Sunday, March 6, 2011

ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నవ్వు,laughter and Health




ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నవ్వు,laughter and Health- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


నవ్వు నాలుగువిధాల చేటని మన పెద్దలు అంటూంటారు. అయితే నవ్వు నలభై విధాల మంచిదని కూడా వారే చెబు తుంటారు. దీనర్థం ఉచితానుచితాలు తెలిసి నవ్వాలని! అను చితమైన సందర్భాలలో నవ్వడం వలన చేటే దాపురిస్తుందన డానికి మనకు ఎన్నో కథలున్నాయి. కాగా, ఆరోగ్యంపై నవ్వు ప్రభావమేమిటనే అంశమై అనేక పరిశీలనలు, అధ్యయనాలు జరిగాయి. ఆరోగ్యాన్ని మెరుగు పర్చడానికి నవ్వు ఎంతో ఉపయోగపడుతుందని ఆ పరిశీ లనలు తేటతెల్లం చేశాయి.
అయితే ఆ నవ్వు మనోల్లాసంతో, మనోరంజనం కలిగిం చేదిగా ఉండాలి. మనస్సు విప్పి నవ్వగలగాలి. అప్పుడే అను కున్న సత్ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. మానవులలో నవ్వు మరియు హాస్యానికి సంబంధించిన మానసిక మరియు శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు.

నవ్వులలో రకాలు

  • * చిరునవ్వు లేదా మందహాసం
  • * విరగబడి నవ్వు
  • * వికటాట్టహాసం
  • * పకపక నవ్వు
  • * వెకిలి నవ్వు
  • * సుందర మందహాసం
  • * నవ్వుగాని నవ్వు---

నవ్వు చరిత్ర :
1964లో మొట్టమొదటిసారి నార్మన్‌ క్విజిన్స్‌ నవ్వును ఒక చికిత్సగా ప్రయోగించి చూశాడు. సానుకూల ఆలోచన, నవ్వు ప్రయోగించి అందరూ నయం కాదని భావిం చే కీళ్ళనొప్పుల వ్యాధిని నయం చేశారు. హాస్య చిత్రాలను చూడడం, విటమిన్‌ సి వాడ డం అతడు ప్రయోగించిన పద్ధతిలో ప్రధాన అంశాలుగా వున్నాయి. 30 నిముషాలు హాస్య చిత్రాలు చూస్తే 2 గంటల పాటు నొప్పిలేని నిద్ర వస్తుందని అతడు కనుగొన్నాడు. ఆరు నెలల తరువాత క్విజిన్స్‌ వ్యాధి పూర్తిగా నయమైపోయింది.

1995లో డా.మదన్‌ కటారియా ఇండియాలో మొట్టమొదటి లాఫ్టర్‌ క్లబ్‌ ప్రారంభించాడు. 'లాఫ్టర్‌ యోగా' అన్న కొత్త దృక్పథం ఎలాటి కారణం లేకుండా నవ్వ డం పెంపొందిస్తుంది. ఫలితంగా విశ్రాంతి లభిస్తుంది ఉద్రిక్తతల నుంచి, భయాల నుంచి తప్పించుకుంటారు. జీవితం పట్ల సానుకూల వైఖరి అనుసరి స్తారు. ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ విధా నం ెపెద్దెత్తున విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1,000పై చిలుకు లాఫింగ్‌ క్లబ్బులున్నాయి.

-హాస్యం మానవ జీవితానికి అనేక విధాలా శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు నూటా ఏభై కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎదుటివారి మాటలకు, చేతలకు, మనమాడే పలుకులకు, మనకే తోచే భావనలకు ఎందుకు నవ్వు వస్తుందో ఇంకా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. 'నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం,నవ్వలేకపోవడం ఒక రోగం' అని ప్రముఖ సినీదర్శకులు జంధ్యాల చెప్పిన మాట తెలుగునాట విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సృష్టిలో నవ్వగలిగే జీవి మనిషి ఒక్కడే! కనుక నవ్వు మనిషిసొత్తు.

నవ్వు ప్రక్రియ
--అనేక రుగ్మతలను రూపుమాపగలిగే శక్తి నవ్వుకు ఉందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కొన్ని రకాల వ్యాధులను నవ్వుతోనే నయం చేసుకోవచ్చు. అనవసరంగా మందులూ మాకులూ మింగనవసరం లేదు. శరీరంలో నవ్వుకు జన్మస్థానం ఊపిరితిత్తులే అయినప్ప టికీ, దానికి సంబంధించిన సంకేతాలు మాత్రం మెదడు నుంచి వెలువడుతాయి. మనం నవ్వడమనే ప్రక్రియ ప్రారంభించినప్పుడు మొద టగా చేసే ప్రక్రియ ఊపిరితిత్తులనిండా గాలి పీల్చుకోవడం. ఈ తరువాత స్వరపేటికను బిగబట్టి, ఛాతీ, కడుపు కండరా లను ఒక్కసారిగా వత్తిడికి గురి చేయడం ద్వారా నోటి ద్వారా గాలి బైటికి రావడం జరుగుతుంది.మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది. 'release nitric oxide ' ,ఎండార్ఫిన్స్ --- దీనికి కారణం .


