Saturday, December 10, 2011

తల్లిపాలు-అవగాహన , Mother Milk-Awareness

  • image : courtesy with Eenadu sukheebhava


ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -తల్లిపాలు-అవగాహన , Mother Milk-Awareness- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...


స్ర్తీకి సంపూర్ణత్వం సిద్ధించేది మాతృత్వంతోనే అని అంటారు. అలాంటి మాతృత్వం పరిపూర్ణమయ్యేది బిడ్డకు తల్లి పాలను ఇచ్చినప్పుడే. అలాంటి తల్లిపాలే నేడు బిడ్డకు కరువయ్యాయి. వివిధ రకాల శారీరక సమస్యల కారణంగా కొంతమంది, అందం తగ్గిపోతుందనే అపోహతో చాలామంది పసిపిల్లలకు పాలు ఇవ్వడం లేదు. చంటిపిల్లలకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే పసిబిడ్డకు అమృతం తల్లిపాలు. భవిష్యత్తులో వారు ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉండేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని తల్లిపాలే అందిస్తాయి. తల్లిపాలు సృష్టిలో క్షీరద జాతికి చెందిన ప్రతి జీవి తన బిడ్డ జన్మించగానే ఇచ్చే మొదటి ఆహారం. శిశువులు ఆరోగ్యంగా పెరిగి, అభివృద్ధి చెందడానికి తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదు. సంతానోత్పత్తి ప్రక్రియలో ఇదొక భాగం. దీని ప్రభావం తల్లి ఆరోగ్యం పై ఎంతైనా ఉంటుంది. ప్రపంచ ప్రజారోగ్య సిఫారసు ప్రకారం శిశువుల గరిష్ట పెరుగుదలను అభివృద్ధిని, ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదటి ఆరునెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఆ తరువాత శిశువు పెరిగే పోషకాహార అవసరాలను బట్టి తగిన పౌష్టిక విలువలున్న అనుబంధ ఆహారాన్ని ఇస్తూ, అతనికి రెండేళ్ళు వచ్చేంత వరకు, ఆ తరువాత కూడా తల్లిపాలను కొనసాగించాలి

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10.9 మిలియన్ల 5 సంవత్సరాలలోపు పిల్లలు వివిధ కారణాలతో చనిపోవుచున్నారు ( మన దేశంలో 2.42 మిలియన్లు). ఇందులో 40 శాతం మరణాలు, నెలలోపు (0 – 28 రోజులు) శిశువులలోనే జరుగుచున్నది. అనగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 మిలియన్ల నెలలోపు శిశువులు మరణిస్తున్నారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు త్రాగించినట్లతే 1 మిలియన్ శిశు మరణాలు నివారించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది. దీని ప్రకారం మనదేశంలో ప్రతి సంవత్సరం సంభవించే 11 లక్షల నెలలోపు శిశు మరణాలలో సుమారు 2,50,000 మరణాలను నివారించవచ్చు.


* బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి ఆరు నెలల కాలము తల్లిపాలు ఒక సంపూర్ణ ఆహారం. బిడ్డకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు సమపాళ్ళలో ఉండడమే కాక అతి ముఖ్యమైన వ్యాధి నిరోధక శక్తి, వెలకట్టలేని తల్లీబిడ్డల అనుబంధం, పెద్దయ్యాక వచ్చే వివిధరకాల దీర్ఘకాలిక జబ్బుల నుండి రక్షణ, మొదలగునవి తల్లిపాల వలన కలుగుతుంది. ఈ ఆరు నెలల కాలములో బిడ్డకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ఆహారము అవసరం లేదు. బిడ్డకు చక్కటి శారీరక, మానసిక, సాంఘీక, ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు ఒక గట్టి పునాది.

* పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలి. మొదటి ఆరు నెలల కాలము తల్లిపాలు మాత్రమే ఇప్పించాలి. 6 నెలలు నిండిన పిదప తల్లిపాలతో పాటు సురక్షితమైన, సరియైన, ఇంటిలో వండిన అదనపు ఆహారం ఇప్పించాలి. తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు, వీలైతే ఇంకా ఎక్కువ కాలం ఇప్పించాలి.
* తన బిడ్డకు రొమ్ముపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము కాన్సరు, అండాశయపు కాన్సరు, రక్తహీనత, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి రక్షణ, మరియు సహజ గర్భనిరోధక శక్తి కలుగుతుంది.
* ముర్రుపాల ఉపయోగం, శ్రేష్టతల గురించి చాలాకాలంగా చాలా మందికి తెలుసు. పుట్టిన వెంటనే శిశువుకి ముర్రుపాలే ముందు పట్టాలనీ తెలుసు. కానీ కొన్ని పురాతన నమ్మకాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాల వల్ల చాలా సందర్భాలలో ముందుగా ముర్రుపాలు బదులు, తేనె, పంచదార, నీళ్ళు లాంటివి ఇస్తున్నారు.



ప్రసవించిన వెంటనే బిడ్డను తల్లి ఎదపై పడుకోబెట్టినట్లయితే, తల్లి స్పర్శతో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ వెళ్ళి తల్లి రొమ్మును చేరుకొని, తల్లిపాలు త్రాగడం ప్రారంభిస్తుంది. పుట్టిన ప్రతి బిడ్డ మొదటి గంటలో చాలా హుషారుగా ఉంటుంది. అటు పిమ్మట బిడ్డ నిద్రపోతుంది. తరువాత హుషారు కావడానికి సుమారు 40 గంటల కాలం పడుతుంది.

1. తల్లి శరీరంలోని వేడి బిడ్డకు ప్రసరించి బిడ్డ వెచ్చగా ఉంటుంది. ఇది ముఖ్యంగా నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు మరియు బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు చాలా ఉపయోగకరం.
2. ప్రసవం వలన కలిగిన శ్రమ నుండి బిడ్డ తొందరగా కోలుకొని, తన యొక్క శ్వాస మరియు
3. గుండె చక్కగా పని చేయడానికి దోహదపడుతుంది.
4. తల్లి శరీరంలో ఉన్నటువంటి ప్రమాదరహిత బాక్టీరియా, బిడ్డ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ
5. బాక్టీరియా వలన ఎలాంటి కీడు బిడ్డకు జరగదు. ఎందుకనగా వీటికి అనువైనట్టి వ్యాధి
6. నిరోధక శక్తి తల్లిపాలలో ఉంటుంది. దీని వలన ప్రమాదకరమైనటువంటి ఏ ఇతర బాక్టీరియా
7. బిడ్డ శరీరంలోకి ప్రవేశింప జాలదు.
8. తన కడుపున పుట్టిన బిడ్డను దగ్గరగా తీసుకోగానే తల్లి అత్యంత ఆనందానికి లోనవుతుంది. ఈ విధంగా తల్లీపిల్లల అనుబంధం మొదలవుతుంది

  • శ్రేష్టమైన ముర్రుపాలు

* ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి , శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు , విటమిన్ - ఎ మొదలగునవి అధిక మోతాదులో ఉంటాయి
* ముర్రుపాల వలన శిశువు మొట్టమొదటిగా విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించేటటువంటి బెలూరుబిన్ అనే పదార్థం కూడా త్వరగా విసర్జింపబడి, త్వద్వారా బిడ్డకు మొదటి వారం కలిగే పచ్చకామెర్ల తీవ్రత తగ్గుతుంది
* మొదటి రోజులలో బిడ్డకు అవసరమైనంత, తక్కువ మోతాదులో పాలు లభ్యమవుతాయి. బిడ్డ తల్లి రొమ్ము స్పృశించి చీకడం వలన ఆక్సిటోసిన్ అనే పదార్థము తల్లి శరీరంలోకి విడుదలవుతుంది
* దీని వలన తల్లి గర్భాశయము కుంచించుకొని, అధిక రక్త స్రావము ఆపబడుతుంది
* ఈ ఆక్సిటోసిన్ మూలంగా మరికొన్ని పదార్థములు తల్లి శరీరంలోకి విడుదలై ఆమె మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది
* తల్లి రొమ్ము నుంచి బిడ్డకు పాలు సునాయసంగా అందుతాయి

