Sunday, March 6, 2011

ప్లూరల్‌ ఎఫ్యూజన్ , Plural Effusion



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ప్లూరల్‌ ఎఫ్యూజన్ , Plural Effusion- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

ఊపిరితిత్తుల వ్యాధుల్లో ప్రధానంగా కనిపించేవి ఛాతీలో నీరు చేరడం, రక్తం గూడు కట్టుకుపోవడం, గాలి చేరడం మొదలైనవి. మనిషి శరీరంలోని అవయవాలన్నీ సురక్షితంగా అమరి ఉంటాయి. ప్రధానంగా ముఖ్యమైన మెదడును కపాలం, గుండెను ప్రక్కటెముకలు రక్షిస్తుంటాయి.

అలాగే రెండు ఊపిరితిత్తులు కూడా ఛాతిలో భద్రంగా ఉంటాయి. శ్వాసకోశాలకు, ఛాతీ కండరాలకు నడుమ ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశంలో శ్వాసకోశాలు సంకోచం, వ్యాకోచం చెందేందుకు అనువుగా ఉంటుంది.

ఈ ప్రదేశాన్ని ప్లూరల్‌ స్పేస్‌ అనీ, వీటిలో వచ్చే వ్యాధులను ప్లూరల్‌ డిసీజెస్‌ అని అంటారు.
సాధారణంగా ఉఛ్వాస నిశ్వాసాలు సాఫీగా జరిగేందుకు ప్లూరాలో కొన్ని ద్రవాలు ఉంటాయి. ఇవి 5 నుండి 15 మిల్లీలీటర్లు మాత్రమే ఉంటాయి. దీనికి మించిన పరిమితిలో ద్రవాలు ఈ ప్రదేశంలో చేరితే శ్వాస ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతాయి.

పొడి దగ్గు, ఆయాసం, కొంచెం దూరం కూడా నడవలేకపోవడం, అలసట, ఛాతిలో నొప్పి, బరువు వంటి లక్షణాలతో వీరు సతమతమవుతారు. ఛాతిలో ఇలా నిండే నీటిని ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ అని వ్యవహరిస్తారు.

ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ వ్యాధి రావడానికి అనేక కారణాలున్నాయి. సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌నుంచి కేన్సర్‌ వ్యాధి వరకూ అనేక రకాల వ్యాధులలో ఛాతిలో నీరు నిండటం జరుగవచ్చు.

బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ శ్వాసకోశాలలో కాని, శ్వాసకోశాలకు దగ్గర ఉండే కాలేయంలో కాని సంభవించవచ్చు. లేదా కడుపులో కాని, గుండె చుట్టూ ఉండే పెరికార్డియం అనే పొరకు కాని సోకవచ్చు.
అదే విధంగా ప్రక్కటెముకలు, లేదా ఛాతి కండరాలలో చీము లేదా ఇన్‌ఫెక్షన్‌ చేరినా ఛాతిలో నీరు పేరుకుంటుంది. చాతికి గాయాలై పుండ్లు పడినప్పుడు కూడా ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ సంభవించవచ్చు.

శరీరంలో నీరు ఎక్కువగా చేరుకున్నప్పుడు కూడా ఛాతిలో నీరు చేరే అవకాశం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఆకని, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కాని ఉన్నప్పుడు పొట్టలో నీరు చేరినట్లుగా ఛాతిలో కూడా నీరు చేరుతుంది.
కాలేయానికి సంబంధించిన లివర్‌ ఆబ్సెస్‌, హైడాటిడ్‌ డిసీజ్‌, సిర్రోసిస్‌ వంటి వ్యాధుల్లో ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ వచ్చే అవకాశాలున్నాయి. కేవలం శ్వాసకోశ వ్యాధులలోనే కాకుండా గుండె, మూత్రపిండాలు, కాలేయం, పాంక్రియాస్‌లలో సంభవించే వ్యాధులు కూడా ప్లూరల్‌ ఎఫ్యూజన్‌కు కారణమవుతాయి. అత్యంత అరుదుగా మందుల వలన, పారాసైట్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన కూడా ఈ వ్యాధి సోకవచ్చు.