నవ్వు ఎందుకు వస్తుంది?

తెర మీద బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వు ఎందుకు వస్తుంది? ఓ బాపు కార్టూన్ ని చూసినప్పుడో, ఓ పి.జి. వుడ్ హౌస్ నవల చదివినప్పుడో నవ్వుఎందుకు వస్తుంది? అసలు నవ్వు ఎందుకు వస్తుంది? చక్కలిగిలి పెట్టినప్పుడు నవ్వు ఎందుకు వస్తుంది? కాని ఎవరికి వారే, బోరు కొట్టినప్పుడల్లా తమకి తాము చక్కలిగిలి పెట్టుకుని ఎందుకు నవ్వుకోలేరు? “కాదేదీ సైన్స్ కనర్హం” కనుక ఈ నవ్వు గురించి కూడా నాడీశాస్త్రంలో కొంత పరిశోధన జరిగింది. అయితే నవ్వు ఓ వ్యాధి కాదు కనుక, ఓ మెదడు వ్యాధి మీద జరిగేటంత పెద్ద ఎత్తున దీని మీద పరిశోధన జరగలేదు. కాని కొన్ని మెదడు సమస్యల నేపథ్యంలో ఆపుకోలేని, అసహజమైన నవ్వు రావడం విశేషం. ఉదాహరణకి ఎపిలెప్సీ వ్యాధి గురించి అందరం వినే వుంటాం. దీన్నే సామాన్య పరిభాషలో ’ఫిట్స్’ అంటారు. ఈ ఫిట్స్ లేదా seizures వచ్చినప్పుడు కొన్ని సార్లు రోగి గిల గిల తన్నుకోవడం కనిపిస్తుంది. కొన్ని రకాల సీజర్స్ వచ్చినప్పుడు రోగి నిశ్చలంగా ఉండిపోతాడు. కాని ఆ సమయంలో తనకి పరిసరాల స్పృహ ఉండదు. ఇక మరికొన్ని రకాల సీజర్స్ లో రోగులు హఠాత్తుగా పెద్ద పెట్టున నవ్వడం, ఏడవడం వంటివి చేస్తారు. ఇలాంటి సీజర్స్ ని gelastic seizures అంటారు. (మరి గ్రీకులో Gelos అంటే నవ్వు!) ప్రఖ్యాత నేచర్ పత్రికలో ( vol 391, page 650, 1998) లో, “Electric current stimulates laughter” అన్న పేరు గల వ్యాసంలో, నవ్వుకి మెదడుకి మధ్య ఓ ఆసక్తికరమైన సంబంధం ప్రకటించబడింది. మెదడులో కొన్ని చోట్ల విద్యుత్ కరెంటు ని ప్రవేశపెడితే, అలాంటి ప్రేరణ నిచ్చిన వ్యక్తి నవ్విందట. ఏ.కె. అన్న పేరు గల 16 ఏళ్ల అమ్మాయికి ఎపిలెప్సీ ఉంది. అందుకు చికిత్సగా ఆమెకి సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేసి మెదడులో ఏ భాగం వల్ల ఈ ఎపిలెప్సీకి సంబంధించిన సీజర్స్ వస్తున్నాయో తెలుసుకుని ఆ భాగాన్ని తొలగిస్తారు, లేదా నాశనం (lesion) చేస్తారు. అయితే మెదడులో “మంచి” భాగాలు, ఎపిలెప్టిక్ సీజర్స్ కలుగజేసే “చెడు” భాగాలు రెండూ ఒక్కలాగాలే ఉంటాయి కనుక, మెదడులో వివిధ ప్రాంతాలకి విద్యుత్ ప్రేరణ (electric stimulation) ఇచ్చి దాని ప్రతిస్పందన ఎలా ఉందో చూసి, మంచి చెడులు నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఎక్కడ ప్రేరణ ఇస్తే సీజర్ పుడుతుందో సమస్య అక్కడ ఉందన్నమాట. ఇలాంటి అన్వేషణలో మెదడులో పలు ప్రాంతాల్లో ప్రేరణ నిస్తూ పోతున్న సమయంలో అనుకోకుండా ఒక ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు ఆ అమ్మాయి గట్టిగా నవ్విందట. ఆ ప్రాంతంలో ప్రేరణ నిచ్చిన ప్రతీ సారి అమ్మాయి అలాగే నవ్విందట. అయితే ఆ ప్రాంతం ఎక్కడుందో చెప్పాలంటే మెదడు నిర్మాణం గురించి ఓ సారి గమనించాలి.
మెదడులో రెండు గోళార్థాలు (hemispheres) ఉన్నాయని, ప్రతి గోళార్థంలోను నాలుగు విభాగాలు (lobes) ఉన్నాయని చిన్నప్పుడు వినే వుంటాం. ఇందులో మెదడులో ముందు పక్క కనిపిస్తున్న పెద్ద విభాగం frontal lobe. మెదడు ఉపరితలం అంతా మిట్ట పల్లాలుగా ఉంటుందని, “మిట్ట” లని gyri అని, “పల్లాల”ని sulci అని అంటారు. ఎడమ గోళార్థంలో (left hemisphere) frontal lobe లో పై భాగంలో ఉండే superior frontal gyrus అనే 2cm X 2cm విస్తీర్ణం గల ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు పుడుతోంది. మెదడు వ్యాధి ఉన్న వారి నవ్వుకి, ఈ నవ్వుకి మధ్య లక్షణంలో తేడా ఉందని గమనించారు డాక్టర్లు. విద్యుత్ ప్రేరణ వల్ల పుట్టిన ఈ నవ్వులో ఆనందాతిరేకం (mirth) ఉందని ఏ.కె. స్వయంగా చెప్పుకుంది. అలాగే ఈ ప్రాంతంలో ప్రేరణ నిచ్చినప్పుడు నవ్వు మాత్రమే వచ్చింది గాని, సీజర్స్ రాలేదు. ఎందుకు నవ్వావు? అని అడిగితే ప్రతీ సారీ ఏదో కొత్త కథ చెప్పేది.
మామూలుగా మనం నవ్వినప్పుడు ముందు ఏదో బాహ్య సన్నివేశం ఉంటుంది (ఉదా: బ్రహ్మానందం), దాని కారణంగా నవ్వు వస్తుంది. కాని ఈ కృత్రిమ నవ్వు విషయంలో ముందు నవ్వు వస్తుంది, ఆ తరువాత కారణంగా భావింపబడ్డ ఏదో కథ కల్పించబడుతుంది. కాని అసలు కారణం ఆ కథ కాదు – విద్యుత్ ప్రేరణ మాత్రమే. అయితే నవ్వడం అనే చర్యని కేవలం మెదడులో superior frontal gyrus మాత్రమే శాసిస్తుందని కాదు. ఏ చర్యనయినా మెదడులో పలు ప్రాంతాలు కలిసి సమిష్టిగా నియంత్రిస్తాయి. కనుక superior frontal gyrus అనేది నవ్వుని శాసించే ఓ పెద్ద circuit లో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే నవ్వులో ఎన్నో అంశాలు ఉన్నాయి.

