మన ఛాతీలో గుండె, వూపిరితిత్తులు ఉంటాయి. పొట్టలో పేగులు, జీర్ణ అవయవాలు ఉంటాయి. ఇవి కలగలిసిపోకుండా... ఈ రెండింటి మధ్యలో ఓ అద్భుతమైన మందపాటి విభజన పొర ఉంటుంది. దీన్నే విభాజకపటలం.. డయాఫ్రమ్ అంటారు. ఈ పొర అడ్డుగా ఉండటం వల్లనే జీర్ణాశయం, పేగుల వంటివి ఛాతీలోకి చొచ్చుకురాకుండా కిందే ఉండిపోతాయి. మనం శ్వాస పీల్చివదలటంలో కూడా ఈ పొర కీలకపాత్ర పోషిస్తుంటుంది.
అయితే కొందరు పిల్లలకు పుట్టుకతోనే ఈ పొరలో కొంత లోపం, రంధ్రం ఉంటుంది. ఫలితంగా వీరిలో పేగులు, ప్లీహం వంటి జీర్ణ అవయవాలు ఛాతీలోకి చొచ్చుకొని వచ్చేస్తూ- బిడ్డ ప్రాణాల మీదకు తెస్తాయి. పుట్టుకతో వచ్చే ఈ సమస్యనే 'డయాఫ్రమాటిక్ హెర్నియా' అంటారు. దీన్ని గుర్తించి బిడ్డ పుట్టగానే సత్వరమే సర్జరీ చేయించకపోతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవటం అవసరం.
హెర్నియా అంటే!
శరీరంలో కొన్నికొన్ని అవయవాలు.. తమ స్థానం తప్పి... చుట్టుపక్కల ప్రాంతాల్లోకి చొచ్చుకువస్తుంటాయి. అడ్డుగా ఉన్న చర్మం గోడలను తోసుకు వస్తుంటాయి. దీన్నే 'హెర్నియా' అంటారు. ఇవి ఉదర భాగంలో ఎక్కువ. గజ్జల ప్రాంతంలో చొచ్చుకొచ్చే ఇంగ్వైనల్ హెర్నియా, బొడ్డు దగ్గర చొచ్చుకువచ్చే అంబ్లికల్ హెర్నియా, అలాగే పొట్టలోపల విభాజక పటలం నుంచి పేగులు పైకి చొచ్చుకుపోతుండే 'డయాఫ్రమాటిక్ హెర్నియా' ఇలాంటివే. వీటిల్లో డయాఫ్రమాటిక్ హెర్నియా చాలా ప్రమాదకరమైందే కాదు, ప్రాణాంతకమైంది కూడా. ఇది మగ పిల్లల్లో ఎక్కువ.
నిజానికి డయాఫ్రమ్ మొత్తం ఒకే పొరలా కనిపించినప్పటికీ.. పిండం ఎదుగుదల క్రమంలో ఇది ఆరు భాగాల కలయికగా రూపొందుతుంది. కొందరిలో ఈ భాగాలు సరిగా కలుసుకోవు. అప్పుడు ఆ వెలితిలోంచి కడుపులోని పేగులు, ప్లీహం ఛాతీలోకి చొచ్చుకొస్తుంటాయి. అలా వచ్చిన ఇవి వూపిరితిత్తుల పెరుగుదలను అడ్డుకుంటాయి. వాటి పనితీరుని దెబ్బతీస్తాయి. అంతేకాదు.. ఎడమవైపు ఉండే గుండెను కుడివైపు నెడతాయి. ఇలాంటి పరిస్థితినే 'కంజెనిటల్ డయాఫ్రమాటిక్/బ్యాక్‌డాలక్ హెర్నియా' అంటారు.
పిండ దశలోనే
ఈ లోపం గర్భంలో పిండం ఎదుగుతున్నప్పుడే మొదలవుతుంది. సాధారణంగా పిండం 8వ వారంలో 'ప్లూరో పెరిటోనియల్ కెనాల్' అనేది మూసుకొని పోతుంది. పదో వారంలో జీర్ణాశయం పొట్టలోకి వస్తుంది. కానీ ఈ సమయాల్లో అలా జరగకపోతే.. పేగులు ఛాతీ భాగంలోకి చొచ్చుకువచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. డయాఫ్రమాటిక్ హెర్నియాకు ఇదే నాంది.
కారణాలేంటి?
ఈ హెర్నియాకు జన్యు సంబంధ కారణం దోహదం చెయ్యచ్చు. తండ్రికి చిన్నప్పుడు ఈ రుగ్మత ఉండుంటే పుట్టే పిల్లలకూ వచ్చే అవకాశం ఉంది. గర్భంతో ఉన్నప్పుడు తల్లి కొన్ని రకాలు మందులు (థాలిడమైడ్, క్వినైన్, ఫ్యానోమెట్రోజన్) వాడినప్పుడూ రావొచ్చు. విటమిన్-ఎ లోపం వల్ల కూడా ఏర్పడొచ్చని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
లక్షణాలు తెలుసుకోవాలి
* ఈ పిల్లలు పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతారు. ఆయాసం, డొక్కలు ఎగరేయటం (రెస్పిరేటరీ డిస్ట్రెస్) కనిపిస్తాయి.
* శ్వాసక్రియ కూడా చాలా వేగంగా (టాకాప్నియా) ఉంటుంది.
* శిశువు చర్మం నీలంగా (సైనోసిస్) కూడా కావొచ్చు
* వాంతులయ్యే అవకాశమూ ఉంది.
* ఇలాంటి పిల్లలను పరీక్షించి చూస్తే కడుపులో ఉండాల్సిన జీర్ణాశయం ఛాతీలో ఉండటం వల్ల పొట్ట ఖాళీగా కనబడుతుంది. ఛాతీ భాగం ఎత్తుగా కనబడుతుంది.
