Friday, March 11, 2011

జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అవగాహన,Juvanile Rhematoid arthritis awarenessఆరోగ్యమే మహాభాగ్యము. మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అవగాహన (Juvanile Rhematoid arthritis awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

--సాధారణంగా పదహారు సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లల్లో కీళ్ల నొప్పులు ఉండవు. ఒకవేళ ఉంటే సాధారణమైన నొప్పులుగా భావించకూడదు. సరైన సమయంలో చికిత్సలను తీసుకోవాలి. జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (జెఆర్‌ఎ)గా వ్యవహరించే ఈ స్థితికి గురైన వారిలో నిరోధక శక్తి స్వయం ప్రేరితంగా మారి మోకాళ్లు, మోచేతులు, మణికట్టు, చీలమండలు, వేళ్ల కణుపులు మొదలైన ప్రాంతాల్లోని జాయింట్లలో వాపును, నొప్పిని కలుగజేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఇమ్యూన్‌ మీడియేటెడ్‌ జాయింట్‌ ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు.

మామూలు వ్యక్తుల్లో తెల్ల రక్త కణాలు వైరస్‌, బాక్టీరియా వంటి శరీరేతర హానికరాంశాలను గుర్తించి తగిన విధంగా ప్రతిస్పందిస్తుంటాయి. జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధి సోకిన వారిలో ఈ విచక్షణ లోపిస్తుంది. అంటే తెల్ల రక్త కణాలు ఆరోగ్యకర మైన శారీరక కణ జాలాలను శరీరేతర హానికరాంశా లుగా పొరపాటుపడి దాడి చేస్తాయి.

సాధారణంగా ఈ వ్యాధి 6 నుంచి 16 సంరాల వయస్సుండే పిల్లల్లో కనిపిస్తుంది. ఎక్కువ జాయింట్లు వ్యాధి ప్రభావానికి గురైతే లక్షణాలు దీర్ఘ కాలంపాటు కొనసాగుతాయి. జాయింటు అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే ప్రదేశం. ఎముకలు ఒక దాని మీద మరొకటి కదిలేప్పుడు రాపిడి పుట్టకుండా ఉండటం కోసం మృదులాస్తితో తయారైన పొర ఎముకల చివరి భాగాలను కప్పి ఉంచుతుంది.

జాయింటును సరైన ప్రదేశంలో ఉంచడం కోసం దాని చుట్టూ కేప్సూల్‌ అనే గట్టిపొర చుట్టి ఉంటుంది. ఈ పొర లోపల జాయింటు తేలికగా కదలడం కోసం సైనోవియల్‌ ద్రవం ఉంటుంది. జాయింటును పటి ష్టంగా ఉంచడం కోసం ఎముకలను కలుపుతూ కండ రాలు, లిగమెంట్లు ఉంటాయి. అలాగే జాయింటుకు పోషకతత్వాలు అందించడం కోసం రక్తనాళాలు కూడా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ సజావుగా పని చేస్తున్నంత కాలం ఏ సమస్యా ఉండదు.
జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌లో జాయింటును ఆవరించి ఉండే సైనోవియల్‌ పొర వ్యాధిగ్రస్తమై వాచి పోతుంది. తెల్ల రక్త కణాలు ఈ పొరలోనికి చొచ్చుకు వెళ్లి విధ్వంసక నైజం ఉన్న రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి.

