'మనం ఏం తింటున్నామో అదే అయిపోతాం' అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో? ఎందుకంటే మనం తినే ఆహారం శరీరంలోని జన్యువులనూ ప్రభావితం చేస్తుందని చైనా పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల వృక్ష-జంతు మైక్రో ఆర్‌ఎన్‌ఏ మార్పిడిపై చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశం బయటపడింది. మనం తరచుగా తినే బియ్యం, గోధుమ, బంగాళాదుంప, క్యాబేజీ వంటి వాటిల్లోని 30 రకాల వృక్ష సంబంధ మైక్రో ఆర్‌ఎన్‌ఏలు మన రక్తంలోనూ ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి కణాల పనితీరునూ మారుస్తున్నట్టు తేలింది. బియ్యంలోని ఒక ప్రత్యేకమైన మైక్రో ఆర్‌ఎన్‌ఏ.. రక్తం నుంచి చెడ్డ కొలెస్ట్రాల్‌ను తొలగించే గ్రాహకాల పనితీరును అడుకుంటుండటమే ఇందుకు నిదర్శనం. అంటే విటమిన్లు, ఖనిజాల మాదిరిగా ఈ ఆర్‌ఎన్‌ఏలూ మొదట్లో మనకు ఆహారం నుంచి సంక్రమించి ఉండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలతో మన శరీరం అధికంగా సమ్మిళితమైందనటాన్ని ఇది రుజువు చేస్తోందని చెబుతున్నారు. ఒక జాతిలోని జన్యు మార్పులు మరోజాతిలో జన్యు మార్పులను ప్రేరేపిస్తుందనే (కో-ఎవల్యూషన్) సిద్ధాంతానికి ఈ ఫలితాలు మరింత బలం చేకూర్చాయని అధ్యయనకర్త చెన్ యు జాంగ్ అంటున్నారు. ఉదాహరణకు పాలల్లోని లాక్టోజ్‌ను జీర్ణం చేసుకునే సామర్థ్యం మనకు పశు పెంపకం చేపట్టిన తర్వాతే అబ్బింది. అలాగే వ్యవసాయం చేయటం ఆరంభించిన తర్వాత మనలో అలాంటి మార్పులే జరిగి ఉండొచ్చంటున్నారు. మొత్తమ్మీద ప్రకృతిలో ఏదీ మడిగట్టుకొని ఒంటరిగా కూచోలేదనటాన్ని జాంగ్ అధ్యయనం మరోసారి గుర్తుచేసింది.
- =================================
No comments:
Post a Comment
Your comment is very important to improve the Web blog.