పరీక్షలు
ప్లూరల్‌ ఎఫ్యూజన్‌ వ్యాధిని నిర్ధారించడానికి ఛాతినుండి నీటిని తీసి పరీక్షలు జరుపుతారు. ఛాతిలో నీరు ఎక్కువగా ఉండి ఆయాసం వస్తుంటే అర లీటరునుంచి సుమారు ఒక లీటరు వరకూ కూడా ఈ నీటిని తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఛాతిలోకి ఒక గొట్టాన్ని (ఇంటర్‌ కోస్టల్‌ డ్రైనేజ్‌ ట్యూబ్‌ - ఐసిడిటి) ప్రవేశపెట్టి నీరు ఎప్పుడూ బైటికి వెళ్లిపోయేలా అమరుస్తారు. ఛాతినుంచి నీటిని సాధారణంగా పరీక్షల కోసమే తీసినప్పటికీ, ఎక్కువగా ఉండే నీటిని కూడా ఈ విధంగా తీసివేయడం ద్వారా వ్యాధి లక్షణాలు త్వరితంగా తగ్గుతాయి.

ఇలా నీటిని తీసివేయడంతోపాటు, అవసరమైన ఔషధాలను కూడా ఉపయోగిస్తే, మళ్లీ నీరు చేరే అవకాశం ఉండదు. కొన్ని సందర్భాలలో వ్యాధికి సంబంధించిన మందులే నీటిని తగ్గించకపోవచ్చు. కనుక వీరిలో నీటిని వీలైనంత ఎక్కువగా తీసివేయాల్సి ఉంటుంది.
క్షయ వ్యాధిగ్రస్తుల్లో ఇలాంటి నీటి వలన మచ్చ (స్కార్‌) ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు ఉన్నప్పుడు ఎక్కువగా, తక్కువ నీరు ఉన్నప్పుడు తక్కువగా మచ్చ ఏర్పడవచ్చు.

క్షయవ్యాధి కారకాలు వీటిలో ఉండిపోయి, అనువైన అవకాశం వచ్చినప్పుడు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లినప్పుడు క్షయవ్యాధి మళ్లీ తిరగబెట్టే అవకాశం కూడా లేకపోలేదు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇలా మచ్చ ఉండటం ఒక శాపమే. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం వెళ్లినప్పుడు ఈ రకమైన మచ్చలు ఛాతి ఎక్స్‌రేలలో కనిపిస్తుం డటం సహజం. ఫలితంగా వీరిని తిరస్కరించే అవకాశం ఉంటుంది.
కనుక ఛాతిలో నీటిని పూర్తిగా తీసివేయించుకోవాలి. తద్వారా మచ్చలు పడకుండా జాగ్రత్త వహించవచ్చు.

కేన్సర్‌తో ఛాతిలో నీరు
ఊపిరితిత్తుల కేన్సర్‌లోనే కాకుండా ఇతర అవయవాలకు సోకే కేన్సర్‌ ప్లూరల్‌ కేవిటీకి ప్రాకినప్పుడు ఛాతిలో నీరు చేరుతుంది.
రొమ్ము కేన్సర్‌, కడుపు, చిన్నప్రేవులు, ప్రోస్టేట్‌, సర్విక్స్‌ కేన్సర్ల వలన ఈ విధంగా నీరు చేరుతుంది. కేన్సర్‌లో ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే మందులతోపాటు, ప్లూర్‌ కావిటీలో కూడా కేన్సర్‌ మందులు ఐసిడిటి ద్వారా ఇచ్చి, చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరిలో ఎక్కువగా నీరు చేరుతుండటం, తరచుగా తీసివేస్తున్నప్పటికీ మళ్లీ రావడం జరుగుతుంది. ప్లూరోడెసిస్‌ అనే పద్ధతి ద్వారా నీటిని పదేపదే తీసివేస్తుండాల్సి ఉంటుంది.
  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.