ఫలితంగా ఎముకల చివర్లలో ఉండే మృదులాస్తి ఒరిపిడికి లోనై గగ్గురుగా తయారవుతుంది. నునుపుదనం కోల్పోవడం వలన ఎముకల కదలిక దుస్సాధ్యంగా తయారవుతుంది. ఈ వ్యాధి ప్రభావం వల్ల కండరాలు, లిగమెంట్లు పట్టును కోల్పోతాయి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే అంశంపై ఇంతవరకు స్పష్టమైన కారణ మంటూ ఏదీ నిర్ధారణ కాలేదు. కాకపోతే జన్యు పరమైన అంశాలను ఆధారం చేసుకుని ఆటో ఇమ్యూనిటీని ఒక ముఖ్యమైన కారణంగా భావిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దవారిలోలాగ ఈ వ్యాధికి లోనైన పిల్లల్లో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్స్‌ వంటివి రక్త పరీక్షల్లో బైటపడవు. అయినప్పటికీ లక్షణాలను ఆధారం చేసుకుని చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఈ వ్యాధికి లోనైన పిల్లలకు తరచుగా కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. కీళ్లలో పట్టేసినట్లు ఉంటుంది. జాయింటు ఎర్రగా కమలటం, వేడిగా ఉండటం వంటివి ముఖ్యమైన లక్షణాలు. వ్యాధికి లోనైన జాయింటు తాలూకు ఎముక పెరుగుదలలో మార్పులు సంభవించి కాళ్లు, చేతుల పొడుగు విషయంలో అసమానతలు చోటు చేసుకుంటాయి. నొప్పిగా ఉండే జాయింటును కదల్చకపోవడం వల్ల దానికి ఊతమిచ్చే కండరం బలహీనపడి బిగుసుకు పోతుంది. ఒక కన్ను ఎర్రబడుతుంది. కొంత మంది పిల్లల్లో కేవలం కీళ్ల నొప్పులే కాకుండా రక్త హీనత, ఎత్తు పెరగకపోవడం, ఆకలి మందగించడం, లో-జ్వరం, చర్మంపైన ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి.

ఈ వ్యాధిలో ప్రధానంగా మూడు భేదాలుంటాయి. పాలి ఆర్టిక్యులర్‌ ఆర్థరైటిస్‌ అనేది మొదటి రకం. ఇది మగపిల్లలకంటే ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయిదు జాయింట్లలో కాని, అంతకంటే ఎక్కువ జాయింట్లలో కాని నొప్పి, వాపు ఉంటాయి. చేతివేళ్ల కణుపులతోపాటు బరువును మోసే జాయిం ట్లలో మోకాళ్లు, తుంటి, మడమలు, పాదాలు, మెడ వంటివి వ్యాధి ప్రభావానికి లోనవుతాయి. వీటితోపాటు తక్కువ స్థాయిలో జ్వరం ఉంటుంది. పాలి ఆర్టిక్యులర్‌ జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనేది రెండవ రకం. దీనిలో నాలుగు కంటే తక్కువ జాయింట్లు వ్యాధిగ్రస్తమ వుతాయి.

జాయింట్లలో నొప్పి, బిగుసుకుపోడం, వాపు వంటి లక్షణాలు ఉంటాయి. మోకాళ్లు, మణికట్టు ఎక్కువగా వ్యాధిబారిన పడతాయి. కంటిలోని నల్లని భాగం వ్యాధి ప్రభావానికి లోనై తదనుగుణమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది. సిస్టమిక్‌ జువనైల్‌ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ మూడవ రకం. దీనిలో కేవలం జాయింట్లు మాత్రమే కాకుండా శరీరం మొత్తం వ్యాధి ప్రభావానికి లోనవుతుంది.
ప్రతిరోజూ సాయంకాలమయ్యే సరికి జ్వరం తీవ్ర స్థాయిని చేరుకుంటుంది. రక్తహీనతకు గుర్తుగా చర్మం పాలిపోయి కనిపిస్తుంది. చర్మం పైన ఎర్రని తడపర లేదా దద్దురు ఉన్నట్లుండి కనిపిస్తూ తిరిగి హఠాత్తుగా తగ్గిపోతుంటుంది. లసిక గ్రంథుల్లో వాపు కనిపిస్తుంది. ప్లీహం వాస్తుంది. వీటిని అనుసరించి జాయింట్లలో వాపు, వేడి, నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

సూచనలు
ఈ వ్యాధిలో వ్యక్తిగత ప్రకృతిని అనుసరించి తీసుకునే ఆహారం వల్ల ప్రయోజనం ఉంటుంది. పూర్తి శాకాహారాన్ని తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించాలి.
అలాగే టమాట, వంకాయ, గోంగూర, బంగాళా దుంపలు, శనగ పిండి వంటకాలు, గ్లూటిన్‌ కలిగిన ఆహార పదార్థాలను
తగ్గించాలి.
లక్షణాలు తీవ్రంగా లేని సమయాల్లో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై సాంత్వన లభిస్తుంది.


  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.