ఆరోగ్య పరీక్షలు మన భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.మన ఆరోగ్యానికి అండగా నిలబడతాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా.. తప్పనిసరిగా కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా మనం జీవితం గాడి తప్పకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యం వన్నె తగ్గకుండా కాపాడుకోవచ్చు. మనం వ్యాధుల బారినపడకుండా చూసుకోవటానికి.. ఒకవేళ మన శరీరంలో ఏదైనా అనారోగ్యకర మార్పులు వస్తుంటే వాటిని తొలి దశలోనే గుర్తించి సమర్థంగా ఎదుర్కొనటానికి ఈ ఆరోగ్య పరీక్షలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే ప్రతి ఏటా మనం తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగినది.
మన శరీరం ఓ సంక్లిష్టమైన.. సజీవమైన యంత్రం. ఈ యంత్రం ఆరోగ్యంగా, హాయిగా పనిచేస్తుండాలంటే రకరకాల అవయవాలు, గ్రంథులు, ఇంద్రియాలు, జీవక్రియలు.. ఇలా ఎన్నో వ్యవస్థలు నిరంతరాయంగా సమన్వయంతో పని చేస్తుండాలి!.వయసుతో పాటు కొన్ని.. జీవనశైలి కారణంగా కొన్ని.. బాహ్య పరిస్థితుల కారణంగా కొన్ని.. ఇలా ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. ఈ మార్పులను గమనిస్తూ... ఈ జీవన యంత్రం ఎప్పుడైనా గాడి తప్పుతుంటే వెంటనే సరి చేసుకోవటం అత్యుత్తమ ఆరోగ్య సూత్రం! అందుకే ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ మనం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం.. క్రమం తప్పకుండా కొన్ని తేలికపాటి పరీక్షలు చేయించుకుని మన ఆరోగ్య స్థితిని సరి చూసుకోవటం చాలా అవసరం.
మారుతున్న మన జీవనశైలితో పాటే మధుమేహం, హైబీపీ, ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం వంటి ఎన్నో రుగ్మతలు పెరుగుతున్నాయి. వీటికి తొలిదశలో ఎటువంటి లక్షణాలూ ఉండవు. వీటివల్ల బాధలేమీ కనబడవు కాబట్టి నిర్లక్ష్యం చేస్తుంటాము. కానీ క్రమేపీ వీటి కారణంగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయి.
మనమే వెనకబడ్డాం. అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాల్లో ఏటా ఆరోగ్య పరీక్షలన్నవి ఎప్పటి నుంచో తప్పనిసరిగా చేస్తున్నారు.. అనవసరంగా పరీక్షలు ఎక్కువ చేయించుకోవటంలో అర్థం లేదుగానీ ఏడాదికి ఒకసారి కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకుని.. మన శరీరంలో ఏవైనా మార్పులు వస్తున్నాయా? అన్నది తెలుసుకోవటం.. ఏవైనా మార్పులు కనబడుతుంటే వెంటనే వాటిపై శ్రద్ధ పెట్టటం మాత్రం చాలా అవసరమని గుర్తించాలి.
1. ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ)
ఈ ఆధునిక కాలంలో తలెత్తుతున్న చాలా వ్యాధులకు అధిక బరువు, ఊబకాయం మూలం. మన ఆహారపుటలవాట్లు మారిపోతుండటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి జీవనశైలి సమస్యల కారణంగా మన బరువే ఇప్పుడు మనకో గుదిబండగా తయారవుతోంది. అందుకే ఏటా క్రమం తప్పకుండా ఒక్కసారైనా బరువు చూసుకుని.. ఎత్తుబరువుల నిష్పత్తి లెక్కించుకుని.. అది కచ్చితంగా ఉందో లేదో చూసుకోవటం చాలా అవసరం.diininE BMI aMTaamu. bi.yam.ai.ఎంత ఉండాలి: ఎత్తు(మీటర్లలో)ను ఎత్తుతో హెచ్చించి.. బరువు(కేజీల్లో)ను ఆ వచ్చిన దానితో భాగహారించాలి. ఇది మన భారతీయుల్లో 18-23 మధ్య ఉండటం ఉత్తమం. అంతకు మించితే బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరం.
