ఎంతటి రోగమైనా మంత్రించినట్టు మాయమవ్వాలన్న కోరికలతో మందులు వాడతారు.
చిన్నపాటి అనారోగ్యాలను ఒకటి, రెండు టాబ్లెట్లు వాడటం తప్పుకాదు. కానీ తగ్గకపోతే మాత్రం తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాల్సిందే. చిన్నపాటి అనారోగ్యాలకు అల్లోపతి వైద్యం కన్నా వంటింటి వైద్యమే మిన్న. ఉదాహరణకు చంటిపిల్లలకు కడుపునొప్పి వస్తే తమలపాకుకు ఆముదం రాసి దాన్ని వెచ్చబెట్టి పొట్టమీద పెట్టండి. పెద్దవాళ్లకు కడుపు నొప్పి వస్తే కాస్త వామూ, ఉప్పూ కలిపి నమిలి వేడినీళ్ళు తాగాలి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కి గోరు వెచ్చటి నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించడం, విరోచనాలు తగ్గడానికి పెరుగులో మెంతులు నానబెట్టి తినడం, అరుగుదలకు కరివేపాకు, పసుపు, ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి పరగడుపునే కుంకుడు గింజ పరిణామంలో తీసుకోవడం ఉత్తమం.
ఇలా ఎన్నో వున్నాయి. పైగా వీటివల్ల మన అనారోగ్యం తగ్గినా, తగ్గకపోయినా దుష్ప్రభావాలైతే ఉండవు. వాటికీ తగ్గకపోతే మాత్రం ఒకటి, రెండు మాత్రలు వేసుకోవచ్చు. అయినప్పటికీ ఉపశమనం లభించకపోతే మాత్ర తప్పనిసరిగా డాక్టరు దగ్గరకు వెళ్లాలి తప్ప తగ్గేదాకా చూద్దాం అనుకుంటూ అదే పనిగా సొంత వైద్యం తీసుకుంటూ, లేనిపోని మందులు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
అలాగే ఆయుర్వేద మందులు వాడేవారు వైద్యులు అనుమతి లేకుండా అల్లోపతి మందులు అస్సలు వేసుకోకూడదు. వైద్యల్ని సంప్రదించకుండా గర్భిణీలు, చిన్నపిల్లలు, బాలింతలు, వృద్దులు స్వంత వైద్యం చేయనేకూడదు. అది ఎన్నో విపత్కర పరిణామాలకు దారితీస్తుంది. తస్మాత్ జాగ్రత్త!

  • =============================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.