1. నవ్వులో ఆనందం అనే భావావేశం ఉంటుంది. (భావావేశం లేకుండా కూడా నవ్వొచ్చు. అందుకే మనస్తూర్తిగా నవ్వే నవ్వుకి, తెచ్చిపెట్టుకున్న నవ్వుకి మధ్య తేడా ఉంటుంది. ఈ విషయం పైకి కూడా కనిపిస్తుంది.)
2. నవ్వు వచ్చినప్పుడు ఒక జోక్ ని గాని, ఒక సన్నివేశాన్ని గాని అర్థం చేసుకుని అందులో హాస్యభరితమైన అంశాన్ని గ్రహించాలి. ఇది విషయగ్రహణం (cognition) కి సంబంధించిన విషయం.
3. నవ్వినప్పుడు ముఖంలో పలు కండరాలు కలిసి పనిచెయ్యాలి? కనుక ఇందులో కర్మేంద్రియాల ప్రమేయం ఉంది.
ఈ మూడు రకాల అంశాలని మెదడులో వివిధ ప్రాంతాలు శాసిస్తుంటాయి. అవన్నీ కలిపితే మెదడులో నవ్వుని శాసించే నాడీ వ్యవస్థ అవుతుంది. అయితే ఆ సంపూర్ణ వ్యవస్థలో ఏఏ ప్రాంతాలు భాగాలుగా ఉన్నాయి, అవి ఎలా కలిసి పని చేస్తున్నాయి అన్న విషయం ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. దాని గురించి ఇంకా పరిశోధన జరుగుతోంది.
నవ్వుకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాం. నవ్వుని తెప్పించే సులభ మార్గాలు – కితకితలు. అసలు కితకితలు ఎందుకు? అవి అవతలి వాళ్ళు పెడితేనే ఎందుకు నవ్వొస్తుంది? “స్వయం కితకితలు” ఎందుకు పనిచెయ్యవు?