2. రక్తపోటు
గుండె పోటు, పక్షవాతం, కిడ్నీ జబ్బులు.. ఇలా ఎన్నో సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుంది. కాబట్టి 25-30 ఏళ్లు దాటిన దగ్గరి నుంచీ ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా బీపీ చూపించుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత తరచుగా చూపించుకోవటం అవసరం. ఇప్పటికే హైబీపీ ఉన్నవారైతే నెలకు ఒకసారైనా కొలిపించుకోవటం ఉత్తమం.
ఎంత ఉండాలి: ఎవరిలోనైనా 120/80 ఉండాలి. అంతకు మించి ఉంటే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.
3. సంపూర్ణ రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ)
మన దేశంలో స్త్రీపురుషుల్లో రక్తహీనత చాలా ఎక్కువ. దీన్ని తేలికపాటి రక్తపరీక్షతో గుర్తించవచ్చు. రక్తహీనత ఉంటే- నీరసం, ఏ పనీ సమర్థంగా చెయ్యలేకపోవటం, పిల్లలు ఏకాగ్రత కుదరక చదువుల్లో వెనకబడటం, ఆయాసం, కాళ్లుచేతులు లాక్కుపోవటం.. వంటి ఎన్నో సమస్యలు బయల్దేరతాయి. దీన్ని తేలికపాటి పరీక్షతో గుర్తించి సరిచేసుకోవచ్చు. అలాగే ఈ రక్తపరీక్ష ప్లేట్‌లెట్ కణాలు, తెల్లరక్తకణాలు, ఈఎస్‌ఆర్ వంటివాటిని కూడా పరిశీలిస్తారు కాబట్టి ఇతరత్రా సమస్యలున్నా బయటపడతాయి. అలాగే ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్(ఈఎస్‌ఆర్) అనేది పరీక్షించటం వల్ల ఒంట్లో చిన్నచిన్న ఇన్ఫెక్షన్ల నుంచి క్యాన్సర్ల వరకూ.. ఎటువంటి మార్పులు తలెత్తినా అనుమానించే అవకాశం ఉంటుంది.
ఎంత ఉండాలి:
* హిమోగ్లోబిన్:
స్త్రీలు: 12-15 జి/డీఎల్
పురుషులు: 14-17 జి/డీఎల్
* డబ్ల్యూబీసీ: 4000-11000 సీయూ/ఎంఎం
* ప్లేట్‌లెట్లు: 1.5-4 లక్షలు
* ఈఎస్‌ఆర్: తొలిగంటలో-
పురుషులు: 0-15 ఎంఎం
స్త్రీలు: 0-20 ఎంఎం
4. మల పరీక్ష
పేగుల్లో కొంకి పురుగులు, నట్టల వంటివి ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఏటా మలపరీక్ష చేయించుకోవటం మంచిది. దీంతో పాటు మలంలో రక్తం కలిసి ఉందా అన్న (అకల్ట్ బ్లడ్) పరీక్షా చేయించుకుంటే.. జీర్ణాశయం నుంచి పెద్దపేగు వరకూ ఎక్కడన్నా పుండు నుంచి క్యాన్సర్ వరకూ.. ఏ సమస్య ఉన్నా దీనిలో రక్తం ఆనవాళ్లు కనబడతాయి. అవి ముదరక ముందే గుర్తించే వీలుంటుంది.
5. మూత్ర పరీక్ష
మూత్ర పరీక్ష చాలా తేలికైనది, మన ఆరోగ్య పరిస్థితి గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ల వంటివి ఉన్నా, మూత్రపిండాల్లో తేడాలు వస్తున్నా, మూత్రంలో సుద్ద (ఆల్బుమిన్) పోతున్నా ఈ పరీక్షలో సంకేతాలు కనబడతాయి. కాబట్టి ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష చేయించుకోవటం మంచిది. మధుమేహులైతే దీనితో పాటు 'మైక్రోఆల్బుమినూరియా' పరీక్ష కూడా చేయించుకోవటం అవసరం.
ఎంత ఉండాలి:
* ఆల్బుమిన్: ఉండకూడదు.