  • కొలస్ట్రం విలువ

* బిడ్డ పుట్టిన తరువాత మొదటి కొద్దిరోజుల పాటు స్రవించే పాలను కొలస్ట్రం అంటారు. ఇవి పసుపురంగులో జిగటగా ఉంటాయి. ఇవి అత్యంత పౌష్టికమైనవి.
* వీటిలో యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు ఉంటాయి. ఈ పాలలో విటమిన్ -ఎ పుష్కలంగా ఉంటుంది
* కొలస్ట్రంలో అధిక ప్రోటీన్లు, కొన్నిసార్లు 10 శాతం వరకు కూడా ఉంటాయి
* తరువాతి పాలలో కన్నా దీనిలో కొవ్వు, కార్బోహైడ్రేట్ లాక్టోజ్ తక్కువగా ఉంటాయి. బిడ్డకు కొలస్ట్రం తాగించడమంటే బిడ్డ శరీరంలోకి పోషక పదార్థాల (యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు / యాంటీబాడీలు) నిల్వలను పెంచడమన్నమాటే
* ఈ యాంటీ - ఇన్ ఫెక్టివ్ పదార్థాలు శిశువును విరేచనాల నుంచి కాపాడుతాయి. శిశువు మొదటి కొన్ని వారాలపాటు విరేచనాలకు గురికావచ్చు. కనుక ఈ పాలు అతనికి రక్షణ కల్పిస్తాయి
* కొలస్ట్రంను తల్లి నుంచి బిడ్డకు లభించే రోగ నిరోధక వరప్రసాదంగా పేర్కొనవచ్చు. కొందరు తల్లులు ఇవి ములికిపాలని, పిల్లలకు జీర్ణం కావని అనుకొంటారు. ఈ పాల రంగులో తేడా ఉండడం, చిక్కగా ఉండడం వారిలో ఈ అనుమానాలకు తావిస్తోంది.
* మన దేశంలో సాధారణంగా తల్లిపాలను ఆలస్యంగా పడుతుంటారు. దాని వలన శిశువుకు కొలస్ట్రంలో ఉండే రోగనిరోధక లక్షణాలు, విటమిన్ - ఎ , ప్రోటీన్లు లభించవు.
* కొన్ని సమయాలలో మూఢ నమ్మకాలు, అజ్ఞానం కారణంగా ప్రసవమైన 5 వ రోజు నుంచి తల్లిపాలను తాగించడం ప్రారంభిస్తారు. భారతదేశంలోని 15.8 శాతం మంది శిశువులకు గంటలోపల, 37. 1 శాతం మంది శిశువులకు పుట్టినరోజు లోపల తల్లిపాలను ఇవ్వడం ప్రారంభిస్తారు.
* తల్లిపాలను ఆలస్యంగా తాగించడం వలన శిశువుకు విలువైన కొలస్ట్రం లభించకపోగా, గ్లూకోజు నీళ్ళు, జంతువుల పాలు, పాలపొడి వంటి ప్రమాదం కలిగించే వీలున్న పదార్థాలు, పిల్లలలో విరేచనాలకు దారితీసే ద్రవ పదార్థాలను తల్లిపాల కన్నా ముందు పడుతున్నారు.
* తల్లిపాలను ఆలస్యంగా ప్రారంభించడం వలన స్తన్యంలో గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది. దానివలన పాలస్రావం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
* కొలస్ట్రం విలువ గురించి తల్లికి, సముదాయాలకు తెలియజేయడం వలన కొలస్ట్రం వృధా కాకుండా నివారించి, శిశువుకు అది లభించేలా చేయవచ్చు.

  • ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు త్రాగించడం ఎలా

* తల్లి ప్రసవించే సమయంలో తనకు ఇష్టమైనవారిని, సహకరించే వారిని తోడుగా ఉంచాలి
* ప్రసవానికి వీలైనంత వరకు మందులు వాడటం తగ్గించాలి
* తల్లికి అనువైన భంగిమలో ప్రసవం జరగనివ్వాలి
* ప్రసవించిన వెంటనే బిడ్డను పొడిబట్టతో తుడిచి తల్లి ఎదపై బోర్లా పరుండబెట్టాలి
* తల్లి స్పర్శతో బిడ్డ నెమ్మదిగా తనంతట తాను ప్రాకుతూ తల్లి రొమ్ము చెంతకు చేరి పాలు త్రాగడం ప్రారంభిస్తుంది. ఇందులకు ఎలాంటి ప్రోద్బలం చేయరాదు.
* పాలు త్రాగేంత వరకు బిడ్డను అలాగే తల్లి ఎదపైన ఉంచాలి.
* శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్) పుట్టిన పిల్లలకు కూడా ఈ వసతి కల్పించాలి.
* బిడ్డ బరువు చూడడం, విటమిన్ -కె ఇంజెక్షన్ చేయడం లాంటివి తరువాత చేయవచ్చును.
* తల్లి పాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు.

పిల్లల సంపూర్ణ ఆరోగ్యాభివృద్ధికి బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు ప్రారంభించి, మొదటి ఆరునెలల కాలం కేవలం తల్లి పాలు మాత్రమే ఇప్పించి, అటుపిమ్మట అదనపు ఆహారం ప్రారంభించి, తల్లి పాలు 2 సంవత్సరాల వరకు ఇప్పించాలి.


  • తల్లిపాలు - అత్యుత్తమ పౌష్టికాహారం

తల్లిపాలకు ముందు వేరే ఏ ఇతర ఆహార పదార్థములు ఇవ్వరాదు.

* ఆధునిక శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం శిశువుల కోసం తల్లిపాల కన్నా మెరుగైన ఆహారాన్ని తయారు చేయలేక పోయాయి.
* బిడ్డ పోషక, మానసిక అవసరాలను తృప్తిపరచడం కోసం తల్లిపాలివ్వడమే అత్యత్తమ మార్గం
* తల్లిపాలలో ఉన్న అత్యత్తమ పోషక లక్షణాలను ఉన్నయి, ఇవి త్వరగా జీర్ణమై, శరీరంలో గ్రహించబడే లక్షణాలు తల్లిపాలలో ఉంటాయి. తల్లిపాలలోని మాంసకృత్తులు బిడ్డ శరీరంలో త్వరత్వరగా కరిగిపోతాయి. బిడ్డ శరీరం వాటిని సులువుగా గ్రహిస్తుంది.
* తల్లిపాలలోని కొవ్వు, కాల్షియంలు కూడా ఈ విధంగానే సులువుగా గ్రహించబడతాయి.
* తల్లిపాలలో ఉండే పాల చక్కెర- లాక్టోజ్ రెడీమేడ్ శక్తిని అందిస్తుంది. అంతేకాక దానిలోని కొంత భాగం ప్రేవులలో లాక్టిక్ ఆసిడ్ గా మారి ప్రమాదకరమైన బాక్టీరియాను నాశనం చేసి, శరీరం కాల్షియం, ఇతర ఖనిజాలను గ్రహించేలా చేస్తుంది.
* తల్లిపాలలో ఉండే థయమిన్, విటమిన్ – సి ల మోతాదు తల్లి తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ విటమిన్లను తగిన మోతాదులో కలిగి ఉంటాయి.
* తల్లిపాలలో యాంటీ - ఇన్ ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. మరే పాలలోనూ ఇవి ఉండవు.
* వర్దమాన దేశాలలో ఇన్ ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నందువల్ల శిశువులకు తల్లిపాలు అనే రక్షణ కవచం అవసరం.

