Saturday, December 10, 2011

వృద్ధుల ఆరోగ్యం-అవగాహన ,Oldpeople health-Awareness

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -వృద్ధుల ఆరోగ్యం-అవగాహన ,Oldpeople health-Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల.. ఇంట్లోవారు వృద్ధుల పట్ల... కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే చాలు.. వారి వృద్ధాప్యం ఇంటిల్లిపాదికీ కూడా ఎంతో సంతోషకరమైన దశగా మారుతుంది.
జీవన ప్రమాణాలు మెరుగవటం.. వైద్య సదుపాయాలు విస్తరించటం.. వ్యాధులు, శారీరక మార్పుల పట్ల నానాటికీ అవగాహన పెరుగుతుండటం... వీటన్నింటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్దాయం పెరుగుతోంది. ఫలితంగా వృద్ధుల సంఖ్యా అనూహ్యంగా వృద్ధిచెందుతోంది. సంపన్న దేశాల్లోనూ, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందనీ.. 2025 నాటికి 65 ఏళ్లు పైబడిన వారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధిక సంఖ్యలో ఉండబోతున్నారని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. దీని పరిణామాలు సామాజికంగానూ, వైద్యపరంగానూ కూడా మున్ముందు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. రానున్న ఒకటిరెండు దశాబ్దాల్లో పని చేసే యువత సంఖ్య తగ్గిపోయి.. విశ్రాంత దశలో ఉండే వృద్ధుల శాతం పెరగబోతోంది. ఫలితంగానే వృద్ధుల ఆరోగ్య సమస్యలు, వారి సంరక్షణ, పోషణ వంటివన్నీ కూడా మరింత కీలకమైన అంశాలుగా మారనున్నాయి.

  • ఏమిటీ వృద్ధాప్యం ప్రత్యేకత?
అంతర్జాతీయంగా ఎన్నో అధ్యయనాలు, పరిశీలనల అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ 65 సంవత్సరాలు పైబడిన వారిని వృద్ధులుగా పరిగణించాలని నిర్ధారణకు వచ్చింది. ఒక వయసు రాగానే శరీరంలో సహజంగానే కొన్ని మార్పులు వస్తాయి. వీటిని వృద్ధాప్యంలో వచ్చే మార్పులుగా భావించవచ్చు. వృద్ధ్యాప్యము ఒక వ్యాధి కాదు .అది ఒక జీవిత కాలములో పరిణామము . దీనినే " జర" అని " ముదిమి" అని పిలుస్తారు. ఆపలేని ఈ వృద్ధాప్యము సహజ పరిణామమై ఆఖరి శ్వాసవరకూ ఉంటుంది.  వీటిని ప్రధానంగా రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు.
1. వయసుతో పాటు సహజంగా వచ్చే మార్పులు. వీటినే 'ఏజ్‌ డిటర్మిన్డ్‌ఛేంజెస్‌' అంటారు. వీటివల్ల చిన్నపాటి ఇబ్బందులున్నా వాటిని అధిగమించటం తేలిక. అదే వీటి ప్రత్యేకత. అంతకు మించి వీటిని గురించి తీవ్రంగా ఆందోళన చెందాల్సినదేం ఉండదు. ఉదాహరణకు- వృద్ధాప్యంలో చర్మం ముడతలు పడుతుంది. మెదడు, నాడీ వ్యవస్థల్లో మార్పుల వల్ల జ్ఞాపకశక్తి కొంత సన్నగిల్లుతుంది. ముఖ్యంగా వినికిడి శక్తి తగ్గటం, కంటిచూపు మందగించటం వంటివీ జరగొచ్చు. వినికిడి లోపాన్ని అధిగమించటానికి శ్రవణ యంత్రాలు వాడుకోవచ్చు. కంటిచూపు కోసం అద్దాలు వాడుకోవచ్చు. ఇలాంటి చిన్నచిన్న చర్యలతోనే ఈ ఇబ్బందులను తేలికగా అధిగమించవచ్చు. వీటితో పాటు గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం కొంత తగ్గి త్వరగా అలిసిపోవటం, కొద్దిగా పని చేసినా ఆయాసం రావటం, కళ్లు తిరగటం వంటివి జరగొచ్చు. ఎముకల పటుత్వం తగ్గి త్వరగా విరిగే అవకాశమూ(ఫ్రాక్చర్లు) పెరుగుతుంది. వృద్ధాప్యంలో మలబద్ధకం, మూత్ర విసర్జనకు కాస్త ఎక్కువసార్లు వెళ్లాల్సిరావటం వంటివీ పలకరిస్తాయి. జీవనశైలిని మార్చుకోవటం, వైద్య సహాయంతో వీటినీ అధిగమించే అవకాశం ఉంటుంది.
2. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం పట్ల, శరీరం పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల వృద్ధాప్యంలో తలెత్తే సమస్యలు రెండో రకం. వీటిని 'ఏజ్‌ రిలేటెడ్‌ డిసీజెస్‌' అంటారు. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు సరైన పోషకాహారం తీసుకోకపోవటం, తగినంత శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవటం, పొగ మద్యం వంటి వ్యసనాలకు బానిసలు కావటం.. వీటన్నింటి వల్లా ఒక వయసు వచ్చిన తర్వాత తీవ్రమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. చిన్నవయసు నుంచీ చక్కటి జీవనశైలి, అలవాట్లను పాటించటం ద్వారా మాత్రమే వీటిని నివారించుకునే వీలుంటుంది.