* గ్లూకోజు: ఉండకూడదు
* పస్ సెల్స్: 0-5 హెచ్‌పీఎఫ్ లోపే ఉండాలి. 5 దాటితే మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే లెక్క.
* ఆర్‌బీసీ: ఉండకూడదు. 3 కంటే ఎక్కువ ఉంటే వైద్యులను సంప్రదించటం తప్పనిసరి.
* క్రిస్టల్స్: యూరిక్ ఆసిడ్, ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉండకూడదు. ఉంటే మూత్రవ్యవస్థలో రాళ్లున్నాయేమో అనుమానించాలి.
6. మధుమేహం
మన దేశంలో మధుమేహ తీవ్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు కుటుంబ చరిత్ర ఉంటేనే అనుమానించాలని భావించేవారుగానీ ఇప్పుడు రకరకాల కారణాల రీత్యా ఎటువంటి వంశ చరిత్రా లేకుండా కూడా మధుమేహం వస్తోంది. కాబట్టి 25 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి పరగడుపున, ఆహారం తీసుకున్న 2 గంటలకు రక్తపరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. తల్లిదండ్రులకు మధుమేహం ఉన్నా, బరువు ఎక్కువగా ఉన్నా.. ఈ మధుమేహ పరీక్షలు ఇంకా ముందే మొదలుపెట్టటం మంచిది.
7. కాలేయ పరీక్షలు (ఎల్‌ఎఫ్‌టీ)
ఇటీవలి కాలంలో హెపటైటిస్ రకం వైరస్‌ల దాడి ఎక్కువైంది. దీనికి తోడు మద్యం, కొన్ని రకాల అరుదైన వ్యాధుల వల్ల లివర్ వ్యాధులు కూడా ఎటువంటి లక్షణాలూ లేకుండా ఉండిపోయి.. ఎప్పుడో ఒకసారి ఉన్నట్టుండి బయటపడుతుంటాయి. అప్పటికే మన చెయ్యి దాటిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏడాదికి ఒకసారి కాలేయం పని తీరును పట్టిచెప్పే 'లివర్ ఫంక్షన్ టెస్టు(ఎల్‌ఎఫ్‌టీ) కూడా చేయించుకోవటం మంచిది.
8. సీరం క్రియాటినైన్
మూత్రపిండాల పనితీరును పరిస్థితిని తెలియజెప్పే కీలకమైన రక్త పరీక్ష ఇది. చాలారకాల కిడ్నీ సమస్యలకు ఆరంభ దశలో ఎటువంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ఈ పరీక్ష చేయించుకుంటే కిడ్నీ సమస్యలు త్వరగా బయటపడతాయి.
ఎంత ఉండాలి: స్త్రీలలో: 0.6-1.1 పురుషుల్లో: 0.7-1.3 ఉండాలి.
9. కొలెస్ట్రాల్ పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్)
మన దేశంలో గుండె జబ్బులు ఎక్కువగా ఉండటానికి అధిక కొలెస్ట్రాల్ ఒక ముఖ్యమైన కారణం. దీనిలో మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్), చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్), మరో రకం కొవ్వు పదార్థం (ట్రైగ్లిజరైడ్లు) తదితరాలు ఉంటాయి. మన దేశంలో చాలా మందికి మంచి కొలెస్ట్రాల్ తక్కువగా, చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటోంది. కొందరికి ఇది జన్యుపరంగా వస్తే చాలామందిలో ఇది ఆహారపుటలవాట్లు, వ్యాయామం లేకపోవటం వంటి జీవనశైలి సమస్యల వల్ల వస్తోంది. చాలామంది లావుగా ఉన్న వారికి కొలెస్ట్రాల్ ఎక్కువుంటుంది, బక్కగా ఉన్న వారికి ఉండదనుకుంటారుగానీ అది సరికాదు. 25-30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి పరగడుపున ఈ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవటం, వీటిలో ఏవి అసాధారణంగా ఉన్నా వైద్యులను సంప్రదించి ముందే ఆహారంలో మార్పులు చేసుకోవటం, వ్యాయామం చెయ్యటం, అవసరమైతే మందులు కూడా వేసుకోవటం.. అవసరం. ఇలా చేస్తే గుండె పోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు.