  • సీసాపాలు త్రాగించుట వలన అపాయములు

* తల్లిపాలు తప్ప ఏ ఇతర పాలు పిల్లలను వ్యాధులు రాకుండా కాపాడలేవు
* పోతపాల వలన త్వరగా సూక్ష్మజీవులు వ్యాపించి పిల్లలు తరుచుగా రోగాలకు గురవుతారు
* పాల సీసాలపై, పీకలపై ఈగలు, దుమ్ము చేరడం వలన సరిగా శుభ్రం చేయకపోవుట వలన పిల్లలకు తరచూ విరోచనములు, వాంతులు అగును
* పాలపీకకు ఉండే రంధ్రము చిన్నది అయినట్లయితే పిల్లలు పాలు త్రాగడానికి ఇబ్బంది అవుతుంది. ఎక్కువగా గాలి పీల్చి పాలు తక్కువగా త్రాగుతారు. రంధ్రము పెద్దదయినట్లయితే వేగంగా పాలు వచ్చి వాంతి అవ్వటానికి అవకాశం కలదు.
* తల్లిపాలతో సమానంగా ఏ ఇతర పాలలో పోషక విలువలు ఉండవు.
* ఇతర పాలు లేదా పాలపొడి రేటు అధికంగా ఉండుట వలన ఎక్కువ నీరు కలపడం జరుగుతుంది. దీని వలన పిల్లలకు సరిపడు పోషక పదార్థములు లభించవు.
* కనుక తల్లిపాల ప్రాముఖ్యతను పిల్లల ఆరోగ్యమును మెరుగు పరచుటకు కార్యకర్తలు కృషి చేయాలి.
* బిడ్డ పుట్టగానే వీలున్నంత తొందరగా బిడ్డని తల్లికి ఇవ్వాలి. ఆరోగ్య సంరక్షణ వారిద్దరి చేరువకి అనుగుణంగానే ఉండాలి.
* గర్భవతులకి సహాయకారిగా ఉండే బంధువులకి, సన్నిహితులకి తల్లిపాల మేలు గురించి అవగాహన కలిగించాలి.

  • తల్లిపాల వల్ల లభించే మరి కొన్ని ప్రయోజనాలు

* శిశువులకు తల్లిపాలు అత్యుత్తమమైన, ప్రకృతిసిద్ధమైన ఆహారం
* తల్లిపాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి
* తల్లిపాలు బిడ్డను వ్యాధుల నుంచి రక్షిస్తాయి
* తల్లిపాలు బిడ్డను మరింత మేధావిని చేస్తాయి
* తల్లిపాలు రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన తయారీ అవసరం లేదు
* తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన కానుక. దానిని కొనసలసిన అవసరం లేదు
* తల్లిపాలు తల్లీబిడ్డల మధ్య ప్రత్యేక అనుబంధాన్ని పెంచుతాయి
* తల్లిపాల వలన తల్లిదండ్రులు బిడ్డల మధ్య వ్యవధి పాటించ గలుగుతారు
* తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు పెరిగిన అదనపు బరువును తల్లిపాలు తగ్గిస్తాయి