  • తేడాలేమిటి?
వృద్ధులకూ... వయసులో ఉన్న వారికీ మధ్య శారీరకంగా తేడాలు ఏమిటన్నది తప్పకుండా అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం. అన్నీ బాగున్నప్పుడు వృద్ధులు కూడా చక్కటి ఆరోగ్యంతో, శక్తిసామర్థ్యాలతో ఉన్నట్టే కనిపిస్తారు. కానీ చిన్నపాటి సుస్తీ చేసినా వీరిలో ప్రాణాంతకంగా మారచ్చు. ఎందుకంటే వృద్ధుల్లో ప్రధానంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వ్యాధులను తట్టుకుని, నిలదొక్కుకుని, త్వరగా కోలుకునే సామర్థ్యం (రిజర్వ్‌ కెపాసిటీ), ఎదుర్కొనే సామర్థ్యం వృద్ధుల్లో తక్కువగా ఉంటుంది. అందుకే వృద్ధులు తేలికగా జబ్బుల బారినపడతారు, కోలుకోవటానికీ ఎక్కువ సమయం తీసుకుంటారు. వయసులో ఉన్నవారికీ, వృద్ధులకూ మధ్యనుండే కీలకమైన వ్యత్యాసం ఇది.


  • పెద్దతరం జాగ్రత్తలు
* చక్కటి తేలికపాటి పోషకాహారం తీసుకోవాలి.
* రోజూ కొద్దిసేపు నడవాలి. ఇది తప్పనిసరి నిత్య కృత్యం కావాలి.
* సన్నిహితులు, ముఖ్యంగా మనుమలు, మనుమరాళ్లతో నిత్యం కొంత సమయం గడపాలి. వారితో చిన్నచిన్న ఆటలు ఆడటం, మాట్లాడించటం, కథలు చెప్పటం వంటి వాటివల్ల ఉత్సాహం పెరుగుతుంది.
* రోజూ కొంతసేపు తమ వయసు వారితో కబుర్లు చెప్పుకోవటం, మనసు విప్పి మాట్లాడుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
* నిత్యం వార్తాపత్రికలు చదవటం, రేడియో వినటం, టీవీ చూడటం వంటి వాటివల్ల జరుగుతున్న విషయాల మీద ఆసక్తిపెరిగి ఉత్సాహం వస్తుంది.
* నడిచేటప్పుడు చేతికర్ర ఉపయోగించటం చాలా మంచిది. ఈ కర్ర నేలకి ఆనే కింది భాగం ఒంటిగా కాకుండా నాలుగు కాళ్లు ఉంటే మంచిది. అది జారిపడిపోకుండా చక్కటి ఆసరాగా కాస్తుంది.
* ప్రతి రోజూ ఒక క్యాల్షియం మాత్ర, ఒక బీకాంప్లెక్స్‌ మాత్ర వేసుకోవాలి.
* మధుమేహం, హైబీపీ వంటి రుగ్మతలు ఉంటే.. అవి కచ్చితంగా నియంత్రణలో ఉండేలా, విడవకుండా చికిత్స తీసుకుంటుండాలి.