10. థైరాయిడ్ పరీక్ష
అయోడిన్ లోపం, రోగనిరోధక వ్యవస్థ లోపం తదితరాల వల్ల మన దేశంలో థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలలో మరీ ఎక్కువ. థైరాయిడ్ హార్మోను తగ్గినా సమస్యే, పెరిగినా సమస్యే. వాటివల్ల ఎన్నో దుష్ప్రభావాలు తలెత్తుతాయి. కాబట్టి ఏటా పరీక్ష చేయించుకుంటూ ఈ లోపాలను ముందే గుర్తిస్తే మంచిది. దీనికి చికిత్స కూడా చాలా తేలిక.
ఎంత ఉండాలి:
టీఎస్‌హెచ్: 0.3-6.0 మైక్రో ఐయూ/ఎంల్
టి3: 0.6-1.81 టి4: 4.0-12.0
గమనిక: ల్యాబోరేటరీలను బట్టి, పరీక్షా విధానాన్ని బట్టి సాధారణ విలువలు మారుతుంటాయి. కాబట్టి తేడాలుంటే స్థానిక వైద్యులను సంప్రదించటం మంచిది.
ఇవీ ముఖ్యమే
ఈసీజీ: 25 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి ఈసీజీ పరీక్ష చేయించుకోవటం మంచిది. చాలా తేలిక పాటి పరీక్ష, కానీ మన గుండె పనితీరు గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
ఛాతీ ఎక్స్‌రే: ఛాతీ ఎక్స్‌రేలో కేవలం క్షయకు సంబంధించిన వివరాలే కాకుండా గుండె సైజు, బృహద్ధమని సైజు వంటివన్నీ కూడా తెలుస్తాయి. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం ఉన్నవారిలో, అలాగే పొగతాగే వారిలో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఎక్కువ.
ఉదరం ఆల్ట్రాసౌండ్: ఇది చాలా సులువైన పరీక్ష, రేడియేషన్ వంటివేమీ ఉండవు. కానీ పొత్తికడుపులోని అవయవాల గురించి ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ పరీక్ష చేయించుకుంటే మూత్రపిండాలు, కాలేయం వంటివి ఎలా ఉన్నాయో తెలుస్తుంది. స్త్రీలలో అండాశయాలు, గర్భాశయం, పురుషుల్లో ప్రోస్టేటు సమస్యలూ తెలుస్తాయి.
కళ్లు : చెత్వారం వంటివి ఉన్న పెద్దవారికే కాదు.. పిల్లలకు కూడా నేత్ర పరీక్ష అవసరం. చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడటమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు.. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి నేత్ర పరీక్ష చేయించుకోవాలి.
మామోగ్రఫీ, పాప్‌స్మియర్: స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన క్యాన్సర్ ముప్పులు రెండు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. కాబట్టి 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా ప్రతి ఏటా తప్పనిసరిగా రొమ్ములకు మామోగ్రఫీ పరీక్ష; గర్భాశయ ముఖద్వారానికి పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం. క్యాన్సర్‌కు సంబంధించిన మార్పులు పాప్‌స్మియర్ పరీక్షలో పదేళ్ల ముందే కనబడతాయి. దీన్ని ముందే గుర్తిస్తే చికిత్స చాలా సులువు కూడా.
పీఎస్‌ఏ: పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ సమస్య ఒకప్పటి కంటే మన దేశంలో ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నాం. 50 ఏళ్లు పైబడిన పురుషులంతా కూడా ఏటా 'ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్(పీఎస్‌ఏ)' అనే రక్తపరీక్ష చేయించుకుంటే దీనికి సంబంధించిన మార్పులేమైనా ఉంటే గుర్తించే వీలుంటుంది. పీఎస్‌ఏ స్థాయి పెరిగి ఉంటే క్యాన్సరేమోనని అనుమానించి మరింత లోతుగా పరీక్షించే వీలుంటుంది. ఎంత ఉండాలి: పీఎస్‌ఏ: 0-4 ఎన్‌జీ/ఎన్‌ఎల్.
source : clinical pathology for Medical graduates.
- ====================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.