  • తల్లిపాలు త్వరగా తాగించడం

* పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంతో పాటు బిడ్డకు కొలస్ట్రం ( తల్లి మొదటి పాలు) లభించేలా చేయడం కోసం తల్లిపాలను త్వరగా తాగించడం చాలా ముఖ్యం వీలైనంత త్వరగా అంటే పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు లభించేలా చేయాలి. అప్పుడే పుట్టిన శిశువు చాలా చురుగ్గా ఉంటుంది.
* బిడ్డను తల్లి దగ్గర ఉంచి, చనుబాలు పట్టే ప్రయత్నం చేస్తే శిశువు పాలు తాగడం త్వరగా నేర్చుకొంటుంది. బిడ్డ త్వరగా పాలు తాగడం వలన తల్లిలో పాల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమై చనుబాలు గ్రహించే ప్రక్రియ వేగమవుతుంది.
* సిజేరియన్ ప్రసవాలలో శిశువుకు 4 – 6 గంటల లోపు తల్లిపాలు తాగించడం ప్రారంభించాలి. పుట్టిన వెంటనే శిశువును తల్లికి దగ్గరగా పడుకోబెట్టడం వలన వారికి వెచ్చదనం లభించడంతో పాటు తరచుగా పాలివ్వడం వీలవుతుంది. దాని వలన పాలు త్వరగా, మెరుగ్గా వస్తాయి.
* తల్లి మొదటి పాలను కొలస్ట్రం అంటారు, ఇవి తరువాతి పాల కన్నా చిక్కగా, పసుపురంగులో ఉండే ఈ పాలు కొద్దికొద్దిగా మొదటి కొద్దిరోజుల పాటు వస్తాయి. ఇవి శిశువుకు తప్పక తాగించాలి. ఈ సమయంలో బిడ్డకు అందించవలసిన ద్రవాహారం కొలస్ట్రం ఒక్కటే. మరే అనుబంధ ఆహారాలు అవసరం లేదు. నీళ్ళు కూడా తాగించనవసరం లేదు.
* ముఖ్యంగా మొదటికాన్పు అయినట్లయితే, తల్లిపాలు పట్టే భంగిమ విషయంలో తల్లికి సహాయం అవసరమవుతుంది. బిడ్డ కోరినప్పుడల్లా, తరచుగా తల్లిపాలు తాగించాలి. బిడ్డకు కావలసినప్పుడల్లా పాలివ్వడాన్ని కొనసాగించాలి.
* ఈ సమయంలో, ఆ తరువాత కూడా కొత్తగా పుట్టిన శిశువుకు తేనె, గుట్టీ, జంతువుల పాలు, పాలపొడి. టీ, నీళ్ళు, గ్లూకోజు నీళ్ళ వంటి మరే ఇతర ద్రవంగానీ, ఆహారంగానీ ఇవ్వకూడదు. ఇవి బిడ్డకు హాని చేసే ప్రమాదముంది.