  • కన్నేసి ఉంచాలి!
ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది గమనిస్తుండటం మంచిది. ఇందుకోసం మన దైనందిన జీవితంలోనే కొన్నికొన్ని సందర్భాలను గమనిస్తుంటే సరిపోతుంది. ఉదాహరణకు:
1. వృద్ధులు తమ పని తాము చేసుకుంటున్నారా? అంటే స్నానం చేయటం, బజారుకు వెళ్లటం, వస్తువులు కొనేటప్పుడు డబ్బులు సరిచూసుకోవటం, వంటివి సమర్థంగా చేసుకోగలుగుతున్నారా? లేదా? వంటివి గమనిస్తుండాలి.
2. బంధువులు, స్నేహితులు, పొరుగువారిని గుర్తు పట్టగలుగుతున్నారా? లేదా? అన్నదీ ముఖ్యమే.
3. చిన్నచిన్న ప్రశ్నలతో వారి జ్ఞాపశక్తి సామర్థ్యం ఎలా ఉందన్నది
తెలుసుకోవచ్చు. ఉదాహరణకు టైమ్‌ అడగటం, అడ్రసు చెప్పమనటం, టెలిఫోన్‌ నంబర్ల వంటివి అడిగి తెలుసుకోవటం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మధ్యలో మళ్లీ మొదటి ప్రశ్న అడిగితే ఎంతవరకూ గుర్తు పెట్టుకోగులుగుతున్నారో కూడా తెలుస్తుంది.
4. చేతుల సహాయం లేకుండా కుర్చీలో నుంచి లేచి 10 అడుగులు నడిచి వెనుతిరిగి వచ్చి కుర్చీలో కూర్చోమనాలి. సాధారణంగా ఈ ప్రక్రియ మొత్తం 15 సెకండ్లలో పూర్తికావాలి. దీనివల్ల బ్యాలెన్స్‌, నడక ఎలా ఉన్నాయి, తూలుడు వంటివి ఉన్నాయా? అన్నది తెలుస్తుంది. దీన్నే 'గెటప్‌ అండ్‌ గో టెస్ట్‌' అంటారు.
5. కాళ్లు దగ్గరగా పెట్టి నుంచోమనాలి. తర్వాత రెండు కళ్లూ మూసుకోమనాలి. ఈ సమయంలో ఇటూఅటూ తూలిపోతున్నారేమో చూడాలి. దీన్నే 'రాంబెర్గ్స్‌ టెస్ట్‌' అంటారు.
6. ఒక అడుగు దూరంలో నిలబడి రహస్యం చెబుతున్నట్టుగా మాట్లాడితే వినికిడి శక్తి ఎలా ఉందో తెలుస్తుంది. వినికిడి తక్కువగా ఉంటే నలుగురిలోకి వెళ్లటానికి, మాట్లాడటానికి మొహమాటపడతారు. ఫలితంగా వీరిలో విసుగు, చికాకు, కోపం వంటివీ చోటుచేసుకుంటాయి.
7. చదవగలుగుతున్న అక్షరాల సైజును బట్టి చూపు ఎలా ఉందో అంచనా వెయ్యచ్చు. చిన్నసైజు అక్షరాలు చదవగలుగుతున్నారా? ఏ సైజు అక్షరాలు కనబడుతున్నాయన్నది తెలుసుకునేందుకు వార్తాపత్రికల్లో వివిధ సైజుల్లో ఉండే శీర్షికల వంటివాటినీ ఉపయోగించుకోవచ్చు.
- ఇవన్నీ చిన్నచిన్న పరీక్షలే. వీటికి అయ్యే ఖర్చేమీ ఉండదు. కానీ వీటి ద్వారా వృద్ధుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది మనకు చాలా వరకూ తెలుస్తుంది.