* స్టెతస్కోపుతో పరీక్షిస్తే హెర్నియా ఏర్పడిన వైపు శ్వాస శబ్దం వినబడదు. ఒకోసారి జీర్ణ అవయవాలకు సంబంధించిన ధ్వనులు వినబడతాయి. * కొందరు పిల్లల్లో వ్యాధి లక్షణాలు ఆలస్యంగా బయటపడతాయి. తరచూ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. అకారణంగా వాంతులు, కడుపునొప్పి, త్రేన్పులు వస్తుంటాయి. ఆకలి సరిగా లేకపోవటం, పెరుగుదల అంతగా కనిపించకపోవటం, ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడటం వంటివి కనిపిస్తాయి. మన దేశంలో ప్రతి 2,000 మందిలో ఒకరు ఈ సమస్యతో పుడుతున్నారు.
ఎక్స్‌రేతో నిర్ధారణ
డయాఫ్రమాటిక్ హెర్నియా లక్షణాలను గుర్తించిన వెంటనే మరికొన్ని పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఛాతీ, కడుపు పూర్తిగా కనిపించేలా ఎక్స్‌రే తీసి, పేగులు.. గుండె ఎలా ఉన్నాయో చూస్తారు. కొందరిలో డయాఫ్రమ్ అంచు భాగం కనిపించదు. ఒకవేళ మామూలు ఎక్స్‌రేలో సరిగా తేలకపోతే బేరియం ద్రవం పంపించి తిరిగి ఎక్స్‌రే తీస్తారు. ఛాతీ భాగంలో పేగులు కనిపించినట్టయితే డయాఫ్రమాటిక్ హెర్నియా ఉన్నట్టు నిర్ధరిస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా డయాఫ్రంలో ఎక్కడ లోపం ఉందో, ఎంత పరిమాణంలో ఉందో పరిశీలిస్తారు.
ఆపరేషనే మార్గం
దీనికి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదు. ఈ లోగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* పుట్టిన వెంటనే ముందు శిశువును వేడిగా ఉండే ప్రదేశానికి తరలిస్తారు. దూదితో శరీరాన్ని పూర్తిగా కప్పేసి, లేదంటే వార్మర్‌లో పెట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆక్సిజన్ అందిస్తారు. శిశువు తలను ఎత్తుగా పెట్టి పడుకోబెడతారు. గొంతులోని స్రావాలను తొలగిస్తుండాలి. ఆ తర్వాత శస్త్రచికిత్స ప్రారంభిస్తారు. ఛాతీలోకి చొచ్చుకెళ్లిన పేగులు, ప్లీహం, ఇతర అవయవాలను కిందికి నెట్టేసి, డయాఫ్రంలోని చీలికను మూసేస్తారు. ఈ చీలిక పెద్దగా ఉంటే మెష్ కూడా అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ పుట్టిన వెంటనే ఆపరేషన్ చేయటానికి సిద్ధంగా లేకపోతే.. శిశువును ప్రత్యేక పరికరాల్లో జాగ్రత్తగా చూస్తూ.. పరిస్థితి మెరుగైన తర్వాత ఆపరేషన్ చేస్తారు.
* అయితే.. ఈ ఆపరేషన్ అన్నిసార్లు విజయం అవుతుందున్న భరోసా లేదు. జీర్ణాశయం ఛాతీలోకి చొచ్చుకొని వెళ్లకుండా ఉన్నా, అలాగే డయాఫ్రమ్‌లో చీలిక తక్కువగా ఉన్నా, రక్తంలో పీహెచ్ స్థాయి 7.2 కన్నా ఎక్కువున్నా ఆపరేషన్ ఫలితాలు బాగుంటాయి. అయితే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా, హెర్నియా కుడివైపు ఉన్నా ఆపరేషన్ అంతగా ఫలించకపోవచ్చు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, మెదడు రుగ్మతలు, అన్నవాహిక, శ్వాసకోశ జబ్బులున్నా కష్టమే.
తగు జాగ్రత్తలు తప్పనిసరి
డయాఫ్రమాటిక్ హెర్నియా విషయంలో గర్భం ధరించినప్పటి నుంచే తల్లి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ముఖ్యంగా తొలిగర్భంలో శిశువు అకారణంగా మరణిస్తే మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ హెర్నియా పదో వారంలో ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి, గర్భంలో ఉమ్మనీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే డయాఫ్రమాటిక్ హెర్నియా ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించిన వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా పరీక్షించుకోవాలి. దీనిని శిశువు గర్భంలో ఉండగానే కనిపెడితే తగు చర్యలు తీసుకొని బిడ్డను కాపాడొచ్చు. తల్లిని సురక్షితమైన చోటుకి తరలించి కాన్పు చేయవచ్చు.
ఈ జబ్బుతో బాధపడే పిల్లలకు వూపిరితిత్తుల్లో రక్తపోటు ఎక్కువగా (పల్మనరీ హైపర్‌టెన్షన్) ఉంటుంది. అలాగే గుండెలోంచి వచ్చే రక్తం తక్కువగా (కార్డియాక్ అవుట్‌పుట్) ఉంటుంది. దీంతో పిల్లలు మరణించే అవకాశం ఎక్కువ కాబట్టి, ఆపరేషన్ చేయటం అత్యవసరమని గుర్తించాలి.
--డా|| హెచ్.హనుమంతరాయుడు,, పీడియాట్రిక్ సర్జన్, రిటైర్డ్ సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, కర్నూలు.(courtesy with Eenadu sukheebhava)
- ===============================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.