  • తల్లిపాలు మాత్రమే

* తల్లిపాలు మాత్రమే అంటే తల్లిపాలు మినహా మరే పాలను, ఆహారాన్ని, ద్రవాలను, కనీసం నీటిని కూడా శిశువుకు తాగించకపోవడం. మొదటి ఆరునెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలి. మొదటి ఆరునెలల పాటు బిడ్డకు కావలసిన అత్యుత్తమ, సంపూర్ణ పౌష్టికాహారాన్ని తల్లిపాలు అందిస్తాయి. కేవలం తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలకు మరే ఆహారం గానీ, ద్రవంగానీ అవసరం లేదు.
* మూలిక పసరు, గ్లూకోజు నీళ్ళు, పళ్ళరసాలు, నీళ్ళు ఆరునెలల పాటు వారికి అవసరం ఉండదు. దేశంలో ఎంత పొడి, ఉష్ణ పరిస్థితులున్నప్పటికీ, ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ బిడ్డ శరీరానికి కావలసిన నీటి అవసరాలను తల్లిపాలు సమకూరుస్తాయి.
* తల్లిపాలు శిశువువులను విరేచనాలు, న్యూమోనియా నుండి రక్షిస్తాయి కనుక శిశువులందరికీ కేవలం తల్లిపాలు లభించేలా చూడడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పిల్లల్లో చెవి ఇన్ ఫెక్షన్ లను, ఆస్థమా, ఎలర్జీ వంటి వాటిని నివారించడానికి తల్లిపాలు దోహదపడతాయి.
* కేవలం ఒక్కసారి జంతువుల పాలనుగానీ, పాలపొడినిగానీ, ఇతర ఆహార పదార్థాన్ని గానీ, చివరకు నీటిని కూడా త్రాగించినా రెండు నష్టాలు కలుగుతాయి.
o మొదటిది - తల్లిపాలు తగ్గిపోతాయి. ఎందుకంటే శిశువు తక్కువ పాలు తాగుతాడు. దాని వల్ల స్తన్యం తక్కువ పాలను ఉత్పత్తి చేస్తుంది.
o మరే ఇతర ఆహారం, నీరు ద్రవాన్ని పాక్షికంగా ప్రవేశ పెట్టినా ఇన్ ఫెక్షన్లు ముఖ్యంగా విరేచనాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు మొదటి ఆరునెలల పాటు కేవలం తల్లిపాలు తాగించినట్లయితే శిశు మరణాల రేటు నాలుగు రెట్లు తగ్గుతుందని ఇటీవల ప్రపంచ ఆర్యోగ్య సంస్థ అంచనాలు చెబుతున్నాయి.
* కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది. అవి వారిని చురుగ్గా చేసి, మేధా ప్రతిభను పెంచుతుంది. వారు గరిష్టంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. శిశువులో తొలినాళ్ళలో విరేచనాలు, శ్వాస సంబంధమైన తీవ్ర ఇన్ ఫెక్షన్లు తగ్గించి, తద్వారా మరణాల రేటును తగ్గించడానికి కేవలం తల్లిపాలు మాత్రమే తాగించడం చాలా ముఖ్యం. తల్లిపాలు మాత్రమే కానట్లయితే తల్లిపాల వలన కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయని గుర్తుంచుకోవాలి.

  • ఐక్యూను పెంచే తల్లిపాలు!
అయితే తల్లిపాలు తాగే పిల్లల్లో తెలివితేటలు కూడా పెరుగుతాయంటే నమ్ముతారా? అంతలా ఆశ్చర్యపోకండి. పోతపాలు తాగిన పిల్లలతో పోలిస్తే ఆర్నెళ్లకు పైగా తల్లిపాలు తాగిన పిల్లల్లో 3.8 పాయింట్ల ఐక్యూ ఎక్కువగా ఉంటున్నట్టు పొలాండ్‌లో చేసిన అధ్యయనంలో వెల్లడైంది మరి. జాగిలోనియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వీస్లా జెడ్రీచోవ్‌స్కీ బృందం తల్లిపాలు, పోతపాలు తాగిన పిల్లలను ఎంచుకొని ఏడేళ్ల పాటు పరిశీలించింది. చిన్నప్పట్నుంచి నర్సరీకి (ప్రి స్కూల్‌) వెళ్లేవరకు ఐదుసార్లు వారి తెలివి తేటలను పరీక్షించింది. ఇందులో తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు తేలటమే విచిత్రమనుకుంటే.. ఇది తల్లిపాలు తాగిన సమయాన్ని బట్టీ ఆధారపడి ఉండటం మరింత విచిత్రం. మూణ్నెళ్ల వరకు తల్లిపాలు తాగినవాళ్లు 2.1 పాయింట్లు, 4-6 నెలల వరకు తాగినవాళ్లు 2.6 పాయింట్లు, ఆర్నెళ్ల కన్నా ఎక్కువ సమయం తాగినవాళ్లు 3.8 పాయింట్ల మేరకు ఐక్యూ అధికంగా కలిగున్నట్టు వెల్లడైంది.