  • వృద్ధుల్లో తలెత్తే సాధారణ సమస్యలు
1. తూలుడు, పడిపోవటం: ఒక వయసు వచ్చిన వారిలో మెడదు, నాడుల సామర్థ్యం సన్నగిల్లటం, కండరాలు బలహీనపడటం, చూపు తగ్గటం, వినికిడి లోపం పెరగటం, మెదడుకు రక్తప్రసరణ తగ్గటం వంటి కారణాల వల్ల బ్యాలెన్స్‌ తప్పి, తేలికగా పడిపోవటం జరుగుతుంటుంది. ఇలా పడినప్పుడు ఎముకలు విరిగే ముప్పూ ఉంటుంది. 65 సంవత్సరాలు దాటిన వారిలో నూటికి దాదాపు 30 మంది ఏడాదికి ఒకటిరెండు సార్త్లెనా పడిపోతారని, అలా పడిపోయిన వారిలో 15 శాతం మందికి ఎముకలు విరగటం జరుగుతోందని అంచనా. వీరిలో ముఖ్యంగా తుంటి దగ్గర, మణికట్టు దగ్గర ఫ్రాక్చర్లయ్యే ముప్పు చాలా ఎక్కువ. ఒకసారి పడిపోతే.. మళ్లీ పడిపోతానేమోనన్న భయం వారిని మరింతగా ఇబ్బంది పెడుతుంటుంది.
2. గందరగోళపడటం: ఏదేదో మాట్లాడటం, సరిగా గుర్తుపట్టలేకపోవటం వంటివీ పెద్ద వయసులో రావచ్చు. పెద్దవయసు వచ్చింది, మతిమరుపుతో ఏదో మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి శరీరంలో ఎక్కడో ఇన్ఫెక్షన్‌ వల్ల జ్వరం వచ్చిగానీ, లేక మెదడుకు రక్తసరఫరా సరిగా లేక రక్తం గూడుకట్టి కూడా ఇలా జరగొచ్చు. ఒక్కోసారి నిద్రమాత్రల ప్రభావం వల్ల కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి పెద్దవయసులో మతిమరుపు, గందరగోళ పడటం సహజమే అని నిర్లక్ష్యం చేయకూడదు.
3. మూత్రం ఆపుకోలేకపోవటం: మూత్ర విసర్జన మీద పట్టుతగ్గి బట్టల్లోనే అయిపోతుండటం పెద్దవయసులో ఎదురయ్యే చాలా ఇబ్బందికర సమస్య. ఇది పురుషుల్లో కంటే స్త్రీలలో మరీ ఎక్కువ. పగటిపూట కంటే రాత్రి అధికం. ఎక్కడికన్నా వెళ్లాలన్నా అసౌకర్యం, ఫలితంగా సమాజానికి దూరం కావటం జరుగుతుంటాయి. దీనివల్ల మూత్రమార్గం దగ్గర, పిర్రల మీద చర్మవ్యాధులు కూడా వస్తుంటాయి. దీనికి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు; మతిమరుపు, గుర్తించలేకపోవటం (కన్ఫ్యూజన్‌); మలబద్ధకం; కదల్లేకపోవటం వంటివి ఎక్కువగా కారణమవుతుంటాయి.
4. తల తిరగటం: తలలో నాదుగా ఉండటం, తల తిరగటం (డిజీనెస్‌) వంటి లక్షణాలు దాదాపు 30% మంది వృద్ధుల్లో ఉంటాయి. దీనికి రక్తపోటు పడిపోవటం (హైపోటెన్షన్‌), గుండె లయ అస్తవ్యస్తం కావటం, చెవిలోపల ఉండే బ్యాలెన్స్‌ యంత్రాంగ సామర్థ్యం క్షీణించటం (వెస్టిబ్యులార్‌ న్యూరోనైటిస్‌), మెదడులో రక్తం గూడుకట్టటం, చూపు మందగించటం వంటివి కారణమవుతాయి.
5. ఒంటరితనం: పెద్దవయసులో తోడునీడ లేకపోవటం, ఎవరూ మాట్లాడేవారులేక మానసికంగా కుంగిపోవటం (డిప్రెషన్‌), ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ఎందుకూ పనికిరాకుండా పోయామన్న న్యూనతాభావం... ఇలాంటివన్నీ కలిసి పెద్దవయసు వారిని బాగా కుంగదీస్తాయి.

