Monday, December 12, 2011

ఇంటిలో పరిశుభ్రత,House Cleanliness



ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -ఇంటిలో పరిశుభ్రత,House Cleanliness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


ఇల్లు చూసి ఇల్లాలిని చేసుకోవాలనే నానుడి ఎక్కువగా వుంది. ఎందుకంటే ఇంటి శుభ్రత ఎక్కువగా ఇల్లాలికే తెలుసు, ఎక్కువ ఇల్లాలిపై ఆధారపడిపడి వుంటుంది. ఏ వస్తువు ఎక్కడ
వుండాలి ఏది ఎంత శుభ్రంగా వుంచుకోవాలి అనే అంశంపై ఆధారపడి వుంటుంది.ఇంటిలోకి ధారాళంగా గాలీ, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలో వీలైనంత వెంటిలేషన్‌ బాగా వుండేటట్లు చూసుకోవాలి. మురుగునీరు ఎప్పటికప్పుడు బైటికి ప్రవహించే విధంగా చూసుకోవాలి. కూరగాయలు మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి. ఈగలు, దోమలు వాలిన పదార్థాలు తినటం వలన అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ వుంటుంది.


ప్రతిరోజూ ఇంటినీ చీపురితో ఊడవటం తడిబట్ట పెట్టటం ప్రతిరోజూ చేయాలి. ఒక వ్యక్తి శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. ఒక ఇంటి శుభ్రత ఓ ఇంటి వారికి మాత్రమే గాక కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది. మన పరిసరాల నుంచి వీచే గాలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. మన పరిసరాల నుంచి వీచేగాలిపైనే గాక, పీల్చేగాలి కాలుష్యమయమైపోతే ఎన్ని సబ్బులతో ఒళ్ళు రుద్దుకుని ఏం లాభం? ఎంత తళతళలాడే దుస్తులు వేసుకుని ఏం ప్రయోజనం. అందుకే ఉతికిన దుస్తులను శుభ్రంగా మడతలు పెట్టుకొని చక్కగా అరమరలో
అమర్చుకోవాలి.


ఏ ఇల్లు అయినా సూక్ష్మజీవులు, బొద్దింకలు, చీమలు, బల్లులు, తేళ్ళు, జెర్రులు వంటివి కంటికి కనిపించే కీటకములు, ఈగలు, దోమలు వంటి వ్యాధి వ్యాపించే కీటకాలు ఇంటిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఇంటిలో ఆకుపచ్చని మొక్కలను పెంచటం వలన ఆరోగ్యం సమకూరుతుంది. ఇటీవల అద్దెఇళ్ళు నేల అసలు కనబడదు. వీలైనంత వరకూ అవకాశం వున్న మేరకు మొక్కలు పెంచటం వలన వాటి నుండి లభించే ఆక్సిజన్‌ను మనం గ్రహించి, మననుండి వచ్చే కార్బన్‌డై ఆక్సైడ్‌ గ్రహించి మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.


పరిసరాల శుభ్రత, వాతావరణ కాలుష్యం గురించి మనం ఎక్కువగా చర్చించుకుంటాం. వాటినెలా నివారించాలా అని ఆలోచిస్తాం. కానీ మన ఇంట్లో వుండే పరిశుభ్రత గురించి పెద్దగా పట్టించుకోం. ఈ నిర్లక్ష్యమే అనేక రుగ్మతలకు కారణమవుతోంది. పైకి శుభ్రంగానే కనిపించే ఇళ్లలో అనేక రోగకారకాలు కొలువుతీరి వుంటాయి. అవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎలర్జీలకు కారణమవుతాయి. చలికాలంలో ఇంట్లో ఫంగస్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఎండాకాలంలో పుప్పొడి వ్యాపించడం ఎక్కువ. ఎలర్జీ కారకాలు ఇంటా బైటా ఎక్కువ సాంద్రతలో వుంటాయి.