ఇంతకీ పిల్లల మేధోశక్తిని పెంచటంలో పోతపాలల్లో లేనివి తల్లిపాలల్లో ఉన్న రసాయనాలేంటి? దీనిపై ఆసక్తికరమైన చర్చ, పరిశోధనలు జరుగుతున్నాయి. తల్లిపాలలోని ఆయా రసాయనాల కోసం శాస్త్రవేత్తలు ఇంకా శోధిస్తూనే ఉన్నారు గానీ.. తల్లీబిడ్డల మధ్య ఏర్పడే అనుబంధమే అసలు కారణమని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌కు చెందిన టోన్స్‌ రాజు అంటున్నారు. ''తల్లి రొమ్ము నుంచి శిశువు పాలు పీల్చటమనేది కేవలం కడుపు నింపుకునే పనికాదు. ఇందులో చురుకైన, పరస్పర, శారీరక, మానసిక సంభాషణ దాగుంది'' అని ఆయన వివరిస్తున్నారు. పాలు ఇస్తున్నప్పుడు తల్లీ పిల్లల మధ్య పరస్పర శారీరక, మానసిక బంధం ఏర్పడుతుందని.. ఇది శిశువు తెలివి తేటల అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.

పుట్టిన తర్వాత ఏడాదిలోపే పిల్లల మెదడు రెండింతల బరువు పెరుగుతుంది. ఇందులో చాలావరకు మెదడులోని తెల్ల పదార్థానికి (వైట్‌ మ్యాటర్‌) సంబంధించిందే. ఈ భాగంలోని నాడులపై విద్యుత్‌ బంధనం (మైఎలినేషన్‌) ఏర్పడితే అవి 50 రెట్లు అధిక వేగంతో విద్యుత్‌ ప్రకంపనాలను ప్రసారం చేస్తాయి. ఈ ప్రక్రియ పుట్టిన తర్వాత బాల్యం నుంచి కౌమారదశలోనే ఎందుకు ఏర్పడతాయనే దానిపై అధ్యయనంలో దృష్టి సారించారు. చిన్నతనంలో ఎదురైన అనుభవాలు మైఎలినేషన్‌ను ప్రభావితం చేస్తాయని, పరిసరాలకు తగ్గట్టుగా మెదడు ఎదగటానికి ఇది తోడ్పడుతున్నట్టు తేలింది. తల్లిదండ్రులు మాటల రూపంలో చూపించే ఆప్యాయత చిన్నతనంలో ఐక్యూపై కీలకమైన ప్రభావం చూపిస్తుందని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన మార్టిన్‌ టెయిచర్‌ అంటున్నారు. ఏడాదిలోపు పిల్లల్లో కేవలం మెదడు పరిమాణం పెరగటమే కాదు.. చూపు, కదలికలు, శబ్దాల ప్రక్రియలకు సంబంధించిన భాగాల్లోనూ ఈ సమయంలోనే ప్రధానమైన మార్పులు జరుగుతాయి. భాషను అర్థం చేసుకోవటం, నేర్చుకోవటం వంటి వాటికి ఇదే పునాది వేస్తుంది. ఇవన్నీ కూడా శిశువుకు ఎదురైన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. రొమ్ము నుంచి పాలు పీలుస్తున్నప్పుడు తల్లీ పిల్లల మధ్య జరిగే సానుకూల భావాల ప్రసారం.. తల్లిదండ్రులు, చుట్టూ ఉండేవారి ప్రేమపూర్వక సంభాషణలు అన్నీ కూడా శిశువు మెదడు అభివృద్ధి చెందటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు ఇస్తున్నప్పుడు తల్లి మెదడుకు రక్తప్రసారం పెరుగుతుంది. ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. ఈ హార్మోన్‌ తల్లీ పిల్లల మధ్య అనుబంధం పెరగటానికి దోహదం చేస్తుంది. పిల్లల మెదళ్లలోనూ ఇలాంటిదే జరుగుతుండొచ్చు అని రాజు చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల మెదడు అభివృద్ధి చెందటంలో తల్లిపాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయన్నమాట. అదీ శిశు అభివృద్ధిలో చాలా కీలకమైన సమయంలో కావటం విశేషం.

  • -- source : courtesy with Sukheebhava Eenadu News paper

  • =============================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.