  • ఇంట్లోవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ఇంటిలోని ప్రతి ఒక్కరూ రోజూ కనీసం 5-10 నిమిషాలు పెద్దవారితో మాట్లాడాలి, వారితో కొంత సమయం గడపాలి. దీనివల్ల పెద్దవారికి ఒంటరితనం, ఆ భావన పోతాయి.
* వృద్ధులు చిన్నచిన్న పొరపాట్లు చేసినా వారిని కించపరచవద్దు. వాళ్లు న్యూనతలోకి జారిపోయేలా అసహనంతో మాట్లాడొద్దు.
* వృద్ధులకు ఏదైనా సుస్తీ చేస్తే కొంత ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా చూడటం ముఖ్యం. వాళ్లు పరిశుభ్రమైన నీరు, తగినంత తాగుతున్నారా? లేదా చూడాలి. మూత్రం ఎలా అవుతోందో
తెలుసుకోవాలి. లేకపోతే ఒంట్లో నీరు తగ్గి (డీహైడ్రేషన్‌) మూత్రపిండాలు దెబ్బతింటాయి.
* ఏదో కొద్దిపాటి జ్వరం వంటివాటితో కంగారు లేదుగానీ.. ఏదైనా సమస్య ఎక్కువగా ఉన్నా, ఎక్కువ రోజులు తగ్గకుండా వేధిస్తున్నా వెంటనే వైద్య చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదో పెద్దాయన లేదా పెద్దావిడ పడుకున్నారు కదా అని పట్టించుకోకుండా వదిలేస్తే చిన్నచిన్న సమస్యలే ప్రమాదకరమైనవిగా మారే అవకాశాలుంటాయి.
* పెద్దవారు నిద్రించే గదిలో చక్కటి వెలుతురునిచ్చే చిన్న లైట్‌ ఉంచటం ముఖ్యం. లేకపోతే మధ్యరాత్రిలో లేచినప్పుడు వీరు చీకటిలో పడిపోయే అవకాశాలు ఎక్కువ. ఇంట్లో ఎక్కడ మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉన్నా.. అక్కడ పట్టుకోవటానికి అనువుగా రెయిలింగ్‌ వంటివి ఉండాలి.
* వీలైనంత వరకూ వృద్ధులున్న ఇళ్లలో వెస్ట్రన్‌ రకం టాయ్‌లెట్‌ సీట్లు ఉండేలా చూడాలి. బాత్రూముల్లో కాలు జారకుండా ఉండే రకం రాళ్లనే వేయించాలి.
ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో వృద్ధాప్యం సంతోషకరంగా గడిచేలా చూడాల్సిన బాధ్యత మనందరిదీ.

  • --డా.అశ్వినీకుమార్ M.D(gen) proffessor of Medicine -Ashram Medical college , Eluru.@courtesy with Eenadu sukheebhava

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.