పసిపిల్లలు ఎక్కువగా ఈ ఎలర్జీలకు గురవుతారు. సాధారణంగా పిల్లలు ఇంట్లో, పాఠశాలల్లో లేదంటే బేబీ సిట్టింగ్‌ లేక బంధువుల ఇళ్లల్లో పెరుగుతారు. నేటి ఇరుకిరుకు ఇళ్లల్లో గాలి, వెలుతురు సోకడం తక్కువే. గాలి అన్నివైపులా ప్రసరించకుంటే ఇంట్లో తేమ అలాగే వుంటుంది. ఇది దుమ్ము పెరగడానికి దోహదపడుతుంది. పిల్లల్లో ఎలర్జీలకి కారణాలు వెతికినపుడు ఎక్కువగా హౌస్‌ డస్ట్‌ మైట్స్‌, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకల వ్యర్థాలు, చెదలు, ఫంగై, సిగరెట్‌ పొగ... వంటివి కారణాలని తేలింది. డస్ట్‌ మైట్స్‌ పెరగడానికి తేమ, మన చర్మంనుండి రాలిపడే మృతకణాలను ఉపయోగించుకుంటాయి. అంటే డస్ట్‌ మైట్స్‌ ఎక్కువగా పరుపులు, కార్పెట్లు, సోఫాలు, దీవానులు, పిండి రుబ్బుకున్నాక సరిగా కడగని మిక్సీలలో పెరుగుతాయి.


డస్ట్‌మైట్స్‌ - జాగ్రత్తలు

పడుకునేచోట ఎక్కువగా వస్తువులు గజిబిజిగా కుప్పలు కుప్పలుగా వుండకూడదు. బెడ్‌రూంను నీట్‌గా వుంచుకోవాలి. అనవసర వస్తువులకు అందులో తావివ్వకూడదు. వస్తువులను, ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో నింపేయకుండా ఖాళీగా వుంచాలి. అది చూడటానికే కాదు, ఆరోగ్యానికీ మంచిది. పరుపులను వారానికోసారయినా ఎండలో వుంచాలి. దుప్పట్లు, దిండు గలీబులు తరచుగా మార్చాలి. వాటిని వేడినీటిలో ఉతకడంవల్ల డస్ట్‌మైట్స్‌ చనిపోతాయి. కార్పెట్లు, సోఫాలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీటిని దులిపితే సరిపోదు. క్రమం తప్పకుండా వాక్యూమ్‌క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడూ ఎండలో వుంచాలి. కుషన్‌ కవర్లు ఎప్పటికప్పుడు మార్చాలి.


తినే పదార్థాలపై మూత తప్పనిసరిగా వుంచాలి. నేలపైన, గోడల్లో వుండే పగుళ్లను ఎప్పటికప్పుడు పూడ్చుకోవాలి. చలికాలంలో డస్ట్‌మైట్స్‌ సాంద్రత ఇంట్లో ఎక్కువవుతుంది. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేయడం, కిటికీలు శుభ్రంగా వుంచడంవల్ల డస్ట్‌మైట్స్‌ తక్కువవుతాయి.ఇంట్లో పొగ తాగరాదు. అది వారి ఆరోగ్యానికే కాదు, కుటుంబ ఆరోగ్యానికే నష్టదాయకం. పొగ ఉబ్బసాన్ని ఎక్కువ చేస్తుంది. ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇక బైటి వాతావరణానికొస్తే అక్కడి ఎలర్జీలకు పుప్పొడి ముఖ్య కారణం. పిల్లలు బైట ఆడుకుని ఇంటికి రాగానే కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

కొత్త ఇంట్లోకి వెళ్లినపుడు శుభ్రతకు సమయం కేటాయించాలి. ముఖ్యంగా మూసివున్న ఇంట్లోకి మారేప్పుడు కూడా ఇంటిని బాగా శుభ్రపరచాలి. ఈ జాగ్రత్తవల్ల ఎలర్జీలు తగ్గుతాయి. ఇందుకు కనీసం పదిహేను నుండి నెలరోజులు కేటాయించాలి.



  • ===========================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.