లాఫ్టర్‌ థెరెపీ వల్ల లాభాలుః:

కండరాలు విశ్రాంతి పొందుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నవ్వు కండరాలకు విశ్రాంతినిచ్చే సాధనంగా పరిగణిస్తారు. నవ్వుతో రక్తవాహికలు వెడల్పవుతాయి. శరీరమంతా రక్తం బాగా ప్రసరిస్తుంది. మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది.

రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం: మనం నవ్వినపుడు అంటువ్యాధులను నిర్మూలించే 'టి' కణాలు మరింత చురుకుగా పని చేస్తా యి. ఎ,బి,ఇమ్యునోబ్లోబిన్స్‌ను కూడా నవ్వు వృద్ధిచేస్తుంది. ఇది గణనీయమైంది. ఎందు చేతనంటే ఇమ్యునోగ్లోబిన్‌ ఎ, వైరస్‌, బాక్టీరియా నుంచి శ్వాస కోశాన్ని కాపాడుతుంది. పనిచేయ కుండా పోయిన కణాలను ఎదుర్కోవడానికి యాంటీ బాడీస్‌కు ఇమ్యునోగ్లోబిన్‌ బలాన్నిస్తుంది.

ప్రాణవాయువును పెంచుతుంది : ఒక వ్యక్తి నవ్వినపుడు ఎక్కువగా ప్రాణవాయువును పీల్చుకుంటాడు. ఫలితంగా తాజాదనాన్ని అనుభవిస్తారు.

శక్తిమంతమైన నొప్పినివారిణి : సహజంగా నొప్పిని తగ్గించే ఎండార్ఫిన్స్‌ను నవ్వు పెంచుతుంది. ఆర్ధ్‌రైటిస్‌, స్పాండులైటిస్‌, కండరాలకు సంబంధిన నొప్పులు మైగ్రేన్‌, ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పులను తగ్గించడానికి ఎండోర్ఫిన్స్‌ ఎంతగానో తోడ్పడతాయి.

-ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది: బ్రాంకైటిస్‌, ఉబ్బసం వున్నవారికి నవ్వు ఎంతగానో సహాయపడుతుంది. నవ్వు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, రక్తంలో ప్రాణవాయువు స్థాయిని పెంచు తుంది. కానీ ఈ రోగులు నవ్వు చికిత్స ప్రారంభించే ముందు వారి డాక్టరును సంప్రదించాలి. నవ్వు మానసిక ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను తగ్గించి రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది. పదినిమిషాల పాటు నవ్వు చికిత్స చేస్తే అధిక రక్తపోటు తగ్గుతుందని ప్రయోగాలు రుజువు చేశాయి. నవ్వు వల్ల ప్రాణవాయువు ప్రసారం, రక్త ప్రసారం మెరుగుపడతాయి కనుక హృద్రోగం పెరక్కుండా కూడా నవ్వు నియంత్రిస్తుంది.

ఎయిరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌లా పని చేస్తుంది : ఒక్క నిమిషం హృదయపూర్వకంగా నవ్వితే చాలు పది నిమిషాల పాటు వ్యాయామం చేసిన ఫలితం. నవ్వు ఎయిరోబిక్‌ వ్యాయామాల వలె గుండె, రక్త సరఫరా వ్యవస్థను ఉద్దీపన చేస్తుంది. భౌతిక శ్రమ లేని ఉద్యోగాలు చేసే వారికి నవ్వు ఒక మంచి వ్యాయామం.

మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు : డిప్రెషన్‌, ఆందోళన, నర్వస్‌ బ్రేక్‌ డౌన్‌, నిద్రలేమి తదితర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారికి లాఫ్టర్‌ థెరపీ లబ్ది చేకూర్చినట్టు అనేక అధ్యయనాల్లో రుజువైంది.

నిత్య యవ్వన రహస్యం : మన ముఖ కండరాలను టోన్‌ చేయడంలో, ముఖ కవళికలను మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడుతుంది. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. అలా వేగవంతం కావడం వల్ల మన ముఖ చర్మానికి పోషణ లభించి అది మెరుస్తుంటుంది.

నవ్వు వల్ల కేవలం భౌతిక, మానసిక లాభాలే కాదు సామాజిక లాభాలు కూడా ఉన్నాయి. నవ్వుతూ ఉండేవారు పటిష్ఠమైన సంబంధాలను కలిగి ఉండగలరు. ఇతరులను చాలా తేలికగా అకర్షించి టీం వర్క్‌ను సునాయాసంగా నిర్వహించగలరు. నవ్వుతూ ఉండటం వల్ల ఘర్షణను తగ్గిస్తుంది, ఇతరులతో సంబంధాలు పెంచుతుంది.

  • =========================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.